Monday

పదేళ్ల ప్రయాణం........................

ప్రచురణకర్తలే ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి నిర్వహించడం దేశంలో ఎక్కడా లేదు. అలాంటిది సొంతంగా రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ లైబ్రరీని ఏర్పాటు చేయాలన్న ఆలోచన విజయవాడ ప్రచురణకర్తలకు ఎలా వచ్చింది? దాన్ని అందరికీ అందుబాటులో ఉంచేందుకు, కొత్త కొత్త సౌకర్యాలు సమకూర్చేందుకు వారేం చేస్తున్నారు? అనే ప్రశ్నలకు లైబ్రరీ నిర్వాహకులు రామస్వామి, అశోక్‌లు చెబుతున్న సమాధానాలు వారి మాటల్లోనే..."దశాబ్దం క్రితం నాటి సంగతి. 2001 ఫిబ్రవరి 19న ఈ లైబ్రరీని ప్రారంభించాం. పదేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు 2,600 మంది సభ్యులు, 20 వేలకు పైగా గ్రంథాలు ఉన్నాయిక్కడ. అయ్యదేవర కాళేశ్వరరావు,అండవల్లి సత్యనారాయణ తాము సేకరించిన పుస్తకాలను గ్రంథాలయానికి అందజేశారు. ఈ రోజుకూ దాతలు విరాళాలిచ్చేందుకు ముందుకు వస్తున్నారు. అయితే అవసరాన్నిబట్టే తీసుకుంటున్నాం. అది కూడా పుస్తకాల రూపంలోనే.



వాళ్లే బిల్లు చెల్లిస్తారు... రెండేళ్ల క్రితం ఇక్కడకు వచ్చిన సుధామూర్తి (ఇన్ఫోసిస్) లైబ్రరీ నిర్వహణను చూసి అభినందించారు. పది లక్షల విరాళం ఇస్తానన్నారు. అయితే ఆ మొత్తాన్ని మేము డబ్బు రూపంలో తీసుకోలేదు. నెల నెలా పుస్తకాలు కొనుగోలు చేసి. ఆ బిల్లులను పంపిస్తామని చెప్పాం. ఆ ప్రకారమే చేస్తున్నాం. డబ్బు మొత్తం తీసుకుని ఒకేసారి పుస్తకాలు కొన్నపుడు అవసరంలేని పుస్తకాలు కూడా కొనొచ్చు. అలాకాక అందరికీ ఉపయుక్తమైన పుస్తకాలను మాత్రమే కొనాలనేది మా ఉద్దేశం. అందుకే పుస్తకాల కొనుగోలులో పాఠకుల అభిప్రాయాలను కూడా తీసుకుంటాం. లైబ్రరీ నిర్మాణం చేపట్టాలనుకున్నప్పటి నుంచి మాకు ఎదురైన అనుభవాల నుంచే ఇవన్నీ నేర్చుకున్నాం.

తొలి అడుగులు... ఏటా విజయవాడ స్వరాజ్యమైదానంలో పెద్దఎత్తున పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్న విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీకి సొంత భవనం ఉండేదికాదు. సొసైటీ కార్యకలాపాల నిర్వహణకు ఇది పెద్ద సమస్యగా వుండేది. ఈ సమస్యను 1998వ సంవత్సరంలో నాటి నగర కమిషనర్ రజిత్‌భార్గవ ముందుంచాం. ఆయన అప్పటి మేయరు టి. వెంకటేశ్వరరావుకు లేఖ పెట్టుకోమన్నారు. అలాగే చేశాం. తీవ్ర తర్జన భర్జనల అనంతరం ఓటింగ్‌కు పెట్టి మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు సి.వి.ఆర్ స్కూల్ ఆవరణలో 300 గజాల స్థలాన్ని కేటాయిస్తూ తీర్మానించారు.
దాతల మంచిమనసు... భవన నిర్మాణానికి ఆమోదం లభించి, నిర్మాణం ప్రారంభించే నాటికి మరో ఏడాది గడిచిపోయింది. 11వ పుస్తక మహోత్సవం వచ్చేసింది. ఆ ఉత్సవానికి హాజరైన నాటి గవర్నర్ సి.రంగరాజన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిపించాలని, కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం నిర్వహించాలని మేయర్‌ను కోరాం. కార్పొరేషన్ ఆమోదించింది. మహోత్సవం ముగిసింది. కొద్ది రోజుల్లోనే శంకుస్థాపన కూడా పూర్తయింది. చేతిలో ఉన్న నాలుగు లక్షలతో పనులు ఎలా మొదలు పెట్టాలి? ఎక్కడి నుంచి ప్రారంభించాలి? అంతటికీ ఎంత ఖర్చవుతుంది? అవసరమైనంత డబ్బు ఎలా వస్తుంది? అన్న ఆలోచనలో వున్న సమయంలో విజయవాడ నుంచి కృష్ణకుమారి అనే ఆవిడ ఫోన్ చేశారు.


తమ పొరుగునే ఉన్న రిటైర్డ్ ప్రిన్సిపాల్ సూరపనేని చంద్రశేఖరరావు గారు గ్రంథాలయ శంకుస్థాపన విషయం దిన పత్రికల్లో చదివారని, వారు ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె చెప్పారు. ఆమె నుంచి ఫోన్ నెంబర్ తీసుకుని చంద్రశేఖరరావు గారిని కలిసాం. అపుడు ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్‌లో సోదరి ఇంటి వద్ద ఉన్నారు. గొప్పమనసుతో మంచి నిర్ణయం తీసుకున్నారు. తమ జీవిత కాలం సంపాదన నుంచి పొదుపు చేసుకున్న డబ్బును లైబ్రరీకి అందజేసేందుకు ముందుకు వచ్చిన చంద్రశేఖరరావుగారు, ఆయన సోదరి విమల గారిని చూసినపుడు ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అనిపించింది. ఓ నెల రోజుల్లో చంద్రశేఖరరావుగారి సోదరి విమల గారు 2.5 లక్షలు అందజేశారు.
ఇదే స్పూర్తితో మరికొందరు దాతలను కలిశాం. ఎవరూ కాదనలేదు. అడిగిందే తడవుగా అందరూ ఎవరి శక్తి మేరకు వారు ముందుకొచ్చి విరాళాలు అందజేశారు. ప్రచురణకర్తలు ఉచితంగా పుస్తకాలు పంపించారు.

బహుముఖ కార్యక్రమాల కేంద్రం ఇక్కడ కొన్ని నెలల పాటు పిల్లలకు లాంగ్వేజ్ క్లాసులు నిర్వహించాం. వీటిని కొనసాగించాలని విజ్ఞప్తులొస్తున్నాయి. కానీ నిర్వహణకు స్థలం సమస్యగా ఉంది. నేషనల్ బుక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ప్రచురణకర్తలకు శిక్షణనిచ్చాం. ఇటువంటి కార్యక్రమాలకు అదనపు సమయం కేటాయించాలి. గ్రంథాలయాన్ని కూడా విస్తరింప జేయాలి. ఈ గ్రంథాలయంలో పిల్లల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకు సహాయం అందించే దాతలు కూడా ఉన్నారు.

కానీ స్థలాభావం సమస్యగా ఉంది. ఆ రోజు 1000 గజాల స్థలం అడిగాం కార్పొరేషన్‌ను. కానీ 300 గజాలే కేటాయించారు. ఇది కార్పొరేషన్, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీల ఉమ్మడి ఆస్థి. కార్పొరేషన్ దీనిపై దృష్టి పెట్టి విస్తరణకు కావలసిన స్థలాన్ని కూడా ఇస్తే చేయాల్సిన పనులు చాలా వున్నాయి. అవన్నీ నెరవేరాలని ఆశిస్తున్నాం''

-: పద్మావతి వడ్లమూడి విజయవాడ

0 comments:

Post a Comment