Tuesday

మూగబోతున్న నాద స్వరం...!


సకల శుభాలకు సంకేతంగా పరిగణించే సంప్రదాయ నాదస్వర సంగీతం హైటెక్ యుగంలో కొత్త పోకడలు పోతోంది. మంగళ వాయిద్యకారుల కచేరిల స్థానంలో సి.డి.లు, వి.సి.డి.లు వచ్చి 'తూతూ' అనిపిస్తున్నాయి. తరతరాల వారసత్వ సంపదగా వస్తున్న సాదస్వర సంగీతానికి పునరుజ్జీవం కల్పించే లక్ష్యంతో 'సిలికానాంధ్ర' వారు ఈ ఏడాది మే 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో అంతర్జాతీయ మహా మంగళ వాయిద్య సమ్మేళనం నిర్వహించాలని సంకల్పించారు. నాదస్వర సంగీత గంగా ప్రవాహంలో మనమూ సేదదీరుదాం...పదండి.
ఈ ఎలక్ట్రానిక్ యుగంలో కూడా రోజువారీ జీవితం డోలు-సన్నాయి నాదస్వర సంగీతంతోనే మొదలవుతోంది. ప్రధాన ఆలయాలలో దేవుని సేవకు సంబంధించి సుప్రభాతం నుంచి పవళింపు వరకు నాదస్వర నీరాజనమే సేవలందచేస్తోంది. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలతోపాటు సర్కారీ కార్యక్రమాలలో సైతం నాదస్వరం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక ఆకాశవాణిలో మంగళవాయిద్య కచేరీలు ఉండనే ఉన్నాయి. కుల మతాలకు అతీతంగా భారతరత్న బిస్మిల్లాఖాన్ మొదలుకొని ఎందరో నాదస్వర విద్వాంసుల సంగీతం ఆలయాలలో భగవంతుని సేవకు అంకితం కావడం విశేషం.

అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు భక్తిపాటల సిడిలు ఆలయాలలో స్పీకర్ల ద్వారా భక్తులను మేల్కొలుపుతున్నాయి. ఒకనాడు తరచు జరిగే సుస్వర నాదస్వర కచేరీలు ఇప్పుడు అరుదైపోయాయి. 'పద్మశ్రీ' షేక్ చిన మౌలానా, 'పద్మశ్రీ' నామగిరిపేట కృష్ణన్, తోడి రాజరత్నంపిళ్ళై, కారైకుడి అరుణాచలం, దాలిపర్తి పిచ్చాహరి, కేదారగౌళ పెంటు సాహెబ్, దేవగాంధారి నాగయ్య, కళ్యాణి చిన్నపీరు దేవతా ఉత్సవాల్లో తప్పనిసరైన మల్హరి వంటి నాదస్వర వైభవం గత చరిత్రగా మిగిలిపోతోంది. ఎన్నెన్నో గ్రామఫోన్ రికార్డులు, కేసెట్లు వంటివి ఆ స్వరసంపదను నిక్షిప్తం చేయగా వాటిని కాపాడుకోలేని నిర్లక్ష్యం ఆ అపురూప పెన్నిధిని చెదలు పట్టిస్తోంది.

మన రాష్ట్రంలో ఎనిమిదిన్నర లక్షలమందితోపాటు దక్షిణ భారతంలో మరో 15 లక్షలదాకా లెక్కకు వచ్చే మంగళతూర్యం కులవృతి.్త. నాయీ బ్రాహ్మణులు, నూర్‌బాషాలు, కుమ్మరి, మాల, మాదిగలలో కొద్దిమందితోపాటు కొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణులు కూడా మంగళ వాయిద్య కళాకారులుగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు ఇంటింటి పండుగల్లో తాంబూలం అందుకునే నాదస్వరం ఇప్పుడు మొక్కుబడి తంతుగా మారిపోయింది. సన్నాయి వాద్యకారుల జీవితాలపై వచ్చిన 'మురిపించే మువ్వలు', 'సన్నాయి అప్పన్న', సూత్రధారులు వంటి సినిమాలలోని సంగీతం ఈనాటికీ తెలుగువారి వీనులకు విందు చేస్తూనే ఉన్నాయి.

సన్నాయి సొగసులు
గత 500 ఏళ్ళుగా మన సంప్రదాయ సంస్కృతిలో మమేకమైన నాదస్వర బృందంలో సన్నాయి, డోలు, శ్రుతితో కలిపి ఐదుగురితో మేళం వుంటుంది. మంచి చేవగల నల్లని ఏపెకర్రతో తయారు చేసిన 38 అంగుళాల పొడవైన సన్నాయిలో ఒకటిన్నర అడుగు ప్రాంతంలో 7 రంధ్రాలు, 'నాభి' శ్రుతి కోసం మరో 4 రంధ్రాలు, వాటి చివర గిన్నె ఆకారంలో 'అణసు'గా చెప్పుకునే చివర, ఇంకోవైపు త్రిభుజాకారంలో తయారుచేసుకున్న ఆకు 'పేక'లుతో 'సన్నాయి' పలికించే రాగాలు సంగీతాభిమానులను ఉర్రూతలూగిస్తాయి.

సన్నాయి వాయిస్తుంటే కనిపించే ఆకురెప్ప కండీలు, కండెలు, దారం, వాటికి వేలాడుతూ ఉండే 'పతకం' మదిని పులకింపచేస్తాయి. గ్రీకు గణితంతోపాటు మన వేదాల్లో లెక్కలు కట్టి చెప్పిన 'పైథాగరస్' పద్ధతిని పుణికిపుచ్చుకున్న నాదస్వర విద్వాంసుల విద్యలో ఎన్నెన్నో వింతలు వున్నాయి.

'డోలు' విన్యాసం
సన్నాయికి జోడీగా నిలిచే 'డోలు' విషయానికి వస్తే, 16 ఇంచ్‌ల పనసగుల్ల రెండువైపులా పదునుపెట్టిన మేకచర్మం ఆ కొసల్ని మూతగా నారుతో బిగించి రూపొందే డోలుపై పుల్లతో కొడితే రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నవారి గుండె కూడా ఝల్లుమంటుంది. కూర్చుని వాయించడంతోపాటు కొన్ని సందర్భాల్లో జంధ్యం, యజ్ఞోపవీతం లాంటి పట్టెడతో నడుందాకా వచ్చే డోలును వాయించే పద్ధతి కూడా వుంది. కుడివైపు పుల్ల, కడ్డీతో మృదువుగా జోరుగా వాయించడంతోపాటు చేతి వేళ్ళకి బొట్టెలు పెట్టుకుని వాయించడం తెలిసిందేగా! ఛాయా ఉడక్, చంఢా డఫరీ, తంబిట్టం, కుండాలం వంటి పేర్లతో వేరు వేరు ప్రాంతాల్లో డోలు వాయిద్యం ప్రశస్తి విస్తృతంగా వుంది.

పల్లెల్లో, రాజుల దర్బార్‌ల్లో, సంస్థానాల్లో, జమీందారీల్లో కొత్తకొత్త విన్యాసాలతో ఆయా విద్వాంసులు చేసిన విన్యాసాలు 'ఆస్థాన' లయ విద్వాంసులుగా ఆదరణ స్థాయి పెంచుకున్నాయి. జలబిందెలు, మీరగాళ్ళతో లయతో అడుగులు, కాళ్ళు పెనవేసుకునే 'కర్తరి', 'ధన్యావర్తం' వంటివి ఎన్నెన్నో. ప్రధాన వాయిద్యకారుడు, సహాయకుడు, 2 డోళ్ళు, 1 శ్రుతి తాళంతో ఏర్పడిన మేళంలో 1875-1930 మధ్యకాలంలో బోలెడన్ని మార్పులు వచ్చాయి. గుంటూరుకు చెందిన భూసురపల్లి వెంకటేశ్వర్లు నాదస్వర విశేషాలు, పరిణామక్రమంపై ప్రత్యేక సిద్ధాంత గ్రంథాన్ని కూడా వెలువరించారు.

అదరణ పూజ్యం
మన రాష్ట్రంలో గతంలో టెక్నికల్ బోర్డు ఈ విద్యలో పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ప్రదానం చేసే పద్ధతి ఉండేది. ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆ పద్థతి కొనసాగుతోంది. సర్టిఫికెట్, డిప్లొమాలు ప్రదానం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్వహణలోని సంగీత, నృత్య కళాశాలల్లో పూర్తికాలం శిక్షణకు అవకాశాలు ఉన్నాయి. పాతకాలంలో గురుకుల విద్య, నిష్ట, బోధన లేకపోవడంతో అంతంతమాత్రం పాండిత్యంతో విద్వాంసులు విస్తరించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఆలయాలతో సహా కొన్ని ఆలయాల్లో ఆస్థాన విద్వాంసులు నియమితులు అయ్యారు. ప్రస్తుతం సిబ్బంది కన్నా ఖాళీలు ఎక్కువ, పస-శ్రద్ధ తక్కువగా వుంది. వివాహాది శుభకార్యాల్లో తప్పనిసరి అవకాశాలు ఉన్నా ఏడాదికాలంలో వంద రోజులకు మించి పని దొరకని స్థితి వుంది. ఇటీవలి కాలంలో మహిళలు కూడా ఈ సంగీతంలోకి ప్రవేశించి విద్వాంసుల బృందాలకు కొత్త ఆకర్షణ పెంచిపెట్టారు.

నాదస్వర కళాకారుల సంక్షేమం కోసం మంగళ వాయిద్యకారుల సంఘం ఆవిర్భవించింది. ఆ నేతల్లో కొందరు సంప్రదాయ రహస్యాల్తో వృత్తివిద్య ప్రాచుర్యం కోసం కొత్త సి.డి.లు రూపొందించారు. తరిగొప్పుల నారాయణ 35 తాళాలతో 12 నిమిషాల 24 సెకండ్ల నిడివిగల సరికొత్త విన్యాసాన్ని వేదికపైకి తెచ్చారు. ఇది మంచి ఆదరణ పొందటంతో సరికొత్తగా 108 తాళాలతో విస్తృతస్థాయి డోలు బృందంతో మరో సీడీ తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో నాదస్వర సంగీతానికి పునరుజ్జీవం కల్పించేందుకు సిలికానాంధ్ర వారు మే 5, 6 తేదీల్లో అంతర్జాతీయ మహా మంగళ వాయిద్య సమ్మేళనం నిర్వహించాలని తలపెట్టారు.

లాల్‌బహదూర్ స్టేడియంలో దేశ విదేశాల నాదస్వర బృందాలు అన్నీ కలసి మహా బృంద విన్యాసం చేయబోతున్నాయి. అందుకోసం ప్రత్యేకమైన సప్త కీర్తనల సీడీని సాధన కోసం రూపొందించారు. దేశ విదేశాల నుంచి తలపండిన వారితో పాటు కొత్తతరం బుడతలు తమ వాయిద్య ప్రతిభతో అలరించనున్నారు. నాదస్వరం, డోలు, క్లారినెట్, శాక్సోఫోన్ తదితర వాయిద్యాలు సంగీత గంగా ప్రవాహాన్ని సృష్టించనున్నాయి. ఆసక్తిగల సంగీత కళాకారులు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989295939, 9866001119 .

0 comments:

Post a Comment