Wednesday

మెదళ్లూ హ్యాక్ అయిపోతాయ్...!

ఒక దేశాన్ని పరిపాలించే నాయకుడి మెదడులో ఉగ్రవాదులు ఒక కంప్యూటర్ చిప్‌ను అమరుస్తారు. ఆ చిప్ ఆధారంగా అతడి మెదడును నియంత్రిస్తూ దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు...ఇదేదో హాలీవుడ్ ఫిక్షన్ సినిమాలా అనిపించవచ్చుగానీ, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు తలెత్తే ప్రమాదం ఉందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది.. ప్రముఖ శాస్త్రవేత్త క్రెయిగ్ వెంటర్ తన ప్రయోగశాలలో సింథటిక్(కృత్రిమ) డీఎన్ఏను సృష్టించి, దాన్ని ఒక బ్యాక్టీరియా కణంలోకి చొప్పించడం ద్వారా ఆ కణానికి జీవాన్ని ప్రసాదించిన సంగతి గుర్తుందా? అదే సింథటిక్ బయాలజీ. 

ఇటీవలి కాలంలో విస్తృతంగా ప్రాచుర్యం పొందుతున్న ఈ పరిజ్ఞానంతో ముప్పు పొంచి ఉందని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయాలజీ, టెక్నాలజీ ఈ రెండూ వేర్వేరుగా అభివృద్ధి చెందుతూ తారస్థాయికి చేరుకున్న దశలో సైన్స్‌నీ ఇంజనీరింగ్‌నీ కలిపే వారధిగా ఈ 'సింథటిక్ బయాలజీ' ఉద్భవించింది. కంప్యూటర్ టెక్నాలజీ కన్నా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకుని హ్యాకర్లు మనుషుల మెదడును నియంత్రించే ప్రమాదం ఉందని నాసా రీసెర్చి క్యాంపస్‌కు చెందిన ఆండ్రూ హెస్సెల్ అనే శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు. 

"ఇది ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాలన్నింటిలోకీ అత్యంత శక్తిమంతమైనది. సింథటిక్ బయాలజీ.. జీవితాన్ని రాసే శాస్త్రం. కణాలన్నీ జీవం ఉన్న కంప్యూటర్ల లాంటివి, డీఎన్ఏ.. ఆ కంప్యూటర్లను నడిపే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజీ. ఇది కంప్యూటర్ టెక్నాలజీ కన్నా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ పరిజ్ఞానాన్ని.. జీవాన్ని ప్రోగ్రామింగ్ చేయడానికి వినియోగించుకుని అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించుకునే విధంగా వినియోగించుకోవాలని అనుకుంటున్నాను'' అని వివరించారు.

అదే సమయంలో ఈ టెక్నాలజీ మరింత పెరిగి.. ఇందులోకి కూడా హ్యాకర్లు చొచ్చుకొచ్చి వైరస్‌లతో సమస్యలు సృష్టించే ప్రభావం ఉందని ఆయన ఊహిస్తున్నారు. భద్రత నిపుణులు మార్క్ గుడ్‌మాన్ కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'సింథటిక్ బయాలజీ అనేది ఒక కొత్త తరహా బయోటెర్రరిజానికి దారితీసే ప్రమాదం ఉంది'' అని ఆయన హెచ్చరిస్తున్నారు.

0 comments:

Post a Comment