Tuesday

భారత్‌ను అధిగమిస్తున్న చైనా.....


దేశ వైజ్ఙానిక రంగం దిశ మారాలి

పరిశోధన, అభివృద్ధి కోసం నిధుల కేటాయింపు రెట్టింపు చేస్తాం

నిరుద్యోగులుగా మహిళా శాస్త్రవేత్తలు
99వ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రధాని మన్మోహన్ వెల్లడి
గాంధీజీ ఆశయాలను అమలులోకి తేవాలి
శాస్త్రవేత్తలను కోరిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్

భువనేశ్వర్, జనవరి 3: ప్రపంచ వైజ్ఞానిక రంగంలో చైనా లాంటి దేశాలు భారత్‌ను అధిగమిస్తున్నాయని ప్రధాని మన్మోహన్‌సింగ్ వెల్లడించారు. అంతేగాదు వైజ్ఞానిక పరిశోధన, అభివృద్ధి కోసం పెట్టే ఖర్చును 12వ పంచవర్ష ప్రణాళిక చివరిలోగా రెట్టింపు చేస్తామని ఆయన ప్రకటించారు. ఉద్యోగావకాశాలు లేక ఎంతోమంది మహిళా శాస్త్రవేత్తలు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని మన్మోహన్ పేర్కొన్నారు.

ఇక్కడి కేఐఐటీ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన 99వ సైన్స్ కాంగ్రెస్‌ను ఆయన మంగళవారం ప్రారంభించారు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారత్ స్థానం మరీ క్షీణించిపోతుందని, చైనా లాంటి దేశాలు మనలను అధిగమిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పరిస్థితులు మారుతున్నప్పటికీ మనం ఇప్పటికీ సాధించిన విజయాలతో సంతృప్తిపడలేమని ఆయన పేర్కొన్నారు. భారత సైన్స్ రంగం యొక్క దిశను మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

వనరుల పరంగా చూస్తే పరిశోధన, అభివృద్ధి కోసం ఖర్చు చేసిన జీడీపీ చాలా తక్కువని, 0.9 శాతంగా ఉన్న జీడీపీని 12వ పంచవర్ష ప్రణాళిక చివరి వరకు 2 శాతానికి పెంచాలని తమ ఉద్దేశమని ప్రధాని పేర్కొన్నారు. ఇదిలాఉండగా వైజ్ఞానిక రంగంలో మహిళల పురోభివృద్ధిని ఈ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రధానంగా ప్రస్తావించడంపై మన్మోహన్ అభినందనలు తెలిపారు. కాగా గ్రామీణాభివృద్ధి కోసం సైన్స్ ఉపయోగపడాలనేదే గాంధీజీ ఉద్దేశమని, దేశం ఆయన ఆశయాలను అమలులో పెడుతుందా? అని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శాస్త్రవేత్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

గ్రామ వికాసానికి అనుగుణమైన సైన్స్ కావాలని గాంధీజీ కోరుకునేవారని, ఆయన కోరుకునే సైన్స్ గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు తదితర చాలా సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని అన్నారు. కాబట్టి గాంధీజీ ఆశయాలను అమలులోకి తెచ్చే ప్రయత్నం చేయాల్సిందిగా పట్నాయక్ శాస్త్ర్రవేత్తలను కోరారు. ఈ సందర్భంగా ఒడిశాకు చెందిన శాస్త్రవేత్తలు సమంతా చంద్రశేఖర్, బిజూ పట్నాయక్, ఉట్కల్మని గోపబంధు దాస్ సైన్స్ రంగంలో చేసిన సేవలను పట్నాయక్ కొనియాడారు.

0 comments:

Post a Comment