Monday

మూడు ఫస్టుల మహిళ...


జుడిషియల్ అకాడమి మొదటి మహిళా డైరెక్టర్. మొదటి మహిళా రిజిస్ట్రార్ (విజిలెన్స్). ఇప్పుడు మొదటి మహిళా రిజిస్ట్రార్ జనరల్... ముగ్గురూ ఒక్కరే. ఆ ఒక్కరే పెనుమల్లి మస్తానమ్మ. మన రాష్ట్ర హైకోర్టుకి మొట్టమొదటి మహిళా రిజిస్ట్రార్ జనరల్‌గా నియమితులైన సందర్భంగా 'నవ్య' కలిసినప్పుడు ఆవిడ తన కెరీర్ గురించి, కుటుంబం గురించి చెప్పిన వివరాలివి...

"రిజిస్ట్రార్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టానని తెలియగానే ప్రశంసలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. వాస్తవానికి ఈ పనికి మగా ఆడా భేదం లేదు. ఎవరైనా నిర్వర్తించాల్సిన విధులు ఒకటే. కాకపోతే హైకోర్టులో రిజిస్ట్రార్ జనరల్‌గా నియమించబడిన మొదటి మహిళని కావడం వల్లే ఈ హడావిడంతా. ఒకరకంగా చూస్తే మా తరానికి ఇది గొప్ప విషయమే. కాని ఇప్పుడు జుడిషియల్ విభాగంలోకి కూడా మహిళలు మగవాళ్లతో సమానంగా వస్తున్నారు. ముందు ముందు ఇటువంటి పొజిషన్లలో ఆడవాళ్లూ వస్తారు. అప్పుడు ఇది అంత పెద్ద వార్త అవ్వకపోవచ్చు (నవ్వుతూ).

మొదట్నించీ చదువంటే ఇష్టం
నెల్లూరు జిల్లాలోని చౌకచర్ల మా స్వగ్రామం. మాది రైతుకుటుంబం. ఇప్పుడు ఆడపిల్లల్ని కూడా బాగా చదివిస్తున్నారు కాని మేము చదువుకునే రోజుల్లో గ్రామాల్లో అమ్మాయిలను బడికి పంపేవారు కాదు. ఒకవేళ చదివించినా ఐదో తరగతి వరకే. ఆ తరువాత ఇంట్లోనే... పెళ్లీడు వచ్చిన తరువాత పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపేవారు. చదువు పట్ల నాకున్నఆసక్తి, పట్టుదలకు అమ్మానాన్నల ప్రోత్సాహం కలవడంతో సైన్సు డిగ్రీ పట్టా అందుకోగలిగాను.

డిగ్రీ అయిన వెంటనే సుబ్బరామిరెడ్డి గారితో వివాహమయ్యింది. మా పెళ్లప్పుడు ఆయన లా ప్రాక్టీసు చేసేవారు. పాప పుట్టిన ఏడాదికి నా భర్త ఇచ్చిన ప్రోత్సాహంతో నెల్లూరులోని లా కళాశాలలో చేరాను. 1977లో లా చదువు పూర్తయ్యింది. బాల్యంలో ఎలాగైతే చదువంటే ఇష్టం ఉండేదో... అలాగే కాస్త పెద్దయ్యాక ఏదైనా చేయాలనే తపన ఉండేది. దానికి తగ్గట్టుగా పుట్టింటితో పాటు అత్తింటి సహకారం కూడా లభించడంతో దిగ్విజయంగా చదువుకోగలిగాను. కెరీర్‌లో నిలదొక్కు కోగలిగాను. పుట్టింటి వైపు చూసుకుంటే నేనొక్క దాన్నే ఉన్నత చదువులు చదివినదాన్ని అప్పట్లో. అత్తింట్లో మాత్రం అందరూ బాగానే చదువుకున్నారు.

లా చదువు పూర్తయిన తరువాత ప్రాక్టీసు మొదలుపెట్టాలి. అప్పుడేమో మావారు ఏలూరులో మెజిస్ట్రేట్‌గా ఉన్నారు. నేను అక్కడ ప్రాక్టీసు చేయలేను. దాంతో నా ప్రాక్టీసు కోసమే ఆయన తనని హైదరాబాద్‌కి బదిలీ చేయమని కోరారు. ఆ విధంగా 1982లో ప్రాక్టీసు మొదలుపెట్టాను. అప్పటికి నా వయస్సు 33 ఏళ్లు. మా అప్పుడు మెజిస్ట్రేట్ రిక్రూట్‌మెంట్ పరీక్ష రాయాలంటే మూడేళ్లు లా ప్రాక్టీసు చేయాల్సిందే. అప్పుడే పరీక్షకు అర్హత ఉండేది. అందుకని 82 నుంచి 85 వరకు ప్రాక్టీసు చేశాను.

85లో సర్వీసు కమిషన్ ద్వారా ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌గా ఎంపికయ్యాను. ఆ తరువాత 1991లో సీనియర్‌సివిల్ జడ్జిగా ప్రమోషన్ వచ్చింది. 1997లో జిల్లా జడ్జిగా విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్, కరీంనగర్‌లలో విధులు నిర్వర్తించాను. ఆ తరువాత వరసగా హైదరాబాద్‌లో చీఫ్ జడ్జి సిటీ స్మాల్ కాజెస్ కోర్టు, డైరెక్టర్ జుడిషియల్ అకాడమి పదవులు చేపట్టాను. తరువాత ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ జడ్జి, రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ విజిలెన్స్‌గా బాధ్యతలు నిర్వర్తించాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిజిస్ట్రార్ జనరల్‌గా పదవీ బాధ్యతలు చేపట్టాను.

వేగం.. నేర్పు ఒక మార్గం....
జడ్జిగా విధులు నిర్వర్తించాలంటే నిత్యవిద్యార్థిలా రోజూ చదువుకుంటూ ఉండాల్సిందే. మా ఇంట్లో ఎలా ఉండేదంటే పిల్లలోపక్క, నేనోపక్క కూర్చుని చదువుకుంటుండే వాళ్లం. జడ్జిగా వ్యవహరించేప్పుడు ప్రతీ అంశాన్ని ఎంతో సునిశితంగా గమనించాల్సి ఉంటుంది. కేసులని స్టడీ చేసి పాయింట్స్ రాసుకుని తెల్లవారి ఉదయమే ఎనిమిది గంటలకు స్టెనోకి డిక్టేట్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఆఫీసు సమయం అయిపోగానే ఫైళ్లు మూసేసి ఇంటి పనులు చేసుకోవడం ఈ పనిలో సాధ్యం కాదు.

అలాగని వృత్తి కోసం కుటుంబ జీవితాన్ని, కుటుంబ జీవితం కోసం వృత్తి ధర్మాన్ని నిర్లక్ష్యం చేయలేదు నేను. రెండింటి కీ సమస్థానం ఇచ్చాను. ఇందుకు నిదర్శనం నా కుటుంబమే. నా పిల్లలు బాగా స్థిరపడ్డారు. సుమ, మనుక్రాంత్, మాధురీష్‌లు మా పిల్లలు. పెద్దపాప, బాబు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. ఇద్దరూ స్టేట్స్‌లో ఉన్నారు. చిన్న పాప ఎంబిఎ చేసింది. బెంగళూరులో ఉంటుంది. నేను, మా ఆయన ఒకే రంగంలో ఉండడం, జిల్లా జడ్జిగా పనిచేసిన ఆయన అనుభవం నాకెంతోగానో ఉపయోగపడుతున్నాయి.

వృత్తిని, కుటుంబాన్ని బాలెన్స్ చేయాలంటే పనిపట్ల అంకితభావంతో పాటు పనిలో వేగం ఉండాలి. ప్రారంభంలో కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ చేయగా చేయగా ఆ వేగం, నేర్పు అలవడతాయి. దాంతో కుటుంబం, వృత్తి ధర్మాలను సమంగా నిర్వర్తించే సామర్థ్యం దానంతటదే ప్రతీ మహిళకీ అలవడుతుంది.

అది అపోహ
మగవాళ్లే సమర్థవంతంగా పనులు చేయగలరనే అపోహ ఉంది సమాజంలో. బహుశా ఆడవాళ్లకి ఉన్నన్ని బాధ్యతలు వాళ్లకి ఉండకపోవడమే ఇందుకు కారణం కావొచ్చు. ఎందుకంటే ఎంత కాదనుకున్నా ఆడవాళ్లు మాత్రమే చూసుకోవాల్సిన పనులు కొన్ని ఉంటాయి. అవి చక్కబెట్టుకుంటూ తామనుకున్న లక్ష్యాలను చేరుకున్న మహిళలు ఎందరో ఉన్నారు. ఇందుకు ఆడవాళ్లు స్మార్ట్‌గా వర్క్ చేయడంతో పాటు కాస్త కుటుంబ సహకారం కూడా కావాలి. అప్పుడు ఏ రంగంలోనైనా మగవాళ్లతో పోటీపడటమే కాకుండా అనుకున్న లక్ష్యాలను అలవోకగా అందుకోగలు గుతారు.

అసంతృప్తి ఎరుగను
భర్త, పిల్లలు అందించే ప్రేమ, ప్రోత్సాహం మంచి టానిక్‌లా పనిచేస్తాయి. నాకు ఆ టానిక్ పుష్కలంగా లభించింది. ఇది కుటుంబపరంగా లభించిన వరం అయితే, వృత్తిపరంగా ఎటువంటి రిమార్క్ లేకుండా పనిచేయగలగడం ఒక అదృష్టం. ఈ రెండూ కలిసి సంపూర్ణ మహిళ అన్న తృప్తిని మిగిల్చాయి నాకు. జీవితంలో ఏది సాధించాలన్నా ఒక లక్ష్యం ఉండాలి. అయితే ఆ లక్ష్యం ఆకాశానికి నిచ్చెన వేసినట్టు కాకుండా మనలోని సామర్ధ్యానికి తగ్గట్టు ఉండాలి. ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకోవాలి. అంతే సిన్సియర్‌గా వాటి సాధనకు కృషి చేయాలి. ఇదే నేను నమ్మే సూత్రం. సానుకూలంగా ఆలోచించి, నాకు ఇచ్చిన పనిని నిబద్ధతతో చేస్తాను. కష్టపడతాను. అదే నన్ను ఈ రోజున ఈ స్థాయికి తీసుకొచ్చింది.

ఇప్పుడు నాకు 59 యేళ్లు. మా జనరేషన్‌కి కాబట్టి ఈ స్థాయికి రావడానికి ఇంత సమయం పట్టింది. ఎందుకంటే అప్పట్లో ఆడపిల్లలు చదువుకోవడమే తక్కువ. కాని ఇప్పుడున్న తరం బాగా చదువుతున్నారు. చాలా వేగంగా ఉన్నారు. నా తరువాత ఇంకెందరో మహిళలు ఈ పదవుల్లో చిన్న వయసులోనే చేరే అవకాశం ఉంది. అటువంటి వాళ్లందరికీ నేను చెప్పేదొక్కటే సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలంటే ప్రాక్టికల్ ఎక్స్‌పీరియెన్స్ అనేది చాలా ముఖ్యం. అది ఉన్నప్పుడు విషయాల పట్ల సునిశిత మైన అవగాహన కలుగుతుంది. దాంతో పరిస్థితులని బట్టి మసలుకునే నేర్పు వస్తుంది. ఇది అన్ని రకాలుగా పైకెదగడంలో ఉపయోగపడుతుంది.''

0 comments:

Post a Comment