బ్యాంకు మిత్రల వెతలు
పొదుపు సంఘాల ఆర్థిక లావాదేవీలు చక్కబెడుతున్న తాము ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని బ్యాంకు మిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్, ఎపిజివిబి, తదితర బ్యాంకుల్లో కలిపి సుమారు 6000 మంది ఉన్నారు. పొదుపు సంఘాలకు సంబంధించిన ఓచర్లు రాయడం, కొత్త సంఘాల ఎకౌంట్‌లు ఓపెన్ చేయడం, డాక్యుమెంటేషన్, లోన్ రికవరీ తదితర పనులకోసం వీరిని నియమించారు. కేవలం పొదుపు సంఘాల పనులు మాత్రమే చేసేందుకు నియమించిన వీరితో ఇప్పుడు బ్యాంకుల్లో ఇతర కస్టమర్ల లావాదేవీలకు సంబంధించిన పనులు కూడా చేయిస్తున్నారు. దీంతో వీరు తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారు. ఇంత చేస్తున్నా తమకు కనీస వేతనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రూ.500 నుండి 1500 వరకు ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా ఇస్తున్నారు. అవి కూడా రెగ్యులర్‌గా ఇవ్వట్లేదు. ఇటు సెర్ప్ అధికారులు, అటు పొదుపు సంఘాల లీడర్ల అజమాయిషీలో వీరు అభద్రతకు గురవుతున్నారు. ఇప్పటికైనా కనీస వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు.
బ్యాంకు మిత్రలు కేవలం పొదుపు సంఘాలకు సంబంధించిన పని మాత్రమే చేయాల్సి ఉంటుందని వీరి నియామక సమయంలో సెర్ప్ అధికారులు చెప్పారు. అంతే కాదు నెలకు రూ.1500 చెల్లిస్తామన్నారు. కానీ ఆచరణలో మాత్రం మరోలా జరుగుతోంది. పొదుపు సంఘాల పనులతోపాటు ప్రతిరోజూ బ్యాంకులకు వచ్చీపోయే కస్టమర్ల ఓచర్లు రాయడం, ఎకౌంట్ ఓపెన్ చేయడం, క్రాప్‌లోన్లు ఇప్పించడం, రికవరీ చేయడం లాంటి అదనపు పనులన్నీ అప్పజెప్తున్నారు. వీరికి నెలకు పదిహేను వందలు చెల్లిస్తామన్న వాగ్దానమూ అమలు చేయట్లేదు. 500 నుండి 1500 వరకు ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా చెల్లిస్తున్నారు. అవి కూడా ఐదారు నెలలకు ఒకసారి ఇస్తున్నారు. దీంతో తమ బతుకు దెరువు కష్టమవుతోందని బ్యాంకు మిత్రలంటున్నారు. ఇచ్చే కొద్దిపాటి వేతనం కూడా సమయానికి ఇవ్వట్లేదంటున్నారు. ఎందకని నిలదీస్తే తమకు ఉద్యోగ భద్రత సమస్య ఏర్పడుతోందని అంటున్నారు. పొదుపు సంఘాల గురించి గొప్పగా చెప్పుకునే ప్రభుత్వం వాటి అభివృద్ధికి తోడ్పడే బ్యాంకు మిత్రల సమస్యలు పట్టించుకునే స్థితిలో మాత్రం లేదు. అదేదో తమకు సంబంధంలేదన్నట్లు వ్యవహరిస్తోంది.
పొదుపు సంఘాలవల్ల బ్యాంకులు, బ్యాంకులవల్ల పొదుపు సంఘాలు లాభపడుతున్నాయి. కానీ బ్యాంకు మిత్రలు మాత్రం పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. జీతాలకోసమని సంఘ సభ్యుల దగ్గర, మండల, జిల్లా సమాఖ్యలు డబ్బులు కూడా వసూలు చేస్తున్నాయి. వీరికి చెల్లించేందుకు నిధులున్నా సమాఖ్యల్లోని కొందరు లీడర్లు, సెర్ప్ అధికారులు కుమ్మక్కై ఆ పని చేయట్లేదు. బ్యాంకు మిత్రల యూనియన్ బలంగా వుండి గట్టిగా నిలదీసే పరిస్థితి ఉన్నచోట మాత్రం అదీ ఎక్కడో ఒకదగ్గర 1500 చెల్లిస్తున్నారు. మిగతాచోట్ల ఏరియా ప్రాజెక్టు మేనేజర్ (ఎపిఎం) ఇష్టాన్నిబట్టి ఐదారు వందల వరకే చెల్లిస్తున్నారు. ఇప్పటికైనా తమకు ఇచ్చిన వాగ్దానం సెర్ప్ అధికారులు నిలబెట్టుకోవాలని కోరుతున్నారు.
''ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది'' నియామక సందర్భంలో సెర్ప్ అధికారులు బ్యాంకు మిత్రలకు చెప్పిన మాటలివి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఉదయం పది గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అవసరమైనప్పుడు ఆ పైనే చేస్తున్నారు. వీరితో అలా చేయిస్తున్నారు. ఫలితంగా మిత్రలు తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇంత చేస్తున్నా వీరి శ్రమను గుర్తించడంలో, వీరికి కనీస వేతనాలు చెల్లించడంలో సెర్ప్ అధికారులు చేస్తున్నదేమీ లేదు. పొదుపు సంఘాల లీడర్లు కూడా పట్టించుకోవట్లేదు. ''సంఘాల వారికేేగాక బ్యాంకులకు వచ్చే కస్టమర్లందరికీ ఓచర్లు రాస్తున్నాం, ఫామ్స్ ఫిలప్ చేస్తున్నాం. రోజువారీ పనికి సంబంధించి రిపోర్టు తయారు చేస్తున్నాం'' అంటున్నారు బ్యాంకు మిత్రలు. ఇవేగాక బ్యాంకులో క్లర్కు పనులు, మెసెంజర్ పనులు కూడా తమతో చేయిస్తున్నారని చెబుతున్నారు. దీన్నిబట్టి వీరు ఏ విధమైన పనిభారాన్ని ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు.నాలుగేళ్లుగా పనిచేస్తున్న తమకు కనీస వేతనం లేకపోవడం అన్యాయమని బ్యాంకు మిత్రలంటున్నారు. కేవలం పొదుపు సంఘాల ఖాతాలకు సంబంధించినపనేగాక ఇతర పనులు చేయిస్తున్నారు. అలాంటప్పుడు తమను ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు ఎందుకు అమలు చేయరని వీరు ప్రశ్నిస్తున్నారు. సెర్ప్ అధికారులు ఆ విధమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని వీరు కోరుతున్నారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటున్న ప్రభుత్వానికి నిజంగా ఆ చిత్తశుద్ధే ఉంటే బ్యాంకు మిత్రలకు వేతనాన్ని నిర్ణయించి అమలు చేస్తే ఉపాధి చూపినట్లవుతుంది కదా! కానీ సర్కారు అలా చేయట్లేదు. వీరికి జీతాలు చెల్లించే బాధ్యత పేదమహిళ(పొదుపు సంఘాల)మీద నెడుతోంది. పైగా ఎక్కువ మందికి ఉపాధి చూపినట్లు చెప్పుకుంటోంది. చివరికీ ఉపాధిపేరుతో ఏదోఒక పని అప్పగించేసి తర్వాత ఎవరి పనులకు వాళ్లే ఫీజులు చెల్లించుకునే పద్ధతిని మన ప్రభుత్వం అవలంభిస్తోంది. బ్యాంకు మిత్రల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె.ధనలక్ష్మి అంటున్నారు. స్త్రీ నిధి బ్యాంకుల ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలిస్తామని, వరల్డ్ బ్యాంకు నుండి 11 వందలకోట్లు వచ్చాయని ముఖ్యమంత్రి చెప్తున్నా నేటికీ ఆ పరిస్థితి లేదు. అసలు ఈ బ్యాంకుల్లో ప్రభుత్వ నిధులే లేవు. షేర్ హోల్డర్స్ పేరుతో ప్రభుత్వం లక్షలాది రూపాయలు మహిళల ద్వారా వసూలు చేసి, వాటిని మహిళా సమాఖ్యలకు అప్పులుగా ఇస్తోంది. నిర్ణీత సమయంలో కట్టకపోతే వడ్డీ వసూలు చేస్తోంది. అంటే మహిళల సొమ్ముతో మహిళలకే అప్పుఇచ్చి వడ్డీలు వసూలు చేసే పని సర్కారే చేస్తోందన్నమాట. అందులో కూడా అనేక షరతులు ఉంటున్నాయి. మండల సమాఖ్యలకు, వారి కుటుంబాలకు వ్యక్తిగతలోను కింద రూ.5000, చదువులోను రూ.25000, వివాహానికి రూ. 25000, వైద్యానికి రూ.15000 ఇస్తుందట మన ప్రభుత్వం. ఇవి కూడా అందరికీ కాదు. సమాఖ్యలలో ఎ,బి,సి,డి అని నాలుగు కేటగిరీలుగా విభజించి ఎ కేటగిరికి కోటిన్నర, బి కేటగిరికి కోటి, సి కేటగిరికి 75 లక్షలు, డి కేటగిరికి 25 లక్షలు ఇస్తారు. మరో విషయమేమిటంటే పొదుపు సంఘాల వారికి సెల్‌ఫోన్లు కూడా ఇస్తున్నారు. దీనివల్ల మహిళల సొమ్ముతో సెల్‌ఫోన్ కంపెనీలకు లాభాలు చేకూర్చేందుకు కూడా ప్రభుత్వం సాయపడుతోంది. పేదలను దోచి పెద్దలకు పెట్టే పనిలో మన సర్కారువుంది.
కనీస వేతనాలు ఇవ్వాలి
బ్యాంకు మిత్రలతో పొదుపు సంఘాలకు సంబంధించిన పనితోపాటు బ్యాంకులకు వచ్చే ఇతర కస్టమర్ల ఖాతాలు తెరిచేందుకు ఫామ్ నింపడం, క్రెడిట్, డెబిట్ ఓచర్స్ రాయడం, క్రాప్‌లోన్ డాక్‌మెంట్ చేయడం, గోల్డు లోన్ డాక్‌మెంట్ చేయడం లాంటి అదనపు పనులన్నీ చేయిస్తున్నారు. సమాఖ్య సభ్యుల దగ్గర మిత్రలకు చెల్లించేందుకు నిధులు వసూలు చేస్తున్నారు. ఇవ్వగలిగే పరిస్థితిలోవున్న సెర్ప్ అధికారులు, సంఘాల లీడర్లు బ్యాంకు మిత్రలకు వేతనలివ్వట్లేదు. ఇప్పటికైనా రెగ్యులర్‌గా ఇవ్వాలి. కనీస వేతనాలు చెల్లించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి.
కె.ధనలక్ష్మి, బ్యాంక్ మిత్రల సంఘం రాష్ట్ర కన్వీనర్.
పనిభారం ఎక్కువ
బ్యాంకు మిత్రలు కేవలం పొదుపు సంఘాల పనులు చేయాలని మొదట్లో చెప్పారు. ఇప్పుడు బ్యాంకులో జరిగే లావాదేవీలన్నింటికి సంబంధించిన పనులు చేయిస్తున్నారు. ఒక్కో బ్యాంకు మిత్ర ఏడెనిమిది గ్రూపులకు సంబంధించిన పనులతోపాటు అదర్ కస్టమర్ల పనులు చేస్తుండటమంటే అదనపు భారమే కదా! చిక్కుడు వెంకటేష్, ఎస్‌బిఐబ్యాంక్ మిత్ర,మాడ్గుల, మ.నగర్.
వేతనాలివ్వకుంటే ఎలా?
ఇచ్చేదే అరకొర ఆపై అదికూడా రెగ్యులర్‌గా ఇవ్వరు. ఐదారు నెలలకు ఒకసారి ఇస్తే... మేం బ్యాంకులకు ఇంటికీ తిరిగిన ప్రయాణ ఖర్చులకు కూడా అవి సరిపోవట్లేదు. వేతనం పెంచాలి. రెగ్యులర్‌గా ఇవ్వాలి. రాగం సుమతి. గోవిందరావుపేట, వరంగల్ జిల్లా.
అభద్రత వెంటాడుతోంది
బ్యాంకు మిత్రలకు ఇచ్చేదే తక్కువ. ఆపైన సంఘం లీడర్లు, ఎపిఎంలు అదనపు పనులు చెప్తుంటారు. పనిలో ఏ చిన్నలోపం వచ్చినా తీసేస్తామని హెచ్చరిస్తుంటారు. మాకు పని ఒత్తిడి వుంది. నిరంతరం అభద్రత వెంటాడుతోంది. కంచాకుల విజయ
ఏడు నెలలుగా జీతం లేదు
ఏడు నెలలుగా నాకు జీతం ఇవ్వలేదు. జీతం సరిగ్గా ఇవ్వట్లేదని, అదనపు పనులు చేయిస్తున్నారని అడిగినందుకు మండల సమాఖ్య అధ్యక్షులు నా జీతం ఇవ్వకుండా ఆపేశారు. ఇటు బ్యాంకులో కూడా పని ఒత్తిడి, అటు అధికారుల వేదింపులు మాకు ఇబ్బందికరంగా మారాయి.అరంజ్యోతి, మిడ్జిల్
రెగ్యులర్‌గా ఇవ్వాలి
మేము పొదుపు సంఘాల పనులేగాక అదర్ కస్టమర్లకు సంబంధించిన ఖాతాలు తెరవడం, లోన్లు రికవరి చేయించడం లాంటివి చేస్తున్నాం. అదనపు పనికి అదనపు చెల్లింపులేవీ లేకపోగా ఇచ్చేవి కూడా రెగ్యులర్‌గా ఇవ్వట్లేదు. ఇప్పటికైనా ఇవ్వాలి. విజయ నిర్మల, మంగపేట, కమలాపురం బ్రాంచ్ (ఎస్‌బిఐ)
0 comments:
Post a Comment