Monday

మొక్కలూ.. మాట్లాడుకుంటాయి...!


మొక్కలకూ మాటలొచ్చండోయ్... సహజ శత్రువులు, జంతువులు, మనుషులు తమమీద దాడిచేస్తే పక్కనున్న వాటికి సంకేత భాషలో ప్రమాద సందేశం పంపుతాయి. కాకపోతే ఆ భాష మరో జీవికి అర్థం కాదు. కానీ, ఆ కథాకమామిషు ఏమిటో పరిశోధకులు పట్టుకోగలిగారు. అలాగిలాక్కాదు... వీడియో కూడా తీశారు. బ్రిటన్‌లోని ఎక్సెటర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తొట్టతొలిసారి ఈ ఘనత సాధించారు. ఈ విశేషాన్ని మంగళవారం (7వ తేదీ) బీబీసీ-2 చానెల్‌లో 'హౌ టు గ్రో ఏ ప్లాంట్' (మొక్కలు పెంచడం ఎలా?) పేరిట మూడు భాగాల ధారావాహిక కార్యక్రమంలో ప్రదర్శించనున్నారు. ప్రొఫెసర్ ఇయాన్ స్టీవర్ట్ దీన్ని సమర్పిస్తారు.

చూడటం మరచిపోకండేం! ఇక ప్రయోగం ఎలా జరిగిందో చూద్దాం... ఓ క్యాబేజీ మొక్క ఉపరితలానికి రంధ్రం చేసినా, కత్తిరించినా ఒక రకమైన వాయువు విడుదలను ప్రేరేపించే దాని జన్యువును వేరుచేశారు. దీనికి మిణుగురులు వెలుతురు చిందించేందుకు ఉపయోగపడే ప్రొటీన్ 'లూసిఫెరేస్'ను జోడించారు. తద్వారా ఆ మొక్కల నుంచి వెలువడే సంకేతాలు వెలుతురు కలిగి ఉండేలా చేశారు. అటుపైన అత్యాధునిక కెమెరాలతో వాటి సంభాషణపై 'నిఘా' పెట్టారు. ముందుగా ఓ క్యాబేజీ మొక్క ఆకును కత్తెరతో సగం కత్తిరించారు.

అది 'మిథైల్ జాస్మొనేట్' వాయువును విడుదల చేయడం ప్రారంభించింది. అలా తన జాతి పొరుగు మొక్కలకు 'ప్రమాద' సంకేతాలు పంపింది. పక్కనున్న మొక్కలు (వాటిని పరిశోధకులు తాకనే లేదు సుమా!) ఆ సందేశం స్వీకరించాయి. 'జాగ్రత్త... మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి' అని దానికి అర్థమట. ఈ హెచ్చరికకు అనుగుణంగా అవి వెంటనే తమ సహజ శత్రువులైన గొంగళి పురుగుల దాడిని నిరోధించే ఓ రకమైన విషపదార్థాన్ని ఆకుల ఉపరితలానికి విడుదల చేశాయి.

ఈ విధంగా మొక్కలు 'సంక్లిష్ట, అదృశ్య భాష'లో మాట్లాడుకుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. 'మొక్కలు గాయపడినప్పుడు వాటినుంచి వెలువడే వాయువులు పొరుగు మొక్కలపై ఎందుకు ప్రభావం చూపుతాయో మేము దృశ్యీకరించాం' అని ఈ సందర్భంగా పరిశోధకులు చెప్పారు. కాకపోతే ఈ అంశంపై మరిన్ని రహస్యాలు ఛేదించేందుకు మరింత లోతుగా పరిశోధన సాగించాల్సి ఉందని శాస్త్రవేత్తల బృందం నాయకుడు ప్రొఫెసర్ స్మిర్నాఫ్ అన్నారు.

0 comments:

Post a Comment