Monday

మహా మహా నగరాల్లో మాస్కో


ప్రపంచంలోని అతి పెద్ద నగరాలు పదింటిలో చేరేందుకు మాస్కో కూడా సిద్ధమవుతోంది. ఈ సంవత్సరంలోనే ఆ నగరం తన పరిధిని రెండున్నర రెట్లు పెంచుకుని ఈ హోదా సాధించబోతోంది. అధికారిక లాంఛనాలన్నీ పూర్తయిన తర్వాత, ప్రస్తుతమున్న 1,091 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కాస్తా 2,531 చదరపు కిలోమీటర్లకు పెరగనుంది. దీనివల్ల ప్రపంచంలోని అతిపెద్ద నగరాలు పదింటిలో రష్యన్ రాజధాని ఆరో నగరం కానుంది. జనాభా రీత్యా చూస్తే ఏడో నగరం అవుతుంది.

విస్తీర్ణంలో అగ్రస్థానంలో సిడ్నీ, కాంగోలోని కిన్షాసా నగరాలున్నాయి. ఈ సంవత్సరంలో 21 మునిసిపాలిటీలు, షెర్బింకా, ట్రోయిస్క్ పట్టణాలు, 19 టౌన్‌షిప్‌లు, పోడోల్స్క్, లెనిన్‌స్కీ, నారో-ఫోమిన్స్క్ జిల్లాల్లోని కొన్ని గ్రామాలు మాస్కో మహానగరంలో కలిసిపోనున్నాయి. వీటితో పాటు క్రాస్నోగోర్స్క్, ఓడింట్సోవో జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు కూడా కలుస్తాయి. విస్తీర్ణం పరంగా మాస్కో ఆరోస్థానానికి చేరుతుండగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా అంకారా, ఇస్తాంబుల్, టెహ్రాన్, బొగోటా చేరుతాయి. దాంతో 1590 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న లండన్ నగరం ఈ పదింటి జాబితా లోంచి జారిపోతోంది.

ఇక జనాభా విషయంలోకొస్తే మాత్రం ఇప్పటికే అగ్రస్థానంలోఉన్న పది నగరాల్లో మన దేశంలోని రెండు నగరాలు కూడా ఉన్నాయి. మాస్కో ఏడో స్థానంలోకి వెళ్లనుంది. ప్రస్తుతం కలిసే ప్రాంతాలతో కలిపి రెండున్నర లక్షల జనాభా పెరగడంతో.. మొత్తం 1,17,50,000 అవుతుంది.

షాంఘై (1,38,31,000), ముంబై (1,38,30,000), సావో పోలో (1,36,51,000), ఇస్తాంబుల్ (1,31,20,000), కరాచీ, న్యూఢిల్లీ నగరాలు కోటీ ఇరవై లక్షల జనాభాను దాటేశాయి. వీటి తర్వాతి స్థానంలో మాస్కో ఉండబోతోంది. కొన్ని దశాబ్దాల పాటు అభివృద్ధి పథంలో దూసుకెళ్లేందుకు మాస్కో నగరం సిద్ధపడుతున్నట్లు నగర మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు.

0 comments:

Post a Comment