Tuesday

నిశ్శబ్దం శబ్ద విస్ఫోటనమై.,


అతడు శబ్దకంఠుడు
ఒక లిప్తకాలంలో కళ్ళుమూసుకుని
సకల సర్వసముద్రాలను త్రాగుతూ అగస్త్యుడౌతాడు
మరుక్షణం.. మనిషి ఒక్కడే.. శతకోటి శబ్దాలై
శతసహస్ర వాయిద్యాలై, సర్వ తుఫానులై ప్రభంజనంగా ప్రత్యక్షమౌతాడు
మనిషి ఒక మాటై, పాటై, బృందగానమై, వాయిద్యాల హారతై
అనుకరణై, అనుసరణై, అనుసృజనై
మనిషి రసపిపాసకు ఒక అనువాదమై
ఏ భాషకూ లొంగని ఒక మహా రసానుభూతై విస్తరిస్తాడు-
శ్రోతలు.. వాడు దేశాధ్యక్షుడా, బ్రహ్మస్వరూపుడా
పాలవాడా, పాకీవాడా, పాన్‌డబ్బావాడా.. ఎవడైనా
రసాస్వాద 'పారవశ్యం'లో..చినుకుల్లో తడుస్తూ పులకిస్తున్న పుడమౌతాడు
ఏ సంగీత కచేరీకైనా.. ఒక శృతి, ఒక లయ, ఒక వయోలిన్, ఒక మృదంగం
ఒక సహ మానవ సమూహం కావాలి.,
కాని అతడు.. ఒకే ఒక్కడు.. ఏక వ్యక్తి సంగీత సముద్రం.. వన్ మాన్ ఆర్కెస్ట్రా
గొంతును సంధిస్తే
మాటలు మంత్రాలై సకిలించే గుర్రాలౌతాయి, పరుగెత్తే విమానాలౌతాయి.
ప్రళయించే యిసుక ఎడారులౌతాయి
గర్జించే ఆకాశ పర్జన్యాలౌతాయి
మెకన్నాస్ గోల్డ్‌లు, బెన్ హర్‌లు, టెన్ కమాండ్‌మెంట్స్
రథచక్రాల భీకర గర్జనలౌతాయి-
పృధ్వీరాజ్ కపూర్‌లు, మహాత్మా గాంధీలు, రాధాకృష్ణన్‌లు
ఎవరైనా అందరూ అజ్ఞాబదులై అతని గొంతులో సవినయంగా వినబడ్తారు-
శబ్ద నియంత అతడు
నియంత్రిస్తాడు, యంత్రిస్తాడు, మంత్రిస్తాడు
ఏక వ్యక్తి ధ్వని విస్ఫోటకుడై మచ్చుచల్లి మాయలా వ్యాపిస్తాడు
అందరూ.. రసపానమత్తులై
తమను, తమ ఉనికిని, తమ సకల స్పృహలను మరిచి
ఒక పారవశ్యోన్మత్తతలో కరిగి ప్రవహిస్తూ అమరులౌతున్నవేళ
అతను.. శబ్ద సంధానాన్ని విరమించి
పసివానిలా బోసినోటిని తెరచి ఒట్టి చిరునవ్వుతో ముందు నిలబడ్తాడు
ఏమిటీ... అంటే.. ఏమీలేదు.
ఏదో ఒక తాదాత్మ్యవీచిక తలను నిమిరి వెళ్ళిపోతుంది.. మాతృస్పర్శవలె
అతను.. అలా పాదముద్రలను మనకు ఒక వారసత్వంగా మిగిల్చి
నడచిపోతుంటాడు.. ఋషిలా..
అతడు వేణుమాధవుడు...వేణువూ.. మాధవుడూ.. రెండూ తానే ఐనవాడు
(ధన్యనుకరణ సామ్రాట్, కళాప్రపూర్ణ పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ 80వ జన్మదినం, 28 డిసెంబర్ 'వరల్డ్ మిమిక్రీ'గా గత పదేళ్ళుగా నిర్వహింపబడ్తోంది... ఆ సందర్భంగా)

0 comments:

Post a Comment