Tuesday

భద్ర సేద్యంతోనే ఆహార భద్రత...


భారత జనాభా 121 కోట్లకు మించిపోయింది. ప్రపంచ జనాభాలో ఇది 17.3 శాతం. గత దశాబ్దంలో వృద్ధిరేటు 17.64 శాతం. అంతర్జాతీయ ఆహార విధానం, పరిశోధనా సంస్థ విడుదల చేసిన 'గ్లోబల్ హంగర్ ఇండెక్స్-2011' ప్రకారం 81 దేశాలలో భారత్ 67వ స్థానంలో ఉంది. మన దేశ జనాభాలో 20 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నవారే. ఆహార ధరలు అస్థిరంగా ఉండటమే ఈ శోచనీయ పరిస్థితికి కారణం. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఆహారేతర పంటల సాగుకు రైతులు అధికంగా మొగ్గుచూపడం, కమ్మోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ మొదలైనవి ఆహార ధరల పెరుగుదలకు కారణాలుగా పేర్కొన్నారు.

ధరల పెరుగుదల వల్ల తీసుకొనే కేలరీల పరిమా ణం పడిపోవడం, కుటుంబ కొనుగోలు సామర్థ్యం తగ్గిపోవడంతో పాటు విద్య, ఆహార భద్రత ఇత్యాది సేవలను పొందే సామర్థ్యమూ తగ్గిపోతోంది. ఆహార ధరలు ఇంకా చాలా కాలం పాటు హెచ్చు స్థాయిలోనే కొనసాగుతాయని, దీనివల్ల అధికంగా నష్టపోయేది పేదలేనని ఆ నివేదిక పేర్కొంది.

జీవ ఇంధనం విధానాలను మార్చుకోవాలని, ఫ్యూచర్స్ కమ్మోడిటీ మార్కెట్స్‌ను క్రమబద్ధీకరించాలని, తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులను నివారించాలని, పేదల ప్రయోజనాలకు తోడ్పడే వ్యవసాయాభివృద్ధి విధానాలను అనుసరించాలని, ఆహార నిల్వలను పెంపొందించుకోవాలని, జాతీయ సామాజిక సంరక్షణా వ్యవస్థల నేర్పా టు చేసుకోవాలని, చిన్న కమతాల రైతులకు మరింత ఆర్థిక సహాయం అందించాలని, వ్యవసాయేతర ఆదాయ అవకాశాలను అభివృద్ధిపరచాలని, అన్ని స్థాయిలలోను మౌలిక సేవలను పటిష్టం చేయాలని 'గ్లోబల్ హంగర్ ఇండెక్స్-2011' సిఫారసు చేసింది.

దేశవ్యాప్తంగా 1960 నుంచి నిర్వహిస్తోన్న ప్రజాపంపిణీ వ్యవస్థ, యూపీఏ ప్రభుత్వం అమలుపరుస్తోన్న పనికి ఆహారం, గ్రామీణ ఉపాధి హమీ కార్యక్రమాలు ప్రస్తుతం అమల్లో ఉన్న ముఖ్యమైన సామాజిక సంరక్షణా పథకాలు. వీటికి అదనంగా ఇటీవల సోని యా గాంధీ చొరవతో జాతీయ ఆహార భద్రతా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది.

దేశ జనాభాలో 63.5 శాతం మందికి చౌకగా ఆహార ధాన్యాలను సరఫరా చేసే లక్ష్యంతో సోనియా గాంధీ ఈ బిల్లును స్వయంగా ప్రతిపాదించారు. దీన్ని పార్లమెంటు ఆమోదించిన అనంతరం కుటుంబంలోని ప్రతి వ్యక్తికి నెలకు ఏడు కిలోల బియ్యం, గోధుమలు, ముతక ధాన్యాలను రూ.3, రూ.2, రూ.1 చొప్పున సరఫరా చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం మంది ఈ పథకం పరిధిలోకి వస్తారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ, పంపిణీల ద్వారా పేదలకు ఆహార భద్రత సమకూర్చడమే ఈ కార్యక్రమాల లక్ష్యంగా ఉన్నది. అయితే అసలైన పేదలను గుర్తించి, వారికి చౌకగా ఆహార ధాన్యాలను అందజేయడం, బోగస్ రేషన్ కార్డులను తొలగించడం అనేవి ఎప్పుడూ చర్చనీయాంశాలవుతున్నాయి. ఏమైనా ఈ కార్యక్రమాలు/ పథకాలు పేదలకు సహాయాన్ని సమకూర్చడానికి ఉద్దేశించినవే గాని, పేదరికం నిర్మూలన లక్ష్యంగా కలవి కావు.

అట్టడుగు స్థాయిలో పేదరికాన్ని నిర్మూలించే శాశ్వత పరిష్కార వ్యూహాలను రూపొందించుకోవడం చాలా ముఖ్యం. తమ సామర్థ్యాలు, వనరులు, అవకాశాలను గరిష్ఠం చేసుకొనేలా ప్రజలకు సాధికారిత కల్పించడమే పేదరికం నిర్మూలనకు ఏకైక పరిష్కారం. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న దేశమైనందున భారత్‌లో పేదరికం వ్యవసాయరంగంతో, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రజలతో ముడివడివుంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయాన్ని లాభదాయకం చేసే ప్రణాళికలను రూపొందించి, అమలు పరచడం ద్వారా పేదరికం సమస్యను పరిష్కరించాలి.

వ్యయసాయ రంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు, నిర్దిష్ట పంటలకు కనీస మద్దతు ధరను సమకూర్చడం, పరపతి సదుపాయాలు కల్పించడం, పంట పెట్టుబడులకు రాయితీలు ఇవ్వడం మొదలైన అంశాలకు మన వ్యవసాయ విధానం అగ్ర ప్రాధాన్యమిస్తోంది. ఇన్ని సేవలు అందిస్తున్నప్పటికీ వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయాల పరిస్థితి మెరుగ్గా లేనే లేదు; వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థల్లో మధ్య దళారుల పెత్తనమే సాగుతోంది; రైతులందరికీ రుణ సదుపాయం దక్కడం లేదు; లాభాలు ఆశాజనకంగా లేవు. వర్తమాన భారతీయ వ్యవసాయ రంగం దుస్థితికి ఈ పరిస్థితులే కారణ మని మరి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సుస్థిర వ్యవసాయాభివృద్ధికి సరైన, నాణ్యమైన మౌలిక సదుపాయాలు కీలకమైనవి. రోడ్లు, వంతెనలు, నీటి పారుదల సదుపాయాలు , విద్యుత్తు, కోతలు, నూర్పిళ్ల అనంతర అవసరాలు తీర్చే వసతులు మొదలైనవి రైతుల ఉత్పాదక సామర్థ్యాన్ని, ఉత్పత్తులను పెంచుతాయి; ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుతాయి. నా బార్డ్ 2004లో నాలుగు రాష్ట్రాలలో గ్రామీణ రోడ్లు రైతుల ఆదాయం, ఉపాధి అవకాశాలపై చూపే ప్రభావాన్ని గురించి ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. రోడ్ల అభివృద్ధికై పెట్టిన పెట్టుబడుల మూలంగా రైతులకు ఆధునిక వ్యవసాయ-ఆర్థిక ఆచరణలు అందుబాటులోకి వచ్చాయని, రవాణా వ్యయం తగ్గిందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని ఆ అధ్యయనం వెల్లడించింది.

విద్యుత్తు సక్రమ సరఫరా గ్రామీణ ప్రజలు ఆశిస్తున్న మరో సదుపాయం. 1960 నుంచి విద్యుత్ సరఫరాలో కోతలు చోటుచేసుకోవడం ఆర్థికాభివృద్ధిని ఎంతైనా కుంటు పరుస్తోంది. చాలా రాష్ట్రాలలో విద్యుత్ కోతలు చాలా సాధారణమైపోయాయి. కొన్ని రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 12 గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయమేర్పడుతుంది. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతోంది.

కాగా కోతల, నూర్పిళ్ల అనంతరం అవసరమయ్యే సదుపాయాలు లోపించడం వల్ల మన దేశం ఏటా యాభై వేల కోట్ల రూపాయల మేరకు నష్టపోతుందని ఒక అంచనా. ఈ వాస్తవాలన్నీ వ్యవసాయ మౌలిక సదుపాయాల రంగంలో మరింతగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయమై ఎటువంటి అశ్రద్ధ వహించినా పేదల జీవనాధారాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది.

ఆహార స్వయం సమృద్ధిని మెరుగుపరచడానికి, ఆహార ధరలలో హెచ్చ తగ్గులను తగ్గించడానికి, ఆహార పంపిణీ ద్వారా ఆకలిని నిర్మూలించడానికి రైతులకు కనీస మద్దతు ధరను సమకూర్చడం చాలా ముఖ్యం. 1950ల్లో జాతీయ ఆహార భద్రత కారణాల దృష్ట్ర్యా వరి, గోధుమ పంటలకు కనీస మద్దతు ధరను సమకూర్చడం ప్రారంభమయింది. ఇప్పుడు 24 పంటలకు చెందిన 25 సరుకులు ఈ మద్దతు ధరల విధానం పరిధిలో ఉన్నాయి. మద్దతు ధరలు, ఆహార ధాన్యాల సేకరణ ధరలు మూలంగా ఆహార ధరలలో అస్థిరత తగ్గినప్పటికీ పంటల సాగులో ప్రాంతీయ విరూపాలు తలెత్తాయి.

ఒక ప్రాంతంలో ఒక పం టకు అనువైన పరిస్థితులు ఉన్న ప్రాంతంలో ఆ పంటను తక్కువగా సాగు చేయడం, అనువైన పరిస్థితులు లేని ప్రాంతంలో ఎక్కువగా సాగుచేయడం లాంటి పరిణామాలకు అది దారి తీసింది. ఇది అనేక సమస్యలకు దారి తీసింది. ఇక వ్యవసాయ మార్కెటింగ్ విధానం కూడా రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది. ప్రస్తుత విధానంలో రైతు తన ఫలసాయానికి ధరను నిర్ణయించుకునే స్వేచ్ఛ రైతుకు లేదు. మార్కెటింగ్ సంస్కరణలు ఇంతవరకు ఆహార ధాన్యాల రంగానికి మాత్రమే పరిమితమయ్యాయి. కనీస మద్దతు ధరల విధానం పరిధిలో ఉన్న పంటల విషయంలో మద్దతు ధరలతో పాటు క్రమబద్ధీకరించిన మార్కెట్లు కూడా కీలక పాత్ర వహిస్తున్నాయి.

అయితే పండ్లు, కూరగాయలు మొదలైన వాటి విషయంలో వాటి గిరాకీ, సరఫరాలను మార్కెట్ శక్తులే నియంత్రిస్తున్నాయి. దీని వల్ల రైతులు నష్టపోతున్నారు. ఈ మార్కెటింగ్ వ్యవస్థలో దళారుల ప్రాబల్యం వల్ల రైతులే గాక వినియోగదారు లు సైతం నష్టపోతున్నారు. రైతులు తమ ఫలసాయాన్ని నేరుగా మార్కెటింగ్ చేయడం వల్ల దళారులు, కమిషన్ ఏజెంట్ల బెడద తప్పుతుంది. ఈ ప్రత్యామ్నాయ విధానం ఇంకా పూర్తిగా అమలులోకి రాలేదు. ఈ సందర్భంగా చిల్లర వర్తకం రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అం శాన్ని ప్రస్తావించవల్సివుంది.

ఎఫ్‌డిఐని అనుమతించడం వల్ల రైతులు తమ ఉత్పత్తులకు మెరుగైన ధరను పొందగలుగుతారు. అంతేగాక వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా అది దోహదం చేస్తుంది. దురదృష్ట వశాత్తు చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంపై చర్చలో రైతులు, వినియోగదారుల ప్రయోజనాలను కాక వ్యాపారుల ప్రయోజనాలను రక్షించడానికే ప్రాధాన్యం లభిస్తుంది.

వేలాది రైతుల ఆత్మహత్యలకు రుణగ్రస్థతే ప్రధాన కారణంగా ఉంది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల భారినుంచి రైతులను కాపాడడానికి కేంద్రం పలు విధాన పరమైన నిర్ణయాలు తీసుకొంది. పరపతి సదుపాయాలనుపెంచడంతో పాటు పంట రుణాలను మాఫీ చేసింది. వడ్డీరేట్లను తగ్గించింది. అడ్వాన్స్ రుణ సదుపాయాన్ని కల్పించింది. అయితే రైతులు వ్యవసాయ ఉత్పాదకాలను కొనుగోలు చేసుకోవడానికి స్వల్పకాలిక రుణాలను తీసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. తద్వారా దీర్ఘకాలిక పెట్టుబడి ఏర్పాటును నిర్లక్ష్యం చేస్తున్నారు.

దీనివల్ల అధునాతన సాంకేతిక ఆచరణలు, భూసారాన్ని పెంపొందించే కార్యకలాపాలు, సాగునీటి సదుపాయాల మెరుగుదల, మార్కెటింగ్ సదుపాయాల అభివృద్ధికి పెడుతోన్న పెట్టుబడుల వల్ల తగు ఫలితాలు కన్పించడం లేదు. వ్యవసాయ ఉత్పాదకాలైన ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలు మొదలైన వాటిని రైతులకు సకాలంలో అందేలా చూడవల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది. అంతేగాక అవి సన్నకారు చిన్నకారు రైతులకు సైతం సక్రమంగా అందవల్సివుంది. భౌతిక సదుపాయాల కొరత, సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడం, పరిశోధన, విస్తరణ కార్యకలాపాలు సరిగా సాగక పోవడం ఇత్యాది అంశాల వల్ల గత రెండు దశాబ్దాలుగా మన వ్యవసాయరంగం అమితంగా నష్టపోతోంది.

తత్ఫలితంగా రైతులు వ్యవసాయం వల్ల లాభం లేదని , దానిపై ఆధారపడి బతక లేమని రైతులు నిస్పృహ పాలయ్యే పరిస్థితి దాపురించింది. ఇప్పుడు గ్రామీణ ప్రజలు చాలామంది పట్టణాలకు వలసపోతున్నారు. తమ బిడ్డలు ఇతర వృత్తులను చేపట్టడాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల పల్లెలో కొత్త పరిస్థితులు నెలకొంటున్నాయి. వీటిలో ఒకటి కౌలు వ్యవసాయం పెరగడం. అయితే కౌలుదారులు తమ భూ యజమానులతో కుదుర్చుకునే ఒప్పందాలకు చట్టబద్ధమైన రక్షణ ఉండడం లేదు. అవి ప్రభుత్వ రికార్డుల కెక్కకపోవడంతో సంస్థాగతమైన రుణ సదుపాయాలు కౌలుదారులకు లభించడం లేదు.

కౌలు రైతులకు సైతం పట్టాదారులకు వలే ప్రయోజనాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ బ్యాంకులు వారికి పంట రుణాలు ఇవ్వడం లేదు. కౌలు రైతుల్లో అత్యధికులు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారు. తమ ప్రయోజనాలకు చట్ట బద్ధమైన రక్షణ లేనప్పుడు వారు అధిక దిగుబడుల సాధనకు ఎలా శ్రద్ధ చూపుతారు? వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ పరిష్కరించని పక్షంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించడం సాధ్యంకాదు. పైగా సమీప భవిష్యత్తులో జాతి ఆహార భద్రతపై ఆ సమస్యలు విషమ ప్రభావాన్ని చూపే ప్రమాదముంది. 

0 comments:

Post a Comment