Tuesday

“ విస్తరాకులాంటి మనస్సు ”


అనంతమైనదీ విశ్వం. సూర్యచంద్రాదుల్లాంటి గ్రహాలు మన కంటికి కనిపిస్తే, కనిపించని గ్రహాల్లాంటి గ్రహాల సమూహాలు కోటానుకోట్లు విశ్వంలో ఉన్నాయట. తాము సూర్య, చంద్రాదుల్లాంటి గ్రహాలకు కోటిరెట్లు పెద్దవైనా, తమను అతి చిన్నవిగా చూపుకుంటూ, మినుకు,మినుకుమంటూ కనిపించే నక్షత్రాలైతే లెక్కకు లెక్కపెట్టలేనన్ని వున్నాయిట విశ్వంలో. ఒక నక్షత్రం వెలుగులు చిమ్ముతూ రాలిపోతే, మరో పది నక్షత్రాలు విశ్వంలో పుట్టుకొస్తుంటాయట. కొన్ని చిన్న, పెద్దా గ్రహాలు సూర్యుడిలాంటి గ్రహాలచుట్టూ ఆకర్షింపబడి తిరుగుతూవుంటే, అటువంటి సూర్యుడులాంటి కోటానుకోట్ల గ్రహాలు విశ్వంలో అంతులేనన్ని వున్నాయిట. ఇటువంటి కోటానుకోట్ల సూర్యుళ్ళని ఆకర్షించి, ఒక పరిధిలో సంచరించేలా చేసేదెవరు? ఇంకెవరు? అనంతమైన విశ్వం విశ్వచైతన్యశక్తే!! శక్తి కంటికి కనిపించనది. దీనినే నేటి శాస్త్రజ్ఞులు చీకటి బిలాలు (BLACK HOLES) అని అంటున్నారు. చీకటి బిలాలు రెండువైపులా తెరుచుకొని వుంటాయి. అయితే, పైవైపు వెడల్పాంటి మూతిలాగా తెరుచుకొనివుండి, తమ సమీపానికి వచ్చిన గ్రహాలను అమాంతం మింగివేసి, వాటిలోని శక్తినికూడా తమలో లీనం చేసుకొని, తిరిగి, తమ రెండోవైపు, సూదిమొనంత మాత్రమే వుండే ద్వారంగుండా శక్తిని, పదార్ధాలని క్రొత్తరూపంలో అనంతమైన విశ్వంలోకి వదులుతుంటూ వుంటాయిట. కొన్ని గ్రహాలు తమ చుట్టూ తాము తిరిగేవైతే, మరికొన్ని తమచుట్టూ తాము తిరిగుతూ, ఒక ముఖ్య గ్రహం చుట్టూ కూడా తిరిగుతుంటాయి; ఇంకొన్ని గ్రహాలు కేవలం ఇతర గ్రహాల చుట్టూ తిరిగేవిగా మాత్రమే వుంటాయి; కొన్ని గ్రహాలు స్వయంగా కాంతిని, శక్తినిచ్చేవయితే, మరికొన్ని ఇతర గ్రహాలనుంచి కాంతిని, శక్తిని పొందుతూ వుంటాయిట విశ్వంలో.
క్రింది విషయాలను చదివేటప్పుడు, పై విషయాలనుకూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. మరి మీతో చెప్పాలనుకున్న సంగతులను ఆలకించండి:–
ఆత్రేయలాంటి సినీగేయ కవులు మనసుపై అనేక పాటలు వ్రాసారు. “ మనసున మనసై ….; ముద్దబంతిపువ్వులో.. మూగమనసు …..; మౌనమే నీ భాష మూగమనసా …. ” ఇలాంటివి ఎన్నో గొప్ప కవితలద్వారా మనస్సుయొక్క గొప్పతనాన్ని మాటల్లో వర్ణించటానికి ప్రయత్నించారు. విశ్వం, అంతా కాకపోయినా, కొంతైనా కంటికి కనిపించేదే, అనుభవానికి అందేదే. మరి మనస్సో? మనస్సు కంటికి కనిపించనది కానీ అనుభవానికి అందేదే. అనంతమైన విశ్వంలాంటిదే మన మనస్సుకూడా. పుట్టుకరీత్యా వచ్చిన జ్ఞానంకొంత; బాహ్య ప్రపంచంలోని వస్తు, విషయ, దృశ్య, శ్రవణాదులద్వారా లభించిన జ్ఞానంద్వారా మనస్సులో సంకల్పాలు మొదలై, అవి ఆలోచనాకృతిని పొందుతాయి. అలా పుట్టిన ఆలోచనల్లో కొన్ని క్షణకాలం మాత్రమే జీవించేవి అయితే; కొన్ని ఆకృతినిపొంది, కొంత కాలానికే, ఆకాశంలోంచి రాలిపడిపోయే చుక్కల్లాంటివి; మరికొన్ని ఆలోచనలు ఫలరూపాన్ని పొందుతాయి. విశ్వంలోని చైతన్యశక్తి ఆకర్షణ, వికర్షణ, విద్యుత్, అయస్కాంత శక్తులను కలిగివుంటుంది. అదేవిధంగా, మన శరీరం, మనసుకూడా ఇవే ఆకర్షణ లక్షణాలను కలిగివుంటాయి. కొన్ని ఆలోచనలు చిన్న గ్రహాల్లాంటివి అయితే, కొన్ని పెద్ద ఆలోచనలు, చూడటానికి/తెలుసుకోవటానికి, మినుకుమినుకు మనే చిన్న నక్షత్రాల్లాగా అనిపించినా, వాటి సామర్ధ్యం మాత్రం ఘనంగానే వుంటాయి, వాటి ఫలితాలుకూడా గొప్పగానే వుంటాయి.
విశ్వానికి (లేదా ఆకాశానికి); సముద్రానికి; మనస్సుకీ ఒక సామాన్య లక్షణం వుంది. అది చీకటి. అంటే, వీటి లోతు, పరిధి ఎంతో మనకీ తెలియదు; వాటికికూడా తెలియదు. విశ్వం లేదా ఆకాశంలోకి భూమినుంచి చూస్తే, సూర్యుని వల్ల వెలుతురు కనిపించినా, కొంత పరిధి దాటిన తరువాత, విశ్వం/ఆకాశంలోకి ప్రయాణించే వారికి చీకటి మాత్రమే కనిపిస్తుంది. అదేవిధంగా, సముద్రంపైన, కొంత లోతువరకు వెలుతురు కనిపించినా, ఎక్కువ లోతుకు వెళ్ళేసరికి అంతా చీకటిమయమే; మరి మనస్సు విషయానికివస్తే, అసలు మనస్సే కనిపించనది; అంటే కనిపించనది చీకటేకదా!! ఇందులోనే ఒక విశ్వరహస్యం వున్నది. కనిపించని, చీకటిగా వున్న విశ్వంలోంచే, వెలుగునిచ్చే సూర్యుళ్ళు, నక్షత్రాలు పుట్టుకువచ్చాయి; చీకటి సముద్రపు లోతుల్లో, అనంతమైన, విశేషమైన జీవరాశులున్నాయి; అదేవిధంగా, కనిపించని మనస్సులోంచే, చీకటిని అధిగమించే, సముద్రాల్ని పరిశోధించే, విశ్వాన్ని తెలుసుకోగోరే అతి గొప్ప ఆలోచనలు పుట్టుకువస్తుంటాయి. చూసారా, శూన్యమనే ఆకాశానికి, అగోచరమైన మనస్సుకు ఎంత సారూప్యమో!! వింతైన సారూప్యం వుండటానికి, దీనివెనుక ఏదైనా విశ్వరహస్యం, లేదా చిదంబర రహస్యమేదైనా వుందంటారా? వుందనే చెప్పాలి. అసలు జీవి పుట్టుకకు మూలమైన మూలకణాలు, విశ్వంనుంచి పుట్టినవేకదా!! “చాందోగ్యోపనిషత్త్ లో (chapter VI – Section-2.3) జీవానికి మూలం ఆకాశం-వాయువు-అగ్ని-నీరు-భూమి అని సోదాహరణంగా చెప్పబడితే, నేటి ఆధునిక శాస్త్రజ్ఞులు, విశ్వంలో 14 బిల్లియన్ల సంవత్సరాల క్రితం విశ్వంలో బిగ్-బ్యాంగ్ అనేది జరిగిందని, అందులోంచే, వాయువులు, మూలకణ పదార్ధాలు పుట్టుకు వచ్చాయనీ, వాటినుంచి నీరు, భూమిలాంటివి పుట్టాయని, వాటినుంచి ఏక కణ జీవులు, తరువాత బహుకణ జీవులు పుట్టుకువచ్చి, కొన్ని కోట్ల సంవత్సరాల పరిణామంలో, నేటి ప్రపంచం, జీవులు ఏర్పడ్డాయని చెబుతున్నారు. అందుకనే, విశ్వానికి, మన మనస్సుకీ సారూప్యం కనిపిస్తుంది.
గ్రహాలు తిరుగుతూవున్నట్లే, మనస్సుకూడా తనలోతాను తిరుగుతూ, ఇతరుల మనసు చుట్టూకూడా తిరుగుతూవుంటుంది. అంతేకాదండి, ఇది ఒక్క క్షణంలో ప్రపంచం మొత్తాన్నికూడా తిరిగిరాగల శక్తిమంతురాలు. గ్రహాలకున్నట్లే, దీనికికూడా ఆకర్షణశక్తి వున్నది. తనకున్న శక్తి, ఆకర్షణతో ఇతరుల మనస్సును ఇట్టే వశపరుచుకోగలదు. కొన్ని మనస్సులకు రెండు లక్షణాలు సరిపడంత లేక, ఇతరుల మనస్సుకే లొంగిపోయి, వాటిపైనే ఆధారపడివుంటాయి. కొన్ని గ్రహాలుకూడా ఇదేవిధంగా వుంటాయని చెప్పుకున్నాం.
ఒక రకం మనస్సు తగినంత స్వీయ శక్తి, ఆకర్షణ లేక, ఇతరుల మనస్సుకు ఆకర్షింపబడి, లొంగిపోయివుంటాయి. అయినప్పటికీ, చల్లని, శాంతస్వభావం కలిగివుంటుంది. ఇటువంటి మనస్సును చంద్రునితో పోల్చవచ్చు. రెండవరకం మనస్సు:- ఇది తన చుట్టూ తాను తిరుగుతూ, గొప్పవారి మనసుల చుట్టూకూడా తిరుగుతూవుంటుంది. దీనికి స్వయం ప్రకాశ శక్తి, ఆకర్షణలుకూడా వుంటాయి. రకం మనస్సులు చాలా ఎక్కువగానేవుంటాయి. మనస్సుని భూమిలాంటి గ్రహాలతో పోల్చవచ్చు. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే, ఇటువంటి మనస్సుగలవారిని ఉత్తములుగా పరిగణించవచ్చు. ఎందుకంటే, వీరు తమకున్న జ్ఞాన, శక్తిసంపత్తులతో జీవనాన్ని సాగిస్తూ, అవసరమైనమేరకు, సద్గురువులను (సూర్యుడు లాంటివారిని) ఆశ్రయించి, వారినుంచి మరింత శక్తిని, జ్ఞాన సంపదను పొందుతూ, జీవితాన్ని సఫలం చేసుకుంటుంటారు. మూడోరకం మనస్సు:– రకం మనస్సు గలవారు పుట్టుకతోనే అత్యంత శక్తి కలిగి, ఆకర్షణ కలిగి, ఇతరులను తమ చుట్టూ తిప్పుకోగలిగిన వారైవుంటారు. వీరిని ధృవ నక్షత్రాల్లాంటి నక్షత్రాలతో సరిపోల్చవచ్చు. వీరు, గురుస్థానంలో వుండి, సామాన్య జనులకు మార్గనిర్దేశాన్ని చేస్తుంటారు. తమ ఆకర్షణ శక్తితో, సామాన్య జనులను తమ,తమ జీవన పరిభ్రమణంలో గతి తప్పకుండా కాపాడుతుంటారు. వీరు విశ్వమహనీయులు.
ఒక సీసానిండా ఏదైనా వాయువును నింపిన తరువాత, అందులోకి కొన్ని ఘన పదార్ధాల్ని నింపటానికి ప్రయత్నిస్తే, సీసాలోని వాయువు తనకుతాను లేదా తనలోతాను కొంతమేరకు కుంచించుకొని, ఘనపదార్ధాలు వుండటానికి సీసాలో కొంత చోటును కల్పిస్తుంది. అదేవిధంగా, ఒక ఓడను సముద్రం నీళ్ళల్లోకి వదిల్తే, ఓడ బరువుకు సమానమైన పరిమాణంగల నీటిని, సముద్రం ప్రక్కకు జరిపి, ఓడ తనలో తేలటానికి చోటిస్తుంది. మరి, ఇదేక్రమంలో, విశ్వం ( లేదా అనంతమైన ఆకాశం ) కూడా, తనలో అనంతమైన గ్రహరాశులకు ( భూగ్రహంతో సహ ) చోటును కల్పిస్తూనే వుంటుంది. దీనిలోని తత్త్వం ఏమిటి? ఒక గ్లాసులో మంచి నీటిని నింపాలంటే, గ్లాసు ఖాళీగానన్నా వుండాలి, లేదా, వున్న పాతనీటిని తీసివేసి, క్రొత్త మంచినీటితో నింపటానికి గ్లాసును ఖాళీగా వుంచాలి. అదేవిధంగా, మన మనస్సును అత్యుత్తమమైన ఆలోచనలతో నింపాలంటే, దానిని ఎప్పుడూ పూర్తిగాగానీ, లేదా కొంతమేరకైనా ఖాళీగా వుంచాలి. అప్పుడే, మన మనస్సు, విశ్వతత్త్వాన్ని కలిగివుంటుంది; విశ్వంలాగా వ్యాప్తి చెందుతూవుంటుంది. తెరచివుంచిన విస్తరిలో అన్నపదార్ధాల్ని వడ్డించవచ్చు, కానీ, మడచివేసిన విస్తరిలో వేటినీ వుంచలేము. మన మనస్సుకూడా తెరచిన విస్తరాకులాగానే వుండాలి.

From
మీతో చెప్పాలనుకున్నా!!! 

0 comments:

Post a Comment