Friday

పొట్ట తగ్గించే ధనురాసనం

ధనుస్సును పోలి ఉన్నందున ఈ ఆసనానికి ధనురాసనం అనే పేరు వచ్చింది. ఆసనం అనే ప్రక్రియ కొద్దిగా క్లిష్టంగా ఉన్నప్పుడు ప్రారంభంలో అందరూ చేయలేరు. పూర్తి ఆసన స్థితిని కాకుండా మొదట సులభమైన స్థితిని ప్రయత్నించి, సాధన తరువాత పూర్ణస్థితిని చేరుకోవచ్చు. రాలేదు అని అనుకోకుండా మొదట అర్ధ ధనురాసనమును ప్రయత్నించి తరువాత పూర్ణ ధనురాసనం చేయవచ్చు.


అర్ధ ధనురాసనం
(ఏకపాద ధనురాసనం) 

ముందుగా బోర్లా పడుకోవాలి. చుబుకం నేలకు ఆన్చి అరచేతులు శరీరానికి పక్కగా ఉంచాలి. ఇప్పుడు ఎడమకాలిని మోకాలి వద్ద మడచాలి. ఎడమ చేతిలో ఎడమ కాలిని పట్టుకుని, కుడిచేతిని ముందుకు చేతివేళ్లతో సహా చాచాలి. చేయి భూమిని తగలకుండా ఉండేటట్లు చూడాలి. గాలి పీల్చుకుంటూ తలను, ఛాతిని, ఎడమ కాలిని పైకి లేపాలి. ఈ స్థితిలో 8 నుంచి 10 సెకన్ల పాటు ఉండాలి. గాలి వదులుతూ యథాస్థితికి రావాలి. నెమ్మదిగా ఎడమ చేతిని తీసివేసి కాలును మామూలుగా ఉంచాలి. ఇదే పద్ధతి కుడికాలితో చేయాలి. మూడు సార్లు ఎడమకాలితో, మూడుసార్లు కుడికాలుతో చేయాలి.

ముందుగా బోర్లా పడుకోవాలి. చేతులు శరీరానికి దగ్గరగా, అరచేతులు భూమి వైపుకు ఉంచాలి. ఇప్పుడు రెండు కాళ్లను మోకాలి వద్ద మడిచి చేతులతో మడమలను పట్టుకోవాలి. చుబుకం నేలకు ఆనించాలి. ఇప్పుడు మొత్తం శరీరాన్ని పైకి లేపాలి. గాలి పీల్చుతూ శరీరం పైకి లేపాలి. ఈ స్థితిలో కొన్ని క్షణాలు ఉండాలి. పొట్ట మీద మాత్రమే శరీరం భూమికి ఆనుతూ ఉంటుంది. నెమ్మదిగా గాలి వదులుతూ యథాస్థితికి రావాలి. ఇలా ఐదుసార్లు రిపీట్ చేయాలి.

ధనురాసనం ఉపయోగాలు :
- ఉదరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ ఎక్కువ జరిగి, అన్ని అవయవాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
- పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వును తగ్గిస్తుంది.
- వెన్నెముకను ఉత్తేజితం చేస్తుంది.
- శ్వాసక్రియను మెరుగు పరుస్తుంది.
ధనురాసనం రోలింగ్‌లోని ఈ మూడు ప్రక్రియల వల్ల పొట్ట తగ్గుతుంది.

0 comments:

Post a Comment