ప్రశాంతంగా మరణించడం ఎలా? ప్రపంచంలో ప్రతి చోట..చాలా మందిని తొలిచే ప్రశ్న ఇది. ఎవరూ కూడా తీసుకుని తీసుకుని చావాలని కోరుకోరు. సాఫీగా దేహాన్ని విడిచిపెట్టి పోవాలనే కోరుకుంటారు. దగ్గరి వారు మరణయాతన లేకుండా ప్రశాంతంగా కనుమూయాలంటే చేయదగ్గది ఒకటుంది. ఆ వ్యక్తి వద్ద 24 గంటలూ వెలిగే విధంగా నేతి దీపం పెట్టాలి. వెన్న కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల అక్కడ ఓ ప్రత్యేకమైన కాంతి మండలం వ్యాపిస్తుంది. ఫలితంగా మరణయాతనను కొంతవరకు తగ్గించొచ్చు. ఇప్పుడు రోజులు మారిపోయాయి. జ్ఞానం కన్నా అజ్ఞానం ఎక్కువగా వ్యాపిస్తోంది. పాతికేళ్ల క్రితం, మన దేశంలో..దీపం వెలగని ఇల్లంటూ ఎక్కడా ఉండేది కాదు. దీపం వెలగని ఇల్లు ఉందంటే దాన్ని శ్మశానం కింద భావించేవారు.
పవిత్ర స్తోత్ర పారాయణం ప్రశాంత మరణానికి మరొకటి కూడా చేయొచ్చు. ఆ వ్యక్తి ఇష్టపడితే...'బ్రహ్మానంద స్వరాపూ..' లాంటి జగన్మంత్ర పారాయణాన్ని సీడీ పెట్టి..మంద్ర స్వరంలో వినిపించొచ్చు. ఇటువంటి పవిత్ర ధ్వని వినపడుతున్నా... తీసుకుని తీసుకుని ప్రాణాలు విడిచే బాధ తప్పుతుంది. ఒక వ్యక్తి మరణించాడు అని «ద్రువీకరణ అయిన 14 రోజుల వరకు ఇలా దీపం వెలిగించడం లేదా పవిత్ర స్తోత్ర పారాయణం జరగాలి. ఎందుకంటే వైద్యపరంగా ఆ వ్యక్తి మరణించి ఉండొచ్చు కాని పూర్తిగా మరణించినట్లు కాదు. ఆ వ్యక్తి ప్రాణ శక్తి అస్తిత్వం ఇంకా ఉంటుంది. మరణ ప్రక్రియ నిదానంగా సాగుతుంది. ఒక వ్యక్తి మరణించిన 11 రోజుల వరకు ఆ వ్యక్తి కేశములు, గోళ్లు పెరుగుతాయన్న సంగతి మీకు తెలిసే ఉంటుంది.
14 రోజుల వరకు కూడా పెరుగుతాయి. కారణం..మరణ ప్రక్రియ పూర్తి కాకుండా నిదానంగా సాగడమే. మట్టిలోంచి పుట్టి పెరిగిన ఈ దేహం నుంచి ప్రాణశక్తి వీడడం అనేది అంచెలంచెలుగా జరుగుతుంది. ముందుగా ఊపిరితిత్తులు, గుండె, మెదడు క్రియలు ఆగిపోతాయి. దాంతో మరణించినట్లు నిర్ధారిస్తారు. కానీ పూర్తిగా మరణించినట్లు కాదు. ఆ దేహాన్ని దహనం చేసినా ఆ వ్యక్తి మరణించినట్లు కాదు. ఎందుకంటే మరో ప్రపంచంలోకి ఆ వ్యక్తి ప్రయాణం ప్రారంభం కాలేదు కాబట్టి. అందుకే భారతదేశంలో ఎవరైనా మరణించిన 14 రోజుల వరకు వివిధ రకాల కర్మకాండలు పాటిస్తారు.
దురదృష్టవశాత్తు ఈ ఆచారాల వెనుక ఉన్న జ్ఞానం, శక్తి చాలా వరకు తెలియకుండా పోయింది. దేహాన్ని ఎలా వీడాలో తెలిసి, అవగాహనతో ఆ ప్రక్రియను దాటిన వారికి ఎలాంటి కర్మకాండలు చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వారికి మాత్రం కర్మకాండలు చేయాలి. వారికి మార్గం చూపించాలి. లేదంటే ఇక్కడిక్కడే తిరుగుతుంటారు. ఈ బంధాలను విడిచిపెట్టిపోలేరు. వారు జీవితమంతా అజ్ఞానంతోనే వెళ్లదీసి ఉంటే...మరణంతో జ్ఞానోదయం కాదు. అక్కడక్కడే పరిభ్రమిస్తుంటారు. వారి చుట్టూ ఉన్న వస్తువులతో బంధం అలాగే ఉంటుంది.
దుస్తులను వదలని దేహశక్తి ఓ వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తి దేహానికి ఉండే లోదుస్తులను వెంటనే తగలబెట్టాలి. మిగిలిన దుస్తులు, నగలు, ఆ వ్యక్తి వాడిన ఇతర వస్తువులన్నింటినీ పంచిపెట్టేయాలి. ఒకరికి కాదు...వేర్వేరు వ్యక్తులకు పంచిపెట్టాలి. ఇదంతా ఆ వ్యక్తి మరణించిన మూడు రోజుల్లో పూర్తి చేసేయాలి. ఆ వ్యక్తి ఉపయోగించిన వాటినన్నింటినీ ఏ ఒక్కరికో మాత్రమే ఇస్తే..అక్కడికే వెళ్లాలని చూస్తాడు. ఎందుకంటే సొంత దేహం వాసన ఇంకా అతడిని వీడి ఉండదు. అతని దేహశక్తి ఇంకా ఆ వ్యక్తి దుస్తుల్లో ఉంటుంది. ఎక్కువ మందికి పంచితే..ఎక్కడ పట్టుకుని వేలాడాలో తెలియని అయోమయం ఏర్పడుతుంది. ఇవన్నీ మరణ ప్రక్రియను పూర్తిచేయడానికి మాత్రమే కాదు..ఆ వ్యక్తి కుటుంబం, బంధువులు నిర్వర్తించాల్సిన పనులు పూర్తిచేయడానికి కూడా. మొత్తం పని పూర్తయిపోయింది అని వారు నిశ్చింతగా ఉండాలి. ఆ పనులన్నీ పూర్తి చేసేటప్పుడు..మీరెంత లీనమై ఉన్నారు..ఆ వ్యక్తితో ఎంత అనుబంధంతో ఉన్నారన్నది ముఖ్యం కాదు.
పని పూర్తవడమే ముఖ్యం-ఆట ముగిసిందంతే! చక్రం వద్ద శక్తులు కేంద్రీకృతం ఆ వ్యక్తి ముఖ్యలక్షణమేమిటో మీకు తెలిస్తే...దాన్ని బట్టి సంబంధిత 'చక్రం' వద్ద విభూధిని రాస్తే ఆ వ్యక్తి శక్తులన్నీ ఆ చక్రం వద్ద కేంద్రీకృతమవడానికి ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు ఆ వ్యక్తి ఎంతో ప్రేమపూర్వక వ్యక్తి అనుకోండి..విభూధి వొంటికి అంటిపెట్టుకునేలా కొద్దిగా నీళ్లతో కలిపి 'అనహత' చక్రం వద్ద పూయాలి. ఆ వ్యక్తి శక్తులన్నీ ఆ అనహత చక్రం వద్ద కూడతాయి. శక్తి అంతా అక్కడకు చేరితే ఆ చక్రం ద్వారా ప్రాణం వీడే అవకాశం ఉంటుంది. ఇది అతనికి చాలా మేలు చేస్తుంది. అందుకే మరణించిన వారికి సరైన సంస్కారాలు జరగకపోతే..మీలో ఏదో తెలియని కలవరం కలుగుతుంది.
ఈ కలవరం ఆ వ్యక్తి దేహానికి సంస్కారాలు నిర్వహించినందుకు కాదు. ఆ వ్యక్తి చాలా నిదానంగా దేహం నుంచి నిష్క్రమించడమే కారణం. ఒక వ్యక్తి ఎలా జీవించాడన్నది ముఖ్యం కాదు..చివరి క్షణాల్లో మరణప్రక్రియ బాగా జరగడం ముఖ్యం. ప్రతి మనిషికి ఈ ఉద్దేశం ఉండాలి. అవతలి వ్యక్తి చివరి క్షణాల్లో ఉన్నపుడు అతని మరణ ప్రక్రియ సజావుగా జరగాలని కాంక్షించాలి. చేతనైన ప్రయత్నం చేయాలి.
From
మీతో చెప్పాలనుకున్నా!!!
0 comments:
Post a Comment