Monday

వెయ్యి కాళ్ల మంటపంపై అందరితో చర్చించాకే నిర్ణయం...!


'తిరుమలలో వెయ్యికాళ్ల మండపంపై వేదపండితులు, పీఠాధిపతుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందుకని దీనిపై అందరినీ సమావేశపరిచి ప్రజలకు ఏది మంచి జరుగుతుందో ఆ నిర్ణయం తీసుకుంటాం. ఒకరి అభిప్రాయమే నెరవేరాలంటే సాధ్యం కాదు' అని దేవాదాయశాఖ మంత్రి సి. రామచంద్రయ్య స్పష్టం చేశారు. తిరుపతి విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు.

తిరుమలపై చిన జీయర్ వ్యాఖ్యలు, టీటీడీ ఈవోపై సీబీఐ కేసులు తదితర అంశాలను ఆయన ప్రస్తావించారు. తిరుమలలో 110 తప్పుల విషయంపై తనకు పూర్తి సమాచారం తెలియదన్నారు. రోజూ లక్షలాది మంది భక్తులు వచ్చే తిరుమలలాంటి పుణ్యక్షేత్రంలో చిన్నచిన్న పొరబాట్లు జరగడం సహజమేనని ఆయన అభిప్రాయపడ్డారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం త్రిదండి చినజీయర్ లాంటి పెద్దలకు సరికాదన్నారు.

దీనివల్ల భక్తి విశ్వాసాలు దెబ్బతింటాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. టీటీడీ ఈవోపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ప్రజలకు వ్యతిరేకంగా ఎవరు నిర్ణయాలు తీసుకున్నా, వారు బాధ్యులవుతారన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయ పాలకమండళ్ల నియామకాలకు సంబంధించి సభ్యులు, చైర్మన్ల అభ్యర్థిత్వాల సిఫార్సుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు.

అడ్డుపడింది నోరున్నవాళ్లే... తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడింది నోరున్నవాళ్లేనని, ఆ తర్వాత వారు నోర్లు మూసుకున్నారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి వ్యాఖ్యానించారు. పదవులు, అధికారాలు పంచుకునేటప్పుడు పో టీలు సహజమని,ఇవన్నీ తాత్కాలికమేనని పేర్కొన్నారు.

వెబ్‌సైట్‌లో రాష్ట్ర దేవాదాయ శాఖ భూముల వివరాలు... కడప: రాష్ట్రంలో దేవాదాయ శాఖకు సంబంధించి 4 లక్షల 60 వేల ఎకరాల మాన్యం భూములున్నాయని వాటి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచామని దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య తెలిపారు. భూముల గురించి కోర్టులో ఏదైనా వివాదం ఉంటే వాటి పరిస్థితిని కూడా వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. దేవాదాయ శాఖలో అవినీతిని పెరిగిందని అడ్డుకట్టకు చర్యలు చేపట్టామన్నారు.

దేవాదాయ భూములు, ఆస్తుల పరిరక్షణకు డీఆర్వో, ఆర్డీవో, డీఎస్పీలతో కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పీఆర్పీ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ అధ్యక్షతన ఆదివారం కడపలో నిర్వహించిన అభినందన సభలో మంత్రి ప్రసంగించారు. దేవాదాయ శాఖ ప్రాధాన్యత లేనిదని తాము భావించలేదన్నారు. దేవుడి సిఫారసుతోనే ఈ పదవి లభించిందన్నారు. తమకు శత్రువులు లేరని శత్రువులతో కూడా సంసారం చేయగలనన్నారు.

నీతి నిజాయితీ గల రాజకీయాలను ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్నానన్నారు. దేవాదాయ శాఖలో దేవతలతోనే కాదు రాక్షసులతోనూ పనిచేయాల్సి ఉంటుందన్నారు. చివరి రక్తం బొట్టు వరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంకితమవుతానన్నారు. ఈ సభలో మాజీ కేంద్రం మంత్రి సాయిప్రతాప్, ఎమ్మెల్యే కమలమ్మ, తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

0 comments:

Post a Comment