అత్యంత సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి స్వయంకృషితో దేశాధ్యక్ష స్ధాయికి ఎదగగలడన్నదానికి ప్రత్యక్ష నిదర్శనంగా, 21వ శతాబ్దికి చెందిన భారతదేశ యువతరానికి అత్యంత ఆదర్శనీయమైన మహత్తరవ్యక్తిగా ప్రజల మనసుల్లో స్ధానం సంపాదించారు. డా|| ఎ.పి.జె.అబ్దుల్ కలామ్.
తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం సమీపంలో ధనుష్కోటిలో 1931వ సంవత్సరంలో ఒక సాధారణ ముస్లిం కుటుంబంలో అబ్దుల్‌కలామ్‌గారు జన్మించారు. అబ్దుల్ కలామ్‌గారి తండ్రి పడవ నడుపుకునే వ్యక్తి. ప్రాధమిక స్ధాయి వరకే కలామ్‌కు చదువు చెప్పించగలిగారు. తరువాత అబ్దుల్ కలామ్‌గారు తన స్వయంకృషితోనే విద్యాభ్యాసం సాగించారు. పేపర్ బాయ్‌గా కూడా పని చేశారు.
పేపర్ బాయ్‌గా పనిచేసే సమయంలో వివిధ పత్రికల్లో వచ్చే యుద్ధ విమానాలు, క్షిపణుల బొమ్మలను చూసి, తాను ఏనాటికైనా విమానాన్ని నడపాలని, పైలెట్‌గా అవ్వాలని కలలుగన్నారు. తండ్రిలోని ఆధ్యాత్మికత, రామేశ్వరంలోని ప్రశాంత వాతావరణం, వివిధవర్గాల మధ్య సామరస్యం అబ్దుల్ కలామ్‌పై గాఢమైన ప్రభావం చూపాయి.
ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తయింతర్వాత మద్రాస్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్‌లో ఇంజనీరింగ్‌లో సీటు రావడంతో అక్కడ చేరారు. ఆ సమయంలో ఖర్చులకోసం, కలామ్‌గారి అక్కయ్య బంగారు గాజులు అమ్మి డబ్బులు యివ్వవలసివచ్చింది. అటువంటిస్ధితి నుండి, స్వయంకృషితో తరువాతికాలంలో అనేక అత్యున్నత శిఖరాలు అధిరోహించారు. ‘మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ లో ఇంజనీరింగ్ పూర్తయింతర్వాత DRDO (Deffence Research and Develoment Organisation) లో చేరడం ద్వారా (1958వ సంవత్సరం) కలామ్‌గారు తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తరువాత 1963వ సంవత్సరంలో ISRO (Indian Space Research Organisation) లో చేరారు. అప్పటి నుండి అనేక ప్రయోగాల్లో పాలుపంచుకున్నారు అబ్దుల్ కలామ్‌గారు.
ఒక్కొక్కసారి నిద్రాహారాలు మాని పరిశోధనలోనే మునిగిపోయేవారు. మిగతా సహచరులందరూ రాత్రి యిళ్ళకు పోయినప్పటికీ, అబ్దుల్ కలామ్‌గారు. మాత్రం అక్కడే పరిశోధనా కార్యక్రమాలలో ఒక్కడే మునిగిపోయేవారు. ఆ సమయంలో వారు ఎంతో కష్టపడి రూపొందించిన ప్రాజెక్టు ఒకటి విఫలమైంది. దాంతో కలామ్‌గారు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కానీ, త్వరలోనే ఆ నిరాశనుండి బయటపడి, క్షిపణుల తయారీవైపు దృష్టి సారించారు.
1981వ సంవత్సరంలో భారతదేశం ప్రయోగించిన 35 కే.జీ.ల బరువు గల రోహిణి ఉపగ్రహం ప్రయోగం విజయవంతం కావడంలో డా|| అబ్దుల్‌కలామ్‌గారు కూడా తనవంతు పాత్రను సమర్ధవంతంగా నిర్వహించారు. ఇక తరువాతంతా చరిత్ర. అబ్దుల్ కలామ్‌గారు తరువాతికాలంలో క్షిపణుల రంగంలో సాధించిన విజయాలు ఆయన పేరును ప్రపంచవ్యాప్తం చేశాయి. భారతదేశాన్ని శత్రుభీకరంగా తీర్చిదిద్దడానికి, తద్వారా తనకలను నిజం చేసుకున్నారు. ‘భారతదేశ క్షిపణి కార్యక్రమ పిత’ గా పేరొందారు కలామ్‌గారు.
19 సం||లపాటు ISRO లో పనిచేసిన తరువాత, 1982వ సంవత్సరంలో మళ్ళీ DRDO లోకి అబ్దుల్‌కలామ్ తిరిగివచ్చారు. అక్కడ డా|| రాజారామన్నగారి ప్రోత్సాహంతో “Integrated Guided Missle Development Programme” ని అబ్దుల్ కలామ్ చేపట్టారు. భారతదేశాన్ని శత్రుభీకరంగా తయారు చేయాలన్న ఆశయం అబ్దుల్‌కలామ్‌ను ముందుకు నడిపింది.
‘పృధ్వి’, ‘అగ్ని’ లాంటి క్షిపణులు తయారు చేయడం ద్వారా భారత రక్షణరంగాన్ని అత్యుత్తమస్ధాయికి ఎదిగేలా తీర్చిదిద్దారు. ఏ పని చేపట్టినా పూర్తయేంతవరకూ నిబద్దతతో పనిచేసే తీరు, నిజాయితీ, నిస్వార్ధపరత్వం. అబ్దుల్‌కలామ్ గారిని యువతకు ఆదర్శనీయమైన వ్యక్తిగా తీర్చిదిద్దారు. 1999వ సంవత్సరంలో ‘పోఖ్రాన్’ అణుపరీక్షలు అబ్దుల్‌కలామ్‌గారి ఆధ్వర్యంలో విజయవంతమై సంచలనం సృష్టించాయి. దాంతో దేశంలో కలామ్‌గారి పేరుప్రఖ్యాతులు పెరిగాయి.
శాస్త్రజ్ఞునిగా, సాంకేతికరంగ నిపుణునిగానే కాక, రచయితగా, దార్శనికునిగా కూడా అబ్దుల్‌కలామ్ విశిష్ట ప్రతిభకనబరిచారు. దాదాపు 50 మందికి పైగా శాస్త్రజ్ఞులు, దార్శనికుల సమవేశం ఏర్పాటుచేసి భారతదేశ భవిష్యత్ కార్యక్రమ ప్రణాళికపై అందరి సూచనలు, సలహాలతో రూపొందించిన ‘విజయం – 2020 ‘ పలువురి ప్రశంసలందుకుంది. అబ్దుల్ కలామ్ ఆత్మకధ ‘ Wings of Fire ‘ (తెలుగులో ‘ఒక విజేత ఆత్మకధ’ గా అనువదించబడింది.) మరియు “Ignited Minds” ( ‘నాదేశ యువజనులారా’ పేరుతో తెలుగులో అనువదించబడింది) పుస్తకాలు బెస్ట్‌సెల్లర్స్‌గా రికార్డులు సృష్టించాయి.
అబ్దుల్‌కలామ్‌గారు తన పదవికి రాజీనామాచేసి, మద్రాస్ IIT కాలేజ్‌లో అధ్యాపకునిగా చేరారు. కానీ, 2002వ సంవత్సరంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఆయనను రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించింది. ఎన్నికలు నామమాత్రంగా జరిగి అబ్దుల్‌కలామ్‌గారు రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేశారు. తొలిసారిగా ఒక శాస్త్రవేత్త భారతదేశ ప్రధమ పౌరునిగా ఎన్నికవడం అబ్దుల్‌కలామ్‌కు లభించిన విశిష్ట గౌరవం. నాటినుండి రాజకీయాలకు అతీతంగా రాష్ట్రపతి పదవికి విలువతెచ్చే విధంగా అబ్దుల్ కలామ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ, కలామ్‌ముందు ఇంకా చాలా ఆశయాలున్నాయి, నిజం చేసుకోవాల్సిన కలలున్నాయి. ఆయన మాటల్లోనే చెప్పాలంటే . . .
ఆదరంగా, సాహసంగా, సత్యంగా, క్షణం, క్షణం… సుదీర్ఘ దినాంత వేళదాకా పనిచేసిన హస్తాలే బహు సుందరాలు.
0 comments:
Post a Comment