Wednesday

ముందున్నది మరో మాంద్యం అమెరికా, యూరప్, చైనా.. ఆసియా వణుకుతున్నాయ్...!


ప్రపంచం ముందు మరో ఆర్థిక మాంద్యం పొంచి ఉందని రిజర్వు బ్యాంకు గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు హెచ్చరించారు. దీని వల్ల అమెరికా, యూరప్, చైనాలతో పాటు.. ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా వణికిపోతున్నాయని ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో బ్యాంకర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లా 20 ఏళ్ల క్రితమే ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధించిందని, అక్కడి ప్రజలు, బ్యాంకు సిబ్బందిలో చైతన్యమే ఇందుకు కారణమన్నారు. తూర్పు గోదావరి జిల్లాను కూడా ఆ దిశగా నడిపించడానికి అధికారులు, బ్యాంకులు కృషి చేయాలన్నారు.

దేశంలో ఇప్పటికే మొదటి దశ ఆర్థిక ఉద్దీపనలు కొనసాగుతున్నాయని, త్వరలో ద్వితీయ శ్రేణి నగరాల్లో రెండో దశ ఉద్దీపనలు అమలు చేస్తామన్నారు. త్వరలో బ్యాంకు ఖాతాలను దేశంలో ఎక్కడికైనా, వేర్వేరు బ్యాంకులకైనా మార్చే దిశగా ఆలోచిస్తున్నామని దువ్వూరి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులకు బ్యాంకు సేవల విషయమై రిజర్వుబ్యాంకుకు రోజూ వందకు పైగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. బ్యాంకు సిబ్బంది ఆలోచనా సరళి మార్చుకోవాలని సూచించారు. 80% గ్రామీణులు ఇంకా బ్యాంకులకు దూరంగా ఉన్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే వారిని బ్యాంకింగ్ సేవలకు దగ్గర చేయాలన్నారు.

అనంతరం ఆయన బ్యాంకర్లతో మాట్లాడారు. వ్యవసాయ రంగంలో రుణ వసూళ్లు తక్కువగా ఉంటున్నాయని బ్యాంకర్లు ఫిర్యాదుచేశారు. రీషెడ్యూల్ చేసిన రుణాలపై ఆశలు వదులుకోవాల్సి వస్తోందన్నారు. దీనికి కారణలేంటని దువ్వూరి ప్రశ్నించగా, ప్రభుత్వాలు గతంలో రుణాలు రద్దుచేయడమేనని జవాబిచ్చారు. ఇంకా వారు తటపటాయిస్తుంటే... దువ్వూరి కలుగజేసుకుని 'రుణాలు చెల్లించొద్దని రైతులకు రాజకీయ నేతలు చెబుతున్నారా?' అని అడిగారు. దీనికి బ్యాంకు అధికారులంతా ముక్తకంఠంతో అవునని జవాబిచ్చారు. ఇదంతా జిల్లా కలెక్టర్ సమక్షంలోనే జరిగింది! రాష్ట్రంలో 2వేల జనాభా దాటిన 6,600 గ్రామాల్లో వ్యాపార ప్రతినిధులను నియమించి బ్యాంకింగ్ సేవలను విస్తరిస్తామని తెలిపారు.

2012 మార్చి నాటికి అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ద్రవ్యోల్బణానికి అనేక కారణాలున్నాయన్నారు. ప్రధానంగా ప్రజల ఆహార అలవాట్లలో మార్పులు రావడం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వృద్ధిరేటు పెరగడం వంటివి కూడా కారణాలేనన్నారు. చమురు ధరలు పెరగడం మరో కారణమన్నారు. యూరప్‌లో సంక్లిష్ట పరిస్థితులు, అమెరికాలో బ్యాంకుల రికవరీలు సన్నగిల్లడంతో రూపాయి మారకపు విలువ రికార్డుస్థాయిలో పడిపోయిందన్నారు.

ఆర్‌బీఐ తీసుకున్న చర్యలతో రూపాయి విలువ కొంత మెరుగైందన్నారు. బ్యాంకుల ప్రగతి, వినియోగదారుల సలహాలు తీసుకుని బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు, చేర్పులు చేయడానికి ఆర్‌బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్, డైరెక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించాలని ఆర్‌బీఐ ప్లాటినం సమావేశాల్లో నిర్ణయించామన్నారు. ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు అన్ని చర్యలూ తీసుకుంటుని, ఈ సంవత్సరం 7% వృద్ధిరేటు సాధించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.

0 comments:

Post a Comment