Monday

మహిళపై తాలిబన్ల బహిరంగ కాల్పులు


అఫ్ఘానిస్థాన్‌లో మళ్లీ తాలిబాన్లు విజృంభిస్తున్నారు. గతకాలపు తమ క్రూర పాలనను మళ్లీ గుర్తుకు తెస్తున్నారు. రాజధాని కాబూల్‌కి సమీపంలోని కిమ్‌చాక్ గ్రామంలో పట్టపగలు ఓ మహిళను కిరాతకంగా కాల్చి చంపడమే ఇందుకు నిదర్శనం. వారం క్రితం ఇది జరిగితే దీనికి సంబంధించిన వీడియో మాత్రం శనివారమే వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం నడుపుతుందనే నేరంపై ఓ మహిళను గ్రామం మధ్యలో మోకాలిపై నుంచోబెట్టిన తాలిబాన్ ఉగ్రవాది ఆయుధంతో ఆమెపై కాల్పులు జరిపాడు. దాంతో ఆమె ప్రాణాలు విడిచింది. ఈ దృశ్యాన్ని 150 మంది గ్రామస్థులు చుట్టూ నిలబడి చూశారు. కాల్చే సమయంలో "ఇది అల్లా విధించిన శిక్ష' అని వ్యాఖ్యానించినట్లుగా ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు.

ఈ ఘటన నేపథ్యంలో 1996-2001 మధ్యకాలంలో తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు సాగించిన బహిరంగ శిక్షలను అధికారులు మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. అయితే తాలిబాన్లను అంతమొందించడమే లక్ష్యంగా నాటో దళాలు 11 సంవత్సరాలపాటు పోరాడిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2001 ముందు వరకూ అఫ్ఘానిస్థాన్‌లో మహిళలకు ఎందులోనూ ప్రాధాన్యం లేదు. తర్వాత ఆమెరికా దళాల రంగ ప్రవేశంతో వారికి చదువు, ఓటు హక్కుతో పాటు అన్నింటా పోటీ పడే వాతావరణం ఏర్పడింది.

0 comments:

Post a Comment