Monday

'గీత' వివాదంపై రష్యా విచారం...

భగవద్గీత నిషేధంపై పెను దుమారం రేగడంతో.. రష్యన్ కోర్టు తన తీర్పును ఈనెల 28 వరకు వాయిదా వేసింది. ఈ విషయమై రష్యన్ అంబుడ్స్‌మన్, మాస్కోకు చెందిన నిపుణులు, సెయింట్ పీటర్స్‌బర్గ్ నుంచి అభిప్రాయాలు తీసుకుని అప్పుడు తుది నిర్ణయం తీసుకోవాలని ఇస్కాన్ రష్యా విభాగం కోరడమే ఇందుకు కారణమని ఇస్కాన్‌కు చెందిన సాధు ప్రియ దాస్ తెలిపారు. ఇస్కాన్ వ్యవస్థాపకుడు ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద రచించిన 'భగవద్గీత యాజిట్ ఈజ్' అనే పుస్తకం విశ్వవ్యాప్తంగా గౌరవనీయమైనదని, అందువల్ల రష్యాలో దాన్ని నిషేధించాలనడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రష్యన్ అంబుడ్స్‌మన్ వ్లాదిమిర్ లుకిన్ ఓ ప్రకటనలో తెలిపారు.

మరో వైపు.. రష్యా ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. గీత వివాదాస్పదం కావడం విచారకరమని రష్యన్ ప్రభుత్వం సోమవారం రాత్రి పేర్కొంది. "పవిత్ర గ్రంథాన్ని కోర్టుకు లాగడం సరికాదు. ఇలాంటి సంఘటనలు సైబీరియాలోని అందమైన నగరం టోమ్‌స్క్‌లో జరగడం విస్మయకరం. లౌకికవాదానికి, పరమత సహనానికి ప్రసిద్ధిగాంచిన ఈ నగరంలో ఇలాంటివి చోటు చేసుకోవడం విచారకరం. దీనిని బట్టి టోమ్‌స్క్ లాంటి అందమైన నగరంలో కూడా పిచ్చివాళ్లు ఉంటారని స్పష్టమవుతోంది. ఇది ఎంతో బాధాకరం'' అని భారత్‌లో రష్యా రాయబారి అలెగ్జాండర్ ఎం కదాకిన్ ఒక ప్రకటనలో అన్నారు. కాగా.. ఈ కేసును ఏ క్షణంలోనైనా ఉపసంహరించుకునే అవకాశం ఉందని దాస్ తెలిపారు.

గీతలోని కొన్ని పదాలను తీసుకుని.. దాన్ని ఉగ్రవాద గ్రంథం అనడం సరికాదన్నారు. భారత్‌లో కూడా ఈ అంశంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభలో ఈ అంశం పెనుదుమారాన్ని సృష్టించింది. కృష్ణుడిని అవమానించే చర్యలనూ తాము సహించబోమని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ చెప్పగా, ఆయనకు పలువురు సభ్యలు మద్దతుగా నిలిచారు. కాగా, కోల్‌కతాలోని ఇస్కాన్ సాధువులు రష్యన్ రాయబార కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

కేంద్రం జోక్యం కోసం పిల్
ముంబై: భగవద్గీతను నిషేధించాలంటూ రష్యా కోర్టులో దాఖలైన దావా విషయమై జోక్యం చేసుకొని, తగు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ బొంబాయి హైకోర్టులో సోమవారం ఓ ప్రజా హిత వ్యాజ్యం దాఖలైంది.

0 comments:

Post a Comment