Sunday

ఇల్లు... శ్రీవారు... ఇద్దరు పిల్లలు... ఈ జీవితం చాలా బాగుంది

రెండు నదుల ప్రవాహం శ్రీదేవి.
ఆమెలోని తెలుగు, తమిళం కలిసి ముంబై తీరాన్ని తాకిగ్లామర్ తుఫాన్‌ను రేపినా ఆమె తన మూలాల్ని మర్చిపోలేదు.
వెండితెరకు రారాణైనా పిల్లలకు అమ్మే.
కెరీర్‌కు ఎక్కడ ఫుల్‌స్టాప్ పెట్టాలో కుటుంబజీవనాన్ని ఎక్కడ మొదలుపెట్టాలో 
ఆమెకు తెలుసు. రెంటినీ సమన్వయం చేసుకోవడం తెలుసు.
స్త్రీల గురించి... భాష గురించి... అభిరుచుల గురించి ఆమె మాట్లాడుతోంది.
ఆమె నటనంతా ఒక సైడ్. ఆమె ఏమి మాట్లాడినా అది అదర్‌సైడ్.
తాజా చిత్రం ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ ప్రచారంలో భాగంగా శనివారం హైదరాబాద్ వచ్చిన శ్రీదేవితో ముచ్చట్లు...


ఆఫ్టర్ నైన్టీన్ ఇయర్స్ గ్యాప్... మళ్లీ తెలుగులోకి వస్తున్నారు....
శ్రీదేవి: అమ్మో... అన్నేళ్లయ్యిందా! నాకేదో నాలుగైదేళ్లే అన్నట్టుంది.

1993లో వచ్చిన ‘ఎస్.పి.పరశురామ్’ తర్వాత మీరు తెలుగు సినిమానే చేయలేదుగా?
శ్రీదేవి: నిజమే. ఫ్యామిలీ లైఫ్‌లో పడి కాలాన్నే మర్చిపోయా. కాని నైన్టీస్‌లో నేను చేసిన సినిమాలు మర్చిపోలేను. జగదేకవీరుడు అతిలోక సుందరి, క్షణక్షణం...

నిజమే... మీరు ఏ భాషలో ఎన్ని సినిమాలు చేసినా తెలుగులోనే బెస్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి.....
శ్రీదేవి: అవును. ఎన్టీఆర్ గారు... అక్కినేని గారు... కృష్ణ... శోభన్‌బాబుగారు... చిరంజీవిగారు... వీళ్లందరితోనూ యాక్ట్ చేశాను. వేటగాడు, ప్రేమాభిషేకం.... ఎంత పెద్ద హిట్స్...

ఎన్టీఆర్‌తో మీ పెయిర్ చాలా బాగా కుదిరింది...
శ్రీదేవి: అటదే నా అదృష్టం. ఆయన మనుమరాలిగా యాక్ట్ చేశాను. అలాగే ప్రియురాలిగా కూడా యాక్ట్ చేశాను. వేటగాడు కోసం నా పేరు చెప్తే ఆ పిల్ల అప్పుడే హీరోయినయ్యిందా అని ఆశ్చర్యపోయారట ఎన్టీఆర్. తర్వాత షూటింగ్‌లో నా యాక్టింగ్ చూసి చాలా మెచ్చుకున్నారు. ఆయన పక్కన యాక్ట్ చేస్తుంటే చాలా ఎనర్జీ. ఆకుచాటు పిందె తడిసే... పాట చేసేటప్పుడు నాకు ఫుల్లుగా జ్వరం. మనం చేయగలం... కానివ్వండి... అని ఎన్టీఆర్ ధైర్యం చెప్తే చేసేశాను (నవ్వు).

ఆ పాట ఇప్పటికీ పెద్ద హిట్...
శ్రీదేవి: అదనే ఏముంది... ఇంకా చాలా సినిమాలు కూడా... నాగార్జున, వెంకటేష్‌ల వరకూ మంచి సినిమాలు పడ్డాయి. 


ఈ 19 ఏళ్ల గ్యాప్‌లో మళ్లీ తెలుగు సినిమా చేయాలని ఎప్పుడూ అనిపించలేదా?
శ్రీదేవి: ఫ్యామిలీ లైఫ్... ముఖ్యంగా పిల్లల పెంపకంలో పడితే అసలేమీ గుర్తుండదు. వాళ్లను స్కూలుకు పంపించడం, వాళ్ల చదువులు, వాళ్ల బాగోగులు దానికే టైమ్ సరిపోతుంది. నేను నటించడం మానేశాను కానీ, సినిమా ఫీల్డ్‌కి మాత్రం దూరం కాలేదు. మావారు బోనీకపూర్‌తో రెగ్యులర్‌గా షూటింగ్స్‌కు వెళ్లడం, ఆ కథలు వినడం... వీటన్నిటి వల్లనేమో నాకేమీ ‘గ్యాప్’ అన్న ఫీలింగ్ రాలేదు. అభిమానులు ఎప్పుడు కలిసినా ఎప్పుడొస్తారు? అనడుగుతుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. వాళ్లతో ‘ఎప్పుడెళ్తారు?’ అని అనిపించుకోకుండా ఉన్నందుకు చాలా హ్యాపీ. 

సుమారు 26 ఏళ్లు... రోజూ రెండు, మూడు షూటింగ్స్. అవుట్‌డోర్ ట్రిప్పులు. మేకప్పులు. ఆర్క్‌లైట్ వెలుగులు. సడన్‌గా ఇవన్నీ వదిలేసి గృహిణిగా ఇంటికే పరిమితమైపోవడం బోర్‌గా అనిపించలేదా?
శ్రీదేవి: ఫ్యామిలీ లైఫ్‌ని మించిన గొప్ప ఎంజాయ్‌మెంట్ ఏముంటుంది. అందుకే వన్ పర్సంట్ కూడా బోర్ అనిపించలేదు. 

సినిమా లైఫ్ బావుందా? ఫ్యామిలీ లైఫ్ బావుందా?
శ్రీదేవి: రెండూ వేర్వేరు. దేని దారి దానిదే. ఆర్టిస్ట్‌గా ఉన్నంతసేపూ పాత్రల గురించి, మేకప్ గురించి, కాస్ట్యూమ్స్ గురించి ఆలోచించేదాన్ని. ఫ్యామిలీలైఫ్‌కొస్తే భర్త, పిల్లలు, బంధువులు, ఇల్లు... ఇదంతా వేరే ప్రపంచం. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని బేరీజు వేయలేం. ఈ విషయంలో భగవంతునికి నేను చాలా రుణపడి ఉంటాను. 

ఉద్యోగాల్లో ఉండే ఆడవాళ్లు లేదా ఉపాధి రంగాల్లో ఉండే ఆడవాళ్లు కుటుంబ జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలంటారు?...
శ్రీదేవి: ఇలా అడగడం స్త్రీల సమర్థతను రెండో వరుసలో నిలబెట్టడం అని నేను అనుకుంటాను. కచ్చితంగా స్త్రీలు తమకు ఇష్టమైన రంగాల్లో రాణించాలి. వాళ్ల టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవాలి. దే ఆర్ గుడ్ టీచర్స్. గుడ్ సైంటిస్ట్స్. గుడ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. తండ్రి బిజీగా ఉండటం వల్ల ఫ్యామిలీ లైఫ్ మిస్ అయినట్టే తల్లి బిజీగా ఉండటం వల్ల ఫ్యామిలీ లైఫ్ మిస్ అవుతుంది. అయితే మగవాడికి బయటి భారం ఒక్కటే. స్త్రీకి ఇటు బయటి శ్రమ, ఇంటికొచ్చాక ఇంటి శ్రమ రెండూ ఉంటాయి. నా దృష్టిలో భర్త నుంచి సపోర్ట్ పిల్లల బాధ్యతను షేర్ చేసుకునే వాతావరణం తల్లిదండ్రుల లేదా అత్తమామల ఆసరా ఉంటే స్త్రీలు తమ తమ రంగాలలో ముందుకు వెళ్లడమే మంచిది. లేదంటే ఒక దశలో వారికే తెలుస్తుంది ఇక్కడితో ఆగుదాం పిల్లల గురించి ఆలోచిద్దాం అని. అప్పటి వరకైనా వాళ్లు తమ కలలకు రూపం ఇవ్వాల్సిందే. కలలు కనాల్సిందే.

సాధారణంగా ఆడవాళ్లు పెళ్లి తర్వాత మారిపోతుంటారు. మీరు మాత్రం స్లిమ్‌గా... అదే ఫిట్‌నెస్‌తో... అదే నాజుకు తనంతో ఉన్నారు!
శ్రీదేవి: (నవ్వేస్తూ) ఏదో... అలా వెళ్లిపోతోంది. సిస్టమేటిక్ లైఫ్ దానికి ప్రధాన కారణం. మంచి ఆలోచనలతో, సంతోషంగా ఉంటే ఎవరైనా ఇలా నాజూగ్గానే కనిపిస్తారు. మంచి ఆరోగ్యం కోసం ఎన్ని ఎక్స్‌ర్‌సైజులు చేసినా కూడా మంచి ఆలోచనలు కూడా ఉండాలి. నా మనసులో ఏముందో అది నా మొహంలోనే కనబడుతుంది.

మీరు ఎమోషన్స్ దాచుకోలేరా...
శ్రీదేవి: పైనొక రకంగానూ, లోపల మరో రకంగా ఉండటం నాకు రాదు. నాది స్ట్రయిట్ మెంటాలిటీ...

మీ అమ్మాయిల్ని ఫిజికల్ ఫిట్‌నెస్‌కోసం హెల్త్ క్లబ్‌లో జాయిన్ చేశారట?
శ్రీదేవి: అది రాంగ్‌న్యూస్. మా పిల్లలకి స్పోర్ట్స్ చాలా ఇంట్రస్ట్. ముఖ్యంగా మా చిన్నపాపకు. అందుకే రోజూ మేం టెన్నిస్ ఆడుతుంటాం. ఓ శనివారం రోజు నేను హెల్త్‌క్లబ్‌కు వెళ్తుంటే, పిల్లలు మేమూ వస్తాం అన్నారు. నాతో పాటు వచ్చారు. అక్కడ నాతో పాటు యోగా క్లాస్‌లో పాల్గొన్నారు. మేం ఇంట్లో కూడా యోగా చేస్తుంటాం. ఆ రోజు ఆ క్లబ్‌లో చేశామంతే. దాంతో మమ్మల్ని అక్కడ చూసిన వాళ్లు నేనేదో పాపను బలవంతంగా ట్రయిన్ చేస్తున్నానని అపోహ పడ్డారు. యోగా అనేది చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ చేస్తారు. అది ఆరోగ్యం కోసమే కదా చేసేది. 

మీ ైడైట్ టెక్నిక్స్ మాక్కూడా చెప్పొచ్చుగా?
శ్రీదేవి: రైస్ తినకండి. మసాలాలు ఆపేయండి. ఫ్రైలు అస్సలొద్దు. కోలాలు వదిలేయండి. దాంతో మీలో ఆటోమేటిగ్గా ఛేంజ్ వచ్చేస్తుంది. 

ముంబైలో స్థిరపడిపోయి కూడా తెలుగులో ఇంత స్వచ్ఛంగా, స్పష్టంగా మాట్లాడుతున్నారే...
శ్రీదేవి: ఏవండీ... రోజుకి పదిసార్లు మా అత్తయ్య, కజిన్స్‌తో తెలుగులోనే మాట్లాడుతుంటాను. తెలుగు నా మాతృభాష. అది నేనెలా మర్చిపోగలను చెప్పండి.

పుస్తకాలు చదువుతుంటారా?
శ్రీదేవి: నాకంత ఓపిక లేదు. 

టీవీ చూస్తుంటారా?
శ్రీదేవి: చూద్దామనుకుంటే పిల్లలు కార్టూన్ చానల్స్, ఈయనేమో క్రికెట్ మ్యాచ్ అంటారు. ఎప్పుడైనా వాళ్లు టీవీ వదిలితే, తెలుగు, తమిళ చానల్స్ చూస్తా. ముఖ్యంగా తమిళ కామెడీ చానల్స్ ఫాలో అవుతా. బాగా ఎంజాయ్ చేస్తా.

మీకు క్రికెట్ ఇష్టం లేదా?
శ్రీదేవి: అస్సల్లేదు. మావారికి మాత్రం చాలా పిచ్చి. నేనెప్పుడైనా టీవీ దగ్గరకు వెళ్తే ఎవరైనా అవుట్ అయ్యారనుకోండి. అది నీవల్లే జరిగింది. లోపలకు వెళ్లిపో అంటారు. మా పెద్దపాపకు క్రికెట్ చాలా ఇంట్రస్ట్. 

ఈ మధ్య క్రికెట్ బిజినెస్‌లోకి ఎంటరైనట్టున్నారు?
శ్రీదేవి: అది మా ఆయన ఇంట్రస్ట్. నేను వెనుక తోకలా వెళ్లానంతే. 

టీవీల్లో మీ సినిమాలు వస్తుంటే ఏమనిపిస్తుంది?
శ్రీదేవి: నాకన్నా మావారు, పిల్లలు ఆసక్తిగా చూస్తుంటారు. నేను ఆపేయమన్నా వినరు వాళ్లు. ఒక్కోసారి ఒక్కో సినిమా చూసి ‘అరె... ఇది నేనెప్పుడు చేశాను’ అని అనిపిస్తుంది. తెలుగులో 86 సినిమాలు చేశాను. పిల్లలు కొన్ని సినిమాల గురించి అడుగుతూ ఉంటారు. ఆ ఇన్సిడెంట్స్ చెబుతుంటాను. నాకెప్పుడూ మా ఫ్యామిలీ అండగా ఉంది. మీరు కూడా అలాగే ఉండండి అని చెబుతుంటాను. 

మీ పిల్లలకు ఇంకా మీరేం చెబుతుంటారు?
శ్రీదేవి: హార్డ్‌వర్క్ చేయమని, సిన్సియర్‌గా ఉండమని చెబుతుంటాను. నో పెయిన్ నో గెయిన్ అనే సిద్ధాంతాన్ని ఫాలో అవ్వమంటాను. కష్టపడకుండా ఎవ్వరికీ ఏ ఫలితం రాదు. ఏ పని చేసినా కచ్చితంగా కష్టపడాలి అని చెప్తా.

ఇంతకూ మీ అమ్మాయిలు ఏం చదువుతున్నారు?
శ్రీదేవి: పెద్ద పాప జాన్వి టెన్త్ క్లాస్. తనకు 15 ఏళ్లు. చిన్న పాప ఖుషీకి 12 ఏళ్లు. సిక్త్స్ స్టాండర్డ్ చదువుతోంది. 

స్కూల్లో శ్రీదేవి అమ్మాయిలుగా వాళ్లకో సెలబ్రిటీ స్టేటస్ ఉండే ఉంటుందిగా...
శ్రీదేవి: అది తప్పదు. మా పిల్లలు అనే కాదు. ఏ ఆర్టిస్టుల పిల్లలకైనా ఆ స్పెషల్ ఎటెన్షన్ వచ్చేస్తుంది. కానీ మేం మాత్రం మా పిల్లల్లో అలాంటి ఫీలింగ్ రాకుండా, నార్మల్‌గా ఉండేలా తీర్చిదిద్దుతున్నాం. 

మీ అమ్మాయిలకు తెలుగొచ్చా?
శ్రీదేవి: తెలుగు, తమిళం రెండూ వచ్చు. ఇప్పటికీ నేర్పుతూనే ఉంటాను. ఈ రెండూ నా మాతృభాషలు కదా.

ఇక్కడ తెలుగును వదిలేసే వాతావరణం ఉంది....
శ్రీదేవి: అవునా... సో శాడ్. మహరాష్ట్రలో మరాఠీ భాషను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. మరాఠీలో చాలా న్యూస్ పేపర్స్, మ్యాగజీన్స్ నడుపుతారు. మరాఠీ సంస్కృతిని గౌరవిస్తారు. ఇంగ్లిష్ ఉండొచ్చు. అది నేర్చుకోవడం తప్పు కాదు. కాని మన భాషను మనమే చులకన చేసుకోవడం శాడ్. నా పిల్లలకు తెలుగు అర్థం కాకపోతే వారితో ఒక ముఖ్యమైన బంధం నాతో తెగిపోయినట్టే కదా. భాష ఫ్యాషన్ కాదు.

రెగ్యులర్‌గా మీరు సినిమాలు చూస్తుంటారా?
శ్రీదేవి: అయ్యో... ఎందుకు చూడనండి. హిందీ, తమిళ్, తెలుగు అన్నీ చూస్తా. నా కన్నా మావారు తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తుంటారు. 

లేటెస్ట్‌గా ఏ తెలుగు సినిమా చూశారు?
శ్రీదేవి: చిరంజీవిగారి అబ్బాయి రామ్‌చరణ్ నటించిన ‘మగధీర’ చూశాను. అది కూడా ఫారిన్‌లో డీవీడీలో చూశా. 

మీకు డెరైక్షన్ చేసే ఆలోచన ఏమైనా ఉందా?
శ్రీదేవి: కొంచెం కూడా లేదు. ఎవరు చేయాల్సిన పని వాళ్లు చేయాలి. 

తెలుగులో సినిమాలు నిర్మించే ఆలోచన ఉందా?
శ్రీదేవి: ఎప్పుడూ అనుకుంటుంటాం. కుదరడంలేదు. అయినా మా ఆయన తెలుగు సినిమాలే తీసుకొచ్చి హిందీలో రీమేక్ చేస్తున్నారుగా. ఆ మధ్య ‘పోకిరి’నే హిందీలో సల్మాన్‌ఖాన్‌తో ‘వాంటెడ్’గా తీశారు. 

అప్పుడెప్పుడో చిరంజీవితో ‘వజ్రాలదొంగ’ సినిమా మొదలుపెట్టి ఆపేశారు?
శ్రీదేవి: అవును. ఎ.కోదండరామిరెడ్డి దర్శకుడు. ఎమ్జీఆర్ వచ్చి క్లాప్ కొట్టారు. ఏవీయమ్ స్టూడియోలో ఓ పాట షూట్ చేశాం. దాంతోనే జనగణమన చెప్పేశాం. 

ఇంత గ్యాప్ తర్వాత యాక్ట్ చేశారు కదా. ఈ మధ్య కాలంలో ఫిలిం మేకింగ్‌లో రకరకాల మార్పులొచ్చేశాయి. డిజిటల్ కెమెరాలు, గ్రాఫిక్స్... ఇవన్నీ చూస్తే ఏమనిపించింది?
శ్రీదేవి: చాలా మార్పులొచ్చాయి కానీ, ఈ మార్పులన్నీ మన మంచికే. డిజిటల్ కెమెరాలు, గ్రాఫిక్స్ అనేది ఫీల్డ్‌లో కామన్ అయిపోయాయి. ముఖ్యంగా టెక్నీషియన్స్ బాగా డెవలప్ అయ్యారు. ఎంత టెక్నాలజీ వచ్చినా భావోద్వేగాల్లో మార్పు రాకూడదు. ముఖ్యంగా ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ని ఏ టెక్నాలజీ ఏమీ చేయలేదు. 

సినిమాలు చేయడం కంటిన్యూ చేస్తారా?
శ్రీదేవి: ఏమో చెప్పలేను. నాకు కథ నచ్చాలి. అంతేకానీ ఏడాదికో సినిమా చేయాలనే ప్లానింగేమీ లేదు. 

గెస్ట్‌గా కూడా చేస్తారా?
శ్రీదేవి: కథ నచ్చితే చేస్తా. 

తెలుగులో కూడా నటిస్తారా?
శ్రీదేవి: ఎందుకు చేయను. తెలుగమ్మాయిగా ఉండి తెలుగులో చేయకుండా ఉంటానా...

ఇప్పటి హీరోయిన్లకు మీరే రోల్ మోడల్ కదా...
శ్రీదేవి: వాళ్లకు చాలా థ్యాంక్స్. అందరూ బాగా చేస్తున్నారు. 

మీ ‘హిమ్మత్‌వాలా’ రీమేక్‌లో తమన్నా చేస్తోంది? 
శ్రీదేవి: తన తమిళ సినిమాలు చాలా చూశా. డాన్సులు బాగా చేస్తుంది. ‘మగధీర’లో కాజల్ కూడా బాగా చేసింది. 

టాపిక్ సినిమాల వైపు వెళ్లిపోతోంది. అందుకే మీ కిచెన్‌లోకి వెళ్దాం. మీరు ఏ ఐటమ్స్ బాగా వండుతారు? 
శ్రీదేవి: మళ్లీ అడగండి.

మీరు ఫుడ్ ఐటమ్స్ ఏది బాగా ప్రిపేర్ చేస్తారు?
శ్రీదేవి: మీరీ ప్రశ్న నన్నడక్కూడదు. ఎందుకంటే నాకు అస్సలు వంట రాదు. నాకన్నా మా అమ్మాయిలు బాగా వండుతారు. చివరకు మా ఆయన కూడా వంటలో స్పెషలిస్ట్. అయితే సూపర్‌వైజ్ మాత్రం బాగా చేయగలను. ఇందులో కారం తక్కువ, ఉప్పు ఎక్కువ అని టేస్ట్ చూసి చెబుతుంటాను. 

పెయింటింగ్స్ ఆసక్తేనా?
శ్రీదేవి: చాలా ఇష్టం. 

రెగ్యులర్‌గా టూర్లకు వెళ్తుంటారా?
శ్రీదేవి: వెళ్తుంటాం. మేం నలుగురం కలిస్తేనే ఓ ఎంజాయ్‌మెంట్. ఏ ప్లేస్‌కు వెళ్లినా బాగా ఎంజాయ్ చేస్తాం. అప్పడప్పుడు మద్రాసు వెళ్తుంటాం. ఒక్కోసారి హైదరాబాద్. 

ఇక్కడకొచ్చి ఏం చేస్తారు? 
శ్రీదేవి: మా అత్తయ్య ఇక్కడే ఉంటారు. మేం కలిశామంటే షాపింగే షాపింగ్. నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. మాల్స్‌కి వెళ్లను. ప్రైవేటు షాప్స్‌కి వెళ్తాను. 

ఇంకా చూడాల్సిన ప్లేస్‌లేమైనా ఉన్నాయా?
శ్రీదేవి: మా ఆయనకు ఇలా అన్నీ తిరగడం చాలా ఇష్టం. అందుకే మేం ఏ ప్లేస్‌నీ వదల్లేదు. 

మీ ఫేవరెట్ కంట్రీ?
శ్రీదేవి: ఇటలీ, రోమ్ దేశాలంటే చాలా ఇష్టం. మద్రాసు, హైదరాబాద్, బెంగళూరు అన్నా చాలా ఇష్టం. 

టెంపుల్స్‌కు వెళ్తుంటారా?
శ్రీదేవి: తిరుపతి రెగ్యులర్‌గా వెళ్తుంటాం. ముంబైలో ప్రతి మంగళవారం సిద్ధి వినాయక టెంపుల్‌కు వెళ్తుంటా. ఇంట్లో పూజలు, వ్రతాలు కూడా చేస్తుంటాం. 

మ్యూజిక్ వింటుంటారా?
శ్రీదేవి: అన్నీ వింటా. తెలుగు, తమిళలో వచ్చిన అన్ని పాటలూ ఎప్పటికప్పుడు కలెక్ట్ చేస్తుంటా. మార్నింగ్ నిద్రలేవగానే వాటిని ఆన్ చేస్తుంటా. ఒక్కోసారి పాత పాటలు వింటుంటా.

‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’ సీక్వెల్‌లో ఎవరు చేస్తే బావుంటుందంటారు?
శ్రీదేవి: అది నేనెలా చెబుతాను. ప్రజలు చెప్పాలి. అయినా మీరీ ప్రశ్న ఎందుకడిగారో తెలుసు. ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దాం! టాటా... బై..బై..
సంభాషణ: పులగం చిన్నారాయణ

మంచి ఆలోచనలతో, సంతోషంగా ఉంటే ఎవరైనా ఇలా నాజూగ్గానే కనిపిస్తారు. మంచి ఆరోగ్యం కోసం ఎన్ని ఎక్స్‌ర్‌సైజులు చేసినా కూడా మంచి ఆలోచనలు కూడా ఉండాలి. నా మనసులో ఏముందో అది నా మొహంలోనే కనబడుతుంది.

రైస్ తినకండి. మసాలాలు ఆపేయండి. ఫ్రైలు అస్సలొద్దు. కోలాలు వదిలేయండి. దాంతో మీలో ఆటోమేటిగ్గా ఛేంజ్ వచ్చేస్తుంది. 

నాకు అస్సలు వంట రాదు. నాకన్నా మా అమ్మాయిలు బాగా వండుతారు. చివరకు మా ఆయన కూడా వంటలో స్పెషలిస్ట్. అయితే సూపర్‌వైజ్ మాత్రం బాగా చేయగలను. ఇందులో కారం తక్కువ, ఉప్పు ఎక్కువ అని టేస్ట్ చూసి చెబుతుంటాను

0 comments:

Post a Comment