Tuesday

అవినీతి కా'మందులు' ఎక్సైజ్, పోలీసు శాఖల్లో అవినీతి రట్టు నెలవారీ మామూళ్ల వసూలు పర్వం


కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ వరకు ఇదే తంతు
ఎక్సైజ్‌లో డీసీ స్థాయి వరకు వెళ్తున్న లంచాలు

 మద్యం సిండికేట్లపై ఏసీబీ దాడులతో అవినీతి గుట్టుముట్లన్నీ రట్టవుతున్నాయి. ఎక్సైజ్, పోలీసు శాఖలలోని మామూలు సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అంతా లంచాలు మెక్కిన వైనం స్పష్టంగా ఆధారాలతో సహా బయటపడుతోంది. కానిస్టేబుల్ నుంచి డిప్యూటీ కమిషనర్ వరకు వివిధ స్థాయుల్లోని అధికారులను ఏసీబీ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతోంది. ఏసీబీ బృందాలు జనవరి 28న రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో దాడులు చేసి మద్యం సిండికేట్ల రికార్డులను స్వాధీనం చేసుకున్నాయి.

పలువురు సిండికేట్ లీడర్లు, ఎక్సైజ్ అధికారులు అరెస్టయ్యారు. ఈ సందర్భంగా ఏసీబీ రూపొందించిన నివేదిక ప్రతుల్లో కొన్ని 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి'కి చిక్కాయి. వాటిని చూస్తే కళ్లు తిరిగే వాస్తవాలు బయటపడుతున్నాయి. సిండికేట్ల నుంచి మామూళ్లు వసూలు చేయడానికి పోలీసు, ఎక్సైజు అధికారులు తమ స్టేషన్లలోని కానిస్టేబుల్ లేదా ఏఎస్సైని ఎంపిక చేస్తున్నారు. వాళ్లు తమ పరిధిలో ఉండే మద్యం షాపుల నుంచి మామూళ్ల మొత్తాన్ని వసూలు చేస్తుంటారు. వరంగల్‌లో ఒక సిండికేట్‌కు నాయకత్వం వహిస్తున్న మద్యం వ్యాపారి వీరచందర్ స్వయంగా వరంగల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌కు డబ్బులు అందజేసినట్లు ఏసీబీ తన నివేదికలో పేర్కొంది.

ఓసారి రూ. 2.75 లక్షలు, మరోసారి రూ. 10వేలు చందర్ ద్వారా డిప్యూటీ కమిషనర్ నర్సింహారావుకు అందాయి. వరంగల్ డివిజన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంచాక్షరికి రూ. 55వేలు, మహబూబాబాద్ డివిజన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు రూ. 18వేలు, సీఐ కరంచంద్‌కు రూ. 50వేలు అందినట్లు నివేదికలో తెలిపారు. అర్బన్ పరిధిలో ఉన్న కాజీపేట సీఐ తిరుపతికి చారి అనే కానిస్టేబుల్ ద్వారా వివిధ దఫాల్లో రూ. 5.50 లక్షలు అందినట్లు తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్‌కు కూడా మామూళ్లు అందాయని పేర్కొన్నారు.

డిసెంబరు 13న కరీంనగర్‌లో మూడున్నర లక్షల రూపాయల మామూళ్ళ డబ్బుతో పట్టుబడిన ఎక్సైజ్ అధికారుల వ్యవహారం ఇప్పుడు అవినీతి అధికారుల మెడకు బిగుసుకుంటుంది. ఈ సంఘటనతో రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ దాడులు మొదలయ్యాయి. ఆ దాడుల్లో రూపొందించిన జాబితా ప్రకారం ఒక్కో జిల్లాలో సోదాలు నిర్వహిస్తూ బాధ్యులను అరెస్ట్ చేసుకుంటూ పోతుంది. రెండు రోజు ల క్రితం వరకూ శ్రీకాకుళం, విశాఖపట్టణం, నెల్లూరు, హైదరాబాద్‌లలో కానిస్టేబుల్ నుంచి ఏసీ స్థాయి వరకు పలువురిని అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం వరంగల్‌లో డిప్యూటీ కమిషనర్ (డీసీ), ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఈఎస్)ల పేర్లు వెలుగులోకి వచ్చాయి.

ఇవిగాక పోలీసు శాఖకు చెందిన డీఎస్పీ, సీఐలు, ఎస్ఐల పేర్లను ఏసీబీ అధికారులు బయటకు లాగారు. అధికారులతో పాటు ప్రముఖులు, మీడియా ప్రతినిధుల చిట్టానూ ఏసీబీ విప్పుతోంది. ఎక్సైజ్ సిబ్బంది ఎమ్మెల్యేలు, మంత్రులతో సిఫార్సులు చేయించుకుని కోరుకున్నచోట పోస్టింగ్ వేయించుకోవడం, దాని కోసం ముడుపులు చెల్లించడం మామూలైపోయింది. తర్వాత వసూళ్ల పర్వం మొదలవుతోంది. నాన్ డ్యూటీపెయిడ్ లిక్కర్, నకిలీ మద్యం, బెల్టుషాపులకు సైతం టార్గెట్లు పెట్టి అమ్మిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు నెలవారీ వాటాలు పంచుతున్నారు. రాజకీయ పార్టీలు సైతం మద్యం సిండికేట్ల నుంచి మామూళ్లు దండుకుంటున్నాయి.

0 comments:

Post a Comment