Monday

సృష్టికి ప్రతిసృష్టి సరోగసీ...


శాస్త్ర విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజులలో సృష్టికి ప్రతి సృష్టి చేయగల విధానమే సరోగసీ అద్దె గర్భం. పిల్లలు ఇక పుట్టరు అని అనుకొన్న దంపతులు సరోగసీ విధానం ద్వారా బిడ్డను కనడం నిజంగా శాస్త్ర విజ్ఞానం ఇచ్చిన వరం.

ఒక దంపతులకు సంబంధించిన పిండం వేరొక స్త్రీ గర్భాశయంలో 9 నెలలు పెరిగి జన్మించడం ద్వారా వచ్చిన శిశువును సరోగసీ (అద్దె గర్భం) శిశువు అనవచ్చు. ఈ శిశువును కనే తల్లి సరోగసీ తల్లి అవుతుంది. సహజమైన ప్రక్రియలా కాకుండా ఇటువంటి ప్రక్రియ ఎప్పుడు అవసరమవుతుంది అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే మానవ ప్రత్యుత్పత్తికి సంబంధించి కొంత అవగాహన ఉండాలి.

సహజంగా శిశువు జన్మించే విధానం 
స్త్రీలలో ఋతుచక్రంలో భాగంగా అండాశయాల నుంచి ఒక అండం విడుదలవుతుంది. ఇది అండాశయాల నుంచి ఫెలోపియన్ నాళంలోకి చేరుతుంది. పురుషుని సంపర్కం ద్వారా స్త్రీలోకి శుక్రకణాలను ప్రవేశపెట్టినప్పుడు శుక్రకణాలు ఫెలోపియన్ నాళాలలోకి చేరతాయి. ఇక్కడ అండం శుక్రకణంతో ఫలదీకరణం చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజం విభజన చెందుతూ పిండంగా మారుతుంది. కొన్ని కణాల దశలో ఉన్న పిండం గర్భాశయ గోడలకు అతుక్కొని 9 నెలల తరువాత పూర్తి శిశువుగా మారి జన్మించడం జరుగుతుంది.

సరోగసీ ఎప్పుడు అవసరమవుతుంది? 
స్త్రీలలో ప్రత్యుత్పత్తి సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు, ముఖ్యంగా గర్భాశయ వ్యాధులు ఉన్నప్పుడు లేదా గర్భాశయం చిన్నదిగా ఉండటం, వ్యాధులు సోకడం వల్ల గర్భాశయాన్ని తీసివేసినప్పుడు పిల్లలు పుట్టడానికి అవకాశం ఉండదు. ఇటువంటి సందర్భంలో సరోగసీ అవసరమవుతుంది. సరోగఫీ విధానంలో భాగంగా భార్యాభర్తలలో స్త్రీ నుంచి అండాన్ని, అదే విధంగా పురుషుని నుంచి శుక్రకణాలను సేకరించడం జరుగుతుంది. వీటిని ప్రయోగశాలలో కృత్రిమంగా ఫలదీకరణం చెందించి సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తారు. సంయుక్త బీజం విభజన చెంది కొన్ని కణాల దశలో పిండంగా వున్నపడు సరోగసీ తల్లి (వేరొక మహిళ) గర్భాశయంలోకి ప్రవేశపెడతారు.

ఇక్కడ ఈ పిండం పూర్తి గర్భావది కాలం పెరిగి శిశువుగా జన్మిస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా జన్మించిన శిశువు శుక్రకణం అండాలను, ఇచ్చిన వారికి చెందుతుంది. కాని 9 మాసాలు వెూసిన స్త్రీకి చెందదు. గర్భాన్ని వెూసి కన్న స్త్రీకు ఈ శిశువుపై ఎలాంటి హక్కు ఉండదు. సరోగసి తల్లి కేవలం తన గర్భాశయాన్ని శిశువు పెరుగుదల, జన్మించడానికి మాత్రమే ఇస్తుంది.

ఈ పద్ధతి ఎంతవరకు ఉపయోగం 
అనేక కారణాల వల్ల పిల్లలు లేని భార్యాభర్తలకు సరోగసీ విధానం నిజంగా ఒక వరం వంటిదే. పిల్లలు లేరని జీవితాంతం బాధపడేకంటే సరోగసీ విధానం ద్వారా పిల్లలను పొందడం చాలా ఉపయోగం. హాలీవుడ్ ప్రముఖులు కొందరు ఈ విధానం ద్వారా పిల్లలను పొందారు. బాలీవుడ్ ప్రముఖుడైన అమీర్‌ఖాన్ దంపతులు కూడా సరోగసీ విధానం ద్వారా శిశువును పొందారు. అసలు పిల్లలు లేకుండా ఉండటం లేదా వేరే వారి పిల్లలను దత్తత తీసుకొనే బదులు సరోగసీ విధానం ద్వారా పిల్లలను పొందడం మేలుగా అనేక మంది భావిస్తున్నారు.

అయితే దీనివల్ల కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. శిశువు గర్భంలో వున్నపడు శిశువుకు గాని గర్భాన్ని వెూసే తల్లికి గాని ఏదైనా వ్యాధులు లేదా ఇతర కారణాలవల్ల ఇబ్బందులు కలగవచ్చు. సరోగసీ తల్లి శిశువును కన్న వెంటనే అసలు తల్లిదండ్రులకు ఇచ్చివేయడం జరుగుతుంది. కాబట్టి ఆ తల్లికి భావోద్వేగాల సమస్య ఉండవచ్చు. ఈ విధంగా జన్మించిన శిశువు సరోగసీ తల్లి దగ్గర పెరగకపోవడం వల్ల తల్లిపాలు అందే అవకాశం లేదు. ఈ పద్ధతి ద్వారా శిశువును కనడం అందరికీ ఆవెూదయోగ్యంగా ఉండకపోవచ్చు. సరోగసీ విధానంలో జన్మించిన శిశువులలో కొందరి తల్లి దండ్రులు వేరుగా ఉండవచ్చు. అంటే భార్యాభర్తలలో ఒకరి నుంచి అండం లేదా శుక్రకణాలను తీసుకొంటారు. వీటిని వేరొకరు దానం చేసిన శుక్రకణాలు లేదా అండాలతో ఫలదీకరణం చెందిస్తారు.

ఈ పిండం మూడవ స్త్రీ గర్భంలో పెరుగుతుంది. ఈ విధానం ద్వారా జన్మించిన శిశువు తల్లి లేదా తండ్రి వేరుగా ఉంటారు. సరోగసీ తల్లివేరుగా ఉంటుంది.
సరోగసీ విధానంలో జన్మించిన శిశువుకు అండాలను లేదా శుక్రకణాలను భార్యాభర్తలలో ఒకరు మాత్రమే దానం చేస్తే న్యాయపరమైన చిక్కులు కలుగుతాయి. సరోగసీ తల్లి శిశువు జన్మించిన తరువాత ఆ శిశువుపట్ల మానసిక భావోద్వేగాలను పెంచుకోవచ్చు. గర్భాధారణ సమయంలో ఆ స్త్రీకి మధుమేహం (డయాబెటిస్) వంటి సమస్యలు రావచ్చు. సరోగసీ విధానం వల్ల సమాజంలో ప్రజలకు అవగాహన లేదు. కాబట్టి ఈ విధంగా పుట్టిన శిశువులను బంధువులు, స్నేహితులు ఎలా చూస్తారనేది ప్రశ్నగా మిగిలిపోతుంది. సరోగసీ విధానం ద్వారా జన్మించిన శిశువు అసలు తల్లిదండ్రులు కొంతకాలానికి విడిపోతే ఆ శిశువును ఎవరూ పెంచలేక అనాధ కావచ్చు. ఇటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. సరోగసీ విధానం వల్ల అనేకమందిలో చాలా రకాల అపోహలున్నాయి. కాబట్టి దీని పట్ల అందరూ ఆసక్తి చూపడం లేదు.

సరోగసీ ప్రాచుర్యం పొందడానికి గల కారణం
ఇటీవల భారతదేశంలో సరోగసీ విధానం ద్వారా పిల్లలను కనడం ఎక్కువయింది. దేశంలోని ప్రధాన నగరాలలోని సంతానరాహిత్యానికి చికిత్స చేసే ఆసుపత్రుల్లో సరోగసీ విధానం ద్వారా అనేకమంది శిశువులు జన్మిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది విదేశీయులే. దీనికి గల కారణం విదేశాలలో సరోగసీ తల్లి దొరకడం చాలాకష్టం. ఒక వేళ దొరికినా చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఆయా దేశాలలో సరోగసీ పట్ల చాలా కఠినమైన చట్టాలున్నాయి. భారతదేశంలో సరోగసీ తల్లి దొరకడం తేలిక. డబ్బుకు ఆశపడే అనేక మంది మధ్య తరగతి మహిళలు దీని పట్ల ఆకర్షితులవుతున్నారు. మనదేశంలో చట్టాలు కూడా కఠినంగా లేవు. చాలా తక్కువ ఖర్చుతో భారతదేశంలో సరోగసీ విధానంతో బిడ్డను పొందవచ్చు. ఈ కారణాల వల్లనే భారతదేశం సరోగ్రసీ విధానంలో బిడ్డను కావాలనుకునే విదేశీయులు భారతదేశం వైపు ఆకర్షితు లవుతున్నారు. దీనివల్లనే భారతదేశానికి ప్రపంచ ఊయల అనే పేరు రావడం జరిగింది.

చట్టాలు నిబంధనలు ఏం చెబుతున్నాయి? 
సరోగసీ విధానం పట్ల ఒక్కొక్క దేశంలో ఒక్కోరకం నిబంధనలు ఉన్నాయి. ఫ్రాన్సు, ఇటలీ, ఐస్‌ల్యాండ్ దేశాలలో దీనిని పూర్తిగా నిషేధించారు. ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, హంగేరీ దేశాలలో సరోగసీ ద్వారా బిడ్డను కనవచ్చు కాని డబ్బులు తీసుకొని సరోగసీకి పాల్పడటం నేరం. ఇజ్రాయిల్‌లో ఒంటరిగా ఉండే మహిళలు, వితంతువులు, విడాకులు, తీసుకొన్నవారు మాత్రమే సరోగసీ విధానం ద్వారా బిడ్డను పొందేందుకు వీలవుతుంది. ఈ ప్రక్రియను ప్రభుత్వం రికార్డుల్లో నవెూదు చేస్తారు.

డిజైనర్ బేబి
జన్మించబోయే శిశువు మనం అనుకున్న లక్షణాలతో వుండే విధంగా రూపకల్పనతో జన్మించే శిశువును డిజైనర్ బేబి అనవచ్చు. అంటే శిశువులో మనం అనుకున్నట్టుగా రంగు, రూపం, కళ్ళు, ముక్కు , వెంట్రుకలు వంటి లక్షణాలను కలిగించవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి శిశువులను సృష్టించడానికి ఆస్కారం ఉంది.

క్లోనింగ్ బేబి
శాఖీయకణ కేంద్రక కణ మార్పిడి జరిగి క్లోనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టించిన శిశువును క్లోనింగ్ బేబి అనవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా ఆడ లేదా మగ ఎవరైతే కావాలనుకుంటావెూ వారి శరీర కణ కేంద్రకాన్ని దాతగా తీసుకొంటారు. ఈ కేంద్రకాన్ని కేంద్రకంలేని అండకణంలోకి మార్పిడి చెందిస్తారు. ఈ విధంగా మార్పిడి చేసిన తరువాత అండకణం సంయుక్త బీజం (పిండంగా) మారుతుంది. దీనిని స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఇక్కడ పిండం పూర్తిగా 9 నెలలు పెరుగుతూ శిశువుగా మారి జన్మించడం జరుగుతుంది. క్లోనింగ్ బేబిలో శరీరం బయట కేవలం శాఖీయకణ మార్పిడి ద్వారా సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తారు. పిండం అభివృద్ధి మాత్రం సాధారణ శిశువువలే తల్లిగర్భంలో జరుగుతుంది. ఇతర జంతులలో ముఖ్యంగా ఆవు, పిల్లి, గొర్రె, గేదె వంటి క్షీరదాలలో క్లోనింగ్ ప్రక్రియ ద్వారా జీవులను సృష్టించినప్పటికి మానవునిలో ఈ ప్రక్రియ ద్వారా క్లోనింగ్ బేబిని సృష్టించడం సాధ్యం కాలేదు. భారతదేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా మానవ క్లోనింగ్ ప్రక్రియను అనేక దేశాలు నిషేదించాయి.

టెస్ట్‌ట్యూబ్ బేబి
టెస్ట్ ట్యూబ్ బేబి అంటే టెస్ట్ ట్యూబ్‌లో జన్మించే శిశువు కాదు. స్త్రీలలో వివిధ కారణాల వలన శుక్రకణం, అండం ఫలదీకరణం చెందదు. స్త్రీలలో ఫెలోపియన్ నాళాలలో అడ్డంకులు ఉండడం లేదా పూర్తిగా మూసుకుపోవడం వల్ల ఫలదీకరణ జరుగదు. పురుషులలో శుక్రకణాల సంఖ్య ఉండవలసిన దానికంటే తక్కువగా ఉండడం లేదా వీటి కదలిక సరిగా ఉండకపోవడం వల్ల ఫలదీకరణలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇటువంటి పరిస్థితులలో స్త్రీల నుంచి అండాలను, పురుషులనుంచి శుక్రకణాలను సేకరించి కృత్రిమంగా ప్రయోగశాలలో సంయోగం చెందిస్తారు.

ఈ ప్రక్రియ నియంత్రించిన పరిస్థితులలో గాజునాళికలో జరుగుతుంది. దీని ఫలితంగా సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఇది విభజన చెంది పిండంగా ఏర్పడం ప్రారంభిస్తుంది. పిండం నుంచి 16 కణాల దశలో ఉన్నపడు దీనిని తిరిగి స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఇక్కడ పిండం సాధారణ పరిస్థితులలో పెరుగుతూ 9 నెలల తరువాత శిశువుగా జన్మిస్తుంది. టెస్ట్ ట్యూబ్ బేబి పద్ధతిలో కేవలం ఫలదీకరణ మాత్రమే కృత్రిమంగా శరీరం బయట జరుగుతుంది. ప్రపంచంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబి లూయిస్ బ్రౌన్ కాగా మనదేశంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబి హర్ష (ఇందిర).

0 comments:

Post a Comment