Friday

బ్యాంకింగ్‌ రంగంలో ప్రవేశిస్తున్నారా?


నేడు ప్రజల, ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నీ బ్యాంకింగ్‌ రంగం మీదే ఆధారపడుతున్నాయి. ప్రతి అభివృద్ధీ, ప్రతి వ్యక్తి ఆర్థిక పురోగతీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దీనిమీద ఆధారపడే ఉంటుంది. అయితే ఈ సేవలన్నీ విస్తరించడంలో, అవి అందరికీ అందడంలో ఆ రంగంలోని ఉద్యోగులు ప్రధాన పాత్ర పోషిస్తుంటారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో రోజురోజుకూ విస్తరిస్తున్న బ్యాంకింగ్‌ సేవలకు అనుగుణంగా సిబ్బంది అవసరం కాబట్టి భవిష్యత్తులో ఇది సేవలతో పాటు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే రంగంగా విస్తరిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అర్హతతోపాటు చక్కటి ప్రతిభ, వృత్తి నైపుణ్యత అలవర్చుకుంటే ఇందులో రాణించవచ్చు.
మీకు బ్యాంకింగ్‌ రంగంలో ప్రవేశించాలని వుందా? అందుకు తగిన అర్హత మీలో వుందా? అయితే ఇందులో అవకాశాలు కోకొల్లలు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ రంగంలో అటెండర్‌ నుంచీ ఆఫీసర్‌ దాకా ఎన్నో రకాల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి. ఆకర్షణీయ వేతనం, హోదా, గౌరవం, రక్షణ, బీమా సౌకర్యం, లోన్‌సౌకర్యం లాంటివి ఉద్యోగుల వృత్తి జీవితానికి సంతృప్తి కలిగించేలా ఉంటాయి. కాబట్టి చాలా మంది బ్యాంకింగ్‌ కొలువు సంపాదించాలన్న ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకింగ్‌ రంగాలు ఒక సవాలుగా ఆర్థిక పురోగతి సాధించాలన్న లక్ష్యంతో, సేవా దృక్పథంతో పనిచేస్తున్నాయి. అయితే ప్రభుత్వ రంగంలో ఉన్నంత భద్రత, రక్షణ, ప్రయివేటు రంగంలో ఉండదు.
బ్యాంకింగ్‌ రంగంలో అడుగు పెట్టడమే కాదు, వృత్తి పరంగా ఎదురైన సవాళ్లను అధిగమించగలిగినప్పుడే అందులో రాణించినట్లు. అందుకోసం ఆ రంగానికి సబంధించిన అవగాహన, అధ్యయనం, శాస్త్రీయ దృక్పథం, సేవా దృక్పథం, నలుగురితో కలిసిపోయే తత్వం, మోటివేట్‌ చేయగలిగే శక్తీ, సహజ సామర్థ్యం, నిజాయితీ, లౌక్యం వంటి లక్షణాలు ఉద్యోగులకు ఉండాలి. ఇందులో ప్రవేశించిన వారు తప్పకుండా వీటిని అలవర్చుకోవాలి. ఆర్థిక వ్యవహారాలపట్ల అప్‌డేట్‌గా ఉండడం, ఉద్యోగాన్ని బట్టి భిన్న పరిస్థితుల్లో సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి. చక్కగా మాట్లాడే నైపుణ్యం, లెక్కల్లో సామర్థ్యం, విళ్లేషణాత్మక ప్రతిభ, చురుకుదనం లాంటివి ఈ రంగంలోని సిబ్బందికి ఎంతో ముఖ్యం.
ప్రవేశం ఇలా...
భారతదేశంలోనే ఆర్ధిక వ్యవహారాలూ, లావాదేవీలు చూసుకునే అతిపెద్ద సంస్థ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ). ఇతర బ్యాంకుల విధి విధానాలను సూచించడంలో, వాటిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బ్యాంకింగ్‌ రంగంలోకి అడుగు పెట్టాలనుకున్న వారు ఈ సంస్థ నిర్వహించే (1.స్లెరికల్‌ గ్రేడ్‌.(రాత పరీక్ష) 2. గ్రేడ్‌ ఎ ఆఫీసర్స్‌ 3. గ్రేడ్‌ బి ఆఫీసర్స్‌ ) మూడు ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే ఆ రంగంలో ప్రవేశించేందుకు తగిన అర్హత కలిగిన వారౌతారు.
దేనికి ఏ ఉద్యోగం
బ్యాంకింగ్‌ రంగంలో ప్రవేశించాలంటే ఎలా? ఏయే అర్హతలు అవసరం? ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఏవేవి ఉన్నాయి? తదితర విషయాలన్నీ బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ వెలువడినప్పుడు అన్ని వార్తా పత్రికల్లోనూ వస్తుంటాయి. ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో అయితే వివరంగా ప్రిపరేషన్‌ విధానంతోపాటు ఇస్తారు. ఉద్యోగార్థులు అప్‌డేట్‌గా ఉండడంవల్ల ఇలాంటి సమాచారాన్ని పొందవచ్చు. టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌, క్వాన్‌టిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ ఎవేర్‌నెస్‌, ఆంగ్లభాషా పరిజ్ఞానం, డిస్క్రిప్టివ్‌ టెస్టు లాంటి పరీక్షలన్నీ ఉత్తీర్ణులైన వారికే ఇంటర్వ్యూకు పిలుపొస్తుంది. కాబట్టి వీటి గురించి ముందుగానే ప్రిపేరైన వారు తప్పక విజయం సాధించే అవకాశం ఉంటుంది. అంతేకాదు దేశంలోని వివిధ సంస్థలు బ్యాంకింగ్‌ కోర్సుల్ని కూడా అందిస్తున్నాయి.
పరీక్షలు ఎన్ని రకాలు?
అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు వివిధ పరీక్షలు ఉంటాయి. పేపర్‌-1లో రాతపూర్వక పరీక్ష ఉంటుంది. ఇందులో అభ్యర్థి మానసిక స్థితినీ, వాస్తవికతనూ పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-2లో ఉద్యోగి స్వయం ఔన్నత్యం, వ్యాసాలు, ఇతర విషయాలు సరైన రీతిలో రాసే విధానం పరిశీలిస్తారు. పేపర్‌-3లో ఆర్ధిక శాస్త్రం, సామాజిక సమస్యలు, పరిష్కార మార్గాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఇందులోనూ అభ్యర్థి ప్రతిభను అంచనా వేస్తారు. ఈ మూడు విధాల పరీక్షల్లోనూ నెగ్గిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో కూడా సత్తాచాటి బ్యాంకింగ్‌ రంగంలో తమ కెరీర్‌ను ప్రదర్శించవచ్చు
సమాచారం ఎలా తెలుస్తుంది?
స్లెరికల్‌గ్రేడ్‌లో ఉత్తీర్ణులైనవారు డబ్బులు సరిచూసుకునే విభాగంలో ఉద్యోగులుగా అర్హత సాధిస్తారు. అందులో ఐదు నుంచి పది సంవత్సరాల అనుభవం తర్వాత వీరిని వేరే విభాగంలోకి మారుస్తారు. బ్యాంకింగ్‌లోని క్లాస్‌వన్‌ పోస్టులకు అలిండియా ఎగ్జామ్స్‌వారు పరీక్ష నిర్వహిస్తారు. గ్రాడ్యుయేట్స్‌, పోస్టు గ్రాడ్యుయేట్స్‌, సిఎ, ఎంబిఎ కలిగిన వారు ఇది రాసేందుకు అర్హులు. ఇందుకు వయసు 21 నుండి 26 సంవత్సరాలలోపు ఉండాలి. అంతేకాదు, అభ్యర్థుల మానసిక పరిస్థితినీ, సహజ సామర్థ్యాన్నీ, ఆంగ్లభాషా ప్రావీణ్యాన్నీ పరీక్షిస్తారు. ఇందులో నెగ్గితేనే ఉద్యోగానికి అర్హులు.

0 comments:

Post a Comment