Wednesday

సంకల్పబలం అవసరం...


లోక్‌పాల్ బిల్లులో రాష్ట్రాల హక్కులకు సంబంధించిన అంశాలను పరిశీలిద్దాం. అంతర్జాతీయ ఒప్పందాలు, తీర్మానాల అమలు విషయంలో రాష్ట్రాల జాబితాలోని అంశాలపై చట్టం చేయటానికి రాజ్యాంగంలోని 253వ అధికరణం పార్లమెంటుకు స్పష్టమైన అధికారాలనిస్తోంది. ఐక్యరాజ్యసమితి అవినీతి వ్యతిరేక తీర్మానాన్ని మన దేశం 2011 మే 1న ధ్రువీకరించింది. కనుక రాష్ట్రాలకు కూడా వర్తించే ఆయా చట్టాల్ని చేయాల్సిన బాధ్యత పార్లమెంటుదే. కేంద్రానికి ఉండే నిబంధనలే రాష్ట్రాలకూ లోక్‌పాల్ బిల్లులో ప్రతిపాదించారు. ఎటువంటి విచక్షణా లేదు. అదే సమయంలో రాష్ట్రాల అధికారాలు ఈ బిల్లుల ద్వారా రాష్ట్రంలోనే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి బదిలీ కావు. 

లోకాయుక్త, ఇతర అధికారుల నియామకాలు పూర్తిగా రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయి. అవినీతి నిరోధక కేసులలో పరిశోధన, ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన యథాక్రమంగా జరిగే అంశాలన్నీ పార్లమెంటు ఉమ్మడి జాబితా పరిధిలోకి... జాబితా3లోని 1, 2 అంశాల కిందకు వస్తాయి. వీటితో పాటు, అధికరణ 253 ప్రకారం అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులకు సంబంధించిన అనుబంధ సర్వీస్ విషయాలు ఇప్పుడు పార్లమెంటు ఉమ్మడి జాబితా పరిధిలోకి వస్తాయి. అంతర్జాతీయ ఒప్పందాల అమలులో భాగంగా గతంలో పలు చట్టాలు రూపొందాయి. మనీ లాండరింగ్ చట్టం, మానవహక్కుల కమిషన్ చట్టాలు అందుకు ప్రధాన ఉదాహరణలు. 

సమాచార హక్కు చట్టం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రాష్ట్రాలకు కూడా వర్తిస్తూ అమలులోకి వచ్చాయి. అలాగే నేర న్యాయ చట్టాలు -మన సిఆర్‌పిసి, సీపీసీ, ఎవిడెన్స్ యాక్ట్, ఐపీసీ తదితర చట్టాలన్నీ- పార్లమెంటే చేసి రాష్ట్రాలకు వర్తింప జేసినవే. వీటిలో ఏదీ రాష్ట్రాల హక్కులను కాలరాసింది కాదు. కొన్ని పార్టీల మధ్య అభిప్రాయ భేదాలుండటం, పార్లమెంటులో మెజారిటీని పొందటానికి రాజీ పడాల్సిన అవసరం దృష్ట్యా లోక్‌సభలో బిల్లులో సవరణ చేసి, రాష్ట్రాల ముందస్తు అంగీకారం తర్వాతే లోకాయుక్త చట్టాన్ని అక్కడ అమలు చేయాలని ఆమోదించారు. ఈ నేపథ్యంలో.. చట్టాన్ని ఆమోదించే రాష్ట్రాలకు మాత్రమే వర్తించేలా ఆ చట్టం చేయడం రాష్ట్రాల హక్కులకు భంగం కలిగిస్తుందనే వాదనలో పస లేదు. 

అయినా, ఇప్పుడు మనం ఒక ప్రతిష్టంభనను ఎదుర్కొంటున్నాం. కొన్ని పార్టీల వితండవాదనలో లోక్‌పాల్ చట్టం రావటం ఆలస్యమవుతోంది. ఈ పరిస్థితిని పరిష్కరించేందుకు ఏం చేయాలి? ఇందుకోసం రెండు చర్యలు అవసరం. మొదటిది, చట్టాన్ని ఆరు అంశాలలో బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అంగీకరించాలి. 

లోక్‌పాల్/లోకాయుక్తకు సుమోటో అధికారాలివ్వటం, లోక్‌పాల్‌కు సొంత నేర పరిశోధనా విభాగం ఏర్పాటు చేయటం, సివిసి సభ్యులను లోక్‌పాల్‌లో ఎక్స్-అఫీషియో సభ్యులుగా చేయటం, ఢిల్లీ ప్రత్యేక పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టంలోని సెక్షను 6ఎ ను, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్19 ని, సిఆర్‌పిసిలోని సెక్షన్ 197ను తొలగించటం, సిబిఐ విషయంలో ప్రతిపాదిస్తున్న లేక ఇప్పటికే ఉన్న నిబంధనలను రాష్ట్ర ఎసిబిలకు కూడా వర్తింప చేయటం, స్థానిక ప్రభుత్వాలలో, ప్రతి జిల్లాలో దిగువ స్థాయిలో అవినీతిని ఎదుర్కోవటానికి తగినంత సంఖ్యలో స్థానిక అంబుడ్స్‌మెన్‌ను లేదా లోకాధికారిలను నియమించుకునేందుకు లోకాయుక్తలకు అధికారాలివ్వటం. 

ఈ ఆరు నిబంధనలూ నిజమైన స్వతంత్ర ప్రతిపత్తిగతల, ప్రభావశీలమైన అవినీతి నిరోధక సంస్థల్ని ఏర్పాటు చేసి అంబుడ్స్‌మెన్‌ను పటిష్టం చేస్తాయి. ప్రస్తుతం బిల్లులో ఉన్న ఏర్పాట్లకి, ఇప్పుడు ప్రతిపాదించే ఆరు సవరణలకి వైరుధ్యం ఏమీ ఉండదు. అదే సమయంలో ఆయా సంస్థల నిర్మాణాన్ని ఈ మార్పులు ఏ రకంగానూ బలహీన పరచవు. రెండోది, లోకాయుక్త నిబంధనలు చట్టంలో యథాతథంగా కొనసాగాలి. అయితే సవరించిన సెక్షన్ 1ను మరింత విశదీకరించి ... శాసనసభలో తీర్మానం ద్వారా ఆమోదించిన తర్వాతే ఏ రాష్ట్రంలోనైనా లోకాయుక్త, ఎసిబి నిబంధనలు వర్తిస్తాయని నిర్ద్వంద్వంగా ప్రకటించాలి. 

ఇది తిరోగమన చర్యే అయినా రాష్ట్రాల హక్కుల పేరుతో బిల్లును బలిపెట్ట కుండా ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టేందుకు తప్పదు. రాజకీయ పార్టీలు-ముఖ్యంగా జాతీయ పార్టీలు తమ నిబద్ధతను ఆచరణలో చూపాల్సి ఉంది. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆ చట్టాన్ని వర్తింపచేయాలి లేదా ఆ రాష్ట్రాలలో అంతకంటే బలమైన చట్టాల్ని అమలు చేయాలి. ఈ చట్రంలో, బలమైన చట్టాల్ని అమలు చేయటానికి రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండాలి. పార్లమెంటు చట్టాన్ని అమలు చేసే క్రమంలో రాష్ట్రాలకు వెసులుబాటు ఉంటుంది. ఉదాహరణకు, రాష్ట్ర శాసనసభ కొత్త నిబంధనల్ని చేర్చుకోవచ్చు. కేంద్ర చట్టంలో ఉన్న నిబంధనల్ని సవరించుకోవచ్చు లేదా మొత్తంగా కొత్త చట్టాన్నే రాష్ట్రం అమలు చేయవచ్చు. ఆ రకమైన మార్పులన్నిటికీ సెక్షన్ 1 స్పష్టమైన అవకాశాల్ని కల్పిస్తే బిల్లు మీద వ్యతిరేకతని తొలగించవచ్చు. 

లోకాయుక్త బిల్లులో ఈ మెరుగుదలలు, రాజీలకు తోడు కొన్ని ఇతర చర్యల్ని కూడా చేపట్టాలి. సేవల్ని అందించటం, ఫిర్యాదుల పరిష్కారం (సిటిజన్స్ ఛార్టర్లు), విజిల్ బ్లోయర్స్ (ప్రజా వేగుల) పరిరక్షణ, న్యాయవ్యవస్థ ప్రమాణాలు, జవాబుదారీతనం బిల్లుల్ని లోక్‌పాల్‌తో పాటే చట్టాలుగా చేయాలి. ఇప్పుడు ఇవి పార్లమెంటు ముందు ఉన్నాయి. వీటితో పాటు 2012 సంవత్సరంలో కనీసం మరో మూడు చట్టాలు వస్తాయని మనం నిర్దిష్ట హామీ ఇవ్వాలి. హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకానికి, తొలగింపునకు జాతీయ జ్యుడీషియల్ కమిషన్‌ను సంబంధిత రాజ్యాంగ నిబంధనల్ని సవరించటం ద్వారా తీసుకురావాలి. దీనివల్ల ఉన్నత న్యాయవ్యవస్థలో అక్రమాలకు అడ్డకట్ట పడుతుంది. 

దిగువ స్థాయి న్యాయవ్యవస్థలో నియామకాలకు, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో తగినంత మంది అర్హులు అందుబాటులో ఉండేందుకు ఐఎఎస్, ఐపిఎస్‌లతో సమానంగా కొత్తగా అఖిల భారత జ్యుడీషియల్ సర్వీస్‌ను ఏర్పాటు చేయాలి. లా కమిషన్ ముసాయిదా బిల్లు, సుప్రీం కోర్టు వ్యాఖ్యలు (ఎఐఆర్ 1996 ఎస్‌సి 2005) ప్రాతిపదికన స్మగ్లర్ల నియంత్రణ చట్టం-1975 తరహాలో అవినీతి పరులైన ప్రజాసేవకుల ఆస్తుల్ని జప్తు చేయటానికి శక్తిమంతమైన ప్రభావవంతమైన చట్టాన్ని తీసుకురావాలి. లోక్‌పాల్, లోకాయుక్తల చట్టంతో పాటు ఈ చట్టాల్ని కూడా తీసుకొస్తే దృఢమైన, స్వతంత్ర ప్రతిపత్తిగల, చెక్కుచెదరని, ప్రభావశీలమైన అవినీతి నిరోధక వ్యవస్థను రూపొందించుకోగలం. 

లోక్‌పాల్, లోకాయుక్తపై వివాదాస్పద అంశాలను పరిష్కరించుకోవటానికి సమయం పడుతుందనుకుంటే, కాంగ్రెస్, బిజెపిలు ఆ ఘర్షణను పక్కనపెట్టి తొలుత రాజ్యాంగ సవరణను ఆమోదించాలి. లోక్‌పాల్, లోకాయుక్తలకు స్వతంత్ర ప్రతిపత్తి, ప్రభావశీలత నిబంధనలను స్థూలంగా పేర్కొంటూ, లోక్‌పాల్, లోకాయుక్తల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ రెండు పార్టీలూ రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టడం అవసరమని కొంతమంది ప్రముఖ న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

లోక్‌పాల్ చట్టంలో వివాదాస్పద వివరాలను ఖరారు చేయటం, వాటిపై ఒక ఆమోదయోగ్య పరిష్కారానికి ప్రయత్నిస్తుండటం ఇవన్నీ కూడా చట్టపరంగా, తప్పనిసరిగా చేయాల్సిన సంస్థాగత నిర్మాణాన్ని రాజ్యాంగంలో పొందుపరచటానికి ఆటంకాలు కానక్కర్లేదు. 'రాష్ట్రాల హక్కులు' అంశం కూడా దీనివల్ల పూర్తి స్థాయిలో పరిష్కారమవుతుంది. ఇటీవల సభలో విఫలమైన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌పాల్/లోకాయుక్త లకు రాజ్యాంగ ప్రతిపత్తిని ప్రతిపాదించింది. ఇందులో వివాదాస్పద అంశాలేమీ లేవు. కాబట్టి విభేదాలని పక్కనపెట్టి దాన్ని ఆమోదించటం సాధ్యమవుతుంది. సుహృద్భావం, పరస్పర విశ్వాసం, అవినీతిని నియంత్రించాలనే నిజమైన సంకల్పం ఉంటే ... ఒక ఆమోదయోగ్యమైన చట్టాన్ని త్వరితగతిన చేయటం ఏ రకంగానూ కష్టంకాదు. 

ఇప్పటికైనా సమయం మించిపోలేదు. గత ఏడాది మనకు అనేక విలువైన పాఠాల్ని నేర్పింది. కొత్త సంవత్సరంలో ఆ పాఠాల్ని మనం ఆచరణలో అమలు చేయాలి. దేశవ్యాప్తంగా, ప్రభావవంతమైన, స్వతంత్రమైన, అవినీతి వ్యతిరేక వ్యవస్థని, సంస్థల్ని ఏర్పాటు చేసుకునేందుకు విజ్ఞతతో, సమష్టితత్వంతో వ్యవహరించాలి. గత ఏడాది చవిచూసిన విద్వేషం, అపనమ్మకం, విరోధ భావం స్థానంలో సామరస్యత, సంకల్పం, పరస్పర గౌరవం భావాలను పెంపొందించుకోవాలి. మన జాతి గౌరవం, ఆత్మ విశ్వాసం, పాలనా ప్రక్రియ పట్ల ప్రజలలో నమ్మకం, ప్రపంచంలో భారత్ ప్రతిష్ఠ, మన దేశం పట్ల విదేశీ పెట్టుబడిదారులకు విశ్వాసం ... ఇవన్నీ ఈ వేళ ప్రమాదంలో పడ్డాయి. విభేదాలను విస్మరించి అందరం కలిసి నిర్ణయాత్మకంగా, వేగంగా వ్యవహరించాల్సిన సమయమిది. 

- డాక్టర్ జయప్రకాష్ నారాయణ్
అధ్యక్షులు, లోక్‌సత్తా పార్టీ

0 comments:

Post a Comment