Saturday

సాకర్ కుట్ర


ఈజిప్టు రాజధాని కైరోలోని తాహ్రిర్ స్క్వేర్‌ను ప్రజలు మరోసారి ముట్టడించారు. అయితే ఈసారి ఈజిప్టులోని పోర్ట్ సయీద్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్‌ని మృత్యు క్రీడగా మార్చిన సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమిస్తున్నారు. కైరోకు చెందిన 'అహీ'్ల, పోర్ట్ సయీద్‌కు చెందిన అల్ 'మస్రీ' అనే రెండు అగ్రశ్రేణి సాకర్ క్లబ్‌లకు మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో మస్రీ క్లబ్ విజేతగా నిలిచింది. మ్యాచ్ ముగియగానే మిలటరీ కూటమి మద్దతుదారులు మస్రీ క్లబ్ అభిమానుల ముసుగులో అహ్లీ క్లబ్ ఆటగాళ్ళు, వారి అభిమానులపై మారణాయుధాలతో దాడి చేశారు. 

ఆ దాడిలోను, ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలోనూ 74 మంది ప్రాణాలు కోల్పోగా, వెయ్యిమందికి పైగా గాయపడ్డారు. వినోదం పంచాల్సిన సాకర్ ఆట రక్తసిక్తమయింది. ఈ హంతక దాడికి ఫీల్డ్ మార్షల్ మహమ్మద్ హుసేన్ తంతవి సైనిక కూటమే కారణమని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైనాయి. గత ఏడాది ఫిబ్రవరిలో అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌ను గద్దె దింపేందుకు జరిగిన తాహ్రిర్ స్క్వేర్ ముట్టడి ప్రస్తుత సైనిక సర్కారుకు వ్యతిరేకంగా పునరావృతమైంది. 

దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు, యువజన సంఘాల సంకీర్ణ కూటమి సయీద్ మారణకాండకు నిరసనగా పార్లమెంటు బయట భారీ ఎత్తున ప్రదర్శనలు చేశాయి. వఫ్ద్ పార్టీ, మహమ్మద్ ఎల్‌బరాదీకి చెందిన 'నేషనల్ అసోసియేషన్ ఫర్ చేంజ్', కరామా పార్టీలతో కూడిన వామపక్ష- మితవాదపార్టీల సంకీర్ణం ఈ సంఘటనపై తీవ్ర నిరసనను వ్యక్తం చేశాయి. ప్రధాని కమల్ ఎల్ గంజౌరీకి కేబినెట్‌కు వ్యతిరేకంగా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఆ సంకీర్ణం నిర్ణయించింది. అత్యంత మితవాద ముస్లిం బ్రదర్‌హుడ్ పార్టీ కూడా ఈ సైనిక కుట్రను ఖండించింది. ఈశాన్య నగరమైన సూయజ్‌లో జరుగుతున్న ప్రదర్శనలపై గురువారం జరిగిన పోలీసు దాడిలో ఇద్దరు నిరసనకారులు మరణించారు. 

అయితే రెండు ఫుట్‌బాల్ క్లబ్‌ల అభిమానుల మధ్య తలెత్తిన ఘర్షణ ఉద్రిక్తతగా మారడంతో అనేక మంది మరణానికి దారి తీసినట్లు చిత్రీకరించేందుకు సైనిక కూటమి ప్రయత్నిస్తోంది. అహ్లీ సాకర్ క్లబ్, దాని అభిమానులు ముబారక్‌కు, సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. గిజాకు సమీపంలోని 'జమాలెక్ వైట్ నైట్స్' అనే ఫుట్‌బాల్ క్లబ్ సభ్యులతో కలసి వారు కైరోలో వీధిపోరాటాలు చేశారు. ఆ కారణంగా అహ్లీ క్లబ్ ఆటగాళ్ళు, వారి అభిమానులు సైనిక ప్రభుత్వానికి కంటగింపు అయ్యారు. అహ్లీ అభిమానులపై సైన్యం, భద్రతా బలగాల అండతో అల్ మస్రీ సాకర్ క్లబ్ దాడి చేసి మారణకాండ సృష్టించిందని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. అణచివేత వ్యతిరేక విప్లవంలో పాల్గొన ్నందుకు సైనిక కూటమి తమ మీద కక్షగట్టి నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు 'అతివాదులు'గా పిలుస్తున్న అహ్లీ క్లబ్ అభిమానులు ఆరోపిస్తున్నారు. 

అమెరికా మద్దతుతో ముప్ఫై ఏళ్ళు పాలించిన ముబారక్‌ను వదిలించుకున్నప్పటికీ ఆయన కొనసాగింపుగా తంతవి మిలటరీ కూటమి అధికారం చేపట్టింది. ముబారక్ కాలంలో కంటె నిరసన కారులపై ప్రస్తుతం హింసాకాండ ఎక్కువగా సాగుతున్నట్లు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ విమర్శించింది. గత ఏడాదిలో 12 వేలమందికి పైగా పౌరులను సైనిక కోర్టుల్లో విచారించి అనేక మందికి మరణశిక్ష విధించినట్లు ఆమ్నెస్టీ పేర్కొంది. సార్వత్రక ఎన్నికలు జరుపకుండా కాలయాపన చేస్తున్న మిలటరీ కూటమికి వ్యతిరేకంగా ప్రజలు గత నవంబర్‌లో ఆందోళన చేశారు. 

అమెరికా మద్దతుతో కొనసాగుతున్న తంతవి నాయకత్వంలోని సైనిక కూటమికి వ్యతిరేకంగా లక్షలాది కార్మికులు, యువతీ యువకులు ఈజిప్టులోని వివిధ ప్రధాన నగరాలలో సమ్మెలు, నిరసన ప్రదర్శనలు చే శారు. అ తర్వాత గంజౌరీ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ తంతావి సైనిక ముఠాదే పెత్తనం సాగుతోంది. అణచివేత వ్యతిరేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న అహ్లీ క్లబ్ అభిమానులు సయీద్ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో తంతవి సైనిక కూటమికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. దాంతో వాళ్ళకి తగిన గుణపాఠం నే ర్పేందుకే సైన్యం సయీద్ దాడికి పాల్పడిందని బాధితులు ఆరోపిస్తున్నారు. తంతవికి అనుకూలంగా నినాదాలిస్తూ అల్ మస్రి అభిమానుల ముసుగులో ప్రభుత్వ గూండాలు, రాళ్ళు, రాడ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారని సమాచారం. 

ఆ మారణకాండకు నిరసనగా సరిగ్గా ఏడాది క్రితం ఉద్యమకారులపై ముబారక్ తలపెట్టిన 'ఒంటెల యుద్ధా'న్ని తిప్పికొట్టిన రోజునే మళ్ళీ తాహ్రిర్ ముట్టడి ప్రారంభం కావడం యాధృచ్ఛికమే. అది జరిగిన 9 రోజులకు ముబారక్ పదవి నుంచి వైదొలగారు. ముబారక్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలపై దాడిచేయబోమని ఈజిప్టు సైన్యం గతంలో గంభీర ప్రకటనలు చేసి, అమెరికా ఆశీస్సులతో అధికారం చేపట్టిన అనంతరం ప్రజలపై ప్రతీకార దాడులకు పూనుకొంది. గతంలో పెరూ, బ్రిటన్, గ్వాటెమాలాల్లో జరిగిన దుర్ఘటనల్లో సాకర్ అభిమానులు చాలామంది చనిపోవడానికి సయీద్ హత్యాకాండకు అసలు పోలికే లేదు. ప్రజాస్వామ్యం కోసం పోరాడిన ఉద్యమకారులపై తంతవి సైనిక కూటమి చేస్తున్న ప్రతీకార దాడులను ఈజిప్టు ప్రజలే తప్పక తిప్పికొడతారు.

0 comments:

Post a Comment