Friday

2012 పోరాట వత్సరం...

 ప్రపంచవ్యాప్తంగా బూర్జువా వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలకు కొనసాగింపుగా 2012ను సామ్రాజ్యవాద, క్రోనీ క్యాపిటలిజం, బూర్జువా వ్యవస్థ వ్యతిరేక పోరాటాల సంవత్సరంగా ముందుకు సాగాలని సిపిఐ
ఉపప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పిలుపు నిచ్చారు. ఎఐటియుసి రాష్ట్ర కార్యాలయం ఎన్‌. సత్యనారాయణరెడ్డి భవన్‌లో నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం ''గెట్‌-టు-గెదర్‌'' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సురవరంతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు పి.జె.చంద్రశేఖర్‌రావు, ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, ఎఐటియుసి జాతీయ కార్యదర్శి బి.వి.విజయలక్ష్మి, నాయకులు ప్రేంపావని, బాల్‌రాజ్‌ , యూసఫ్‌ తదితరులు పాల్గొన్నారు. పి.జె.చంద్రశేఖర్‌రావు, బాల్‌రాజ్‌లు కేక్‌ కట్‌ చేశారు. అనంతరం సురవరం మాట్లాడుతూ 2011లో అనేక సవాళ్ళు, సంక్షోభాలు ఎదురయ్యాయని, వాటిపై 2012లో పోరాడాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ముంచుకొస్తున్న ఆర్థిక సంక్షోభం ప్రభావం మన ప్రమేయం లేకున్నా మన దేశం సహా ఇతర దేశాలపై పడనుందని తెలిపారు. బూర్జువా, సామ్రాజ్యవాద శక్తులు ఆర్థిక సంక్షోభ భారాన్ని కార్మికవర్గంపై మోపేందుకు యత్నిస్తున్నాయని, ఈ చర్యలను తిప్పికొట్టేందుకు బలమైన కార్మికవర్గ పోరాటాలు అవసరమన్నారు. ఇప్పటికే ఐరోపా దేశాల్లో పోరాటాలు జరుగుతున్నాయని, వాటిని స్ఫూర్తిగా తీసుకొని బలమైన వామపక్ష ఉద్యమం గల మన దేశంలో శక్తివంతమైన పోరాటాలు చేయాల్సిన అవసరముందని చెప్పారు.
నారాయణ మాట్లాడుతూ 2012లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానాలకు వ్యతిరేకంగా గ్రామస్థాయి నుంచి పట్టణస్థాయి వరకు బలమైన ఉద్యమాలు నిర్మించి ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలని పిలుపునిచ్చారు. 2011లో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి, అస్థవ్యస్థ పాలన కొనసాగాయని, వాటిని అధిగమించేందుకు బలమైన కార్మిక ఉద్యమాలు అవసరమన్నారు. పి.జె.చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ ఈ ఏడాది ద్వితీయార్థంలో జాతీయ మహాసభలు జరగనున్నాయని, వాటిలో ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చేయాల్సిన పోరాటాలు, కర్తవ్యాలపై కార్మికవర్గానికి మార్గనిర్దేశనం జరుగుతుందని పేర్కొన్నారు. ఓబులేసు మాట్లాడుతూ కాంట్రాక్టీకరణ, ఔట్‌సోర్సింగ్‌ విధానాలు, యువకిరణాలు వంటి ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలపై సోమవారం ఎఐటియుసి ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహిస్తు న్నామన్నారు. ఫిబ్రవరి 28న సాధారణ సమ్మెను విజయవంతం చేసేందుకు ఈనెల 5న గాంధీభవన్‌లో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సన్నాహక సభ జరుగుతుందని, ఇందులో గురుదాస్‌ దాస్‌గుప్తా, సంజీవరెడ్డి, తపన్‌ సేన్‌ తదితర కేంద్ర కార్మిక సంఘాల నాయకులు హాజరవుతారని తెలిపారు. 

0 comments:

Post a Comment