Sunday

70 ఏళ్ల 'కాలం' కథ...

50 ఏళ్లుగా వీల్‌చైర్‌కే పరిమితం
ఇన్నాళ్లు బతకడం అద్భుతమేనంటున్న వైద్యులు


శరీరంలోని కండరాల్లో ఎలాంటి కదలికా లేకుండా.. చక్రాల కుర్చీకే పరిమితమైన ఒక వ్యక్తి 70 ఏళ్లు బతకడం సాధ్యమేనా? కండరాలన్నీ చచ్చుబడి పోయి.. 24 గంటలూ వైద్యులపై ఆధారపడుతూ.. దినదిన గండంగా జీవితాన్ని వెళ్లదీస్తున్న ఒక రోగి సృష్టి రహస్యాలను ఛేదించడం కుదిరేపనేనా? మాటా పలుకూ లేకుండా జీవచ్ఛవంలా ఉన్న ఒక వ్యక్తి.. ఏ చీకూచింతా లేకుండా మానవ జన్మలోని మాధుర్యాన్ని ఆస్వాదించడం జరిగేపనేనా?.. ఈ అసాధ్యాలన్నింటినీ సుసాధ్యం చేసి చూపారు బ్రిటిష్ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్.

ఈ భూమి మీద పక్షులు ఎరగడం ఒక వింత అయితే.. నడి సముద్రంలో ఓడ నడవడం మరో అబ్బురమైతే.. వాటన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం స్టీఫెన్ హాకింగ్ జీవితం. ఈ సంగతిని ఆయనే చెబుతున్నారు మరి. ఈ విశ్వంలోకే అత్యంత జఠిలమైన రహస్యాలను ఛేదించిన తనకు.. తాను ఇన్నాళ్లు బతకడం మాత్రం మిస్టరీగానే మిగిలిపోయిందని ఆయన అంటున్నారు. ఎందుకంటే అతి ప్రమాదకరమైన 'మోటార్ న్యూరాన్ డిసీజ్' (కండర క్షీణత వ్యాధి)తో హాకింగ్ సహజీవనం చేస్తున్నారు మరి.

వైద్య పరిభాషలో 'లౌ గెహరిగ్ డిసీజ్' అని పిలిచే ఈ వ్యాధి ఎంత ప్రమాదకరమైనదంటే.. ఇది సోకిన రోగి కండరాలు పనిచేయవు. మనిషి మాట్లాడేందుకు, నడిచేందుకు, కదిలేందుకు వీలుగా కండర కదలిలకు ఉపకరించే నాడీ కళాలను ఈ వ్యాధి దెబ్బతీస్తుంది. రోగిలోని అవయవాలన్నింటినీ ఈ వ్యాధి క్రమంగా నాశనం చేస్తూ.. అతడిని మరణానికి చేరువ చేస్తుంది.

అందువల్ల ఈ వ్యాధికి గురైన వారిలో అ్యతధికులు కొద్ది సంవత్సరాల్లోనే చనిపోతారు. కానీ.. హాకింగ్ మాత్రం ఇంకా బతికే ఉండటం తమకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని లండన్‌లోని కింగ్స్ కాలేజీలో ఉన్న 'మోటార్ న్యూరాన్ డిసీజ్ కేర్ అండ్ రిసెర్చ్ సెంటర్' డైరెక్టర్ అమ్మర్ అల్ చలాబీ అంటున్నారు. కండర క్షీణత వ్యాధికి గురై కూడా హాకింగ్ 70 ఏళ్ల పాటు బతకడం చాలా అసాధారణమైన విషయమని ఈయన అభిప్రాయపడ్డారు.

ఎందుకంటే పడక కుర్చీకే పరిమితమై కూడా విశ్వంలోని గుట్టుమట్లను బయట పెట్టిన హాకింగ్‌కు ఆదివారంతో 70 ఏళ్లు నిండుతున్నాయి మరి. 1942 జనవరి 8న హాకింగ్ జన్మించారు. నిజానికి కేంబ్రిడ్జ్ వర్సిటీలో హాకింగ్ 21 ఏళ్ల విద్యార్థిగా ఉన్నప్పుడు.. ఆయనకు ఈ ప్రమాదకరమైన వ్యాధి సోకింది. కండరాలన్నీ చచ్చుబడిపోతూ.. తాను ఏ మాత్రం కదలలేని స్థితిలోకి చేరుకుంటున్నా కూడా సైన్స్ పట్ల మక్కువ గల హాకింగ్.. భౌతిక శాస్త్రంలో పట్టుదలతో పీహెచ్‌డీ చేశారు.

ఆ తరువాత కొద్ది కాలానికే శరీరం మొత్తం చచ్చుబడిపోయి.. జీవచ్ఛవంగా ఆయన మారిపోయారు. ఈ క్రమంలో.. 1985లో పులి మీద పుట్రలా హాకింగ్‌కు నిమోనియా వ్యాధి సోకింది. ఆ వ్యాధి తీవ్రమై ముక్కు ద్వారా గానీ, నోటి ద్వారా గానీ గాలి పీల్చుకోలేని పరిస్థితికి హాకింగ్ చేరుకున్నారు. దాంతో.. ఆయనకు కృత్రిమ శ్వాస అందించేందుకు వీలుగా మెడ వెనుక వైపు చిన్న రంధ్రం చేసి.. ఒక గొట్టాన్ని అమర్చారు. ఈ ఆపరేషన్ కారణంగా.. హాకింగ్ స్వరపేటిక పూర్తిగా దెబ్బతింది.

దాంతో.. హాకింగ్ శరీర కదలికల ఆధారంగా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో పసిగట్టే ఒక పరికరాన్ని కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్త ఆ సమయంలో రూపొందించారు. ఈ పరికరం తాను పసిగట్టిన విషయాలను మాటల్లోకి మార్చేందుకు వీలుగా వాయిస్ సింథసైజర్‌ను దీనికి అమర్చారు. అలా తాను చెప్పాలనుకున్న విషయాలను.. వాయిస్ సింథసైజర్ ద్వారా వెల్లడిస్తున్నారు.

విశ్వ ఆవిర్భావం, ఇతర ఖగోళ రహస్యాలను ఛేదిస్తూ.. హాకింగ్ 1988లో రాసిన 'ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్' ఆయనకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టింది. సైన్స్ చదువుకోని వాళ్లకు సైతం తేలికగా అర్థమయ్యేలా సరళమైన భాషలో రాసిన ఈ పుస్తకం ప్రతులు కోటికి పైగా అమ్ముడు పోయాయి. ఆ తరువాత కృష్ణ బిలాల (బ్లాక్ హోల్స్) రహస్యాలు, విశ్వ ఆవిర్భావానికి సంబంధించి 'బిగ్ బ్యాంగ్' సిద్ధాంతం తదితరాలను ఆయన ఆవిష్కరించారు.

1979 నుంచి 2009 వరకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఈయన గణిత శాస్త్రంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఈ యూనివర్సిటీలోని థియరిటికల్ కాస్మాలజీ విభాగానికి హాకిం గ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వైజ్ఞానిక రంగంలో హాకింగ్ చేసిన కృషికిగానూ.. అమెరికా అత్యుతన్నత పౌర పురస్కారం సహా అనేక అవార్డులు ఈయనను వరించాయి.

కాగా.. హాకింగ్ ఇంత కాలం ఎలా బతికి ఉన్నారో తెలుసుకొనేందుకు.. ఈయన డీఎన్‌యే నమూనాను విశ్లేషిస్తున్నామని చలాబీ అన్నారు. హాకింగ్ నిత్యం నలుగురైదుగురు వైద్యుల పరిరక్షణలో ఉంటారని.. బహుశా ఆయన ఇంతకాలం బతికి ఉండటానికి ఇది కూడా కారణం కావచ్చని మరి కొందరి నిపుణుల అభిప్రాయం.

0 comments:

Post a Comment