Friday

ఇంజనీరింగ్ కాలేజీల మూత! మూసివేత దిశగా కళాశాలలు ఇప్పటికే 5 కాలేజీల నుంచి ప్రతిపాదనలు


రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కళాశాలలు మూత దిశగా పయనిస్తున్నాయి. కొన్నేళ్లుగా విచ్చలవిడి అనుమతులతో పెద్ద సంఖ్యలో కళాశాలలు ఏర్పాటయ్యాయి. కానీ, అడ్మిషన్లు లేకపోవడంతో ఇప్పుడు డీలా పడిపోతున్నాయి. ఇన్నేళ్లుగా పెరిగినదంతా.. ఇప్పుడు తిరోగమనంలో నడుస్తోంది. ఇక ఇంజనీరింగ్ కళాశాలలను నడపటం తమవల్ల కాదంటూ.. పలు యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. అడ్మిషన్లు లేని కారణంగా కళాశాలలను నిర్వహించడం తమకు సాధ్యం కాదని, 2012-13 విద్యా సంవత్సరపు అడ్మిషన్ల జాబితా నుంచి తొలగించాలని కోరుతున్నాయి. 

ఇప్పటికే 5 ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు 'క్లోజర్' కోసం సంబంధిత విశ్వవిద్యాలయానికి, సర్కారుకు దరఖాస్తు చేసుకున్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, వరంగల్, ప్రకాశం, కడప జిల్లాలకు చెందిన ఒక్కో ఇంజనీరింగ్ కళాశాల ఇందులో ఉన్నాయి. సంబంధిత విశ్వవిద్యాలయం, ప్రభుత్వం నుంచి వేర్వేరుగా 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ)' తీసుకుని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)కి దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇలా కళాశాలలు, కోర్సుల మూత కోసం ప్రతిపాదనలు పంపుకొనేందుకు ఏఐసీటీఈ ఈనెల 6 వరకు గడువు విధించింది. 

సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. మరో 30 కళాశాలల వరకు మూత బాటలో ఉన్నాయి. ఇవన్నీ గత ఏడాది సింగిల్ డిజిట్‌లో అడ్మిషన్లు జరిగిన కాలేజీలే. 2012-13 విద్యా సంవత్సరంలో జరిగే అడ్మిషన్లను బట్టి మరికొన్ని కళాశాలల యాజమాన్యాలు సైతం మూత యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇంజనీరింగ్ కళాశాలల పరిస్థితి ఇలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కోర్సులు కూడా మూతపడే పరిస్థితి కనిపిస్తోంది.

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ ) కోర్సు మాకొద్దంటూ దాదాపు 70 కళాశాలలు రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఒకప్పుడు ఎంతో క్రేజ్ ఉన్న ఐటీ కోర్సుకు డిమాండ్ పూర్తిగా పడిపోయింది. ఉద్యోగావకాశాలు తగ్గిపోవటమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. మరోవైపు ఎంసీఏ కోర్సు భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 కళాశాలల్లో ఎంసీఏ కోర్సుల మూత కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు అందాయి. ఈ నెల 6 నాటికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 

కళాశాల/ కోర్సు మూత ఎలాగంటే ..
*ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం.. ప్రస్తుత కోర్సుల రెన్యువల్, కొత్త కోర్సుల మంజూరు, ఉన్న కోర్సుల మూత దేనికైనా.. రూ.లక్ష చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

*మూత కోసం ప్రతిపాదించిన కళాశాలల యాజమాన్యాలకు సంబంధిత విశ్వవిద్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం విడివిడిగా ఎన్‌వోసీ ఇవ్వాల్సి ఉంటుంది. 

*విద్యార్థులకు తగిన ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఇంజనీరింగ్‌లో మొదటి సంవత్సరం మూతకు దరఖాస్తు చేసుకుంటే.. రెండు, మూడు, నాలుగో సంవత్సరాల విద్యార్థులను అదే కళాశాలలో కొనసాగిస్తామని గానీ, లేదా ఇతర కళాశాలల్లో సర్దుబాటు చేస్తామని గానీ యాజమాన్యాలు స్పష్టంగా హామీ ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తుకు ఏ ఇబ్బందీ లేకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత యాజమాన్యాలపైనే ఉంటుంది.

0 comments:

Post a Comment