Monday

భావనే భగవంతుడు


"మనల్ని మనం వదులుకోవాలి. మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. నిష్కామకర్మ, భక్తి, యోగం మనకు మార్గాలు. ఆత్మ విచారణకే సాధన. భగవంతుడంటే చైతన్యమే. మౌనంలోనే తత్వం అనుభవమవుతుంది. మాటలు తగ్గించాలి. స్వానుభవం పరిధిలో వుంటూనే అనంతత్వంలోకి మనం మనల్ని ప్రసరించుకోవాలి''

తండ్రీ! నీ ఆజ్ఞ ప్రకారం వచ్చేశాను. ఇకపై అంతా నీ ఇష్టం! అన్నవి కేవలం మాటలు కావు. ఆత్మానుభవం పొందిన రమణుల సమర్పణ. సర్వవ్యాపకుడు, సర్వమూలము అయన అరుణాచలేశ్వరుడు ఆ క్షణం వరకు రమణుల భావనలో సగుణమూర్తి. మరుక్షణమే రమణులకు నిరాకార, నిర్గుణ పరబ్రహ్మమైన కర్త. అంతిమంగా తనకంటూ ఏ విధమైన కష్టాలు లేవని, తన ఉనికి, అస్తిత్వము, వ్యక్తిత్వము కర్తదేనన్న మనోసన్యాసం. నిర్భయత, స్పష్టత, నిష్ఠ కలబోసుకున్న నిర్మల, నిశ్చల, అద్వైత భావసిద్ధి. భగవాన్ రమణుల భువన సంచారంలో ఇదో రమణీయమైన మలుపు.

ఆత్మానుభవం..అద్భుతం
అత్మానుభవం కలగటం అంత సులభం కాదు. కలగకపోవటం అంటూ లేదు. కానీ ఒక ఆత్మానుభవం 54 సంవత్సరాలు నిలకడచెంది దేహంగా, మోహాతీతంగా వుండటం మాత్రం అద్భుతం. ఏమీలేదు ఊరకుండండి అని బోధించిన మహర్షి, ఆ బోధకు ఉదాహరణ పూర్వకంగా వుండగలగటం ఆధ్యాత్మిక చరిత్రలో అపూర్వం. మాటకు, మనసుకు అందని ఒక పరిసత్యం సాధకుడికి అనుభవంలోకి రావాలి.

సత్యానుభవం కలిగిన మహర్షి వంటి వారు మానవదేహంలో ఉంటూనే సాధకుడికి సామీప్య, సారూప్య, సాన్నిధ్య స్థితులలో అందుబాటులో లేకపోతే, సత్యాన్వేషణ కుంటుపడుతుంది. అందువల్లనే మహాత్ములు, మహర్షుల వంటి వారి జీవనగమనమంతా సాధనమయంగానూ, మార్గదర్శకంగానూ వుంటుంది. మహర్షుల వంటి వారికి భగవంతుడు ఒక శక్తి. ఒక దివ్యభావన. అనుభవసిద్ధంతా అంతరంగికమే. సర్వం బ్రహ్మమయమనే స్థిరభావనే వారి స్థితి.

ఏకాంతంలో సమూహాన్ని, సమూహంలో ఏకాంతాన్ని సృష్టించుకుని, తమలో తాము, తమతో తాము వుంటారు. బయట జరుగుతున్న ఏ విషయమూ వారి స్థితిని ప్రభావితం చేయలేదు. తమ అంతరంగిక శుద్ధిని, అద్వైత సిద్ధిన అందరిపై ప్రసరించగల సర్వశ్రేయోకాముకులై, తమ కర్తవ్యాన్ని నిశ ్శబ్దంగా, నిరంతరాయంగా కొనసాగిస్తారు. అన్ని పనులను సహజనైపుణ్యంతో నిస్వార్థంగా చేస్తారు. ఆత్మనిష్ఠ వారికి సహజంగా వుంటుంది.

నిశ్శబ్ద బోధ
అపరోక్షానుభూతికి రమణులు ఒక సహజ ఉదాహరణ. మరణం అమంగళం కాదు. సత్యసాక్షాత్కారం పొందలేకపోవటమే అసలు మరణం. సత్యానుభవం ఎరుగని దేహ నిరుపయోగం. అది అసంపూర్ణం. అత్మా ఒక్కటే నాశనం ఎరుగనిది. నశించేవి ఏవీ ఆత్మస్థాయికి చెందినవి కావు. అవన్నీ కేవలం వస్తువులే. "మనల్ని మనం వదులుకోవాలి. మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. నిష్కామకర్మ, భక్తి, యోగం మనకు మార్గాలు. ఆత్మ విచారణకే సాధన.

భగవంతుడంటే చైతన్యమే. మౌనంలోనే తత్వం అనుభవమవుతుంది. మాటలు తగ్గించాలి. స్వానుభవం పరిధిలో వుంటూనే అనంతత్వంలోకి మనం మనల్ని ప్రసరించుకోవాలి''. సరిగ్గా మహర్షి స్థితి ఇదే. అద్వైత సిద్ధికి అయన ఒక సగుణరూపం. ఏదో శక్తి, ఎవరో కర్త తననూ, ఈ సర్వసృష్టిని నడిపిస్తున్నవే గానీ అందులో తమ ప్రమేయమేదీ లేదన్న నిష్ఠ వారిది. భగవాన్ జీవితమంతా ఈ సూత్రం మీద నడిచిందే. ఆయనకు నమస్కారాలు, తిరస్కారాలు ఏవీ అంటవు. ఆయన మార్గమంతా నివృత్తే. తమ చుట్టూ వున్న వారి సుఖదుఃఖాలకు, ఆనందాలకు ప్రతిస్పందించని పాషాణపాకం కాదది.

అయితే స్పందనలన్నీ క్లుప్తంగా, సరళ సమీరంలా, గంభీరంగా వుంటాయి. ఉద్వేగమెరుగని ఉత్సాహ కీలలుగా వుంటాయి. తాము అనుభవించిన ఆత్మానుభవంలో నుంచి వెలువడే ఆధ్యాత్మిక తరంగాలు, ఎవరెవరి అవసరాన్ని బట్టి వారిని తాకి, మూలంవైపు నడక సాగేట్లు చేస్తాయి. ప్రపంచం కల్పించే ప్రతి అవకాశాన్ని ఆత్మోన్నతి కోసం ఉపయోగించుకోవాలి. తత్వవిచారణలో ఆత్మానుభవం శిఖరస్థాయికి చెందినది. సత్యసాధన, సత్యశోధన ఆధారంగా సాగే ఆత్మవిచారమే అసలు సాధన. 54 సంవత్సరాల రమణుల ఈ దివ్యస్థితి ప్రపంచానికి ఓ నిశ్శబ్ద బోధ.

'నిన్ను నీవు తెలుసుకో! అదే అసలు స్పృహ, అదే ఎరుక' అనే రమణ బోధ, ఒక గంభీర తాత్విక చింతన. ఎన్నో పోగొట్టుకుంటే కానీ ఈ చింతన స్థిరపడదు. నేనూ - నాది అనే అహంకార, మమకారాలు వదులుకుంటేనే, మనము - మనది అనే విశాలన ఏర్పడుతుంది. అపై, ఉన్నదంగా ఒకటే అనే స్థిరభావన కలగి, మిగులుతుంది. ఆత్మానుభవమంటే ఒక నిశ్చలత, నిరంతరత. అంతేకాదు. అదొక సత్యభూమిక. అందువల్లనే మహర్షి వంటి మహాపురుషులు తమ అనుభూతిని ప్రపంచానికి అందించటంలో ముందుంటారు. స్వయంగా అందించరు. అందుకోమంటారు. అందుకే భగవాన్, అనుగ్రహమంటే ఆత్మే అంటారు. అందిస్తున్నదెవరు? అందుకున్నదెవరు? అంతా వుండటమే. అంతా జరగటమే. ఎవరి కర్తృత్వము ఎందులోనూ లేదు.

0 comments:

Post a Comment