Friday

యువతలో కొలవెరి ఫీవర్

యువతరంలో కొలవెరి డీ సాంగ్ ఫీవర్ ఎక్కువవుతోంది. ఎంతగా అంటే యూట్యూబ్ లో దీని హిట్లు 94 లక్షలు దాటేశాయి. కోటికి చేరువవుతున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ని ఈ సాంగ్ చాలా ఎక్కువగా ఆకర్షిస్తోంది. రజనీ, అమితాబ్ లాంటి సెలబ్రెటీలంతా ట్విట్టర్ లో ట్వీట్లు మీద ట్వీట్లు రాస్తున్నారు. ఈ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ కి సంబంధించిన మరిన్ని ఇంట్రస్టింగ్ టాపిక్స్ మీ కోసం. ఏదో తెలియని మైకం.. ఇంకేదో మత్తుతో కూడిన గమ్మత్తు. పదాల విరుపు.. రాగాల కూర్పు.. భలే కుదిరాయి. అందుకే అద్భుతాలు ఎవరూ చేయక్కరలేదు.

అవే జరిగిపోతాయి అన్నట్టుగా.. ఈ పాట కాస్త సూపర్ డూపర్ హిట్టయిపోయింది. ఆన్ లైన్ సాంగ్స్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇది త్రీ సినిమాలోని కొలవిరి డీ పాట స్టామినా. కొలవరి డీ అంటే చంపేంత కసి అని అర్థం. ఇది చాలామందికి తెలియదు. కాకపోతే.. పదాల ప్రాస.. ట్యూన్ బాగున్నాయి. నోటితో సరదాగా హమ్ చేయడానికి ఈజీగా ఉంది. అందుకే... యూత్ అంతా ఈ సాంగ్ ఇంతగా ఇష్టపడుతోంది. ఈ స్థాయిలో పాపులర్ అయింది.

కాలేజీలు, కాఫీ క్లబ్బులు, సెలూన్లు, మార్కెట్లు ఇలా ఎక్కడ చూసినా ఈ సాంగే. ఈ సాంగ్ తో త్రీ సినిమాకు పిచ్చ పబ్లిసిటీ వచ్చేసింది. ఈ సాంగ్ కి ట్యూన్ ఇచ్చింది కూడా రజనీకాంత్ మేనల్లుడు అనిరుధ్ రవిచందర్. ఆయన అందించిన సంగీతం యూత్ ని పిచ్చెక్కిస్తోంది. అసలీ సాంగ్ ఇంత హిట్ అవుతుందని తాను అనుకోలేదంటున్నాడు హీరో ధనుష్. తన వాయిస్ లో మిస్టేక్స్ ఉన్నా.. హమ్ చేయడానికి ఈజీగా ఉండడం వల్లే సాంగ్ హిట్టయిందని అంటున్నాడు.

ఈ సాంగ్ రాసేటప్పుడు కూడా తమిళ యాసలో ఉన్న ఇంగ్లిష్ పదాలన్ని ఓ దగ్గర రాసుకున్నానని.. వాటితోనే పాటను అల్లానంటున్నాడీ హీరో. మొత్తానికి ధనుష్ తెంగ్లిష్ ఫార్ములా మాంచి హిట్టయింది. నెట్ లో ఈ పాట హిట్ అయిందో లేదో.. దీనిని అనుకరిస్తూ.. చాలామంది పేరడీలు కూడా తయారుచేసేశారు. ఓ లేడీ ఈ సాంగ్ ని పాడింది. ఈ సాంగ్ లో బీట్ కు తగ్గట్టుగా కొంతమంది డ్యాన్సర్లు ఏకంగా స్టెప్పులు కూడా వేసి ఆ వీడియోను యూట్యూబ్లో పెట్టేశారు.

ఆన్ లైన్ ఈ సాంగ్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. యూత్ కి బాగా చేరువవ్వడంతో ఇది సూపర్ డూపర్ హిట్టయింది. అందుకే సాహిత్యం, నేపథ్యంతో పనిలేకుండా అందరి నోట్లో నానుతోంది.

0 comments:

Post a Comment