Wednesday

చక్రాసనం

చక్రమును పోలి ఉంటుంది కాబట్టి చక్రాసనము అని పేరు. చక్రాసనముదే ఊర్ధ్వ ధనురాసనం అని కూడా అంటారు. ఒకేసారి చక్రాసనంలో కాకుండా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ సాధన చేస్తే కష్టమైన ఈ ఆసనాన్ని సాధించవచ్చు.

పద్ధతి :
ముందుగా వెల్లకిలా పడుకోవాలి. రెండు కాళ్లనూ పిరుదుల వద్దకు తీసుకురావాలి. రెండు మడమలను నడుము వద్ద ఆన్చాలి. రెండు చేతులనూ ఒకదాని తరువాత ఒకటి నెమ్మదిగా భుజాల కిందుగా ఉంచాలి. గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా తలను, వీపును, నడుమును భూమి నుంచి పైకి లేపాలి. చేతులను, పాదాలను భూమి మీద ప్రెస్8 చేస్తూ తలను, నడుమును వీలున్నంత పైకి లేపాలి. ఉండగలిగినంత సమయం ఉన్న తరువాత గాలి వదులుతూ యథాస్థితికి రావాలి. అన్ని ఆసనాల కన్నా ఇది కొంచెం కఠినంగా ఉంటుంది. కాబట్టి స్టెప్‌బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాం.

స్టెప్ బై స్టెప్
1. పద్ధతి మొత్తం మామూలుగా చేసినా నడుము, భుజాలు మాత్రమే పైకి లేపి ఈ స్థితిలో ఉండగలిగినంత సమయం ఉండి యధాస్థితికి రావాలి.
2. ఈ స్థితిలో నడుము, భుజాలతోపాటు తలను కొద్దిగా లేపి తల మధ్యభాగం భూమి మీద ఆనేటట్లుగా ఉంచాలి. ఇదే స్థితిలో ఉండగలిగినంత సమయం ఉండి యధాస్థితికి రావాలి.
3. చక్రాసనం
4. చక్రాసన స్థితిలోకి వచ్చాక నెమ్మదిగా పాదాల మడమలను ఎత్తి, వేళ్లమీద మాత్రమే ఉండగలిగినింత సమయం ఉండాలి. తరువాత నెమ్మదిగా మడమలు నేలకు ఆన్చి యధాస్థితికి రావాలి.
5. చక్రాసన స్థితిలోకి వచ్చాక నెమ్మదిగా కుడిపాదం మీద బ్యాలెన్స్ కుదుర్చుకుని, ఎడమ కాలును వీలున్నంతగా పైకి లేపాలి. ఉండగలిగినంత సమయం ఉండి నెమ్మదిగా యధాస్థితికి రావాలి.
ఒకేరోజు అన్ని స్టెప్స్ ప్రయత్నించకూడదు. ఒక్కొక్క స్టేజ్‌లో బాగా అనుకూలంగా ఉన్న తరువాత అంటే ఒక 15 రోజులు ఒక స్టెప్ మాత్రమే ప్రయత్నం చేయాలి. దీంతో కూడా పూర్తి చక్రాసనం వల్ల కలిగే లాభాలు పొందవచ్చు.

ఉపయోగాలు :
నాడీ వ్యవస్థ సంపూర్ణంగా ఉత్తేజితం చేస్తుంది.
భుజాల వద్ద, వీపు వద్ద పేరుకున్న కొవ్వును తగ్గిస్తుంది. వెన్నెముక ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది.
ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి, ఆర్టిస్టులకు, పిల్లలకు చాలా మంచిది.
జాగ్రత్తలు :
నీరసంగా ఉన్నప్పుడు చేయకూడదు. ముంజేతులు బలహీనంగా ఉన్నవారు చేయకూడదు.
గమనిక : నిపుణుల ఆధ్వర్యంలో చేయడం మంచిది. 

0 comments:

Post a Comment