Tuesday

అవినీతిపై సుప్రీం అంకుశం పబ్లిక్ సర్వెంట్లపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు ప్రాసిక్యూషన్ కోరవచ్చు.. ఇది పౌరుల హక్కు


అనుమతిపై నాన్చడం కుదరదు.. 4 నెలల్లోపు తేల్చాలి
లేకుంటే అనుమతి ఇచ్చినట్లే!.. తేల్చి చెప్పిన ధర్మాసనం

ప్రధానికి తగిన సలహా ఇవ్వలేదు
ప్రధాని కార్యాలయానికి అక్షింతలు
గడువుపై పార్లమెంటుకూ సూచన
రాజా ప్రాసిక్యూషన్‌కు మార్గం సుగమం

రాజా అయినా, రాజాధి 'రాజు' అయినా... అక్రమాలకు పాల్పడిన పబ్లిక్ సర్వెంట్స్‌పై ఏ పౌరుడైనా ఫిర్యాదు చేయవచ్చు! వారిని అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా కోరవచ్చు! ఇది సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన విషయం.

అక్రమార్కులను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతించకుండా ప్రభుత్వం నెలలు, సంవత్సరాల తరబడి నాన్చేందుకు వీల్లేదు. గరిష్ఠంగా నాలుగు నెలల్లోపు అటో ఇటో తేల్చేయాల్సిందేనని కూడా సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు స్పష్టం చేసింది! దేశాన్ని పట్టి కుదిపేస్తున్న 2జీ కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంటు సభ్యుడు ఎ.రాజాను ప్రాసిక్యూట్ చేసేందుకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది.

ఈ విషయంలో జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్య స్వామి వాదనను బలపరిచింది. 'రాజాను ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా ప్రధానమంత్రిని ఆదేశించలేం' అంటూ ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. ప్రాసిక్యూట్ చేయడంపై నిర్ణయం తీసుకోవడంలో మీనమేషాలు లెక్కించిన ప్రధానమంత్రి కార్యాలయంపై సుప్రీం మండిపడింది. జస్టిస్ జీఎస్ సింఘ్వీ, జస్టిస్ ఏకే గంగూలీలతో కూడిన ధర్మాసనం మంగళవారం దీనిపై తీర్పు చెప్పింది.

గురువారం పదవీ విరమణ చేయనున్న జస్టిస్ గంగూలీ ప్రత్యేకమైన తీర్పు రాశారు. పబ్లిక్ సర్వెంట్స్ అవినీతిపై నిశిత వ్యాఖ్యలు చేశారు. సుప్రీం తీర్పు కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని విపక్షాలు... అన్నా హజారే బృందం పేర్కొనగా... 'కోర్టులు ఇలాంటి తీర్పులు అనేకం ఇస్తుంటాయి. ఇది మాకు ఎదురుదెబ్బ కాదు' అని కాంగ్రెస్ తేలిగ్గా తీసుకుంది.



ప్రజాస్వామ్యానికి అవినీతి ప్రమాదం
సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య రిపబ్లిక్‌లో అవినీతికి చోటు లేదు. అవినీతి భూతం అభివృద్ధికి శత్రువు. మానవ విలువలకు పాతరేస్తుంది. న్యాయాన్ని సమాధి చేస్తుంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ప్రభోదించే రాజ్యాంగ విలువలనే అపహాస్యం చేస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం. స్వేచ్ఛగా, నిర్భయంగా విధులు నిర్వహించేందుకు వీలుగా తప్పుడు ప్రాసిక్యూషన్ నుంచి పబ్లిక్ సర్వెంట్స్‌కు కొన్ని రక్షణలు కల్పించారు. అయితే... ఈ 'రక్షణ'నే కవచంగా వాడుకుంటూ అవినీతికి పాల్పడటం కుదరదు. అవినీతిపరులైన పబ్లిక్ సర్వెంట్స్‌పై ఫిర్యాదు చేయడం పౌరుల రాజ్యాంగ హక్కు. దీనిపై సంబంధిత యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిందే.
- జస్టిస్ ఏకే గంగూలీ


న్యూఢిల్లీ, జనవరి 31:అవినీతి మదగజంపై సుప్రీంకోర్టు మరోమారు అంకుశం ప్రయోగించింది. ప్రజా జీవితంలో పెచ్చరిల్లుతున్న అవినీతి... ఈ దేశ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగబద్ధ పాలనకే పెనుముప్పు అని ఆందోళన వ్యక్తం చేసింది. అక్రమాలకు పాల్పడిన పబ్లిక్ సర్వెంట్స్ (ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల)ను ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా కోరే హక్కు పౌరులెవరికైనా ఉంటుందని స్పష్టం చేసింది. పబ్లిక్ సర్వెంట్స్‌ను అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూట్ చేయాలంటే కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తు అనుమతి అవసరం.

2జీ కేసులో అరెస్టయిన ఎ.రాజా ప్రాసిక్యూషన్‌కు ప్రధాని కార్యాలయం (పీఎంవో) అనుమతించకుండా, అనుమతి నిరాకరించకుండా 16 నెలలుగా నాన్చింది. 2జీ కుంభకోణాన్ని బయటికి లాగుతున్న సుబ్రమణ్యస్వామి ఇదే అంశంపై 'లేఖల యుద్ధం' ప్రకటించారు. రాజా ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని ఆయన కోరారు. ఇందుకు ప్రధాని నిరాకరించారు. దీంతో సుబ్రమణ్యస్వామి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 'రాజా ప్రాసిక్యూషన్‌కు అనుమతించాల్సిందిగా ప్రధాన మంత్రిని ఆదేశించండి' అని కోరారు.

ఇందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టుకు ఎక్కారు. దీనిపై సుప్రీం ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. వినీత్ నారాయణ్ కేసులో 1998లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం... పబ్లిక్ సర్వెంట్స్ ప్రాసిక్యూషన్‌కు అనుమతిపై మూడు నెలల్లో తేల్చాలని, అటార్నీ జనరల్‌తో సంప్రదింపులు జరపాల్సిన అవసరముంటే మరో నెల గడువు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. మొత్తానికి నాలుగు నెలల్లోపు విషయం తేల్చాల్సిందేనని పునరుద్ఘాటించింది.

నాలుగు నెలలు గడిచిన తర్వాత కూడా 'నాన్చుడు కార్యక్రమం' కొనసాగితే... ప్రాసిక్యూషన్‌కు అనుమతించినట్లుగానే భావించాల్సి వస్తుందని ఈ కేసులో ప్రత్యేకంగా తీర్పు రాసిన జస్టిస్ ఏకే గంగూలీ స్పష్టం చేశారు. సంప్రదింపులు జరపాల్సిన అవసరముందనే విషయాన్ని మూడు నెలల్లోపే లిఖిత పూర్వకంగా అటార్నీ జనరల్‌కు చెప్పాలన్నారు. అంతేకాదు... 'అవినీతి నిరోధక చట్టం కింద ఎన్ని రోజుల్లోపు అనుమతి ఇవ్వాలనే అంశం చట్టంలో లేదు. దీనికి ఇక నిర్దిష్ట గడువు విధిస్తూ పార్లమెంటులో చట్టం చేయాలి' అని కూడా ఆయన సూచించారు.

ప్రధాని కార్యాలయమే కారణం
రాజా ప్రాసిక్యూషన్‌పై ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తగిన సూచనలు చేయడంలో ఆయన కార్యాలయం (పీఎంవో) విఫలమైందని సుప్రీం అక్షింతలు వేసింది. "రాజాను ప్రాసిక్యూట్ చేయాలన్న పిటిషన్‌కు బూజు పట్టించారు. రాజాను ప్రాసిక్యూట్ చేయడంపై తగిన నిర్ణయం తీసుకునేలా... ఆయనపై ఉన్న తీవ్రతను ప్రధానికి వివరించడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారు. ఇలాంటి కేసులకు సంబంధించిన నిబంధనలు, నియమాల వాస్తవ వివరాలను ప్రధానికి వివరించి ఉంటే... ఆయన కచ్చితంగా తగిన నిర్ణయం తీసుకునే వారు.

రాజాను ప్రాసిక్యూట్ చేయాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోవడానికి ఏడాదికిపైగా సమయం తీసుకునే వారే కాదు'' అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో ప్రధాన మంత్రిని తప్పుపట్టనప్పటికీ... ఆయన కార్యాలయ వ్యవహార శైలిని మాత్రం వేలెత్తి చూపింది. "తన ముందుకు వచ్చే ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలించడం ప్రధానికి సాధ్యం కాదు. ఆయా అంశాలపై సలహాదారులు, ఇతర అధికారులపై ఆయన ఆధారపడాల్సి వస్తుంది. రాజాపై సుబ్రమణ్య స్వామి చేసిన ఆరోపణల తీవ్రతను ప్రధానికి వివరించాల్సిన బాధ్యత పీఎంవో, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలదే'' అని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా తప్పు పట్టింది.

"2జీ కేసులో ప్రధానమంత్రే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినట్లు ఢిల్లీ హైకోర్టు తప్పుగా భావిస్తోంది. నిజానికి... ఈ అంశాన్ని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచారణ జరిపి... పూర్తిస్థాయి దర్యాప్తు జరపాల్సిందిగా సీబీఐని కోరింది'' అని వివరించింది. సుబ్రమణ్య స్వామికి ఈ విషయంలో జోక్యం చేసుకునే అర్హత లేదని అటార్నీ జనరల్ జి.వి.వాహనవతి చేసిన వాదనను ధర్మాసనం పూర్తిగా తోసి పుచ్చింది. పబ్లిక్ సర్వెంట్స్ అవినీతిపై ఫిర్యాదు చేయడం పౌరుల హక్కు అని స్పష్టం చేసింది. అయితే... ఫిర్యాదు చేసిన వ్యక్తి తగిన ఆధారాలు సమర్పించారా; అవినీతి జరిగినట్లుగా దర్యాప్తు సంస్థ ప్రాథమిక ఆధారాలు సేకరించిందా? అనే అంశాలను సంబంధిత యంత్రాంగం పరిశీలించాలని పేర్కొంది.

0 comments:

Post a Comment