Monday

ఉదరమే మార్చేశారు! కేన్సర్ సోకిన బాలికకు అవయవ మార్పిడి ఆరు కీలక అవయవాలను మార్చిన వైద్యులు


వైద్య చరిత్రలోనే అద్భుతం! తీవ్రమైన కేన్సర్ సోకిన తొమ్మిదేళ్ల బాలికకు శరీరంలోని ఆరు కీలక అవయవాలను మార్చి వైద్యులు ఆమెకు పునర్జన్మనిచ్చారు. అలన్నా షెవెనెల్ అనే ఈ చిన్నారి 2008 నుంచి కేన్సర్‌తో బాధపడుతోంది. దాంతో బోస్టన్‌లోని ఓ పిల్లల ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు ఉదరభాగం, కాలేయం, క్లోమం, అన్నవాహిక, చిన్న ప్రేవులు, ప్లీహం.. అన్నీ మార్చేశారు!!

అత్యంత అరుదైన, చాలా తీవ్రమైన కేన్సర్ ఆమెకు సోకి.. శరీరంలోని పలు కీలక అవయవాలకు పాకిందని, అన్ని చికిత్సలూ విఫలమైన తర్వాత చ్రిల్డన్స్ పీడియాట్రిక్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ డైరెక్టర్ హ్యూంగ్ బే కిమ్ ఆమె శరీరంలో కేన్సర్ సోకిన అవయవాలన్నింటినీ తీసేసి.. కొత్తవాటిని అమర్చాలని నిర్ణయించారు. సరిగ్గా అదే సమయానికి.. ఆమె వయసులోని ఉండి, అదే గ్రూపు రక్తం ఉన్న ఓ బాలిక ఇటీవల మరణించగా, ఆమె అవయవాలను తీసి అలన్నాకు అమర్చగలిగారు. మూడు నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత అలన్నా ఇంటికి తిరిగొచ్చి హాయిగా ఆడుకుంటోంది. 2008లో ఒకసారి అలన్నాకు ఉన్నట్టుండి జ్వరం వచ్చి బరువు కోల్పోసాగింది.

పొట్ట బాగా వాచింది. అప్పుడే ఆమె ఉదరభాగంలో కణితిని కనుగొన్న వైద్యులు రెండుసార్లు దాన్ని తొలగించేందుకు ప్రయత్నించినా, అది ఆక్టోపస్‌లా విస్తరించి ఒక్కో అవయవానికీ పాకింది. ఇది అత్యంత అరుదైన సర్కోమా అని ఆ తర్వాత వైద్యులు కనుగొన్నట్లు అలన్నా నాయనమ్మ డేబి స్కోలస్ తెలిపారు. కీమోథెరపీ కూడా అలన్నాకు పనిచేయలేదు. రోజులు గడిచేకొద్దీ కణితి మరింత పెరిగి.. పొట్టలో విపరీతమైన నొప్పి వచ్చేది. దాంతో ఆహారం తీసుకోలేక.. కేవలం ద్రవాలపైనే ఆధారపడింది. చిట్టచివరకు డాక్టర్ కిమ్ నిర్ణయంతో శస్త్రచికిత్స చేయగా.. ఆమెతో పాటు ఆమె కుటుంబానికీ ఉపశమనం కలిగింది.

0 comments:

Post a Comment