Tuesday

ఐసీయూలో 108,104 సేవలు



GVK EMRI Ambulance



ప్రజారోగ్యంపై సర్కార్‌ నిర్లక్ష్యం రోజురోజుకూ ఎక్కువైపోతోంది. ఆపత్కాలంలో ఆదుకొనే 108, గ్రామాల్లో తిరిగే 104 వాహనాలపై సవతితల్లి ప్రేమ చూపిస్తోంది. నిధుల విడుదలలో జాప్యం వాహనాలను షెడ్లకే పరిమితం చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో కుయ్‌...కుయ్‌ మంటూ వచ్చి ప్రజల ప్రాణాలను రక్షించే 108 వాహనాలు, గ్రామాల్లో ఉచిత వైద్యసేవలందించే 104 సర్వీసులు మూగబోతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం... నిర్వాహకుల లాభాపేక్ష... వెరసి... ప్రజారోగ్యాన్ని గాలికొదిలేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 475 వరకూ ఉన్న 104 వాహనాలు కొంతకాలంగా రోడ్డెక్కడం లేదు.

సమస్యలు పరిష్కరించాలంటూ సిబ్బంది సమ్మెకు దిగారు. 20 రోజులు ఆందోళనబాట పట్టినా.... ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సిబ్బంది సమ్మెతో గ్రామీణ ప్రజలకు వైద్యపరీక్షలు, మందుల సరఫరా నిలిచిపోయింది.ఇటు 108 వాహనాల పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 802 వాహనాల్లో కేవలం 500 వాహనాలు మాత్రమే రన్నింగ్‌లో ఉన్నాయి. మిగిలిన వాహనాలు వివిధ రిపేర్లతో షెడ్లలో మూలుగుతున్నాయి.

ప్రభుత్వం నిధులు విడుదల చేసేవరకూ వాహనాలను పూర్తిస్థాయిలో నడపలేమంటున్నారు నిర్వాహక జీవీకే ప్రతినిధులు. యాజమాన్య వైఖరిని నిరసిస్తూ... డిసెంబర్‌ 15 నుంచి మరోసారి సమ్మెకు వెళ్లే యోచనలో ఉద్యోగులు ఉన్నారు. అదే గనుక జరిగితే 108 వాహనాలు ఆగిపోయే ప్రమాదం ఉంది. ప్రజలు రోగాలతో సతమతమవుతున్న సమయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికైనా సర్కార్‌ ప్రజారోగ్యం పరిరక్షణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

0 comments:

Post a Comment