Friday

గురుపూర్ణిమ

పూర్ణము శూన్యము నెరుగదు
శూన్యానికి పూర్ణము తెలియదు.
పూర్ణం కావాలని అందరికీ ఆశ.
పరిపూర్ణం కావాలని ఒకటే ఆశ.
పూర్ణం కావాలా!
పూర్ణమై శోభించాలా!
అయితే గురువును చేరు.
మారుతుంది బతుకు తీరు.
క్షీరము నిచ్చేది ధేనువు
జ్ఞానము నిచ్చేది గురువు.
గాలి నిచ్చేది తరువు.
జాలి చూపేది గురువు.
ఆశించదు దేనినీ తరువు
ఆశ లెరుగని వాడు గురువు.
ఎండుతూ నీడనిస్తుంది తరువు
శ్రమిస్తూ సుఖాన్ని పంచేవాడు గురువు
ఫలాల పంపకం తరువుది
మోక్షఫలాల సంతర్పణం గురువుది.
జలపూర్ణం చెరువు
ప్రేమ పూర్ణుడు గురువు
మేను చల్లబడుతుంది దిగితే చెరువులో
మనసు శాంతిస్తుంది రమిస్తే గురు బోధలో.
చెట్లని పెంచేది ఎరువు
శిష్యుల్ని పెంచేది గురువు
అవని లోపలే ఎరువు
అవలోకిస్తేనే గురువు.
దేవ గురుడు బృహస్పతి
గురుదేవుడెప్పుడూ సరస్వతే.
గురుసన్నిధిలో
ఉన్నవాళ్లూ అనుభవిస్తారు
లేనివాళ్లూ అనుభవిస్తారు
గురువు ఉన్నవాళ్లు
అనుభవించేది ఆనందం
గురువులేనివాళ్లు
అనుభవించేది దుఃఖం
గురువైభవం
దినరాజు చూపలేనిది
సురరాజు చూడలేనిది
గురురాజు నిలయం
నటరాజు ఆలయం.
మాటలు పోలవు
గురు మహిమను పలుకుటకు
కన్నులు చాలవు
గురుమహిమను చూచుటకు.
అందరికీ పండుగలెన్నో అయితే
గురుబిడ్డలందరికీ ఒకే పండుగ
అదే గురుపండుగ
గురుపూర్ణిమ పండుగ
శిష్యుల హృదయాల నిండుగ
ఓం శ్రీ సద్గురుభ్యో నమః

0 comments:

Post a Comment