Sunday

ఆర్థోపెడిక్ సమస్యలకు ఆధునిక చికిత్సలు ఓ వరం

మోకాలు, భుజం, మోచేయి, మడమ, మణికట్టు, తుంటి సమస్యలకు అత్యంత అధునాతన వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఆర్థ్రోస్కోపి సాయంతో చేసే మినిమల్ యాక్సెస్ సర్జరీ, ఇతర రకాల చికిత్సలతో ఆర్థోపెడిక్ సమస్యల నుంచి సత్వరం బయటపడే అవకాశం ఏర్పడింది. కీళ్లలో ఉండే కార్టిలేజ్‌ను పునరుత్పత్తి చేయటం ద్వారా కీళ్లనొప్పిని తగ్గించవచ్చు. కీళ్లభుజం నొప్పి సమస్యకు ఎలాంటి శస్త్రచికిత్స చేయకుండానే హైడ్రోడిలేటేషన్ టెక్నిక్‌తో కేవలం ఒక్క ఇంజక్షన్‌తో నయం చేయవచ్చు. ఇలాంటి మరెన్నో అత్యాధునిక వైద్య విధానాలను వివరిస్తున్నారు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బి.నితిన్‌కుమార్ .

ఆర్థోపిడిక్ సమస్యలు మనిషిని అచేతనం చేస్తాయి. ఆస్పత్రికి వెళ్లడం, సర్జరీ అంటే భయంతో సమస్యను మరింత తీవ్రం చేసుకునే వారు కోకొల్లలు. ఆర్థోపెడిక్ సమస్యల నుంచి తాజాగా వచ్చిన ఆధునిక చికిత్సలతో సత్వరం కోలుకునే అవకాశాలున్నాయి. ఆర్థోపెడిక్ సమస్యలకు ఆర్థ్రోస్కోపి సాయంతో చేసే మినిమల్లీ యాక్సెస్ సర్జరీ అందుబాటులోకి వచ్చింది. మోకాలు లేదా మోచేతి లోపలకు చిన్న ట్యూబ్ లాంటి పరికరం ఆర్థ్రోస్కోపిని పంపించి, లోపల ఉన్న కీళ్లను వీడియో కెమెరా సాయంతో టెలివిజన్ మానిటర్‌పై చూస్తూ శస్త్రచికిత్స చేస్తారు.

ఎక్స్‌రే, ఎంఆర్ఐ స్కానింగ్‌లో కూడా కనిపించని చిన్న గాయాన్ని కూడా ఆర్థ్రోస్కోపి సాయంతో చూస్తూ శస్త్రచికిత్స చేయవచ్చు. ఈ పద్ధతిలో శస్త్రచికిత్స చేయించుకున్న రోగుల్లో ఎక్కువమందిని ఆపరేషన్ చేసిన రోజే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయవచ్చు. ఈ పద్ధతిలో చేసే శస్త్రచికిత్సలో గాయాలకు కుట్లు కూడా వేయాల్సిన పని ఉండదు.

అందువల్ల రోగి త్వరగా కోలుకుంటాడు. మోకాలు, భుజం, మడమ, మోచేయి, మణికట్టు సమస్యలకు ఆర్థ్రోస్కోపిక్ మినిమల్లీ యాక్సెస్ సర్జరీ చేయవచ్చు. ఈ సర్జరీ చేయించుకున్న వారికి ఆపరేషన్ మచ్చ కూడా ఉండదు. ఈ పద్ధతిలో మోకాలిలోని లిగమెంట్లను కూడా రిపేరు చేయవచ్చు. తక్కువ వయసులో వచ్చే మోకాలి నొప్పి సమస్యలకు కూడా ఈ సర్జరీ మేలు. మోకాలిలో వదులుగా ఉన్న ఎముకలను సరిచేయవచ్చు.

చిన్న వయసులోనే ఆర్థరైటిస్ చిన్న వయసులో వచ్చే ఆర్థరైటీస్ సమస్యలకు కీళ్లమార్పిడి శస్త్రచికిత్స లేకుండా చికిత్స చేయవచ్చు. 60 ఏళ్లలోపు వయసు వారిలో వచ్చే కీళ్లనొప్పుల సమస్యకు పలు రకాల చికిత్సా పద్ధతులున్నాయి. మొత్తం కీలు మార్పిడి ఆపరేషన్ లేకుండానే ఇంజక్షన్‌లు, ఆర్థ్రోస్కోపి, మైనర్ సర్జికల్ విధానాలతో చికిత్స చేయవచ్చు. 60 ఏళ్ల వయసున్న వారిలో కొందరికి మోకాలికి ఒకవైపు మాత్రమే నొప్పి వస్తుంది. అలాంటపుడు మోకాలిలో పాక్షికంగా కీలు మార్పిడి చేయవచ్చు.

దీనివల్ల రోగి త్వరగా కోలుకోవచ్చు. కొంతమందికి మోకాలిలో ఉన్న ఎముకలు వదులుగా మారి తీవ్రనొప్పి వస్తుంటుంది. అలాంటపుడు కీళ్ల మార్పిడి చేయకుండా కేవలం చికిత్సతో కోలుకునేలా చేస్తారు. నీ రిలైన్‌మెంట్ విధానంలో చేసిన చికిత్సతో కీళ్లనొప్పిని నయం చేయవచ్చు. మోకాలి నొప్పి సమస్య తీవ్రంగా ఉన్నపుడు మాత్రమే కీళ్లమార్పిడి శస్త్రచికిత్స అవసరం. కీళ్లమార్పిడితో మోకాలి నొప్పి సమస్య పూర్తిగా తగ్గిపోయి రోగి కొత్త జీవితాన్ని ఆరంభించవచ్చు. అత్యంత అధునాతన పద్థతుల్లో శస్త్ర చికిత్స చేస్తాం కాబట్టి కీళ్లమార్పిడి ఆపరేషన్ చేయించుకున్న రోగి ఆ మరునాటి నుంచే నడవవచ్చు. రోగిని నాలుగు రోజులకే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారు.

కార్టిలేజ్ పునరుత్పత్తి సాధ్యమే కొందరు రోగుల్లో కొత్త విధానంతో కార్టిలేజ్ పునరుత్పత్తి సాధ్యమవుతుంది. తక్కువ వయసు వారిలో కొద్దిభాగంలో కార్టిలేజ్ దెబ్బతింటే అలాంటి వారికి కార్టిలేజ్‌ను పునరుత్పత్తి చేయవచ్చు. ఆరోగ్యంగా ఉన్న వారి నుంచి కార్టిలేజ్‌ను తీసుకొని కీళ్లలోకి ఎక్కించవచ్చు. చిన్న రంథ్రం చేసి కృత్రిమ కార్టిలేజ్‌ను కూడా రీజనరేట్ చేయవచ్చు.

కీళ్లనొప్పిని నివారించే ముందుజాగ్రత్తలు కీళ్లనొప్పి సమస్య రాకుండా కొన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవచ్చు. ప్రతిరోజూ పోషకాహారం తీసుకోవటంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అలాగే బరువును అదుపులో వుంచుకోవటం వల్ల కీళ్లనొప్పి సమస్య దరిచేరకుండా చూసుకోవచ్చు. మీరు ఒక కిలో బరువు తగ్గటం వల్ల మోకాలి కీలుకు నాలుగు కిలోల ఒత్తిడిని తగ్గించేందుకు వీలవుతుంది. ఆరోగ్యకరమైన తక్కువ కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారం తీసుకోవటం, కాల్షియం, విటమిన్‌లు, ప్రోటీన్‌లు, ఫైబర్ అధికంగా ఉన్న పాలు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవటం మేలు.

ప్రతిరోజు 30 నిమిషాల పాటు సైక్లింగ్, స్విమ్మింగ్ చేయటం వల్ల మోకాళ్లతోపాటు శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. ఎక్కువ దూరం వాకింగ్ చేయడం, జాగింగ్, రన్నింగ్ చేయటం వల్ల మోకాలి నొప్పికి కారణమవుతుంది. అందువల్ల వాకింగ్ చేసేటపుడు ఓ చేతికర్ర ఊతంగా వినియోగించటం మేలని లండన్‌లోని పరిశోధకులు తేల్చారు. ఉదాహరణకు మీరు కుడివైపు మోకాలి నొప్పితో బాధపడుతుంటే, వాకింగ్ చేసేటపుడు ఎడమచేతిని కర్ర సాయంతో నడవండి. దీనివల్ల మోకాలిపై 60 శాతం ఒత్తిడి తగ్గుతుంది.

మన దేశంలో ఎక్కువ మంది డయాబెటిక్ సమస్యతో సతమతమవుతున్న వారు కావటంతో వారికి భుజం నొప్పి సమస్యలు వస్తున్నాయి. దీనికితోడు ఆటల్లో క్రీడాకారులకు కూడా గాయాలతో ఈ భుజం నొప్పి బాధిస్తుంది. ఎక్కువగా క్రికెటర్లకు ఈ సమస్య వస్తుంది. భుజం మార్పిడి లేకుండానే ఇంజక్షన్‌లు, ఆర్థ్రోస్కోపి సాయంతో మెరుగైన చికిత్స చేయవచ్చు. ఆర్థ్రోస్కోపి పిన్‌హోల్ సర్జరీతో భుజం నొప్పిని తగ్గించవచ్చు.

హైడ్రోడిలేటేషన్ టెక్నిక్ 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారిలో, అందులోనూ మహిళల్లో ఎక్కువమందికి భుజం నొప్పి సమస్య వస్తుంది. మధుమేహంతో పాటు గాయపడటం వల్ల భుజం నొప్పి వస్తుంది. ప్రసవసమయంలో కంటే కూడా భుజం నొప్పి ఎక్కువగా బాధిస్తుందని మహిళా రోగులు చెపుతుంటారు. ఇలాంటి నొప్పిని నయం చేయటానికి కొందరు సంప్రదాయంగా పెయిన్ కిల్లర్స్ వాడటం, ఫిజియోథెరపీ పద్ధతులను అవలంభిస్తున్నారు. దీనివల్ల ఇంకా భుజం నొప్పి పెరుగుతుండటంతో ఫిజియోథెరపీని నిలిపివేస్తున్నారు.

భుజం నొప్పి సమస్యకు ఇటీవల ఆస్ట్రేలియా, యూరోప్, అమెరికా దేశాల్లో హైడ్రోడిలేటేషన్ టెక్నిక్‌ను అవలంభిస్తున్నారు. భుజం నొప్పికి నాలుగు రకాల సొల్యూషన్స్‌ను ఇంజక్షన్ ద్వారా భుజంలోకి పంపించి ప్రషర్ చేసేలా చూస్తారు. ఎక్స్‌రే సహకారంతో రోగి భుజాన్ని చూసి చేసే ఇంజక్షన్‌తో 3నుంచి 4 వారాల్లో భుజం నొప్పి దూరమవుతుంది. క్రీడాకారులకు భుజం నొప్పి సాధారణంగా భుజం డిజ్‌లొకేషన్ అనే సమస్య సాధారణంగా క్రీడాకారులకు వస్తుంది. ఒత్తిడితో భుజంలోని నరాలు దెబ్బతని తీవ్రమైన నొప్పి వస్తుంది. షోల్డరు డిజ్‌లొకేషన్ సమస్యకు ఆర్థ్రోస్కోపిక్ స్టెబిలైజేషన్ సర్జరీ నయం చేయవచ్చు.

ముందుజాగ్రత్తలు ప్రతిరోజు వ్యాయామం చేస్తే భుజం నొప్పిని నివారించవచ్చు. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవటంతోపాటు కుర్చీలో కూర్చునేటపుడు మెడ వెనుక ఆనించి కూర్చుంటే భుజం నొప్పి రాదు. కంప్యూటర్‌పై పనిచేసే వారు, వీడియోగేమ్‌లు ఆడేవారు టీవీ చూసేవారు, డ్రైవింగ్ చేసేవారు సరిగ్గా కూర్చోవాలి. సరిగా కూర్చోకుంటే వెన్నెముకతోపాటు భుజం నొప్పి వస్తుంది. నిలబడేటపుడు తలను నిటారుగా పెట్టాలి. అప్పుడు మీ శరీర బరువు రెండు కాళ్లపై సమానంగా పడుతుంది. వంకరగా నిలబడినా, కుర్చీలో సరిగా వెనుక ఆన్చకుండా కూర్చున్నా వివిధ రకాల సమస్యలు వస్తుంటాయి. పడుకునేటపుడు దిండును భుజం కింద పెట్టుకోకుండా తలకు మెడకు మధ్య భాగంలో ఉంచుకుంటే భుజం నొప్పి సమస్య రాదు.

0 comments:

Post a Comment