Monday

400 శాతం పెరిగిన దొంగ నోట్ల చలామణి...


 దేశంలో నకిలీ కరెన్సీ కుప్పలుతెప్పలుగా ప్రవహించటమే కాదు.. విస్తృతంగా చలామణి అవుతోందని ప్రభుత్వ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారత ఆర్ధిక కార్యకలాపాల్లో ఈ నకిలీ కరెన్సీ లావాదేవీలు ఏకంగా 400 శాతం పెరిగినట్లు ఆర్ధిక మంత్రిత్వ శాఖలోని ఫైనాన్షియల్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయు) రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 2010-11 ఆర్ధిక సంవత్సరంలో భారత్‌లో ఏకంగా 35 కోట్ల రూపాయల విలువైన నకిలీ కరెన్సీ లావాదేవీలను గుర్తించినట్లు ఎఫ్ఐయు ఆ నివేదికలో తెలిపింది. ఈ కాలంలో నకిలీ నోట్లతో సుమారు 4,23,539 లావేదేవీలు జరిగినట్లు ఏజెన్సీ గుర్తించింది. 

2009-10లో ప్రివెంటివ్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం (పిఎంఎల్ఎ) ప్రొవిజన్ల కింద వివిధ బ్యాంకులు, ఇతరత్రా ఆర్ధిక లావాదేవీల్లో నకిలీ కరెన్సీ లావాదేవీలు (సిసిఆర్) 1,27,781గా ఉన్నాయని ఎఫ్ఐయు పేర్కొంది. 2010-11లో దేశంలోకి 500 రూపాయల నోట్ల డినామినేషన్‌తో కూడిన నకిలీ నోట్లు వెల్లువలా వచ్చిపడ్డాయని నివేదికలో తెలిపింది. గత ఆర్ధిక సంవత్సరంలో 500 రూపాయలతో కూడిన నకిలీ నోట్లు 60.74 శాతం పెరగగా 1,000 రూపాయల నకిలీ నోట్ల సంఖ్య కూడా గణనీయంగానే పెరిగిందని వెల్లడించింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులు, ఆర్ధిక సం స్థల్లో అనుమానాస్పద లావాదేవీలు (ఎస్‌టిఆర్) కూడా ఏకంగా 300 శాతం పెరిగాయని తెలిపింది. ప్రైవేట్ బ్యాంకుల్లోనే అధికం: దేశీయంగా నకిలీ కరెన్సీ లావాదేవీల్లో ప్రైవేట్ బ్యాంకులే కీలక పాత్ర పోషించాయని ఆర్ధిక మంత్రిత్వ శాఖకు సమర్పించిన నివేదికల్లో ఎఫ్ఐయు వివరించింది.

0 comments:

Post a Comment