Tuesday

“ ఉషోదయపు నడక ”


సుప్రభాతం. ఉదయం నాలుగు గంటల నలభైఐదు నిముషాలు అయింది. బయట కొక్కొరొక్కో అని కోడి కూత; దిండు ప్రక్కనున్న మొబైల్ లో అలారం మోగింది. పట్నంలో కోడి కూతపై మనం పూర్తిగా ఆధారపడలేము కదండీ! అందుకనే మొబైల్ అలారం కూడా!! అదీగాక, తెల్లవారిందికాబట్టి కోడి కూసిందో, లేక రోజు భోజనంలోకి కోడిని పంపించే ఏర్పాట్లు చేస్తుంటే దాని గొంతు నొక్కుతుంటే కొక్కొరొకో అన్నదో మరి మనకు తెలియదుగదా!! అదీసంగతి. మంచం దిగి, పళ్ళు తోముకొని, ఐదు నుంచి ఆరు గంటలవరకు, ఒక గంట, ధ్యానం చేసుకున్నాను. ఆతరువాత తయారయి, సుప్రభాత కాలినడకకు బయలుదేరాను. ఇంటిలోపలి మొదటి అంకం పూర్తయింది.
ఆరుగంటలకు రహదారిమీదకు వచ్చాను. చల్లటిగాలి వంటికి తగిలి, ఒళ్ళు జిల్లుమంది. ఇది కార్తీకమాసంకదా! కార్తీకమాసం రాబోయే సంక్రాంతికి సమారంభం. మరి, కొంత చలిగానే వుంటుంది. అటు,ఇటూ చూస్తూ, రోజూవచ్చేవాళ్ళు వచ్చారా లేదా అని చూస్తూ, అడుగులు ముందుకు వేస్తున్నాను. అక్కడక్కడా కోళ్ళు కొక్కొరొకో అని అంటున్నాయి. నిజానికి కోడికూతలో ఒక సందేశం వున్నది. సుఖాలకి అలవాటుపడి, అందులో నిద్రపోతున్న మనుషుల్లారా! ఉషోదయం అయింది, నిద్ర లేవండి; బద్దకాన్ని వీడండి; బ్రతుకుబాటలో ముందుకు పదండి!! అని చెప్పినట్లుగా వుంటుంది నాకు. కాదంటారా?
అడుగులు ముందుకు పడుతున్నాయి. పెద్ద రోడ్డుకు ప్రక్కన, మూసివున్న దుకాణాలముందు, దినపత్రికలవాళ్ళు, తమ దుకాణాలు తెరిచారు. అంటే, దినపత్రికలను సర్ది, పేపర్ బాయస్‍కి పంచి, అన్నివైపులకు పంపుతుంటారు. మరొకప్రక్క, రోడ్డుకు ప్రక్కన వెలసిన టీ, కాఫీ దుకాణాలు. గ్రుక్కెడు వేడినీళ్ళు మన నోట్లో పోసి, రెండురూపాయలందుకొని, తమ దైనందిన జీవనాన్ని సాగదీస్తుంటారు వీరు. ప్రొద్దునే పనికివెళ్ళే ఉద్యోగస్తులు ఒక కప్పు కాఫీ నోట్లోపోసుకొని, ( పాపం, వీళ్ళు ఇంట్లో తమ భార్యల్ని కాఫీ పెట్టమని కష్టపెట్టలేరు ఎందుకంటే, అప్పటికే అన్నం, కూర చేసి డబ్బాల్లో పెట్టి ఇచ్చరాయే! ), ఒక దినపత్రికను కొని, చదువుతూ తమ బస్సులకోసం ఎదురు చూస్తుంటారు. నా అడుగులు ముందుకు పడుతున్నాయి.
పెద్దరోడ్డును దాటి, ప్రక్క బాటలోకి నడిచాను. దోవలో రెండు కిలోమీటర్లు వరకు దుమ్ము, ధూళి వుండదు. స్వాగతం, సుస్వాగతం అని పలుకుతున్నాట్లుగా, దోవకిరువైపులా పచ్చని చెట్లు తలలూపుతూ పలకరిస్తున్నాయి. మధ్య, కొత్తగావస్తున్న కాలనీల్లో చెట్లను బాగానే పెంచుతున్నారు. వాతావరణానికీ మంచిదీ, మనకీ మంచిదే గదా! చెట్లను చూస్తుంటే, అవి మనకు గురుసమానులుగా అనిపిస్తాయి. ఎంతో విషయాన్ని మనకు బోధిస్తునట్లు తెలుస్తుంది. మనం వదిలిన గాలిని అవి పీల్చుకొని, మనకు, ఎటువంటి ప్రత్యుపకారం ఆశించకుండా, ప్రాణవాయువుని అందిస్తుంటాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన రహస్యాన్ని మనం పరిశీలించాలి. ప్రపంచంలో వున్న చరాచరములన్నీ ( మనిషి తప్ప ), తమ పని తాము చేసుకుంటూ, వీలున్నంతవరకు ఇతరులకు ఉపయోగపడుతూ ( చనిపోయిన తరువాతకూడానండి!! ) జీవిస్తాయేకానీ, జీవి, మరొక జీవిని తమ కట్టుబానిసగా వాడుకోవు. కానీ, మనిషిమాత్రం, తనకున్న తెలివితేటలతో, జంతువుల్ని మేపి, తన పనిని వాటిచేత చేయించుకుంటాడు; చెట్లను పెంచి, తన అవసరాలకు వాడుకుంటాడు. వాటివల్ల తనకు ఉపయోగం లేదనుకుంటే, నిర్దాక్షణ్యంగా వాటిని తొలగిస్తాడు. మరి, చెట్లు మనకు పూలు, పళ్ళని ఇస్తున్నాయి. ఎంతో ఎత్తు ఎదిగినా, ఒదిగివుంటాయి!! వాటిని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. ( శ్రీ దత్తాత్రేయులవారు తమ సహజ గురువుల్లో చెట్టునుకూడా ఒక గురువుగా పేర్కొన్నారు ). నా నడక సాగుతున్నది. మరో పాఠంకూడా మనం నేర్చుకునేది వున్నది చెట్లనుచూసి. రోడ్లకు ఇరువైపుల చెట్లనుంచి రాలి, పడిపోయి, పాదాలక్రింద, చక్రాలక్రింద నలిగిపోయిన రంగు,రంగుల పూలు. దూరంనుంచి చూడటానికి, పసుపచ్చని, ఎర్రని రంగుల తివాచీల్లాగా కనిపిస్తూ, మనకు సాదర స్వాగతం పలుకుతుంటాయి. రాలి, పడిపొయి, నలిగిపోయిన వాటిని చూస్తే, మన జీవితంతో పోల్చుకోవచ్చు. ఇంతేగదా జీవితం! అని మనస్సు వేదన పడుతుంది. కానీ, బాధపడక్కరలేదు. ఒక్కసారి, తలెత్తి, చెట్లపైకి చూస్తే, క్రొత్త పువ్వులు, విరబూసి, నవ్వుతూ మనల్ని పలకరిస్తాయి. క్రొత్త తరానికి స్వాగతం పలుకుతూ, వాటికి చోటివ్వాలికదా, అందుకే మేము ప్రక్కకు తొలిగాం అని రాలిన పూలు మనకు చెబుతున్నట్లు అనిపిస్తుంది. నిజమే, ఇదంతా జీవితంలో ఒక భాగమే!! క్రొత్త పువ్వుల్ని చూస్తూ, నేను అడుగులు ముందుకు వేసాను.
ఆకాశంలో టప,టపమని శబ్దాలు. నేలపై కొంచెం దూరంలో టక,టకమని శబ్దాలు. పైకిచూస్తే, పావురాల గుంపులు, తెల్లని కొంగల బారులు తమ రెక్కల్ని టప,టపలాడిస్తూ, ముందుకు సాగుతుంటే, నాకు స్వాగతం పలుకుతునట్లనిపిస్తుంది. ప్రభాత సమయంలో ఒక్కసారలా ఎగరాలని వాటికి ఎవరు చెప్పారో ఏమో? బహుశా, వాటినిచూసే మనంకూడా నడక ప్రారంభించామేమో! నాలుగు అడుగులు నడిచానే లేదో, నాముందు అడుగుల సవ్వళ్ళు. సిపాయుల గుంపులు. తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, దేశ రక్షణకోసం ఎప్పుడూ ముందడుగు వేస్తుంటామని వారు గుర్తుచేస్తునట్లుంది. ( మాది కంటో‍న్మెంట్ ఏరియా ).
పక్షుల్ని, సిపాయుల్ని చూసి కలిగిన ఉత్సాహంతో నా నడక సాగుతూనేవున్నది ముందుకు. రోడ్డుకు ప్రక్కన గుడి; గుడిలోంచి కౌసల్యా, సుప్రజా అంటూ సుప్రభాతం వినిపిస్తున్నది. భక్తులువచ్చి, దణ్ణాలుపెట్టుకొని వెళ్తున్నారు. సమయంలేనివారు, చెప్పులిప్పి, రోడ్డుమీదనుండే ఒక నమస్కారం చేసుకొని వెళ్ళిపోతున్నారు. వారిని చూస్తూ నేను ముందుకు నడుస్తున్నాను. నిజానికి వ్యాపార లాభం కోసమైనా, మీ సేవకోసమే మేమున్నాం అన్నట్లుగా, వ్యాపారులు ప్రొద్దున్నే తమ దుకాణాలు తెరచి, పప్పులు, ఉప్పులు అందిస్తున్నారు. ఆడవాళ్ళు కొంతమంది, తమ ఇంటిముందు ఊడ్చి, కళ్ళాపి చల్లి, ముగ్గులు వేస్తున్నారు. అందులో కార్తీకమాసం కావటంతో, ఉదయానేలేచి, తలస్నానాదులు చేసి, పెద్ద బొట్టుతో, తల్లో పూలతో బయటకువచ్చి, నీళ్ళు చల్లి, ముగ్గులు వేస్తున్నారు. తమ వంతు సహాయంగా, మొగవాళ్ళు, పూజకోసం పూలను కోస్తున్నారు. పెద్దల జంటలను చూస్తూ, ఆనందంతో నేను ముందుకు నడుస్తూనే వున్నాను.
అక్కడక్కడ వీధుల మీద దుమ్ము లేస్తున్నది. వీధుల ప్రక్కన చిన్న,చిన్న మంటలు. వీధులను ఊడుస్తున్న పురపాలక కార్మికులు. మనం పడేసిన చెత్తా,చెదారాన్ని కొబ్బరిపుల్లల చీపుర్లతో ఊడ్చి, ప్రక్కనేసి, తగులబెడుతూవున్నారు. ఇవి సంక్రాంతి ముందు వేసే మంటల్లాగా వున్నాయి. రోడ్లు ఊడ్చే వాళ్ళల్లో ఎక్కువమంది ఆడవాళ్ళే వుంటారు. వారందరూ, చలివలన, తలకు తలపాగాలాంటివి చుట్టుకొని, చేతిలో పొడుగాటి కర్రకు కట్టిన పుల్లల చీపుర్లతో వీధులను శుభ్రంచేస్తుంటారు. వీరిని చూస్తుంటే నాకు రెండు విషయాలు స్పురిస్తాయి. ఒకటి:– స్త్రీలు, తలకు తలపాగా కట్టుకొని ( కాళికాదేవి కిరీటం పెట్టుకున్నట్లుగా ), చీపురు కర్రను రెండు చేతులతో వాలుగా పట్టుకొని ఊడుస్తుంటే, కాళికాదేవి త్రిశూలం పట్టి, మహిషాసుర మర్ధన చేస్తున్నట్లనిపిస్తుంది నాకు. దుమ్ము లేచిందని మనం ముక్కు మూసుకొని ప్రక్కకు నడిచినా, వాళ్ళు ప్రశాంతంగా తమ పని తాము చేసుకుంటూనే వుంటారు. రెండవది:– వాళ్ళు శుభ్రం చెస్తున్నది చెత్తా,చెదారాన్ని అయినా, మనుషుల మనస్సుల్లో, శరీరంలో పేరుకుపోయిన, వదలని కోరికల్ని, కుళ్ళుని, సూదిమొనల్లాంటి చీపుర్లతో ( శూలం లాంటిది ) నిశ్చితంగా, నిర్భయంగా ఊడ్చి, ప్రోగుపెట్టి, మంటల్లో కాల్చి, బూడిదచేసి, మరలా పైకి లేవకుండా కళ్ళాపి చల్లుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. అది తల్చుకొని, గుడి దగ్గర దణ్ణం పెట్టుకోకపోయినా, వీళ్ళకుమాత్రం మనస్సులో నమస్కరించి, ఆనందంతో మరల ముందుకు నడుస్తాను.
ఇక, త్రోవలో, సన్నటివాళ్ళు, అతి లావాటివాళ్ళు, చిన్నవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ ఎదురుపడుతూ వుంటారు. కొంతమంది పూర్వపరిచయం వున్నవాళ్ళే; కొంతమంది క్రొత్తగా పరిచయం అవుతుంటారు. చిన్న,చిన్న పలకరింపులు, కుశెల ప్రశ్నెలు, మరల ముందుకు సాగే నడక. ఎవరినీ కించెపరిచే ఉద్దేశ్యం నాకు లేకపోయినా, అతి లావుగావుండి, వైద్యుల సలహాపై నడకను సాధన చేస్తున్న వాళ్ళను చూస్తే నాకు పెద్దలు చెప్పిన ఒక విషయం గురుకు వస్తుంది: “ పొట్టను నమ్మొచ్చుకానీ, నాలుకని నమ్మరాదని ”. అయితే, లావుకు కారణాలు జన్యుపరమైనవికూడా అయివుండవచ్చు.
అలా ముందుకు నడుస్తుంటే, అక్కడక్కడ క్రొత్తగా కడుతున్న పెద్దపెద్ద భవంతులు, అపార్ట్‍మెంట్స్; వాటి ప్రక్కనేవున్న ఖాళీ స్థలాల్లో గుడిసెలు; అందులో భవంతులను కట్టే పనివాళ్ళు. ప్రొద్దున్నే లేచి, వంటా,వార్పూ ముగించుకొని, చద్దిఅన్నం తిని, మధ్యాహ్నం భోజనానికి డబ్బాల్లో అన్నం సర్దుకునే ప్రయత్నాల్లోవుండే ఆడవాళ్ళు కనిపిస్తుంటారు. మగవాళ్ళు, కొంతమంది, కడుతున్న ఇళ్ళను అన్నివైపులనుండి, రకరకాల కోణాలలో పరిశీలిస్తూ, కోణాలు సరిగ్గా వచ్చాయా లేదా అని చూస్తూ, పెద్దమేస్త్రి చెప్పిన సలహాలను వింటుంటారు. వాళ్ళల్లో, కొంతమంది, చాలాసేపు, తలపైకెత్తి, దాదాపు పూర్తికావస్తున్న భవనాలవైపు చూస్తూ, దీర్ఘాలోచనతో వున్నట్లు నాకు అనిపిస్తుంది. ప్రక్కనేవున్న పూరిగుడిశెల బ్రతుకులనుంచి ఎత్తైన భవనాల్లోకి చేరి, బ్రతకలేమా! ఏనాటికైనా? అన్న ఆశ వారి మనస్సుల్లో ఉదయిస్తున్నదేమో అని ఉదయపువేళలో నా మనసులో అనిపిస్తుంది. వారి కోరిక నెరవేరాలని కోరుకుంటూ నా నడకలో తిరుగు ప్రయాణం మొదలుపెడతాను.
తిరుగు ప్రయాణం. సమయం ఆరున్న గంటలు. సూర్యుడు ఎర్రబారుతూ, మనోహరంగా కనిపిస్తుంటాడు. నేను నడుస్తుంటే, నాతోపాటే నడుస్తున్నట్లుగా వుంటాడు. నా వారైన చెట్లు, పువ్వులు, పక్షులు, చల్లని గాలులు నిన్ను పలకరించాయా అని అడిగినట్లనిపిస్తుంది. అన్నట్లు ఒక్క విషయం చెప్పటం మరిచాను. కొంతమంది జంతు ప్రేమికులు, తాము పెంచుకునే కుక్కల్ని తీసుకొని నడకకు వస్తుంటారు. చాలా కుక్కలు ఇళ్ళముందు పడుకొని, ఇళ్ళ యజమానులు, నడకకోసం, తలుపులు తీసుకొని బయటకు రాగానే, శబ్దాలకు లేచి, వాళ్ళ కళ్ళల్లో కళ్ళుపెట్టి ( మీరు గమనించండి ) చూస్తుంటాయి. నువ్వు, మమ్మల్ని పెంచుకోకపోయినా, ఏదో మాలో, స్వతహాగావున్న విశ్వాసంతో, మీ ఇంటిముందు రాత్రంతా కాపలా కాసాము; దయతో మా ముఖాన తింటానికి ఏదైనా పడేయగలరా? అని అడుగుతున్నట్లుగా అనిపిస్తుంది వీధి కుక్కల్ని చూస్తుంటే.
ఉపసంహారం:– ఆధ్యాత్మికత ప్రకృతి పరం. మనం కోణంలో, ధృక్పధంతో, విషయాన్నైనా చూస్తామో, ప్రకృతి విషయాన్ని అదే విధంగా ఆవిష్కరిస్తుంది! మనం ప్రతి రోజూ నడిచే నడకలోకూడా ఆధ్యాత్మికతను చూడవచ్చు. కాలం ఎవరికోసం ఆగదు. అది ఎప్పుడూ ముందుకు నడుస్తూ నే వుంటుంది. జీవి అయినా కాలంతో నడవాల్సిందే. ‘నడవలేని బద్దకస్థుడు జీవిత మాధుర్యాన్ని అందుకోలేడు. అంతెందుకండీ అసలు మనకు నడకను నేర్పినవారు ఇద్దరే ఇద్దరు. వాళ్ళు ఇరవైనాలుగు గంటలూ, మూడువందల అరవై ఐదు రోజులూ, పగలనకా, రాత్రనకా, తూర్పునుంచి, పడమరకు; పడమటనుంచి తూర్పుకు నడుస్తూనేవుంటారు. అదేనండి, సూర్య,చంద్రులు. సరే, మా ఇళ్ళు వచ్చేసింది. సమయం ఏడు గంటలయింది. మరి నేనూ మిగతా పనులు నడిపించాలి; చదువుతున్న మీరూ, మీమీ పనులను నడిపించాలిగదా! మరి ఇక నడవండి ముందుకు. తిరిగి, రేపు ఉదయం, నడకలో కలుద్దాం, ఆనందంతో. సెలవ్.

From
మీతో చెప్పాలనుకున్నా!!!

0 comments:

Post a Comment