Wednesday

షుగర్ 'ఎఫెక్ట్'కు చెక్...!


పగలు మేల్కొని... రాత్రి నిద్రిస్తే సాధారణం! కానీ... రాత్రంతా పని చేసి పగలు నిద్రిస్తే అసాధారణం! ఇలాంటి అసాధారణ వేళలతో శరీర స్పందనలూ మారిపోతాయి. శాస్త్రీయంగా చెప్పాలంటే... 'బయలాజికల్ క్లాక్' పని చేయడం మారుతుంది. ఇప్పుడు... శాస్త్రవేత్తలు 'బయలాజికల్ క్లాక్'కు, శరీరంలో చక్కెర సంబంధిత రసాయన క్రియకు మధ్య సంబంధాన్ని గుర్తించారు. ఈ పరిశోధనతో ఆస్తమా, అలర్జీ, ఆర్థరైటిస్ ఔషధాల వల్ల తలెత్తుతున్న దుష్ప్రభావాలను (సైడ్ ఎఫెక్ట్స్) కూడా నివారించవచ్చునని భావిస్తున్నారు.

అమెరికాకు చెందిన సల్క్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్ స్టడీస్ నిపుణులు ఈ అధ్యయనం నిర్వహించారు. వీరు శారీరక స్పందనలను నియంత్రించే క్రిప్టోక్రోమ్స్ అనే ప్రొటీన్లను గుర్తించారు. నొప్పి నివారణ ఔషధాలు ప్రభావం చూపే జీవకణాలతో క్రిప్టోక్రోమ్స్ సంబంధాన్ని నెరుపుతూ ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అధ్యయన వివరాలు 'నేచుర్' పత్రికలో ప్రచురితమయ్యాయి. దీని ప్రకారం... వ్యక్తి 'బయలాజికల్ రిథమ్'ను పరిగణనలోకి తీసుకుని చికిత్స అందించడం ద్వారా ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్‌ను నివారించవచ్చు.

"మనం మేల్కొని ఉన్న సమయం, నిద్రించే సమయం ఆధారంగా శరీరంలో పోషకాల తయారీ ఉంటుంది. కానీ... ఇది కణాలు, జన్యువుల స్థాయిలో ఎలా జరుగుతుందనేది ఇప్పటిదాకా మిస్టరీయే. మా పరిశోధనలో రెండు ముఖ్యమైన వ్యవస్థల మధ్య బంధాన్ని గుర్తించాం'' అని తెలిపారు. శరీరంలో గ్లూకోకార్టికాయిడ్స్ అనే స్టెరాయిడ్ హార్మోన్లు ప్రతిరోజు ఉదయం తీవ్రస్థాయికి పెరుగుతాయి. వెరసి... రోజువారీ పనులను ఉత్సాహంగా చేసేందుకు ఉపకరిస్తాయి. రాత్రి కాగానే వీటి స్థాయి తగ్గుతుంది. ఈ స్టెరాయిడ్ హార్మోన్లను ఆస్తమా, అలర్జీ, ఆర్థరైటిస్ తదితర వ్యాధులకు చికిత్స చేసేందుకు ఉపయోగిస్తున్నారు.

దీనివల్ల శరీరంలో సహజంగా జరిగే జీవకణ రసాయన చర్యలపై దుష్ప్రభావం పడే అవకాశముంది. రక్తంలో చక్కెర స్థాయి భారీగా పెరిగే ప్రమాదముంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు క్రిప్టోక్రోమ్స్ ప్రొటీన్ల పనితీరును అన్ని కోణాల్లో ఆవిష్కరించారు. స్టెరాయిడ్ హార్మోన్ అయిన గ్లూకోకార్టికాయిడ్ చర్యలను కూడా క్రిప్టోక్రోమ్స్ నియంత్రిస్తాయని గుర్తించారు. దీనిద్వారా పోషకాల ఉత్పత్తిని కూడా నియంత్రిస్తాయని తేల్చారు. క్రిప్టోక్రోమ్స్ హెచ్చుతగ్గుల స్థాయిని గుర్తించి... దాని ఆధారంగా గ్లూకోకార్టికాయిడ్ ఔషధాలను ఇస్తే, షుగర్ సంబంధిత దుష్ప్రభావాలను తగ్గించవచ్చునని తేల్చారు. ఈ అధ్యయనంతో సరికొత్త నొప్పి నివారణ ఔషధాల ఆవిష్కరణకు మార్గం సుగమమైనట్లే!

0 comments:

Post a Comment