Friday

లోపలి మనిషి...

అప్ఘానిస్థాన్‌పై, తాలిబాన్లపై ఇప్పటికి కుప్పతెప్పల పుస్తకాలు వెలువడ్డాయి. కాని ఇటువంటిది ఒక్కటీ లేదు. ఏమిటి దీని ప్రత్యేకత? రచయిత అబ్దుల్‌ సలామ్‌ జయీఫ్‌ స్వయంగా తాలిబాన్‌ వ్యవస్థాపకులలో ఒకరు. ఆ సంస్థ సిద్ధాంతాల రూపకల్పనలో, మొదట రష్యన్లపైనా తర్వాత వేర్వేరు అఫ్ఘాన్‌ సాయుధ వర్గాలపైనా పోరాటంలో, చివరకు తాలిబాన్‌ ప్రభుత్వ స్థాపనలో తన పాత్ర ఉంది. తాలిబాన్‌ ప్రభుత్వంలో వేర్వేరు శాఖల మంత్రిగా పనిచేసిన ఆయన పాకిస్థాన్‌లో అప్ఘాన్‌ రాయబారిగా నియమితుడయ్యాడు. 

సరిగా ఆ కాలంలోనే అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రంపై టెర్రరిస్టు దాడి, ఆ దరిమిలా అప్ఘాన్‌పై అమెరికా దాడి వంటి పరిణామాలు సంభవించాయి. తాలిబాన్‌ ప్రభుత్వాన్ని అమెరికన్లు కూలదోసిన తర్వాత, జయీఫ్‌ను పాకిస్థానీ ఐఎస్‌ఐ అమెరికాకు అప్పగించింది. అమెరికన్లు ఆయనను కొంతకాలం కాందహార్‌లో, కొంతకాలం గ్వాంటనామో బేలో నిర్బంధించి నానా హింసల పాలు చేసారు. 2005 చివరిలో విడుదలైనప్పటినుంచి కాబూల్‌లో నివాసం. తాను ఇప్పటికీ, ఎప్పటికీ తాలిబ్‌నే అన్నది ఆయన ప్రకటన.

తాలిబాన్‌పై ఇటువంటి వ్యక్తి పుస్తక రచన చేయటమన్నది ఇంత వరకు జరగలేదు. ఇది 'లోపలి మనిషి రచన. అదే ఈ పుస్తకం ప్రత్యేకత. అందుకు తగినట్లే పైన పేర్కొన్న పరిణామాలన్నింటి గురించి మనకు ఇంతవరకు తెలియని అనేక వివరాలు జయీఫ్‌ వ్యక్తిగత అనుభవాల రూపంలో మన ముందుకు వస్తాయి. ఇతర రచయితలు పేర్కొనే వివరాలు, చేసే వ్యాఖ్యలకు భిన్నమైన వాస్తవాలు ఇందులో దర్శనమిస్తాయి. కనుక అప్ఘానిస్థాన్‌ను, తాలిబాన్‌ను, అక్కడి సమాజాన్ని, రాజకీయ పరిణామాలను అర్థం చేసుకోదలచినవారు తప్పక చదవవలసిన పుస్తకమిది.

అయితే, తాలిబాన్‌గా తన జీవితం గురించి రాయటం తప్ప యథాతథంగా ఇది తాలిబాన్‌ ఉద్యమ చరిత్ర కానందువల్ల కావచ్చు మనకు ఆ పార్శ్వం గురించి ఈ పుస్తకం వల్ల తెలిసేది తక్కువే. పోతే, రచనలోని వస్తువ్ఞ సరేసరికాగా, రచనాశైలి కూడా మన చేత పుస్తకాన్ని ఆపకుండా చదివిస్తుంది. జయీఫ్‌ పష్తూ భాషలో 2009లో రాసిన పాఠాన్ని, అప్ఘానిస్థాన్‌తో తగినంత పరిచయం ఉండటమే గాక, కాందహార్‌ కేంద్రంగా పరిశోధనలు నిర్వహిస్తున్న అలెక్స్‌ స్ట్రిక్‌ వాన్‌ లిన్షోటెన్‌, ఫెలిక్స్‌ కుహెన్‌ ఇంగ్లీషులోకి అనువదించారు. కాందహార్‌ పరిస్థితిపై వారు స్వయంగా రాసిన ఒక నోట్‌తో పాటు, జయీఫ్‌ 2009 మార్చ్‌లో రాసిన ఉపోద్ఘాతం, జూన్‌లో రాసిన ముగింపు వ్యాఖ్యలు ఇందులోని అదనపు ఆకర్షణలు.

ఈ రచన చేయటంలో తనకు నాలుగు ఉద్దేశాలున్నట్లు జయీఫ్‌ చెప్తాడు. అవి(1) రాజు- భిక్షకుడు, యువకుడు-వృద్ధుడు, స్త్రీ-పురుషుడు, నల్లవాడు-తెల్లవాడు ఎవరైనా సరే వారికన్న తన జీవితం ఎక్కువ ముఖ్యమేమీ కాదని ప్రతి ఒక్కరు గుర్తించాలి, (2) తనను, తన దేశాన్ని, గౌరవాన్ని కాపాడుకోవటం తన హక్కుగా భావించేవారంతా అదే హక్కు ఇతరులకూ ఉంటుందని గుర్తించాలి, (3) అప్ఘానిస్థాన్‌ నిజమైన సంస్కృతి ఏమిటో తెలియనివారంతా తెలుసుకోవాలి, (4) అప్ఘన్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, వారెంత అణచివేతకు గురవ్ఞతున్నారో ప్రపంచం గ్రహించాలి. ప్రపంచ ప్రజలంతా వారి పట్ల దయ, ఆర్ద్రత చూపాలి.

విషయానికి వస్తే, 1968లో ఒక పేద గ్రామీణ కుటుంబంలో జన్మించిన జయీఫ్‌కు ఏడేళ్ళ వయసు వచ్చేసరికి తలిదండ్రులిద్దరూ మరణిస్తారు. పదేళ్ళ వయసుకు ఇతర బంధువ్ఞలతో పాటు పాకిస్థాన్‌కు శరణార్థిగా పోతాడు. రష్యన్ల సైనిక జోక్యానికి, స్థానిక కమ్యూనిస్టు పాలనకు వ్యతిరేకంగా దేశంలో సాగుతుండిన పోరాటం వల్ల కలిగిన సమస్యలు అందుకు కారణం. తండ్రి ముల్లా అయినందున స్వగ్రామంలో, తర్వాత పాకిస్థాన్‌లోని శరణార్థి శిబిరాలలోనూ మత విద్యలే నేర్చుతాడు. ధార్మిక దృష్టి బాగా అలవడుతుంది. తన 15వ ఏటి నుంచి ఆరేళ్ళ పాటు, 1989లో రష్యా ఓటమి వరకు, పోరాటంలో భాగస్వామి అవ్ఞతాడు.

తర్వాత రెండేళ్ళపాటు ఇమామ్‌గా పనిచేస్తాడు. కాని రష్యన్ల నిష్క్రమణ అనంతరం వేర్వేరు అప్ఘాన్‌ జాతులు, నేరస్థ ముఠాలు అధికారం కోసం, డబ్బు సంపాదనకు ఘర్షణ పడుతూ అరాచకాన్ని సృష్టించటం, ప్రజలను దోపిడీ చేయటం, హత్యలకు, అత్యాచారాలకు పాల్పడుతుండటంతో ఆ స్థితిపై తిరుగుబాటుగా ఇతరులతో కలిసి తాలిబాన్‌ ఉద్యమాన్ని ఆరంభిస్తాడు. పాత తాలిబాన్లు, ఇంకా చెడిపోని ముజాహిదీన్లు ఆ ఉద్యమంలో చేరుతారు. అప్పటికి జయీఫ్‌ వయసు 26. సంవత్సరం 1994.

ఒక ఏడాది కాలంలోనే అవాంఛనీయ శక్తులను పోరాటంలో ఓడించి తాలిబాన్లు అధికారానికి వస్తారు. ఆ ప్రభుత్వంలో అయిదేళ్ళ పాటు వేర్వేరు పదవీ బాధ్యతలు నిర్వహించిన జయీఫ్‌, 2000వ సంవత్సరంలో, తన 32వ ఏట ఇస్లామాబాద్‌కు రాయబారిగా వెళతాడు. అమెరికాపై టెర్రరిస్టు దాడి దరిమిలా 2001 చివరిలో అరెస్టవ్ఞతాడు. ఇవన్నీ రచయిత వ్యక్తిగత వివరాలు కాగా, ఈ జీవితం యావత్తూ అప్ఘాన్‌ గ్రామీణ సమాజంలో, ఆర్థిక-రాజకీయ పరిస్థితులలో, అంతర్జాతీయ పరిణామాలలో భాగంగా సాగిందన్నది పుస్తకంలోని చిత్రీకరణ. అంతే తప్ప, పరిస్థితుల వివరణను, ప్రభావాలను పక్కకు తోసి తన గురించి ఎక్కువ చేసి చెప్పుకునే ప్రయత్నం రచయిత ఎక్కడా చేయలేదు.

కనుకనే ఇది మన అవగాహనను పెంచే పుస్తకమవ్ఞతున్నది. ఇంకా చెప్పాలంటే ఇంతవరకు లేని అవగాహన మనకు కలుగుతుంది. అది అప్ఘానిస్థాన్‌ గురించి మాత్రమే కాదు. తాలిబాన్‌ ధోరణికి కారణాలేమిటి, దాని ఆవిర్భావ మూలాలేమిటి అన్న విషయంతో ఆరంభించి, సమాజం పట్ల, అప్ఘాన్‌ గ్రూపుల పట్ల తాలిబాన్ల దృక్పథమేమిటో మనకు అర్థమవ్ఞతుంది. అదేవిధంగా అప్ఘాన్లకు మిత్రదేశమని చెప్పుకున్న పాకిస్థాన్‌ ప్రభుత్వం, ఐఎస్‌ఐ సంస్థా కీలక సమయాలలో వ్యవహరించిన తీరు, జయీఫ్‌ తదితర ఖైదీలను పాకిస్థాన్‌లో, అప్ఘాన్‌లో, గ్వాంటనామో బేలో రకరకాలుగా హింసించిన విధాలు అన్నీ కూడా రచయిత కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు.

తాలిబాన్‌ సంస్థ రష్యన్ల ఓటమి తర్వాత 1994లో మాత్రమే ఆవిర్భవించిందన్నది సాధారణ అభిప్రాయం. కాని అది నిజంకాదని, రష్యన్లతో పోరాట కాలంలోనే తాలిబాన్‌ బృందాలు ఉండేవని, అవి ముజాహిదీన్లకు భిన్నమైన ఆలోచనలు, వ్యవహరణ, జీవనశైలితో సాగేవని జయీఫ్‌ వివరించి చెప్పటం ఈ పుస్తకంలోని ఒక ముఖ్యమైన విశేషం. వారు ముజాహిదీన్లకు భిన్నమైన బృందాలుగా ఉండేవారు కూడా. వారికి, ముజాహిదీన్లకు ఏకీభావం విదేశీ ఆక్రమణ దారులకు వ్యతిరేకంగా పోరాడటంలోనే. కనుకనే రష్యన్ల ఓటమి తర్వాత ముజాహిదీన్లు పలువ్ఞరు దారితప్పగా తాలిబాన్లు తిరిగి ఏకమై ఆ గ్రూపులపై పోరాడారు. తమతో ఏకీభవించే ముజాహిదీన్లను కలుపుకొన్నారు. ఇపుడు అమెరికన్లకు వ్యతిరేకంగా జరుగుతున్నదీ అదే.

అధికారం, సంపదల కోసం అమెరికాతో చేతులు కలిపిన మాజీ ముజాహిదీన్లు కొందరు కాగా, తక్కినవారు, తాలిబాన్లూ కలిసి అమెరికా వ్యతిరేక పోరాటంలో ఉన్నారు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే వీరి దృక్పథం ధార్మికత, సమాజ సంక్షేమం, విదేశాల ఆధిపత్యాన్ని, ఆక్రమణను ఎంతమాత్రం సహించని తరతరాల స్వతంత్రేచ్ఛ, పోరాట శీలత అని చెప్పవచ్చు. వారి ధార్మికతలో మత మౌలిక వాదం(ఫండమెంటలిజం), సంప్రదాయికమైన తిరోగామి ధోరణులు అనేకం ఉన్నాయి. ఇస్లామిక్‌ కాలిఫేట్‌ను నెలకొల్పి షరియా నిబంధనల అమలు వారి లక్ష్యం. తాలిబాన్లు అధికారంలో ఉండినపుడు ఆ ధోరణులు పరిపాలనలో ప్రతిఫలించిన తీరు గురించి జయీఫ్‌ చెదురుమదురు ప్రస్తావనలు తప్ప చేయలేదు గాని పరిస్థితి స్పష్టమే.

పోతే, రష్యన్‌ వ్యతిరేక పోరాటంలో అమె రికా, పాకిస్థాన్‌, సవూదీ అరేబియాల పాత్ర గురించి జయీఫ్‌ ఎందువల్లనో క్లుప్తమైన ప్రస్తా వనలు చేయటం మినహా వివరించలేదు. కాని తన అరెస్టుకు ముందు, ఆ తర్వాత పాక్‌ ప్రభుత్వం, ఐఎస్‌ఐ పోషించిన వ్యతిరేక పాత్రను చాలా వర్ణించాడు. తాలిబాన్‌ లక్ష్యాలకు భంగం కలిగించారన్న ఆగ్రహం, వ్యక్తిగతంగా తనను హింసించటం అందుకు కారణం కావచ్చు. అమెరికాకు సంబంధించి కూడా అదే కనిపిస్తుంది.

అమెరికాలో టెర్రరిస్టు దాడితోగాని, అల్‌కా యిదాతో గాని సంబంధం లేదని తేలిన తర్వాత జయీఫ్‌ను గ్వాంటనామో బే నుంచి 2005లో విడుదల చేస్తారు. అయితే ఆ పని చేసేముందు తనను ఒక పత్రంపైన సంతకం చేయమం టారు. తను నేరాన్ని అంగీకరిస్తున్నానని, అందుకు క్షమాపణ కోరుతున్నానని, విడుదల తర్వాత ఇటువంటి పనులు చేయబోనని, అటువంటివారితో సంబంధాలు పెట్టుకోబోనని అందులో ఉంటుంది. కాని సంతకానికి జయీఫ్‌ నిరాకరిస్తాడు. చేయని నేరాన్ని, లేని సంబంధాలను అంగీకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తాడు. చివరకు, తానిక అమెరికా వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనబోనని మాత్రం రాసిచ్చి విడుదలవ్ఞతాడు.
కాని గమనించదగినదేమంటే, విడుదలై కాబూల్‌లో స్థిరపడిన తర్వాత గాని, ఈ పుస్తకం చివరి భాగాలలో రాసిన దానిని బట్టి గాని, తన అమెరికా వ్యతిరేక వైఖరిలో ఎటువంటి మార్పు కన్పించదు.

కార్యకలాపాలు లేకపోవచ్చు, కాని మౌలిక వైఖరి వెనుకటిదే. ''నేను గతంలో తాలిబ్‌ను, ఇపుడు తాలిబ్‌ను, ఇక ముందు కూడా తాలిబ్‌ను అని విడుదల సమయంలో చేసిన ప్రకటనకు జయీఫ్‌ కట్టుబడే ఉన్నాడన్నమాట. విడుదలైన మూడేళ్ళ తర్వాత 2008లో కొన్ని వ్యాఖ్యలు చేసి గృహ నిర్బంధానికి గురి కావటం ఇందుకు రుజువ్ఞ. 'మార్పుల నినాదపు అధ్యక్షుడు ఒబామాపై జయీఫ్‌కు ఆశలేమీ లేవని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

అప్ఘానిస్థాన్‌పై ఇతరులు, ముఖ్యంగా పాశ్చాత్యులు చాలా పుస్తకాలు రాసారు. వీటిలో పాకిస్థానీ జర్నలిస్టులు కొద్దిమంది తమకు అక్కడి పరిస్థితులతో దీర్ఘకాలపు పరిచయం ఉన్నందువల్ల తగినన్ని వివరాలను పేర్కొనటాన్ని మినహాయిస్తే, ఈ పుస్తకంలోవలె లోతైన సమాచారం మరెక్కడా కన్పించదు. జయీఫ్‌ స్వయంగా తాలిబన్‌ కావటం, అన్ని పరిణామాలకు 'లోపలి మనిషి కావటం ఇందుకు కారణం. అయితే తనకు తెలిసింది ఇంకా చాలా ఉంటుంది గనుక ఆయన మరిన్ని పుస్తకాలు రాయగలడని ఆశించాలి.

0 comments:

Post a Comment