Monday

సాధన సమాహరం

ఆత్మవిద్యాసాధకుడైన జీవుడికి, శంకర భగవత్సాదులందించిన సమాధాన సమాహారం ఇది. సాధకులందరికీ ఈ సమాహారం సర్వదా ధారణీయం. * గురు వచనమే ప్రమాణం. ఆత్మవిద్యను బోధించే వాడే అసలు గురువు.
* అన్నిటికంటే ఉత్తమ ప్రయోజనకారి ధర్మమే. చేయవలసిన దానిని, సరైన సమయంలో సర్వజనహితంగా చేయటమే ధర్మం. అదొక నిష్ట.
* గురువు ఆజ్ఞాపించిన విషయాన్ని విస్మరించినా, ధిక్కరించినా అది విషమే. గురువు అన్ని వేళలా హితకారి. భౌతిక, ఆధ్యాత్మిక విషయాలు రెండింటిలో గురువు మార్గదర్శి.
* తనకు తన తోటి వారికి, సర్వహితంగా ఉండేట్లు జీవించాలని కోరుకోవటం అభిలషణీయం. ఎందుకంటే జీవుడు సృష్టిలో భాగం కనుక. జీవితం ఈ సాధనలో అంకితం కావాలి.
*మనసు ద్వారా విషయవాంఛలను రేకెత్తించే ఇంద్రియాలు అసలు దొంగలు. ఇవన్నీ జీవుడి లోపలే ఉన్నాయి. దొంగలను ఒక కంట కనిపెట్టి ఉండాలి. అప్రమత్తంగా ఉండాలి. సాధనతో దొంగలను లొంగతీసుకొని, మనసును హృదయంతో కలిపి, నిలుపుకోవాలి.
* ఏ పనీ చేయకపోవటం, ఆత్మ విచారణ సాగించక, కాలమంతా, ప్రాపంచిక ఆలోచనలతో కాలాన్ని వెళ్లగొట్టటం, బుద్ధిమాంద్యం. నిష్క్రియ మంచిది కాదు. క్రియాశీలంగా కాలం గడపాలి.

* గొప్పతనం ఇవ్వటంలో ఉన్నది. పుచ్చుకోవటంలో కాదు. అడగటంలో, అడిగి పొందటంతో అవమానం దాగి ఉంది.
* హాయిగా ఉండలేక పోవటం, ఎవరికీ ఆనందాన్ని కలిగించలేక పోవటమే, దురదృష్టం. పరిస్థితులెట్లా ఉన్నా, అన్ని వేళలా హాయిగా ఉండాలి. సమయ్యయంతో, సామరస్యంతో పరిస్థితులన్నిటిని చక్కదిద్దుకోవాలి. సంఘర్షణకు తావులేని విధంగా, సుఖంగా ఉండాలి.

*అనుభవం నేర్పిన గుణపాఠాన్ని గుర్తుంచుకొని, తిరిగి తప్పు చేయకుండా జీవించాలి. క్రమశిక్షణతో జీవితాన్ని నడపాలి.
*Äౌవనం, ధనం జీవితం...ఇవన్నీ తామరాకు మీద నీటి బిందువులే. ఈ స్పృహ వల్ల స్పష్టత, స్వచ్ఛత, నిబద్ధత ఏర్పడి, మానవజీవితం ఆనందసాగరమవుతుంది.
* సరైన సమయంలో చేసే సహాయమే అత్యంత విలువైనది. అవసరానికి అక్రకు రానిది. సకాలంలో కురవని వర్షం వంటిది.
* రహస్యంగా, లోకం కంటపడకుండా చేసే పాపచింతన, పాపకార్యం భయంకరమైనది. ఆత్మవంచన వల్ల జీవించినంత కాలమూ, మనసును శూలం వలె పొడిచి తీర్చరాని వేదనను మిగుల్చుతుంది. అజ్ఞానాన్ని మటుమాయం చేయగల విద్య అంటే ఆత్మవిద్య, ప్రాణాన్ని నిలబెట్టి ఆరోగ్యాన్నివ్వగల ఔషధం, ఇంకొకరికి యాతనను, బాధను, క్షోభను తొలగించగల త్యాగము, దానము, ఇదే దివ్యసాధనలు.

* ధర్మ పరాయణుడు, సత్యశోధకుడు, సత్యసాధకుడు పరాజయ మెరుగడు. తనను తాను తెలుసుకున్నందున, అటువంటి వాడు జగదేకవీరుడే!
*ఆత్మనెరిగిన వాడు, దయామయుడు, వినమ్రుడూ, ఈ మూడు విధాలైన మానవుడి ఆధీనంలో ఈ సృష్టి సర్వానందమయంగా ఉంటుంది.
* దర్మమార్గంలో నడవటం, ఆత్మను ఎరగటం, ఆత్మగా జీవించటం, నిశ్చల, నిర్మల, నిరంజన, నికేతన స్థితిలో నిలకడగా ఉండటం...వీటన్నిటి వల్ల అనంతానందం లభిస్తుంది. అధర్మం దుర్దశకు దారి తీయిస్తుంది.
*ఎవరి నుంచి ఏమీ ఆశించక పోవటమే మహోన్నత దానం. భగవంతుడిని సైతం ఏమీ అడగకుండా ఉండగలగాలి. మన అవసరం భగవంతుడికి తెలుసు. ధర్మ జీవనం గడిపేవాడికి, అది ఆయాచితంగా లభిస్తుంది.

* పాప భావన నుంచి, పాపకార్యం నుంచి మనసును మరల్చి హితం పలికే వాడే, నిజమైన స్నేహితుడు.
* మధురమైన పలుకులతో కూడిన దానం, వినయంతో కూడిన విద్య, సహనంతో కూడిన ధైర్యం, త్యాగంతో కూడిన సంపద...ఎంతో సాధన చేస్తే గాని రాబట్టుకోలేం. ఎంత కష్టమైనా సాధించుకోవలసినవి, ఇవి.
*సర్వ సంపదలూ ఉండి కూడా ఎవరికీ సాయపడని, అక్కరకు రాని వ్యక్తి ఈ ప్రపంచంలో ఉండి వ్యర్థుడే. ప్రయోజనం లేని జీవితం వాడిది.
* పగలూ, రాత్రీ ఆలోచించవలసినదీ అనుకోవలసినదీ భగవన్నామమే, ఆయన దివ్యపద, పాదస్మరణమే. ప్రపంచాన్ని గూర్చిన ఆలోచనలు ఆనందాన్ని ఇవ్వలేవు.
* జన్మ ఎత్తినందుకు సాధించుకోవలసినవి, జ్ఞానం, సంపద, శక్తి, కీర్తి, ప్రతిభ!
* జ్ఞానం వల్ల ఆత్మ సాక్షాత్కారం, సంపద వల్ల స్కత్కర్మాచరణ, శక్తి వల్ల కార్యసాధన, కీర్తి వల్ల నిత్యస్ఫూర్తి. ప్రతిభ వల్ల శ్రేయస్సు కలుగుతాయి.
* మంచి గుణాలను నాశనం చేసే 'లోభం' వదులుకోవాలి. లోభం భయాన్ని, అసహనాన్ని, అభద్రతను, పెంచి దైవగుణాలను తుంచుతుంది.
*అహంకార మమకారాల వల్ల కలిగే 'లాలస', జీవుడి నిత్య శత్రువు. కామం అనర్థహేతువు.

0 comments:

Post a Comment