Saturday

క్యాన్సర్‌ను జయిద్దాం


భయపెడుతున్న సర్వెకల్ క్యాన్సర్
భారత దేశంలోనే ఏటా కొత్తగా 1 లక్షా 34 వేల గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్లు బయటపడుతున్నాయని ఐసిఎంఆర్ ఒక అంచనా వేసింది. ఈ క్యాన్సర్ల కారణంగా భారత దేశంలో దాదాపు 74 వేల మంది ఏటా ప్రాణాలు కోల్పోతున్నట్లు కూడా వారు కనుగొన్నారు. నిజానికి భారత దేశంలో ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలోనే ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ క్యాన్సర్‌లను నిరోధించే టీకాలను చిన్న వయసులోనే తీసుకోవడం ద్వారా ఈ సమస్యను పూర్తిగా అధిగమించవచ్చంటున్నారు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ మోహన వంశీ.

శరీర అంతర్భాగాల అపరిశుభ్రత పలు రకాల వ్యాధులకు దారి తీస్తుందనే నిజం చాలా మందికి తెలుసు. కానీ, ఈ అపరిశుభ్రత స్త్రీలలో ఏకంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కే దారి తీస్తుందనేది కొద్దిమందికే తెలుసు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లోనే ఈ క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. ఈ వర్గాల్లోని అపరిశుభ్ర తే ఈ సమస్యకు ప్రధాన కారణమని కూడా శాస్త్ర వేత్తలు కనుగొన్నారు. ప్రత్యేకించి జననాంగాల అపరిశుభ్రత కారణంగా వచ్చే హెచ్‌పివి (హ్యూమన్ పాపిలోమెటస్ వైరల్ ) ఇన్‌ఫెక్షన్‌లే ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు కారణమని పరిశోధకులు ఒక కచ్ఛితమైన నిర్ధారణకు వచ్చారు.

అయితే, ఈ వైరస్ తీరప్రాంతాల్లోని ప్రజల్లో, తేమకలిగిన వాతావరణంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. అలాగే జననాంగాల అపరిశుభ్రత అంతే పెద్ద కారణంగా ఉంటోంది. ప్రత్యేకించి బహిష్టు సమయాల్లో పరిశుభ్రతను పాటించకపోవడం వల్ల తరచూ ఈ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే వారు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇది స్త్రీలకే పరిమితమై ఉండదు. జననాంగాల పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా ఉండిపోయే వారి భర్తలు శృంగారంలో పాల్గొన్నప్పుడు వారి నుంచి ఈ వైరస్ భార్యలకు పాకుతుంది.

ఏ వయసులో....
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు సాధారణంగా చిన్న వయసులోనే పెళ్లి అయిన వారిలో, ఎక్కువ మంది పిల్లలను కన్న వారిలో, అతిగా శృంగారంలో పాల్గొనే వారిలో, జననాంగాల పరిశుభ్రత పాటించని వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, క్యాన్సర్ కారకమైన వైరస్‌ను నియంత్రించే టీకాలను పరిశోధకులు కనుగొన్నారు. గార్డాసిల్, సర్వారిక్స్ అన్న పేర్లతో లభిస్తున్న ఈ టీకాలను ఆరు మాసాల కాలంలో మూడు సార్లు, మూడు డోసులుగా ఇవ్వవలసి ఉంటుంది.

ఈ మూడు డోసుల మందు మొత్తం ఖరీదు 7 నుంచి 8 వేల దాకా ఉంటుంది. ఈ టీకాలను ఇన్‌ఫెక్షన్ సోకక ముందే పెళ్లికాని ఆడపిల్లలందరికీ 10 నుంచి 12 ఏళ్లలోపే ఇవ్వాలి. వీటి వల్ల మునుముందు ఈ గర్భాశయ క్యాన్సర్ రాకుండా పూర్తిగా నియంత్రించవచ్చు. చిన్న వయసులోనే ఇవ్వనివారికి పెళ్లి నాటికైనా ఇవ్వాలి. అప్పటికీ ఇవ్వకపోతే పెళ్లి తరువాత కూడా ఇవ్వవచ్చు. ఆ మాటకొస్తే 46 ఏళ్లు వచ్చే దాకా కూడా తీసుకోవచ్చు. కాకపోతే పాప్సిమియర్, గైనిక్ పరీక్షలన్నీ చేసి అన్నీ నార్మల్‌గా ఉన్నప్పుడే ఇవ్వాలి. పరీక్షలు చేసే నాటికే క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే అప్పుడింక టీకాలు ఇచ్చినా ప్రయోజనం ఉండదు.

వైరస్ ప్రత్యేకత
సాధారణంగా బాల్యంలో చికెన్‌పాక్స్ గానీ, స్వైన్ ఫ్లూ వంటి వైరస్ వ్యాధులు సోకినప్పుడు శరీరంలో వాటిని ఎదిరించే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా ఆ సమస్య మరోసారి రాదు. అయితే సర్వైకల్ క్యాన్సర్‌ను కలిగించే ప్యాపిలోమెటస్ వైరస్ మాత్రం ఎంతో తెలివైౖనది. ఇది గర్భాశయ ముఖద్వారంలోని కణాల్లోకి వెళుతుంది. కణాల్లోని న్యూక్లియస్‌లోకి ప్రవేశిస్తుంది. న్యూక్లియస్‌తో పాటు విభజనకు గురవుతుంది. కానీ, కణాలను చంపదు. సహజంగా కణాలను చంపినప్పుడే వ్యాధి నిరోధక వ్యవస్థ పనిచేయడం మొదలెడుతుంది. ఈ వైరస్ కణాల్లోనే ఉంటున్నా, వాటిని చ ంపదు కాబట్టి వ్యాధి నిరోధక వ్యవస్థకు ఇది దొరకదు. అందుకే వ్యాధి నిరోధక శక్తి పెరగ దు. అందుకే టీకాల ద్వారానే ఆ వ్యాధి నిరోధక శక్తిని పెంచవలసి ఉంటుంది.

వ్యాధి లక్షణాలు
జననాంగం నుంచి అసహజంగా అంటే బహిష్టుతో ప్రమేయం లేకుండా రక్తస్రావం కావడం ఒక లక్షణం. శృంగారంలో పాల్గొన్న వెంటనే రక్తస్రావం కావడం, రుతుక్రమం ఆగిపోయిన వయసులో రక్తస్రావం కావడం, జననాంగం నుంచి నిరంతరంగా ద్రవాలు రావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కొందరిలో ఎక్కువ కాలం మరికొందరిలో ఎక్కువ మొత్తంలో ఈ ద్రవాలు విడుదల అవుతుంటాయి. ఇవన్నీ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తొలిదశలో ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు. వీటిలో ఏ ఒక్క లక్షణం కనిపించినా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఒకవేళ వ్యాధి కాస్త ముదిరిపోయి ఉంటే పొత్తి కడుపులో నొప్పి రావడం, నిరంతర రక్తస్రావం కావడం వల్ల రక్తహీనత రావడం, ఆకలి తగ్గిపోయి, శరీరం బలహీనపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుర్తించడంలో ఇంకా ఆలస్యమైతే కాళ్లల్లో వాపులు వస్తాయి.

వ్యాధి నిర్ధారణ
గర్భాశయ క్యాన్సర్‌గా అనుమానం కలిగినప్పుడు పెల్విక్ పరీక్షలు, గైనిక్ పరీక్షలు చేయించి వ్యాధి ఉందో లేదో గుర్తించవచ్చు. ఆ తరువాత పాప్స్‌మిమర్ , సర్వైకల్ బయాప్సి పరీక్షలు చేయిస్తే వ్యాధి నిర్ధారణ మరింత స్పష్టమవుతుంది. అప్పటికీ ఏమైనా సందేహాలు ఉంటే కాల్పోస్కోపీ అనే పరీక్ష చేయించవలసి ఉంటుంది. ఒకసారి వ్యా«ధి నిర్ధారణ అయిపోతే, వ్యా«ధి మౌలికంగా ఉండే నాలుగు స్టేజీల్లో (దశల్లో ) ఎక్కడుందో పరిశీలించవలసి ఉంటుంది. చికిత్సలన్నీ ఆ దశను అనుసరించే ఉంటాయి. వ్యాధి దశను గుర్తించడానికి ఎంఆర్ఐ స్కాన్ ఉత్తమమైనది.

వైద్య చికిత్సలు
స్టేజ్-1బి, 2ఎ వరకు, శస్త్ర చికిత్స ద్వారానే క్యాన్సర్ నుంచి 95 శాతం బయటపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ క్యాన్సర్ స్టేజ్- 2బి దాటితే అప్పుడు కీమో థెరపీ, రేడియో థెరపీ ద్వారా వైద్యం చేయవలసి ఉంటుంది. క్యాన్సర్ తొలిదశలో ఉన్నప్పుడు, గర్భాశయాన్ని తీసివేసేందుకు చేసే శస్త్ర చికిత్సల్లో ఓపెన్ సర్జరీ కాకుండా ఒక చిన్న రంధ్రంలోంచి కీహోల్ విధానంలో చేస్తాం. దీన్ని ర్యాడికల్ హిస్టరెక్టమీ అంటారు. దీనివల్ల చాలా కచ్ఛితమైన ప్రమాణాలతో శస్త్ర చికిత్స చేయడం సాధ్యమవుతుంది. పైగా, గాయం త్వరగా మాని, చాలా త్వరగా కోలుకునే వీలుంటుంది. దీనివల్ల ఆ తరువాత ఎక్కువ రోజులు ఆగకుండా శస్త్ర చికిత్స జరిగిన ఒకటి రెండు వారాల్లోనే రేడియో థెరపీ, కీమోథెరపీ ఇవ్వడం సాధ్యమవుతుంది.

ఒకవేళ క్యాన్సర్ గర్భాశయ ముఖద్వారానికే పరిమితం కాకుండా ఇతర భాగాలకు పాకిందేమో అన్న అనుమానం క లిగితే శరీరం మొత్తాన్ని పరిశీలించడానికి పెట్ సీటీ -స్కాన్ చేయించవలసి ఉంటుంది. ఒకవేళ స్టేజ్ 3బిలో గుర్తించినా కీమో థెరపీ, రేడియో థెరపీ ద్వారా 25 శాతం మందికి పూర్తిగా నయమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఈ క్యాన్సర్ ఆలస్యంగా బయటపడినా అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్యాన్సర్‌ను ఆలస్యంగా అంటే 3బి స్టేజ్ దాటిన తరువాతే గుర్తించినా ఆధునికమైన కొన్ని చికిత్సల ద్వారా వారి జీవిత కాలాన్ని బాగా పొడిగించే అవకాశాలు ఉంటాయి.


క్యాన్సర్ చికిత్సలు రోగి వెన్నులో వణుకు పుట్టిస్తాయి. జీవితం మీద ఆశలు హరింపజేస్తాయి. క్యాన్సర్ వ్యాధి ఎంత వేగంగా విస్తరిస్తున్నదో ఆ వ్యాధి నివారణకు అంతే వేగంగా ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న చాలా రకాల క్యాన్సర్ సమస్యలకు ఇప్పుడు కొంత వరకు పరిష్కారమార్గం లభించింది. ముఖ్యంగా ఆధునిక చికిత్సా విధానాల ద్వారా రోగికి ఎంతో ఊరట కలుగుతున్నది. క్యాన్సర్ చికిత్సా విధానంలో వచ్చిన ఆధునిక పద్ధతుల్ని వివరిస్తున్నారు యశోద క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మెడికల్, రేడియేషన్, సర్జికల్ ఆంకాలజిస్టులు.

టార్గెట్ థెరపీతో ట్యూమర్ ్సకు చెక్
మన దేశంలో ఎక్కువగా పురుషులు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, మహిళలు సర్వైకల్ క్యాన్సర్‌ల బారిన పడుతున్నారు. పొగతాగటంతోపాటు పొగాకుతో చేసిన ఉత్పత్తులను నమలటం, మారిన ఆహారపు అలవాట్లు, వైరస్‌ల వల్ల పురుషులకు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ వస్తుంది. కారణాలేవైనా నోటిలో అల్సర్ రావటం, రక్తం స్రవించటం, గొంతు వద్ద గడ్డ ఏర్పడటం, గొంతు ధ్వని మారటం, నోటిలో నొప్పి అనిపించటం ఈ క్యాన్సర్ లక్షణాలు. ఈ క్యాన్సర్‌ను బయాప్సీ ద్వారా క్యాన్సర్ ఏ దశలో ఉన్నదో గుర్తించ వచ్చు.
ఈ వ్యాధిన ప్రాథమిక దశలో గుర్తిస్త్తే దీన్ని నిర్మూలించడం చాలా సులభం. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్‌కు ఓరల్‌కెవిట్ ఓరో ఫారినెక్స్, హైపోఫారినెక్స్‌ల విధానాల ద్వారా కీమోథెరపీ, రేడియో థెరపీ చికిత్సల ద్వారా నయం చేయవచ్చు. ఈ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్‌లో ఉంటే టార్గెటెడ్ థెరపీ ద్వారా క్యాన్సర్ ట్యూమర్స్‌ను నిర్మూలించవచ్చు. 

వైరస్ ఇన్‌ఫెక్షన్, ధూమపానం వల్ల మహిళలు సెర్వైకల్ క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారు. పట్టణ మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్, గ్రామీణ మహిళలకు ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. జననాంగం నుంచి రక్తం స్రవించటం, వైట్ డిశ్చార్జి, నీళ్లు రావటం, యూరిన్ ఇన్‌ఫెక్షన్‌లకు గురికావటం సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు. ఈ క్యాన్సర్‌ను ప్యాప్సీమేర్ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. 18 నుంచి 60 ఏళ్ల వయసు మధ్య గల మహిళలు రెండు,మూడేళ్లకు ఓ సారి ప్యాప్సీమేర్ పరీక్షలు చేయించుకోవటం ద్వారా ఈ క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. ఈ క్యాన్సర్‌ను కీమోథెరపీ, రేడియో థెరపీల ద్వారా నివారించవచ్చు. ర్యాపిడ్ ఆర్క్ మిషన్ సాయంతో కొత్త విధానంలో సాధారణ కణాలు దెబ్బతినకుండా క్యాన్సర్ ట్యూమర్స్‌ను మాత్రమే తొలగించవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సినేషన్ తీసుకోవటం ఉత్తమం. ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరంపై ప్రజలను చైతన్యవంతులను చేయాల్సి ఉంది.


అన్ని రకాల క్యాన్సర్‌ల చికిత్సలలో రేడియో థెరపీ నేడు కీలకంగా మారింది. కొన్ని శరీర భాగాల్లో కీమోథెరపీ, శస్త్రచికిత్సలు చేయలేము. అలాంటి ప్రాంతాల్లో కూడా రేడియోథెరపీ ద్వారా క్యాన్సర్ ట్యూమర్‌లను తొలగించవచ్చు. స్వరపేటిక, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినపుడు గతంలో వాటిని సర్జరీ ద్వారా పూర్తిగా తొలగించేవారు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన ఆధునిక వైద్యంతో రేడియేషన్ ద్వారా స్వరపేటిక, బ్రెస్ట్‌ను పూర్తిగా తొలగించకుండానే కేవలం క్యాన్సర్ ట్యూమర్లను మాత్రమే రేడియోథెరపీ ద్వారా నిర్మూలించవచ్చు. 80శాతం క్యాన్సర్‌లకు చికిత్సలో రేడియోథెరపీ అవసరమవుతుంది. తొందరగా క్యాన్సర్‌ను గుర్తించటంతోపాటు ఆధునిక వైద్య విధానాలతో సాధారణ కణాలు దెబ్బతినకుండా కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే తొలగించేందుకు రేడియోథెరపీ విశేషంగా ఉపయోగపడుతుంది. ఇంటెన్సివ్ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ (ఐఎంఆర్‌టి) రేడియోథెరపీలో హై ఎనర్జీ ఎక్స్‌రే కిరణాల సాయంతో ఎక్కువ డోసు మందును ఇచ్చి క్యాన్సర్ గడ్డలను సులభంగా తొలగిస్తారు. ఈ చికిత్స వినిమల్ ఎక్స్‌లరేటర్ సాయంతో చేస్తారు.

ఇమేజ్ గ్రెడెడ్ రేడియోథెరపీ (ఐజిఆర్‌టి) : ర్యాపిడ్ఆర్క్ యంత్రం సాయంతో చికిత్స చేసే ముందు క్యాన్సర్ ట్యూమర్‌ను చూస్తారు. క్యాన్సర్ గడ్డ ఎక్కడ ఉందో, అక్కడకు మాత్రమే రేడియోథెరపీ ద్వారా ఆయా క్యాన్సర్‌కారక కణాలను చంపేస్తారు. వాల్యూహెట్రిక్ ఆర్క్ థెరపీ : ఈ విధానంలో ర్యాపిడ్ ఆర్క్ మిషన్ సాయంతో వేగంగా క్యాన్సర్ ట్యూమర్‌ను ఒకే సారి నివారిస్తారు. ఈ రేడియోథెరపీ కేవలం రెండు,మూడు నిమిషాల్లోనే పూర్తి అవుతుంది.

సైబర్‌నైఫ్ రేడియో సర్జరీ : రోబోటిక్ చేతికి వినిమల్ ఎక్స్‌లరేటర్‌ను తొడిగిస్తారు. రోబో సాయంతో క్యాన్సర్ ట్యూమర్‌ను గుర్తించి దాన్ని తొలగిస్తారు.

టోమోథెరపీ : ఈ విధానంలో సీటీ స్కాన్ తరహాలో స్లైస్ స్లైస్‌లుగా క్యాన్సర్ ట్యూమర్‌ను తొలగిస్తారు.

శస్త్రచికిత్సతో 90 శాతం క్యాన్సర్‌లను పూర్తిగా నయం చేయవచ్చు. మూడు దశల్లో ఉన్న క్యాన్సర్ వ్యాధికి సర్జరీయే మేలు. బ్రెస్ట్, నోటి, కొలొరెక్టల్, సెర్వైకల్ క్యాన్సర్‌లను శస్త్రచికిత్సతో సులభంగా నయం చేయవచ్చు. గతంలో క్యాన్సర్ వచ్చిన శరీర భాగాన్ని పూర్తిగా తొలగించేవారు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన వైద్యంతో ఆర్గాన్ ప్రిజర్వేటివ్ సర్జరీలు చేయవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినపుడు దాన్ని మొత్తం తొలగించకుండా బ్రెస్ట్ కంజర్వేటివ్ సర్జరీ చేయవచ్చు. క్యాన్సర్ గడ్డను మాత్రమే యాక్సిలరీ డిసెక్షన్ ద్వారా తొలగించి, ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తొడలోని కండతో బ్రెస్ట్ రీ కన్‌స్ట్రక్షన్ చేయవచ్చు. దీనివల్ల రొమ్ము ఆపరేషన్ తర్వాత కూడా సాధారణంగానే ఉంటుంది. బ్రెస్ట్‌లో ఏర్పడిన చిన్న క్యాన్సర్ గడ్డలను రోల్ టెక్నిక్ ద్వారా తొలగించవచ్చు. మెమోగ్రఫీ ద్వారా జే వైర్ సాయంతో ట్యూమర్‌ను గుర్తించి తొలగిస్తారు.

అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జరీ : ఈ విధానంలో కొలోరెక్టర్ క్యాన్సర్స్ అయిన లివర్, ఉదరభాగాల్లో ఏర్పడిన క్యాన్సర్‌లను చిన్న రంధ్రం ద్వారా హార్మోని స్కాల్‌వెల్‌ను పంపించి క్యాన్సర్ ట్యూమర్‌లను తొలగిస్తారు.

హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ అండ్ రీ కన్‌స్ట్రక్టివ్ సర్జరీ : ఈ విధానంలో నోటి, స్వరపేటిక, గొంతు క్యాన్సర్‌లకు చికిత్స చేయటంతోపాటు క్యాన్సర్ ట్యూమర్‌లు తొలగించిన భాగాల్లో ప్లాస్టిక్ సర్జరీ ద్వారా కాలి ఎముక, చేతి చర్మాన్ని అతికిస్తారు. ఆర్గాన్ లేజర్ కార్బన్‌డయాక్సైడ్ శస్త్రచికిత్స : స్వరపేటిక, నోటిక్యాన్సర్‌ల నివారణకు లేజర్ ట్రీట్‌మెంట్ చేస్తారు. కార్బన్‌డయాక్సైడ్ ఆర్గాన్ లేజర్ కిరణాల సాయంతో క్యాన్సర్ టిస్యూను కాల్చి తొలగిస్తారు.

రేడియో ప్రీక్వెన్సీ అబ్‌లేటర్ చికిత్స: లివర్ క్యాన్సర్‌కు రేడియో ప్రీక్వెన్సీ ఎనర్జీని థర్మల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి దాని సాయంతో లివర్‌ను పూర్తిగా తొలగించకుండానే అందులో ఉన్న క్యాన్సర్ టిస్యూలను కాల్చివేస్తారు.

ప్రొస్టేట్ క్యాన్సర్‌కు రోబోటిక్ సర్జరీ : ప్రొస్టేట్ క్యాన్సర్‌ను నివారించేందుకు రోబో సాయంతో చేసే ఆపరేషన్‌ను రోబోటిక్ సర్జరీ అంటారు.

0 comments:

Post a Comment