Thursday

అమూల్ పాపకు 50 ఏళ్లు


పోల్కా డాట్స్ ఉన్న ఫ్రాక్ వేసుకొని చిలిపిగా ఉన్న అమూల్ పిల్లను చూడండి. చూడగానే నవ్వొస్తోంది కదూ. అమూల్ ఉత్పత్తులకు గత ఐదు దశాబ్దాలుగా ఈ పిల్లే ప్రతినిధి. ప్రతి శుక్రవారం ఒక కొత్త ఆలోచనతో మన ముందుకు వచ్చి నవ్విస్తూ ఉంటుంది. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ, ఎన్డీ తివారీ సెక్స్ స్కాండల్, తాజాగా వచ్చిన కొలె'వెర్రి' దాకా మన సమాజంలో జరుగుతున్న సంఘటనలను అమూల్ ప్రకటనలు ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఈ ప్రకటనలు దేశవ్యాప్తంగా నాలుగు వేల ప్రదేశాలలో హోర్డింగ్‌ల రూపంలో మాత్రమే కాకుండా పత్రికల్లో కార్టూన్ల రూపంలో దర్శనమిస్తూ ఉంటాయి. ప్రతి శుక్రవారం తాజా అమూల్ కార్టూన్ కోసం ఎదురుచూసేవారు ఎంతో మంది. అలాంటి కార్టూన్ల గురించి రూపొందించిన సంకలనమే- "అమూల్స్ ఇండియా''. అసలు అమూల్ పిల్ల ఎలా పుట్టిందో దాచున్హా కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సిల్వెస్టర్ దాచున్హా ఈ పుస్తకంలో వివరించారు. దాని నుంచి కొన్ని ఆసక్తికరమైన భాగాలు..

"1966..అమూల్ వెన్నకు ప్రకటనలను రూపొందించే బాధ్యత మా ఏజన్సీకి లభించింది. అప్పటికే అమూల్ వెన్న పదేళ్ల నుంచి మార్కెట్‌లో ఉంది. 'గుజరాత్ డైరీ కోఆపరేటివ్‌లోని పరిశుద్ధమైన పరిసరాలలో శుద్ధమైన పాల నుంచి తీసిన స్వచ్ఛమైన వెన్న' అని అమూల్ ప్రకటనలలో పేర్కొంటూ ఉండేవారు. అయితే అందరిని ఆకర్షించే విధంగా ఈ ప్రకటన ఉండాలని మేము భావించాం. మొదట ఈ ప్రకటనకు ప్యూర్లీ ద బెస్ట్ (స్వచ్ఛమైనవాటిలో ఉత్తమమైనది) అనే ట్యాగ్ లైన్ తగిలించాను. ఒక రోజు ఇంట్లో మా ఆవిడకు ఈ ప్రకటన గురించి చెప్పాను.

వెంటనే తను 'అట్లర్లీ అమూల్' అని ఎందుకు ఉండకూడదు అంది. నేను దానికి బట్టర్లీ అనే పదం కూడా కలిపాను. అలా అట్టర్లీ బట్టర్లీ అమూల్ అనే స్లోగన్ పుట్టింది. అయితే బట్టర్లీ అనే పదం వ్యాకరణ ప్రకారం సరైనది కాదని కొందరు అభ్యంతరం తెలిపారు. అమూల్ ఛైర్మన్ కురియన్‌కి కూడా ఈ విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి. 'ఇదొక పిచ్చి లైనులా ఉంది. కాని అందరిని ఆకర్షిస్తుందనుకుంటే దాన్నే కొనసాగించండి' అన్నారు. ట్యాగ్ లైను అయితే తయారయింది. కాని దాన్ని చెప్పటానికి ఒక ఆకర్షణీయమైన బొమ్మ కావాలి. అందంగా ఉండే చిన్న పిల్ల అయితే మంచిది. చూడగానే ఆకర్షణీయంగా ఉండాలి. ఈ రెండు లక్షణాలు ఉన్న బొమ్మను గీయమని మా ఆర్ట్ డైరక్టర్ ఫెర్నాండేజ్‌కు చెప్పాను.

అతను రెండు రోజుల తర్వాత అమూల్ పాపను గీసుకు వచ్చాడు. చూడగానే మా అందరికి ఆ పిల్ల నచ్చింది. ఆ పాపలో అమాయకత్వముంది. చిలిపితనముంది. తెలివితేటలు కనిపిస్తున్నాయి. అమూల్ పాప అందరి హృదయాలు కొల్లగొడుతుందని మాకర్థమైపోయింది. అనుకున్నట్లే అందరూ అమూల్ పాపను ఆదరించటం మొదలుపెట్టారు.

1966 తర్వాత దేశంలో జరిగే ప్రతి సంఘటనకు అమూల్ పాప ప్రత్యక్ష సాక్షి. 1960లలో కోల్‌కత్తాలో ఎక్కువ హర్తాళ్‌లు జరుగుతూ ఉండేవి. వేల మంది ప్రజలు 'చోల్బి నా' (మేం పని చేయం అని అర్థం) అని ప్రదర్శనలు చేస్తూ ఉండేవారు. జన జీవితం స్తంభించిపోతూ ఉండేది. దీనిని స్ఫూర్తిగా తీసుకొని 'బ్రెడ్ వితవుట్ అమూల్- చోల్బి నా.. చోల్బి నా' (అమూల్ వెన్న లేకుండా బ్రెడ్ వద్దే వద్దు.. అని అర్థం) అనే ప్రకటన తయారుచేశాం. కరడుగట్టిన లెఫ్ట్ కార్యకర్తలు కూడా దీనిని చూసి నవ్వుకున్నారు. 

హరే కృష్ణ మూమెంట్ బాగా జోరు మీద ఉన్న సమయంలో- 'హరేరామ హరేరామ రామరామ హరేహరే' అనే పదాలకు బదులుగా 'హర్రీ అమూల్, హర్రీ బట్టర్.. హర్రీ హర్రీ'' అనే స్లోగన్ తయారుచేశాం. దీనికి కూడా మంచి స్పందన వచ్చింది. అమూల్ ప్రకటనలు వివాదమయిన సందర్భాలు కూడా లేకపోలేదు. 1970లలో తమ భర్తలు లండన్‌లో ఉన్నారని అనేక మంది భారతీయ మహిళలు బ్రిటన్‌కు వెళ్తూ ఉండేవారు.

వీరికి కన్యత్వ పరీక్షలు నిర్వహించాలని లండన్ ఎయిర్‌పోర్టు అధికారులు నిర్ణయించారు. దీనిపై ' ఇండియన్ వర్జిన్స్ నీడ్ నో అర్జిన్' అనే ట్యాగ్ లైన్ తయారుచేశాం. దీనిని మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మేము ఆ స్లోగన్‌ను తీసేయాల్సి వచ్చింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నాలుగువేల ప్రాంతాల్లో అమూల్ హోర్డింగ్‌లు ఉన్నాయి. 50 ఏళ్లుగా థీమ్ మారనివి ఈ అమూల్ ప్రకటనలే కావచ్చు..''

0 comments:

Post a Comment