Monday

అయామ్ యోకో ఓనో..


"భౌతికంగా ప్రపంచంలో నేనెక్కడ ఉన్నా... నా ఆత్మ మాత్రం భారతదేశంలోనే ఉంటుంది. ఈ గడ్డ అంటే నాకంత ఇష్టం'' అంటారు యోకో ఓనో. ఈవిడ 'ది బీటిల్స్' రాక్ బ్యాండ్ ఐకాన్‌గా పేరొందిన జాన్ లెనన్ సహచరి. తన చిత్రాల ప్రదర్శన కోసం ఢిల్లీకి వచ్చిన ఆమె మన దేశం పట్ల తనకున్న ఇష్టం గురించి, తన పని గురించి చెప్పిన వివరాలే ఇవి...

"బీటిల్స్ గురించి మీరంతా వినే ఉంటారు. అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించి, సంగీతంతో ప్రపంచాన్ని ఊపేసిన రాక్ బ్యాండ్ అది. అందులో ఒకరైన జాన్‌ని పెళ్లి చేసుకోవడం వల్లే నాకు భారతదేశంతో అనుబంధం ఏర్పడింది. బహుశా 1960ల్లో అనుకుంటా మహేష్ యోగి ఆశ్రమంలో బోధనలు వినేందుకు తనతో కలిసి మొదటిసారి ఇక్కడికి వచ్చాను. అప్పుడే హిమాలయాలకు వెళ్లాం. నా భర్త మరణం తరువాత మళ్లీ ఇప్పుడిలా వచ్చాను. దేశ రాజధాని ఢిల్లీలో 'అవర్ బ్యూటిఫుల్ డాటర్స్' పేరుతో ఈ నెల పదమూడున ప్రదర్శన మొదలుపెట్టాను. ఇది మార్చి పదో తేదీ వరకు ఉంటుంది.

దీని ప్రధాన ఉద్దేశం ప్రపంచశాంతి. రోజు రోజుకి ప్రపంచ పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. వీటిని ఒక దారికి తేగలిగిన వాళ్లు మహిళలే. అందుకే మహిళలతో నేను మాట్లాడుతున్నాను. వీళ్లతో పాటు తెలివైన మగవాళ్లతో కూడా మాట్లాడుతున్నాను. అందరం కలిస్తే మెరుగైన ప్రపంచాన్ని నిర్మించొచ్చు. మహిళలకు ఎక్కువ ప్రాముఖ్యం ఎందుకు ఇస్తున్నానంటే వారిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని సమీకరించగలిగితే సాధ్యం కానిది ఏదీలేదు. అందుకే మహిళల్ని ధ్యేయంగా చేసుకుని నా ప్రదర్శనలు నిర్వహిస్తాను.

ఇక్కడ ఏర్పాటు చేసిన 'మై మమ్మీ ఈజ్ బ్యూటిఫుల్'' ప్రదర్శనలో సందర్శకులు ఖాళీ గోడలపైన, కాన్వాస్‌లపైన తమ సందేశాలను రాయొచ్చు. వాళ్లమ్మల ఫోటోలు అతికించి వాళ్లకు అంకితం కూడా చేయవచ్చు. అలాగే ఒక 'విష్ ట్రీ' కూడా ఏర్పాటుచేశాను. 1990 నుంచి నా ప్రతీ ప్రదర్శనలో విష్ ట్రీ ఉంచుతున్నాను. సందర్శకులు తమ కోరికలను కాగితం మీద రాసి ఈ ట్రీకి వేలాడదీస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా మనుషులంద రూ కలిసి చేసే ప్రార్థన. విష్ ట్రీ అనేది జపనీయుల సంప్రదాయంలోనిది. అలాగని ఆ సంప్రదాయ పద్ధతిని అనుసరించడంలేదు. 

నా పద్ధతిలో చేస్తున్నాను. విష్ ట్రీ నా హిట్ సాంగ్ కూడా. మొదట లాస్ ఏంజెలిస్‌లో విష్‌ట్రీ పెట్టినప్పుడు అంత స్పందన రాలేదు. కాని స్పెయిన్‌లో మాత్రం బాగా స్పందన వచ్చింది. అప్పట్నించీ విష్ ట్రీల సంఖ్య పెరిగిపోయింది. వీటిని ఢిల్లీలో రకరకాల ప్రదేశాల్లో ఉంచుతున్నాను. వీటితో కలిపితే విష్‌ట్రీల సంఖ్య పదిలక్షలకు చేరిపోయింది. వీటన్నిటినీ జాన్ లెనన్ స్మృతి చిహ్నం 'ఇమాజిన్ పీస్ టవర్' వద్దకు చేరుస్తాను. పదిలక్షల విషెస్‌ను టవర్ కింది భాగంలో ఉంచుతాను. ఈ విషెస్‌తో పర్వతాలనే కదిలించొచ్చు అనేది నా నమ్మకం.

అలాగే కళలు ప్రపంచానికే కాకుండా మహిళలకు కూడా చాలా ముఖ్యం. చేతిలో కళ ఉన్న ఏ మహిళకీ హీనమైన పరిస్థితులు ఎదురవ్వవు. నాకు మా అమ్మ సంగీతం, కళ నాలుగేళ్ల వయసునుంచే నేర్పించారు. అదే నాకిప్పుడు అండగా నిలిచింది'' అంటారు ఓనో.

విష్ ట్రీ అనేది జపనీయుల సంప్రదాయం. అలాగని ఆ సంప్రదాయ పద్ధతిని అనుసరించడంలేదు. నా పద్ధతిలో చేస్తున్నాను. విష్ ట్రీ నా హిట్ సాంగ్ కూడా. మొదట లాస్ ఏంజెలిస్‌లో విష్‌ట్రీ పెట్టినప్పుడు అంత స్పందన రాలేదు. కాని స్పెయిన్‌లో మాత్రం బాగా స్పందన వచ్చింది. అప్పట్నించీ విష్ ట్రీల సంఖ్య పెరిగిపోయింది. వీటిని ఢిల్లీలో రకరకాల ప్రదేశాల్లో ఉంచుతున్నాను. వీటితో కలిపితే విష్‌ట్రీల సంఖ్య పదిలక్షలకు చేరిపోయింది.

0 comments:

Post a Comment