Thursday

విమానంకన్నా నౌకకు ప్రమాదాలు మెండు.... పడవ మునక పసిగట్టే పరికరాలు...!


విమానంకన్నా నౌకకు ప్రమాదాలు మెండు.... పడవ మునక పసిగట్టే పరికరాలు!ఆకాశంలో ఎగిరే విమానం పేలిపోతే ప్రమాదానికి ఆధారాలు, కారణాలు గాలిలో కలిసి పోతాయని ఈ మధ్యనెప్పుడో అనుకున్నాం. గతంలో 'కనిష్క' గాలిలో పేలిపోయి, సముద్రంలో కుప్పకూలింది. అది నిజంగానే కుప్పగా ఒకేచోట కూలినా కొంత బాగుండేది. అంత ఎత్తున పేలిన విమానం ముక్కలు సముద్రంలో రెండు మూడు కిలోమీటర్ల ప్రాంతంలో చెల్లాచెదురయినాయి. విమానంలోనయితే ప్రమాదానికి ముందు, తరువాత జరిగిన విషయాలను కొంతవరకైనా తెలియజేసే సదుపాయం ఒకటి ఉంటుంది. దీన్నే బ్లాక్‌ బాక్స్‌ అంటారు. కనిష్క బ్లాక్‌ బాక్స్‌ కోసం నెలల తరబడి, మరమనుషుల సాయంతో వెదికిన సంగతి అందరికీ తెలిసిందే! ప్రమాదాలు ఒక్క విమానాలకే రావు. నేలపై నడిచే రైలు పడిపోతుంది. సముద్రంలో పడవ మునిగిపోతుంది. ఈ నీటిలో మునిగిన షిప్పు గురించి కూడా ఇంతో కొంతో తెలిస్తే బాగుంటుంది కదా! సరిగ్గా ఈ ఆలోచన వచ్చినందుకే ఇంగ్లాండ్‌లో ఒక పరిశోధన సంస్థ వారు నౌకల కోసం 'మెరైన్‌ బ్లాక్‌ బాక్స్‌'లను తయారుచేశారు.

విమానానికన్నా, నౌకకు ప్రమాదాలు మెండు. అది తగలబడవచ్చు, మునిగిపోవచ్చు. తుపానులో చిక్కుకోవచ్చు. నెలల తరబడి జరిగే నౌకాయాత్రలో విమానానికి ఉన్న సమాచార ప్రసార సదుపాయాలు ఎల్లప్పుడూ ఉండవు. ఇటువంటి నౌకలు ఒకవేళ ప్రమాదానికి గురైతే, అంతకుముందు ఆ తరువాత పడవలో ఏం జరిగిందో తెలుసుకోవడం ఎంతైనా అవసరం. అందుకనే ఐదు లక్షల పౌండ్లు వెచ్చింది 'ఆక్సిడెంట్‌ రికార్డర్‌' నమూనాను తయారుచేశారు.
ఈ రికార్డర్‌ ఒకటి కాదు. నిజానికి రెండు రికార్డర్లు. ఇందులో ఒకటి ఇరవై నాలుగు గంటలూ రాడార్‌ సమాచారాన్ని నమోదు చేస్తూ ఉంటుంది. దీనికి ఆగడం అంటూ లేదు. ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. ఇక రెండవ రికార్డర్‌లో మిగతా విషయాలన్నీ నమోదవుతాయి. అన్నీ అంటే అనుకున్నంత సులభమేమీ కాదు. నౌక బయట సంగతులు, లోపల సంగతులు, ఇంజన్‌ సంగతులు ఇంకా ఎన్నెన్నో తెలుసుకోవాలి. నౌక వేగం, ఎటువైపుగా కదులుతున్నది, చుట్టూ వాతావరణం ఎలాగున్నది? గాలి ఎంత వేగంగా వీస్తున్నది, వేడిమి ఎంతగా ఉంది? అలాంటి సంగతులన్నింటితోబాటు, ఇంజన్‌ ఎలా పనిచేస్తున్నది, ఎంత స్పీడుగా తిరుగుతున్నది, వేడెక్కిస్తుందా? చల్లగానే ఉందా? లాంటి విషయాలు కూడా రెండవ రికార్డ్‌లో నమోదవుతాయి. చెప్పుకోవడానికి ఇవన్నీ సులభం గానే అనిపిస్తాయి. కానీ ఈ అంశాలన్నింటినీ తెలుసు కోవడానికి పడవ నలుమూలలా సెన్సర్స్‌ అమర్చాలి. కేబుల్స్‌ ద్వారా ఈ సమాచారాన్నంతా జంక్షన్‌ బాక్స్‌కు అందించాలి. అక్కడ సమాచారాన్ని ఒక క్రమంలో పెట్టి రికార్డర్‌కు అందజేయాలి. అప్పుడు గానీ పని అయినట్లు కాదు. విమానాల విషయంలో ఇలాంటి సమాచారం మహా అయితే ఇరవై నాలుగుగంటలపాటు రికార్డు చేస్తే చాలును! అంతకంటే ఎక్కువకాలం విమానం ఏకబిగిన ప్రయాణం చెయ్యదు మరి. అదే ఓడలయితే నెలల తరబడి సముద్రంమీదనే ఉంటాయి. కనుక కనీసం వారంరోజుల రికార్డింగునయినా చెరపకుండా
ఉండవలసి ఉంటుంది. దీనికోసం ఆధునాతన రికార్డింగ్‌ పరికరాలు, సదుపాయాలు అవసరం.
సరే! రికార్డింగు జరుగుతుంది. తప్పదు గనుక అప్పుడో ఇప్పుడో ప్రమాదమూ జరుగుతుంది. అప్పుడు ఈ నల్లపెట్టెను పట్టుకొనేదెట్లా? రెండు రికార్డరులనూ ఒక సిలిండర్‌లో పకడ్బందీగా అమర్చి ఉంచుతారు. ఈ సిలిండర్‌ మన ఆత్మలాగే ఆగ్నికి కాలదు, నీట నానదు, ఎటువంటి శక్తి వలననూ నాశనము చెందదు. అంతేకాదు. విపరీత పరిస్థితులలో తన చుట్టూ తాను ఒక ఛేంబర్‌ను ఏర్పాటు చేసుకుని, తేలియాడగలదు కూడా , ఇక ఈ అమరిక పడవ నుండి విడివడి, పనిచేసే దెప్పుడంటే, దానికీ లక్షణాలు, ఏర్పాట్లు చేశారు. నౌకలో అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి. వేడిమి కొంత లిమిట్‌ దాటగానే బ్లాక్‌ బాక్స్‌ 'ఆక్టివేట్‌' అయ్యి నీటిలోకి చేరుకుంటుంది. అయితే పడవలు అస్తమానం అగ్ని ప్రమాదానికి గురికావు. నీట మునుగుతుంటాయి కూడా. అలా మునుగుతున్న ప్పుడు, బ్లాక్‌ బాక్స్‌ మీద నీటి వత్తిడి పెరుగు తుంటుంది. ఈ ఒత్తిడి ఒక స్థాయిని మించినా పరిక రాలు 'ఆక్టివేట్‌' అవుతాయి. ఇలాంటి పరిస్థితిలో సిలిండర్‌ తనను తాను రక్షించుకుని సముద్రంలోకి చేరుతుంది. నీటిలోకి చేరగానే బ్లాక్‌ బాక్స్‌లోని ట్రాన్స్‌పాండర్‌ పనిచేయడం మొదలవుతుంది. అది నిరంతరం పంపే రేడియో సంకేతాలను అంతరిక్షంలో నిలిచి ఉన్న ఉపగ్రహాలు గుర్తిస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా, ప్రమాదంలో చిక్కుకున్న నౌకల నుండి వచ్చే సంకేతాలను అందుకోవడానికి, చేతనయితే సకాలంలో సహాయం అందజేయడానికి ఉపకరించే ఉపగ్రహాలను, ప్రయోగించాలని కూడా ఇటీవలే నిర్ణయాలు జరిగినాయి. సముద్రం బ్లాక్‌ బాక్స్‌ కూడా ఇంకా పరిశోధనలోనే ఉంది.కానీ, రక్షణ యొక్క అవసరం దృష్ట్యా, త్వరలోనే నౌకా పరిశ్రమల వారు దీని ఉపయోగాన్ని చేపట్టడం మంచిదని, వాయిస్‌ రిజిస్టర్‌ షిప్పింగ్‌ కంపెనీలో పరిశోధన బృందం నాయకులు డాక్టర్‌ గుడ్‌మన్‌ అంటున్నారు. సునిశితమయిన రికార్డింగు పరికరాలు, ఉపగ్రహ వ్యవస్థ అనే రెండు అధునాతన అంశాల వల్ల ముందు ముందు నౌకా ప్రమాదాలను తప్పించవచ్చు తగ్గించవచ్చు అని గుడ్‌మన్‌ అభిప్రాయం.
సైన్స్‌ను పదుగురి సాయంకోసం వాడుకోవాలని అభిప్రాయపడే గుడ్‌మన్‌ పేరుకేగాదు, నిజంగానే మంచి మనిషి. ప్రపంచమంతటా మరి శాస్త్రవేత్తలంతా ఇలాంటి మంచి మనుషులే కావాలి.

0 comments:

Post a Comment