భగవద్గీత రెండవ అధ్యాయం, ఇరవైఏడువ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇట్లా చెప్పాడు:
|| జాతస్య హి ధ్రువోమృత్యు ర్ధృవం జన్మ మృతస్య చ | తస్మాదపరిహార్యేర్ధే | న త్వం శోచితు మర్హసి ||
అర్ధం: పుట్టినవానికి చావు తప్పదు; చచ్చిన వానికి పుట్టుక తప్పదు.
పై శ్లోకాన్నిబట్టి ఈ విశ్వంలో శాశ్వతమైనది ఏదీలేదు; అట్లని అశాశ్వతమైనదీ ఏదీలేదని తెలుస్తున్నది. ఈ విషయాన్ని జీవులకు, వస్తువులు లేదా పదార్ధాలకి అన్వయిస్తే, ఈ రోజు పుట్టిన జీవి, రేపు చనిపోతే, ఆతరువాత ఆ జీవి మరల పుడుతున్నాడని తెలుస్తుంది. మరణానికి, మరల పుట్టుకకి మధ్యవున్న ‘సంధికాలం’ మనకు కనబడటంలేదు/తెలియటంలేదు. పదార్ధ విషయంలోకూడా ఇంతే. కానీ, ఆ జీవి లేదా ఆ పదార్ధం, అవసరమైన మార్పులుచెంది మరల సృష్టిపధంలో తిరుగాడుతూనేవుంటుంది.
శక్తి-ఉష్ణం-కాంతి: ఒక జీవపదార్ధం, కొంత ఒరిపిడికి లోనైనప్పుడు, దానినుండి శక్తి, ఉష్ణం, కాంతి ఏర్పడుతుంటాయి. ఈ ప్రక్రియలో, ఈ మూడింటిలో ఒకటి, లేదా రెండు కంటికి కనిపించవచ్చు, లేదా కనిపించక పోవచ్చును. కానీ, మూడూ ఆవిష్కరింపబడుతూనేవుంటాయి. అయితే, విత్తుముందా? చెట్టుముందా? అన్నట్లుగా, జీవపదార్ధం ముందా? లేక శక్తి ముందా? అని ప్రశ్నించుకుంటే, నా ఉద్దేశ్యంలో ‘శక్తి’ అనేదే ముందు అని అంటాను. ఈ శక్తినే ‘ విశ్వ చైతన్యశక్తి’ అని అందాం. శక్తే ముందు అని ఎట్లా చెప్పొచ్చు అని అంటే, ఆధునిక శాస్త్రాల ప్రకారంకూడా, ENERGY IS NEITHER BE CREATED NOR
/*DESTROYED ( శక్తికి పుట్టుక, నాశనము లేవు ) అని చెప్పబడింది కాబట్టి. అంటే, పదార్ధం శక్తి తరువాతనే పుట్టివుండాలి, లేదా శక్తినుండి పుట్టివుండాలి. మన వేదశాస్త్రముల ప్రకారంకూడా ఈ విశ్వమంతా చైతన్యశక్తియొక్క సృష్టే!! ‘E=Mc2’ అనే సిద్ధాంతాన్నికూడా ఇక్కడ, ఈ ప్రతిపాదన సరిఅయినదే అని చెప్పటానికి వినియోగించవచ్చు. E లేదా శక్తి – దీనినే ముందుగా ఎందుకు చెప్పాలి? పదార్ధాన్ని ముందుగా చెప్పవచ్చునుకదా? అని ప్రశ్నిస్తే, పదార్ధం కంటికి కనిపించినా, కనిపించకపోయినా, శక్తి అనేది శాశ్వతంగా వుంటుంది; తెలుస్తుంది కాబట్టి అని చెప్పవచ్చు. మరొక మాటేమిటంటే, ‘ENERGY CAN BE EXCHANGED IN THE FORM OF HEAT OR MECHANICAL WORK, BUT ENERGY’S TOTAL QUANTITY REMAINS CONSTANT’( స్థిరః – విష్ణుసహస్రనామం). ఈ వాక్యం ద్వారాకూడా చైతన్యశక్తి యొక్క ప్రాధమ్యం, ప్రాముఖ్యత మనకు తెలుస్తున్నది. మరొక ఉదాహరణను చూస్తే:- ELECTROMAGNETIC ENERGY IS PERPETUALLY CHANGING FROM ENERGY TO MASS AND FROM MASS TO ENERGY అని చెప్పబడింది.
చైతన్యశక్తి తనకుతానుగా అనేక రూపాలుగా మారుతున్నప్పుడు, దానినుండి పుట్టిన ఏ ఇతర జీవ పదార్ధాలకైనా పుట్టుక, ఎదుగుదల, తగ్గిపోవటం, నశించిపోవటం అనే నాలుగు దశలు కనిపించినా, నిజానికి ఆ స్థితులన్నీ పరిణామ దశలే. అంటే చైతన్యశక్తి ఒక భ్రమణ-చక్రంలాంటిది అని తెలుస్తున్నది. దీనికి, దీనిలోవుండే పదార్ధానికి ఆది, అంత్యం అనేవిలేవు. మన వేదశాస్త్రాల ప్రకారం జీవులు 64 వేల కోట్ల యోనుల ( MOTHER’S WOMB ) ద్వారా జీవ, మరణ దశలను పొందుతారు అని చెప్పబడింది. ప్రతి జీవికికూడా ఒక పరిణామ దశవుంది అని చెబుతూ, జీవులన్నింటినీ సృష్టించే బ్రహ్మకుకూడా నూరు సంవత్సరాల ( బ్రహ్మకు: 360 రోజులు ఒక సంవత్సరం; 100 సం.లు=309173760000000 అంటే మూడు కోట్ల, తొమ్మిది లక్షల, పదిహేడువేల మూడువందల డెబ్భైఆరు కోట్ల కోట్ల సంవత్సరాలు ) ఆయుఃప్రమాణాన్ని చెప్పబడింది. కాబట్టి, చావు,పుట్టుక అనేవి ఒకదానికొకటి సంధింపబడివున్న నిరంతర ప్రక్రియలని చెప్పవచ్చు.
నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు అని సామెత చెబుతారు. నీరు పల్లానికే ఎందుకు వెళ్తుంది? ఎందుకంటే, నీరు ఎత్తులో వున్నదికాబట్టి. మరి ఆ నీటిని అంత ఎత్తులో మొదటగా వుంచెందెవరు? దేవుడా? అయితే, ఆ నిజంకూడా ఆ దేవుడికే తెలియాలి! అసలు సంగతేమిటంటే, నీరు కణ సముదాయం; తనలో ఇమిడివున్న చైతన్యశక్తిచే, ఒక చోటనుంచి మరొక చోటుకు కదులుతూనే వుంటుంది. కొండల్లో పుట్టి, నదులై, సముద్రంలో కలిసి, ఆవిరై, వర్షరూపంలో మరల కొండలపై పుట్టి, మళ్ళీ పల్లానికి ప్రవహిస్తుంటుంది. అట్లాగే, ఈ విశ్వచైతన్యశక్తి, దానిద్వారా పుట్టిన అణువులు, పరమాణువులు, జీవులు నియమబద్ధంగా, కాలాతీతంగా ఈ విశ్వంలో కదులుతూనే వుంటాయి.
ప్రతిజీవి, జీవపదార్ధము లేదా జీవ పరమాణువులతో నిర్మింపబడినదే. ఈ జీవ పరమాణువులకు ఆ జీవం అనేది ఎక్కడనుంచి వస్తున్నది? విశ్వ చైతన్యశక్తినుంచే వస్తున్నది. మనం పదార్ధంలోని పరమాణువులను సూక్ష్మదర్శిని ద్వారా చూడగలముకానీ, వాటిలోవున్న చైతన్యశక్తిని చూడలేము. అయితే, ఆ శక్తిని ఉష్ణము, వెలుతురు, చలనములద్వారా తెలుసుకోగలం; అనుభవించగలం. ప్రతి జీవికి, లేదా జీవ పదార్ధానికి పుట్టుక, పెరుగుదల, తగ్గుదల, నాశనము అనే నాలుగు దశలున్నపటికీ, నాశన దశ తరువాత, ఆ జీవి లేదా జీవపదార్ధం, మరియు శక్తి ఎక్కడికి పోతున్నాయి? అనేది ముఖ్యమైన ప్రశ్న. అయితే, ఈ జీవపదార్ధం సంపూర్ణ మరణం (dead) కాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
జీవపదార్ధం పరమాణువులయొక్క సముదాయం. ఉదాహరణకి: మానవ శరీరం తీసుకుందాం. ఈ శరీరానికి మూడు స్థితులున్నాయి. కారణ శరీరం; సూక్ష్మ శరీరం; స్థూల శరీరం. ఏదో ఒక కారణంవలన శరీరం పుట్టిందికాబట్టి కారణశరీరం అని అన్నారు; జ్ఞానేంద్రియాలు, మనసుతోకూడి, కంటికి కనిపించక, అనుభవ జ్ఞానాన్ని కలిగివుండేది కాబట్టి సూక్ష్మశరీరం అని అన్నారు; పంచభూతములవలన పరమాణువలతోకూడి తయారయి, కంటికి కనిపించేది కనుక స్థూలశరీరం అని అన్నారు.
ఈ పేరాలో నా ఊహాజనితమైన ఒక విషయాన్ని ప్రతిపాదిస్తున్నాను. దీనికి సమర్ధనగా ఆధునిక సైన్స్ సిద్ధాంతాల్నికూడా పరిగణలోకి తీసుకుంటున్నాను. శరీరం మరణించినప్పుడు శరీరకణజాలం విఛ్చిన్నమైపోయి, భూమిలో కలిసిపోతుంది; అక్కడ అనేక రూపాంతరాలు చెందుతుంది. అయితే, ఈ శరీకణజాలంలోని ‘చైతన్యశక్తి” ఏమయినట్లు? ఇది నాశనం అయిపోతుందా? కాదు అని సమాధానం చెప్పాలి. ఇది విశ్వచైతన్యశక్తిలో కలిసిపోతుంది; కలిసిపోవాలికూడా. ‘చైతన్యశక్తి’ని, ‘సూక్ష్మశరీరం’ అని చెప్పవచ్చా? అవును అని అనుకుంటే, ప్రతి జీవినుండి విడివడిన చైతన్యశక్తి, విశ్వచైతన్యశక్తితో సంబంధముకలిగి వుంటూనే, తను ఒక “ప్రతిపత్తి”గా ( individualised Entity ) వుండివుంటే, అట్టి సూక్ష్మశరీరం, తనకు కలిగివున్న జ్ఞానేంద్రియశక్తితో, తిరిగి ఒక క్రొత్త శరీరంతో పునర్జన్మను పొందగలదు. ఇక్కడ, మనం పైన చెప్పుకున్న మూడు సిద్ధాంతాల్ని గుర్తుకుతెచ్చుకోవాలి: ఒకటి: Energy, neither be created nor be destroyed; 2nd: E=Mc2; 3rd: Electromagnetic energy is perpetually changing from
Energy to Mass and from Mass to Energy.
స్థూల శరీరకణజాలం, మరణం తరువాత విఛ్చిన్నమైనప్పటికీ, తిరిగి పుట్టటం జరగాలంటే, సూక్ష్మశరీరం, తనలోని చైతన్యశక్తిని, సంపూర్ణ చైతన్యశక్తి స్థాయికి తెచ్చుకోవాలి. దీనిని ఆంగ్లంలో ‘ రెజ్యువినేషన్ ’ (rejuvenation) అని అంటారు. మరి, ఆవిధంగా సూక్ష్మశరీరం పరిణామం చెందుతుందా? చెందగలదా? అని అంటే, ఇక్కడకూడా నాయొక్క ఊహాజనితమైన ఒక ప్రతిపాదనని, ఆధునిక సైన్స్ విషయాధారంగా మీముందుకు తీసుకువస్తున్నాను:-
ఆధునిక సైన్స్‍లో ‘బ్లాక్‍హోల్స్’ (కృష్ణబిలాలు) ను గురించి వివరించటం జరిగింది. విశ్వంలోని గ్రహాలన్నీ పెద్ద,పెద్ద నక్షత్రాలు విస్పోటం చెందటంవలన ఏర్పడ్డాయని చెప్పటం జరిగింది. ఇటువంటి పెద్ద,పెద్ద నక్షత్రాలు అంతులేకుండా ఈ విశ్వంలో వున్నాయి. ఇటువంటి నక్షత్రాలు, ఒక దశ అంతంలో కూలిపోయినప్పుడు, వాటిలోని ఘన, ద్రవ, వాయి,ధూళి పదార్ధాలు ఒకచోట కుప్పగా ఏర్పడతాయి. ఈ కుప్పగావుండే ప్రదేశాన్నే బ్లాక్‍హోల్ లేదా కృష్ణబిలము అనిఅంటారు. ఈ ప్రదేశంలో, పదార్ధాలన్నీ అత్యంత సాంద్రత, అత్యంత ఉష్ణము కలిగి, కాంతివేగం కంటే ఎన్నోరెట్లు వేగంతో భ్రమిస్తుంటాయి. ఈ ప్రదేశంలోకి, బయటనుంచి వచ్చిన కాంతికిరణాలుకూడా తిరిగి వెనక్కి మరలలేవు. అయితే, ఆధునిక సైన్స్యొక్క ఊహ ఏమి చెబుతుందంటే, ఈ కృష్ణబిలంలోకి, కాంతిగానీ; పదార్ధంగానీ, శక్తిగానీ ప్రవేశించినప్పుడు, అవి వచ్చిన మార్గంలోనే వెనక్కిపోలేక, అక్కడే చిక్కుకుపోతాయి. కానీ, ఆ బిలంయొక్క రెండవ లేదా క్రింద కొననుంచి ఇవి మరింత చైతన్యాన్ని పొంది, బయటకు వస్తుంటాయి. కానీ, దీనిని ఇప్పటివరకు స్పష్టంగా గుర్తించటం జరగలేదు. Mr.Eric Bresseur quoted, “ One idea is that a Blak Hole is connected to a White Whole. The matter falling into
a Black Hole would be spewed-out by a White Hole somewhereelse, possibly rejuvenated to the State of Primal Matter as produced by Big Bang
- Hydrogen and Helium. కాబట్టి, ఈ విషయాల ఆధారంగా, స్థూల శరీరంనుండి విడివడిన చైతన్యశక్తి, కృష్ణబిలాలగుండా ప్రయాణించి, సంపూర్ణ చైతన్యశక్తిగా రూపొంది, తిరిగి మరొక పుట్టుకను లేదా శరీరధారణను చేస్తుంది. దీని ఆధారంగానే, పునరపి జననం, పునరపి మరణం ( మరణం అంటే మార్పు ) అని పెద్దలు చెప్పివుండవచ్చును.
ఉపసంహారం:- ఆధునిక సైన్స్ బిగ్-బాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం, 14 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ విశ్వం పుట్టిందని చెప్పటం జరిగింది. ఇప్పటివరకు మనం, మనంవుండే పాలపుంత యొక్క పూర్తి రహస్యాలను తెలుసుకోలేదు. ఒక్క చంద్రుడుమీద తప్ప, మరే ఇతర గ్రహాలపైనా దిగలేదు; వాటి అనుపానాలు తెలియలేదు. విశ్వంలో, మన పాలపుంత (గెలాక్సీ) లాంటివి కోటానుకోట్లు వున్నాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అంటే, మనకు తెలియకుండా, మన కంటికి కనబడకుండా ఎన్నెన్నో వింతలు, విశేషాలు ఈ విశ్వంలో నిరంతరం ఆవిష్కరింపబడుతూనే వుండివుండాలి!! అటువంటప్పుడు, పైన నేను పేర్కొన్న రెండు ప్రతిపాదనలు సంభవమే అని అనటానికి ఆస్కారంకూడా వుండి వుండవచ్చునుకదా?! అన్నీకాకపోయినా, ప్రపంచంలో, కొన్ని పరిశోధనల్లో, ‘ఈ జన్మలోనే కాకుండా, క్రిత జన్మలోకూడా నేను మనిషినే’ అని చెప్పిన సంఘటనలు నిజమేనని నిరూపించబడినాయి. అయినప్పటికీ, పరిపూర్ణ పరిశోధనలు పూర్తికాలేదు.
From
మీతో చెప్పాలనుకున్నా!!!
0 comments:
Post a Comment