Sunday

ప్రమాదంలో పెన్షన్‌...!

   పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలో విదేశీ పెత్తనం
1ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే జీవితాంతం ప్రశాంతంగా కనీస మొత్తాన్ని పెన్షనుగా పొందుతూ జీవనాన్ని గడపవచ్చన్న ప్రజల కోర్కెలు 1.1.2004నుండి కల్లలయ్యాయి.
అప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగి పదవీవిరమణ చేసే ఉన్న వేతనంలో 50% పెన్షనుగా ప్రభుత్వ ఖజానానుండి చెల్లించబడేది. అయితే ప్రభుత్వ వ్యయంలో పెన్షన్‌ చెల్లింపుల ఖర్చు విపరీతంగా పెరుగుతోందనీ, కనుక ఈ పెన్షను ఖర్చును తగ్గించుకోవాలనీ, ప్రభుత్వం తలపోసింది. ఆర్థిక సంస్కరణలలో భాగంగా ప్రపంచబ్యాంకు ఆదేశానుసారం పెన్షను చెల్లింపులను ప్రభుత్వంకాకుండా ఒక ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పి, దానిద్వారా చెల్లించాలని నిర్ణయించారు.
cపెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు
23.03.2003 నాటి ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో పెన్షను ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటైంది. 1882నాటి ట్రస్టుల చట్టంద్వారా పిఎఫ్‌ఆర్‌డిఎ ఒక ట్రస్టుగా ఏర్పాటైంది. పిఎఫ్‌ఆర్‌డిఎకు ఒక ఛైర్‌పర్సన్‌, ముగ్గురు పూర్తికాల సభ్యులు, ఇద్దరు తాత్కాలిక సభ్యులు వుంటారు. 10.10.2003న ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వుల ద్వారా పెన్షను విభాగాన్ని అజమాయిషీ చేసే బాధ్యతని పిఎఫ్‌ఆర్‌డిఎకి అప్పగించింది.
1.1.04 నుండి కేంద్రప్రభుత్వంలో నియమించబడిన ఉద్యోగులందరూ తమ తమ వేతనాలలో 10% పెన్షను కంట్రిబ్యూషన్‌గా చెల్లించాల్సివుంటుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వం సమకూర్చుతుంది. ఈ మొత్తాన్ని పిఎఫ్‌ఆర్‌డిఎతో నియమించబడే పెన్షను ఫండ్‌ మేనేజర్లు ప్రభుత్వ నిబంధనల మేరకు పెట్టుబడులు పెడతారు. ఈ మొత్తాలపై వచ్చే ఆదాయాన్ని ఉద్యోగి 60 సంవత్సరాలకు పదవీ విరమణ చేసిన తరువాత 60% తిరిగి చెల్లిస్తారు. మిగతా 40% ఉద్యోగి అకౌంట్‌లోనే ఉంటుంది. ఈ మొత్తాన్ని షేర్‌మార్కెట్లలో ఉంచి ఆ మొత్తాలపై వచ్చే ఆదాయాన్ని ఉద్యోగికి పెన్షనురూపంలో చెల్లిస్తారు. దీనినే 'న్యూ పెన్షను స్కీమ్‌'గా పిలుస్తారు.
ఈ పిఎఫ్‌ఆర్‌డిఎ పథకం మిలటరీ ఉద్యోగులకు తప్ప మిగతా అందరికీ అమలు చేస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, వామపక్ష ప్రభుత్వాల ప్రభావం ఉన్న కేరళ, వెస్ట్‌ బెంగాల్‌, త్రిపుర తప్ప అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నోటిఫికేషన్‌ తేదీనుండి ఆయా రాష్ట్రాలలో, ఆయా రాష్ట్ర ఉద్యోగులకు ఈ పథకం అమలులోకి వచ్చింది.
ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వుల ద్వారా అమలులోకి వచ్చిన ఈ పథకం అమలును ప్రభుత్వం ఆర్డినెన్సు జారీద్వారా చట్టబద్ధంచేసింది. ఆ తర్వాత పార్లమెంటులో 2005 బిల్లు ప్రవేశపెట్టబడి పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి నివేదించబడింది.
ఆంధ్రప్రదేశ్‌లో 22.9.04న పిఎఫ్‌ఆర్‌డిఎ అమలులోకి వచ్చింది. 1.9.2004 తరువాత రాష్ట్రప్రభుత్వం ద్వారా నియమించబడిన ఉద్యోగులకు పిఎఫ్‌ఆర్‌డిఎ వర్తిస్తుంది.
2005లో పిఎఫ్‌ఆర్‌డిఎ బిల్లు స్టాండింగ్‌ కమిటీకి పంపించబడటంతో, బిజెపి నాయకుడు శ్రీ యశ్వంత్‌సిన్హా నాయకత్వంలోని కమిటీ ఈ బిల్లుకి కొన్ని మార్పులను సూచించింది.
2005 బిల్లుకి, 2011 బిల్లుకి ప్రధాన తేడా ఏమిటి? స్టాండింగ్‌ కమిటీ సూచనల్ని ప్రభుత్వం ఏం చేసింది?
1.1.2004లో కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే న్యూ పెన్షను స్కీం అమలుచేశారు. అయితే, 1.5.2009న న్యూ పెన్షను స్కీంను పిఎఫ్‌ఆర్‌డిఎ 'నేషనల్‌ పెన్షను స్కీం'గా అమలుచేశారు. 1.1.2004లోని 'న్యూ పెన్షను స్కీం' కంపల్సరీకాగా, నేషనల్‌ పెన్షన్‌ స్కీం ఆప్షనల్‌. అంటే, 1.5.09 తరువాత దేశంలోని ఏ పౌరుడైనా నెలనెలా కంట్రిబ్యూషన్‌ చెల్లించడం ద్వారా పిఎఫ్‌ఆర్‌డిఎలో సభ్యుడై పెన్షను పొందవచ్చు. దేశంలోని అసంఘటిత కార్మికులకు వయసు మీరినపుడు ఆసరా కల్పించేందుకు ఈ పథకాన్ని అమలుచేసేందుకు ప్రభుత్వం ఉద్దేశించింది.
పిఎఫ్‌ఆర్‌డిఎ కమిటీలో గతంలో ఉద్యోగులు మరియు స్టేక్‌ హోల్డర్లకి ప్రాతినిధ్యం లేదు. ప్రస్తుత 2011 చట్టంలో ఉద్యోగులకి, స్టేక్‌ హోల్డర్లకు ప్రాతినిధ్యం ఉంటుంది.
ప్రస్తుత పిఎఫ్‌ఆర్‌డిఎ ఒక్క న్యూ పెన్షను స్కీంలో మాత్రమే రూల్సుచేసే అధికారం ఉండగా, కొత్త చట్టంలో అన్నిరకాల పెన్షను స్కీములపైనా రూల్సుచేసే అధికారం పిఎఫ్‌ఆర్‌డిఎకు ఉంటుంది. ప్రావిడెంటు ఫండు చట్టాన్ని సవరించే అధికారం కూడా పిఎఫ్‌ఆర్‌డిఎకు ఉంటుంది. 31.3.2011 నాటికి పిఎఫ్‌ఆర్‌డిఎలో 17 లక్షల సభ్యత్వాలు ఉన్నాయి. ఇందులో 43,000 తప్ప అన్నీ కంపల్సరీ అకౌంట్లే.
ర గతంలో ఏదైనా పెన్షను పథకం అమలులోకి రావాలంటే ఇన్‌కంటాక్సు డిపార్టుమెంటునుండి పర్మిషన్‌ తీసుకోవాల్సి వుండేది. కానీ ప్రస్తుత బిల్లులో దీన్ని రద్దుచేశారు.
60 సంవత్సరాలు వచ్చేసరికి అకౌంట్‌ హోల్డరుకు గరిష్టంగా 60% మాత్రమే తిరిగి చెల్లిస్తారు. అకౌంట్‌ హోల్డరు ఖచ్ఛితంగా 40% తిరిగి తీసుకోవాల్సి వుంటుంది.
పెట్టుబడులు ఏయే రంగాలలో పెట్టాలో ఆయా ఫండ్‌ మేనేజర్లు ఆయా అకౌంట్ల యజమానుల అభీష్టంమేరకు పెట్టుబడులు పెడతారు. పెన్షను ఫండ్‌ మేనేజర్లుగా, ఎల్‌ఐసి, ఎస్‌బిఐ, యుటిఐ, ఐడిఎఫ్‌సి, ఐసిఐసిఐ, కొడక్‌ మహీంద్రా మరియు రిలయన్సు ఎన్నిక కాబడ్డాయి.
పెన్షను గ్యారెంటీ- సామాజిక భద్రత
పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ పిఎఫ్‌ఆర్‌డిఎ బిల్లు 2011లో కనీస పెన్షను గ్యారెంటీ ఉండాలనీ, పెన్షను అకౌంట్‌నుండి ముందే కొంత మొత్తాన్ని 'విత్‌డ్రా' చేసుకునే సౌలభ్యం కల్పించాలనీ సూచించింది. ఈ రెండు సూచనల్నీ ప్రభుత్వం తిరస్కరించింది. ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌లో కనీసం 8.5% వడ్డీ గత నాలుగు సంవత్సరాలనుండీ చెల్లిస్తున్నారు. షేర్‌మార్కెట్లో పెట్టుబడి పెట్టినపుడు కనీసం ఈ వడ్డీరేటు మేరకు రిటర్న్స్‌ రాకపోతే ప్రభుత్వం ఈ భారాన్ని మోయాల్సి వస్తుందనీ, కనుకనే మినిమం గ్యారెంటీ పెన్షను అన్ని సూచనల్ని అంగీకరించలేమనీ ప్రభుత్వం పేర్కొంటోంది.
అమెరికాలో కూడా 75% గ్యారెంటీ పెన్షను, మిగతా 25% షేర్‌మార్కెట్‌ ఆదాయాలపై ఆధారపడ్డ పెన్షను వుంది. అయితే ఇది సోషల్‌ సెక్యూరిటీ టాక్స్‌ ద్వారా ఉద్యోగుల జీతాలలో రికవరీ చేసిన మొత్తాలలో ఇస్తారు.
ఈ దేశంలో 46 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. వారందరికీ పెన్షను రూపంలో సామాజిక భద్రత లేదు. ఈ పిఎఫ్‌ఆర్‌డిఎ బిల్లు ద్వారా అసంఘటిత కార్మికులందరికీ భద్రత కల్పిస్తున్నామనీ ప్రభుత్వం పేర్కొంటోంది. ఇది నిజమా? అసంఘటిత కార్మికులలో అనేకమంది ఉద్యోగాలు మారుతుంటారు. వీరికోసం 'స్వావలంబన' పేరుతో ఏర్పాటయ్యే పెన్షన్‌ ఫండ్‌లో పెన్షను అకౌంటుదారుడు, పెన్షను చెల్లించకుండా వుంటే ఏం చేయాలి అన్న అంశంలేదు. అలాగే క్లాజు 20(3)(జి) ప్రకారం ట్రేడ్‌ యూనియన్లు పెట్టుబడులు ఎక్కడ వుండాలో చెప్పడానికి వీలులేదు. 46 కోట్ల మంది అసంఘటిత కార్మికుల డబ్బుతో షేర్‌మార్కెట్లకు నిరంతరం ధనం అందడంకోసం ప్రభుత్వం చేస్తున్న కుట్రగానే ఈ పిఎఫ్‌ఆర్‌డిఎ బిల్లుని భావించాలి.
షేర్‌ మార్కెట్లలో పెట్టుబడులవల్ల నష్టాలు వచ్చి, కనీసం 8.5% వడ్డీ అన్నా ఇవ్వలేని పక్షంలో ప్రభుత్వంపై భారమవుతుందని వాదిస్తున్న ప్రభుత్వం, నెలకి సగటున 2000/- కూడా వేతనం లేని కార్మికుడు తినీ, తినక దాచుకున్న డబ్బుపై తగిన విలువ వస్తుందో రాదో అన్న అనుమానంతో కార్మికుడు సామాజిక భద్రతని ఎలా ఫీలవుతాడు?
పిఎఫ్‌ఆర్‌డిఎ లో 26% ఫారిన్‌ డిజిన్వెస్ట్‌మెంటుకు అనుమతి
2008 నాటి ఆర్థికసంక్షోభంలో అతలాకుతలమైన అమెరికా, ఇతర యూరోపియన్‌ దేశాలలో బ్యాంకులు దివాళా తీయడంతో పెన్షను ఫండు పథకాలన్నీ గాలిలో కలిసిపోయాయి. అనేకమంది సగటు మానవులు రోడ్డునపడ్డారు. అయినా సరే కళ్లు తెరవని ప్రభుత్వాలు విదేశీ పెన్షను ఫండు మదుపరులను సంతృప్తి పరచడంకోసం పిఎఫ్‌ఆర్‌డిఎలో 20% ఎఫ్‌డిఐని అనుమతిస్తూ మార్పులుచేస్తోంది. పైగా ఈ ఎఫ్‌డిఐ అనుమతిని బిల్లురూపంలో కాకుండా ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వుల రూపంలో ఇవ్వజూస్తోంది. తద్వారా రాబోయే రోజులలో మరింతగా పెన్షను పథకాలను విదేశీ మదుపరులకు అప్పగించచూస్తోంది. ఇన్యూరెన్సు రంగంలో 26% ఎఫ్‌డిఐని మరింతగా పెంచాలన్న అంశం పార్లమెంటరీ స్థాయీసంఘం దగ్గర ఉండగా, ఇన్యూరెన్సు, పెన్షను రంగాలలో మరింతగా ఎఫ్‌డిఐ అనుమతించాలనీ, దానికి పార్లమెంటుకు చట్టాలద్వారా కాకుండా, తన ఇష్టారాజ్యంగా వ్యవహరింపజూస్తోంది.
విదేశాలలో పెన్షను ఫండ్స్‌ ఎలా ఉన్నాయి?
అర్జెంటైనా, బ్రెజిల్‌, చిలీ, కొలంబియా,
పెరూ, ఉరుగ్వే, పోలెండ్‌, ఉజ్బెకిస్తాన్‌ లాంటి దేశాలలో పెన్షను ఫండ్‌ పథకాలు అమలవుతున్నా ఆయా దేశాలన్నీ పెన్షను కనీస చెల్లింపు విధానాలనే అమలుచేస్తున్నాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఆర్థికసంక్షోభాలు చుట్టుముడుతున్న కారణంగా పెన్షను ఫండుపై మదుపరులకు వచ్చే ఆదాయాలు ఒకటి, రెండు దేశాలలో మినహా ఎక్కడా ఆశాజనకంగా లేవు.
ఇంకా ఇందులోని లోపాలేమిటి?
పెన్షను ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరించేవారు, పెన్షను ఫండ్‌ అకౌంట్‌దారుల లాభంకోసమే పని చేస్తారనే గ్యారెంటీ లేదు. వాణిజ్యపరంగా లాభాల దృక్పథంతో నడిచే ఈ పెన్షను ఫండ్‌ మేనేజర్లు షేరుమార్కెట్లు పతనమైనపుడు కాయకష్టంతో దాచుకున్న డబ్బుపై కనీస గ్యారెంటీ లేకపోతే 60 సంవత్సరాల వయసులో మదుపరి జీవితాన్ని ఎలా గడపాలి? పిఎఫ్‌ఆర్‌డిఎ సర్‌ప్లస్‌ ఫండ్‌ని కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లో జమచేయాలని 2005నాటి పిఎఫ్‌ఆర్‌డిఎలో వుంది. కానీ ఇప్పటివరకూ జమచేయలేదు. అత్యవసర పరిస్థితులలో మదుపరి ఫండ్‌నుండి డబ్బులు విత్‌డ్రా చేసుకునే సౌలభ్యం కల్పించాలన్న పార్లమెంటరీ స్థాయీసంఘం సిఫార్సును కూడా ప్రభుత్వం అంగీకరించలేదు.
విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకు, అప్పనంగా స్టాక్‌మార్కెట్లకు నెలనెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడిగా సమకూర్చే కుట్రలో భాగంగా 46 కోట్లమంది సామాన్య అసంఘటిత కార్మికుల పొట్టకొట్టడమే ఈ బిల్లు లక్ష్యం.
ఏ పెన్షను పథకాన్నైనా మార్చే అధికారాన్ని పిఎఫ్‌ఆర్‌డిఎకు కట్టబెట్టడం ద్వారా పెన్షను చెల్లింపు బాధ్యతనుండి సంపూర్ణంగా తప్పుకోవాలన్న ప్రభుత్వ దురాలోచనే పిఎఫ్‌ఆర్‌డిఎ బిల్లు అసలు రూపం.
దేశంలోని అన్ని కార్మికసంఘాల మద్దతుతో 25 నవంబరు, 2011న లక్షలాదిమందితో పార్లమెంటు మార్చ్‌ను మద్దతు పలకండి. సామాజిక భద్రత కల్పన ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేద్దాం. అందుకోసం మరో పోరాటానికి సంఘటితంగా సిద్ధమవుదాం.

0 comments:

Post a Comment