Thursday

గల్ఫ్ లేఖ

కోనేరు కథ
- మొహమ్మద్ ఇర్ఫాన్

జననీ జన్మభూమీశ్చ స్వర్గదపి గరియాసీ' స్ఫూర్తితో మాతృభూమి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో స్వదేశానికి తిరిగివచ్చిన వైద్యుడు కాకర్ల సుబ్బారావు. ఆర్థోపెడిక్ సర్జన్ కానప్పటికీ ఆర్థోపెడిక్ ఆస్పత్రి అయిన నిజాం ఆస్పత్రిని సూపర్ స్పెషాల్టీస్ ఆస్పత్రిగా తీర్చిదిద్దడంలో ఆయన ఎనలేని కృషి చేశారు. తన విదేశీ అనుభవంతో స్వదేశానికి ఉపకారం చేసిన ప్రవాసీయుల గూర్చి ఈ విధంగా చెప్పుకోవాలంటే అనేక పేర్లు ఉన్నాయి. అయితే విదేశాలలో ఉంటూ విదేశాల పేర స్వదేశీ సంపదను కొల్లగొట్టిన ప్రవాసీయుల పేర్లలో మొదటిపేరు కోనేరు ప్రసాద్‌ది కావటంలో ఆశ్చర్యమేమీ లేదు.

గల్ఫ్‌లో అడుగుపెట్టిన అనతికాలంలోనే, హైదరాబాద్‌లోని అత్యున్నతస్థాయి రాజకీయ నాయకులతో ప్రసాద్ స్నేహసంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. గల్ఫ్‌లో ఆయన పేరు బాగా సుపరిచితం కావడానికి ఈ సంబంధాలు ఎంతైనా తోడ్పడ్డాయి. సామాన్యులకు ప్రసాద్ సదా దూరంగా ఉంటారు. ఆ మాటకొస్తే ప్రముఖులకు సైతం దూరం గా, రిజర్వుగా వుం టారాయన. దుబాయిలోని ఆంధ్రులకు ప్రసాద్ చేసిన సేవలేమీ లేవు.

పార్టీలకు అతీతంగా ముఖ్య మంత్రులతో సంబంధాలు నెరపడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే తమ అధికార హయాంలో మొదటిసారిగా దుబాయిని సందర్శించిన చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డిల యాత్రలకు ప్రసాద్ తెర వెనుక పాత్ర పోషించారు. ఒక దశలో తెలుగుదేశం హయాంలో రాజ్యసభ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా ప్రసాద్ పేరు కూడా వార్తల్లోకి వచ్చింది.

ప్రస్తుతం ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణ ఎదుర్కొంటోన్న ప్రసాద్ కుమారుడు మధును ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా కూడా ఒక దశలో దుబాయి అధికారులకు పరిచయం చేయడం జరిగింది. ఎమ్మార్ కంపెనీ, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌ను హైదరాబాద్‌కు పరిచయం చేసి వాటికి అనుమతులు సాధించడంలో కూడా ప్రసాద్ కీలక పాత్ర వహించారు. అందుకే రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా అప్పటి ముఖ్యమంత్రి, దేశంలో ఎక్కడాలేని విధంగా ఎమ్మార్‌కు వ్యవసాయ భూమి కేటాయించారు.

ఇది 2002 సంవత్సరంలో జరిగింది. ప్రసాద్‌కృషి మూలంగానే దుబాయిరాజు సోదరుడే కాక ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ చైర్మన్ కూడా అయిన షేఖ్ సమూద్ స్వయాన హైదరాబాద్‌కు వచ్చి అప్పటి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినవెంటనే కోనేరు ప్రసాద్ ఆ కొత్త ప్రభుత్వంతో కూడా సత్ససంబంధాల నేర్పాటు చేసుకున్నారు. అనతికాలంలోనే వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆప్తుడయ్యారు.

తన వ్యాపారాలు కేంద్రీకృతమై ఉన్న రాస్ అల్ ఖైమా అనే ఏమిరేట్ (యుఏఇలోని ఏడు ఏమిరేట్స్‌లో ఇదొకటి)ను అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో తెరపైకి తీసుకొచ్చారు. దీని స్థాయి, స్తోమతకు మించి ఆంధ్రప్రదేశ్‌లో కేటాయింపులు జరిగాయి. దీనివల్ల బాగా లబ్ధి పొందిన వ్యక్తి నిస్సందేహంగా ప్రసాదే. రాస్ అల్ ఖైమా ప్రస్తుత రాజు షేఖ్ సౌద్ అల్ ఖాస్మీ లెబనాన్‌లో చదువుకొంటున్న రోజుల్లో మిత్రుడైన ఖజర్ మస్సాద్ (లెబనీస్ జాతీయుడు) ఆయనకు విదేశ పెట్టుబడుల వ్యవహారాల్లో సలహాదారు.

ఈ మస్సాద్‌తో ప్రసాద్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని వినికిడి. అతని ద్వారా ప్రసాద్ రాస్ అల్ ఖైమా పేరును ఎక్కడంటే అక్కడ ఉపయోగించుకొని బాగా లబ్ధి పొందారు. అది విశాఖపట్నంలో గనులకు సంబంధించి గానీ, హైదరాబాద్ పరిసరాలలో భూ పందేరాలలో గాని రాస్ అల్ ఖైమా పేరిట జరిగిన కేటాయింపులన్నీ కూడా కోనేరు ప్రసాద్ కొరకేనని ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. ఇండోనేషియాలో అల్యూమినియం, బొగ్గు గనులను కూడా కోనేరు ప్రసాద్ ఒప్పందంలో మస్సాద్ సహాయ సహకారాలందించారు.

ఆరోగ్య సేవల పరంగా చూస్తే యుఏఇలో రాస్ అల్ ఖైమా వెనుకబడిన ప్రాంతం. ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించారు. కనీస శస్త్ర చికిత్సలతో పాటు అనేక జబ్బులకు చికిత్స చేసే సదుపాయాలు, సౌకర్యాలు రాస్ అల్ ఖైమాలో లేకపోవడంతో రోగులను అబుదాబి, దుబాయి ఏమిరేట్లకు పంపడం పరిపాటి. వెనుకబడిన తమ ఏమిరేట్‌లో ఒక ఆధునిక ఆస్పత్రిని నిర్మించవల్సిందిగా అబుదాబి రాజకుటుంబాన్ని రాస్ అల్ కైమా రాజు కోరారు.

అలా రాస్ అల్ కైమాలో నిర్మాణమైన అత్యాధునిక ఆస్పత్రికి అబుదాబి రాజు పేరే పెట్టారు. ఇక ఆర్థిక రంగంలో రాస్ అల్ ఖైమా పేరు ఎవరికీ తెలియదు. ఉన్న ఏకైక రాక్ అనే బ్యాంకు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌తో పోల్చితే చాలా చిన్నది. ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి గాని తమ ఏమిరేట్‌లో పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపారస్తులను రాస్ అల్ ఖైమా కోరుతోంది. వాస్తవ పరిస్థితి ఇది కాగా ఆ ఏమిరేట్ పేర మన రాష్ట్రంలో వైఎస్ హయాంలో పెద్ద దోపిడీకి తెరలేచింది.

ఆరోగ్య, ఆర్థిక నగరాల నిర్మాణానికి గాను తమకు 2000 ఎకరాలు కేటాయించాలని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని రాస్ అల్ ఖైమా కోరింది. ఆ మేరకు గచ్చిబౌలీ సమీపంలోని సుల్తాన్‌పూర్ (మెదక్ జిల్లా)లో మొదటి దశ కింద 471 ఎకరాల భూమిని కేటాయించారు. రెండవ దశ కింద భూమి కేటాయింపు ప్రయత్నం జరుగుతుండగా వైఎస్ దుర్మరణం పాలయ్యారు. పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపార దృష్టితో జరిగిన ఈ భూకేటాయింపులలో ఐ ఏ ఎస్ అధికారి బిపి ఆచార్య ప్రధాన పాత్ర పోషించారు.

ఎలాంటి అనుభవం, అర్హత లేని రాస్ అల్ ఖైమా సంస్థలకు ఏ రకంగా అడ్డగోలుగా పందేరాలు చేశారో దీనిద్వారా అర్థమవుతుంది. మొత్తానికి ఇక్కడ రాస్ అల్ ఖైమా పేరు చెప్పి, అక్కడ ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పి బాగా లబ్ధి పొందిన వ్యక్తి కోనేరు ప్రసాద్. ఆయనపై జరుగుతున్న విచారణ ఇప్పటికీ పూర్తి స్థాయిలో కాకుండా కేవలం ఎమ్మార్ లావాదేవీలకు పరిమితమైవుంది. ప్రసాద్ చేసిన వ్యాపారాలలో ఆ లావాదేవీలు చాలా స్వల్ప భాగం మాత్రమే.

0 comments:

Post a Comment