Saturday

పాత పేపరు


   

పాత న్యూస్ పేపర్ ఎందుకూ పనికిరాకుండా పోతున్నది అనుకుంటూ ఉంటే, టులేన్ యూనివర్శిటీ పరిశోధకులు ఆశ్చర్యకరమయిన విషయాన్ని తెలియజేసి ‘ఆగండి’ అంటున్నారు. వారు ‘టియు-103’ అనే కొత్త బ్యాక్టీరియాను కనుగొన్నారు. అది పాత కాగితాన్ని తిని బ్యుటనాల్ అనే ఆల్కహాలును తయారు చేస్తుంది. దాన్ని, గాసోలీన్, కిరోసిన్‌ల లాగే కావలసిన చోట ఇంధనంగా వాడుకోవచ్చు. సెల్యులోజ్ అనే పదార్థంతో, వస్త్రాలు, కాగితాలు తయారవుతాయని తెలిసే ఉంటుంది. ఇది చక్కెరలతో తయారయినా మనం ఆరగించుకోలేము. సెల్యులోజ్ నుంచి నేరుగా బ్యుటనాల్‌ను తయారు చేయగల సూక్ష్మజీవి ఈ సరికొత్త టియు-103 ఒకటే. ఇది మొదటిసారిగా దొరికింది. గడ్డి, మొక్కలు అన్నింటిలోనూ సెల్యులోజ్ ఉంటుంది. ప్రపంచంలో దొరికే సేంద్రియ, జీవసంబంధ రసాయనాలలో అన్నింటికన్నా ఎక్కువగా ఉండేది ఇదే. దాన్ని ఆల్కహాలుగా మార్చడం గురించి రసాయన పరిశోధకులు చాలా ఏళ్లుగా కలలు కంటున్నారు. టులేన్‌లోని సెల్ అండ్ మాలిక్యులార్ బయాలజీ పరిశోధనశాలలో డేవిడ్ ములిన్ అనే ప్రొఫెసర్ దగ్గర పి.హెచ్.డీ కోసం పనిచేస్తున్న హర్షద్ వేలన్‌కర్ ఈ సూక్ష్మజీవి గురించి ఎంతో కాలంగా అనే్వషిస్తున్నాడు. అతని కృషి ఫలించింది. ప్రపంచమంతటా లక్షల టన్నుల సెల్యులోజ్ పదార్థాలను వ్యర్థంగా పడేస్తున్నారు. దాన్నంతా వాడుకుంటే ఇంధనం కొరత తీరుతుంది, అంటాడు మన హర్షద్. ఈ సూక్ష్మజీవి పశువుల పేడలో కనిపించింది. పశువులు సెల్యులోజ్ (గడ్డి)ని అరిగించుకుంటాయని తెలుసు. అందుకే వాటిని తెచ్చి పెంచారు. సూక్ష్మజీవిని వాడి బ్యుటనాల్ తయారు చేసే పద్ధతిని కూడా కనుగొన్నారు. నిజానికి బ్యుటనాల్‌ను పుట్టించగల సూక్ష్మజీవులన్నీ ఆక్సిజెన్ ఉంటే చనిపోతాయి. ఈ టియు-103 మాత్రం ఆక్సిజెన్‌ను తట్టుకుని ఉండి పని చేస్తుంది.మామూలుగా ఇతనాల్‌ను ఇంధనంగా వాడుతుంటారు. ఈ బ్యుటనాల్‌ను మాత్రం ప్రస్తుతం వాడుకలో ఉన్న ఇంజన్లలో, ఏ మాత్రం మార్పులు అవసరం లేకుండానే వాడుకోవచ్చు. ఉన్న గొట్టాల ద్వారానే దాన్ని రవాణా చేయవచ్చు. దీంతో వాహనాల మైలేజీ కూడా బాగా వస్తుంది. ఈ ఇంధనతో కాలుష్యం కూడా తగ్గుతుంది.

0 comments:

Post a Comment