Monday

INTERNATIONAL NEWS»  పశ్చిమ కనుమలకు మరో కిరీటం ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు జర్మనీలోని ఓపెరా హౌస్, పోర్చుగల్ పట్టణం, సహారా సరస్సులకూ గుర్తింపు యునెస్కో ప్రకటన


నదీ నదాలు, కొండకోనలు, పచ్చదనపు అందాలు, జలపాతాల గలగలలు... ఒక్కముక్కలో చెప్పాలంటే ఇది జీవ వైవిధ్యానికి పట్టుగొమ్మ! ప్రకృతి సౌందర్య సీమ! ఇన్ని అందాల పశ్చిమ కనుమలకు (వెస్ట్రన్ ఘాట్స్) ఘనమైన గుర్తింపు లభించింది. 1600 కిలోమీటర్ల పొడవు, 1.60 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించిన పశ్చిమ కనుమలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిసూ ఐక్యరాజ్యసమితి నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర-గుజరాత్ సరిహద్దుల్లో మొదలై... మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ మీదుగా సాగి... తమిళనాడులోని కన్యాకుమారి వరకు వ్యాపించిన పచ్చటి పశ్చిమ కనుమలకు ఐరాస ఇలా ప్రత్యేక స్థానాన్ని ఇచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశిష్టమైన ఎనిమిది జీవ వైవిధ్య కేంద్రాల్లో పశ్చిమ కనుమలు ఒకటి. ఈ కనుమల్లోని పర్వతాలు హిమాలయాలకంటే పురాతనమైనవి. భారతదేశంలో రుతుపవనాల గమనం, వర్షపాతంపై పశ్చిమ కనుమల ప్రభావం ఎనలేనిది. వీటన్నింటి నేపథ్యంలోనే ఐరాస విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) పశ్చిమ కనుమలకు ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకోంది. దీంతోపాటు... జర్మనీలోని చారిత్రక ఓపెరా హౌస్‌ను, పోర్చుగల్‌లో కోటగోడల మధ్య వెలిసిన ఎల్వాస్ నగరాన్ని, సహారా ఎడారిలో ఒకదానితో ఒకటి అనుసంధానమైన 18 సరస్సులను కూడా యునెస్కో అంతర్జాతీయ వారసత్వ సంపదలుగా గుర్తిస్తూ తమ నిర్ణయం ప్రకటించింది. యునెస్కో ప్రత్యేక కమిటీ ఏడాదికి ఒకసారి సమావేశమై ఈ జాబితాలో కొత్త ప్రాంతాలను చేర్చుతుంటుంది.

'పశ్చిమ' ప్రత్యేకత ఇది...
భారత దేశంలోని 40 శాతం నదీ నదాల ప్రవాహాలకు పశ్చిమ కనుమలే మూలం. కోట్లాదిమందికి జీవాధారమైన గోదావరి, కృష్ణా, కావేరీ నదులతోపాటు వాటి ఉప నదులు అనేకం పశ్చిమ కనుమల్లోనే జీవం పోసుకున్నాయి. పశ్చిమ కనుమల్లోని పర్వతాల సగటు ఎత్తు 3900 అడుగులు. రుతు పవనాలను పట్టి నిలిపి... దక్కన్ పీఠభూమిలో వర్షం కురిపించడంలో వీటి పాత్ర ఎంతో కీలకం. పశ్చిమ కనుమలు జీవ వైవిధ్యానికి నిలయం. ఇక్కడ ఐదువేలకుపైగా పూల మొక్కల జాతులున్నాయి.

139 క్షీరదాలు, 508 రకాల పక్షులు, 179 రకాల ఉభయ చరాలకు పశ్చిమ కనుమలు ఆశ్రయాన్ని ఇస్తున్నాయి. ఇప్పటికీ గుర్తించని అనేక జీవ, జంతు జాతులు అనేకం ఇక్కడ ఉన్నాయి. అంతర్జాతీయంగా అంతరించిపోయే ప్రమాదమున్న 325 జాతులకు పశ్చిమ కనుమలు రక్షణ ఇస్తున్నాయి. గుజరాత్-మహారాష్ట్ర సరిహద్దుల్లోని సాత్పూరా శ్రేణులతో పశ్చిమ కనుమలు ప్రారంభమవుతాయి.

సహ్యాద్రి, నీలగిరి, అనైమలై హిల్స్ వంటి ప్రధాన పర్వత శ్రేణులన్నీ ఈ కనుమలలో భాగమే. ప్రముఖ వేసవి విడుదులు లోనావాలా-ఖండాలా, మహాబలేశ్వర్, ఖుద్రేముఖ్, కొడగు, ఊటీ, కొడైకెనాల్ వంటివన్నీ పశ్చిమ కనుమలు మనకు ఇచ్చిన కానుకలు. దక్షిణ భారతంలో అత్యంత ఎత్తైన 'దొడ్డ బెట్ట' (ఊటీ సమీపంలో ఉంటుంది) కూడా పశ్చిమ కనుమలలోనిదే. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన జోగ్ జలపాతం (కర్ణాటక) కూడా ఇక్కడిదే. భారత ప్రభుత్వం పశ్చిమ కనుమలలో 2 జీవావరణ (బయోస్పియర్) కేంద్రాలను, 12 జాతీయ వన్యప్రాణి సంరక్షణ పార్కులను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాల్లో మనుషులు అడుగుపెట్టడాన్ని నిషేధించింది. బందీపూర, నుంగు, వేనాడు, మదుమలై, ముకుర్తి, పొన్ముడి వంటి నేషనల్ పార్కులన్నీ పశ్చిమ కనుమలలోనివే కావడం విశేషం.

18 వ శతాబ్దం నాటా 'ఓపెరా'
ప్రపంచ వారసత్వ సంపదలో చోటు సంపాదించిన జర్మనీలోని బేర్యూత్ పట్టణంలోని 'మార్‌గ్రావియల్ ఓపెరా హౌస్'కు శతాబ్దాల చరిత్ర ఉంది. దీనిని 18వ శతాబ్దంలో బారోక్ తరహా నిర్మాణ శైలిలో నిర్మించారు. ఒకేసారి 500 మంది సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించేలా దీనిని నిర్మించారు. కట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇది చెక్కు చెదరకుండా ఉంది. ఇన్ని ప్రత్యేకతల నేపథ్యంలోనే దీనిని యునెస్కో గుర్తించింది.

ఎడారిలో జల బంధం అది సహారా ఎడారి! ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి. ఈ ఎడారిలో వెలిసిన 'ఔనియాంగా సరస్సు'లకు ఇప్పుడు ఐరాస గుర్తింపు లభించింది. చాద్ పరిధిలో ఉన్న ఈ 18 సరస్సులు ఒకదానితో మరొకటికి అనుసంధానంగా ఉన్నాయి. వీటి మొత్తం విస్తీర్ణం 62,808 హెక్టార్లు. క్షార, మంచి నీటితో కూడిన ఈ సరస్సు పరిధిలో అనేక రకాల జీవ, సూక్ష్మ జంతు జాతులు ఆశ్రయం పొందుతున్నాయి.

నగరం చుట్టూ కోట పోర్చుగల్ సరిహద్దు పట్టణమైన ఎల్వాస్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ 10వ శతాబ్దానికి ముందు నాటి కట్టడాలు కూడా ఉన్నాయి. పోర్చుగల్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత (1640)లో ఎల్వాస్ చుట్టూ రక్షణ కుడ్యాలు నిర్మించడం ప్రారంభించారు. 19వ శతాబ్దందాకా ఈ పనులు జరుగుతూనే ఉన్నాయి. రక్షణ కుడ్యాల మధ్య ఉన్న అత్యంత విశాలమైన ప్రాంతంగా ఎల్వాస్ ఖ్యాతి గడించింది. ఈ కోట గోడల మధ్యే సైనిక శిబిరాలు, చర్చిలు, సన్యాసాశ్రమాలు ఉన్నాయి.

0 comments:

Post a Comment