Monday

టర్కీ విమానం కూల్చింది సిరియాలోనే, అందుకు రుజువులున్నాయ్ -రష్యా


టర్కీ గూఢచార విమానాన్ని కూల్చింది సిరియా గగనతలంలోనేననీ అందుకు తమ వద్ద ‘తటస్ధ రుజువు’ (ఆబ్జెక్టివ్ ప్రూఫ్) ఉందనీ రష్యా మిలిటరీ వర్గాలు ప్రకటించాయి. అంతర్జాతీయ గగన తలంలో ఉండగా తమ విమానాన్ని సిరియా కూల్చివేసిందని టర్కీ ఆరోపిస్తోంది. టర్కీకి యుద్ధ విమానం ఎఫ్-4 పయనించిన మార్గానికి సంబంధించిన వస్తుగత సమాచారం (ఆబ్జెక్టివ్ డేటా) రష్యా ఆధీనంలో ఉన్నట్లు ‘ఇంటర్ ఫాక్స్ న్యూస్ ఏజన్సీ’ ని ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది.
టర్కీ విమానం కూల్చివేతను అడ్డు పెట్టుకుని సిరియాపై దురాక్రమణ దాడి చెయ్యడానికి నాటో దేశాలు వ్యూహాలు పన్నుతున్న నేపధ్యంలో సిరియా కేంద్రంగా జరుగుతున్న రోజువారీ పరిణామాలు ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. జూన్ 22 న సిరియా గగనతలంలో చొరబడిన టర్కీ గూఢచార యుద్ధ విమానాన్ని సిరియా కూల్చివేసింది. టర్కీ విమానం సిరియాలోకి చొరబడి ఉండవచ్చని టర్కీ విదేశాంగ మంత్రి సైతం అంగీకరించాడు. టర్కీ లోని టి.వి చానెళ్ళు, వార్తా పత్రికలు కూడా టర్కీ విమాన శిధిలాలు సిరియా సముద్ర జలాల్లోనే కూలాయని చెప్పినట్లు అంతర్జాతీయ పత్రికలు వెల్లడి చేశాయి. అయినప్పటికీ నాటో సమావేశాలు జరిగాక బొంకడాన్ని టర్కీ తీవ్రం చేసినట్లు పత్రికల వార్తల ద్వారా అర్ధమవుతోంది.
రష్యా కి చెందిన ‘మిలటరీ-డిప్లొమేటిక్ సోర్స్’ తమకు సమాచారం ఇచ్చినట్లు ఇంటర్ ఫాక్స్ తెలిపింది. “(టర్కీ) జెట్ సిరియా గగనతలాన్ని ఉల్లంఘించిందని ఈ సమాచారం స్పష్టం చేస్తోంది” అని సదరు సోర్స్ చెప్పినట్లు ఇంటర్ ఫాక్స్ తెలిపింది. “సిరియాలో రష్యా ప్రయోజనాలున్నాయ”నీ, వివిధ చానెళ్ల ద్వారా తాము పరిస్ధితిని పర్యవేక్షిస్తున్నామనీ రష్యా సోర్స్ చెప్పినట్లు తెలుస్తోంది. రష్యా వాయు, అంతరిక్ష బలగాలతో పాటు నౌకా బలగాలకు కూడా అలాంటి సమాచారాన్ని సేకరించి, విశ్లేషించగల సామర్ధ్యం ఉందని కూడా రష్యా మిలట్రీ చెప్పినట్లు తెలుస్తోంది.
తమ విమాన శిధిలాలు సిరియా జలాల్లోనే కూలాయని టర్కీ అంగీకరించింది. అయినప్పటికీ విమానం మాత్రం అంతర్జాతీయ ‘ఎయిర్ స్పేస్’ లోనే ఉన్నట్లు టర్కీ బొంకుతోంది. అమెరికా గూఢచార అధికారి ఒకరు ఇచ్చిన సమాచారం కూడా టర్కీ చెబుతున్నదానికి విరుద్ధంగా ఉంది. అమెరికా అధికారి ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ పత్రికకు చెప్పినదాని ప్రకారం సిరియన్లు టర్కీ యుద్ధ విమానాన్ని ఒడ్డుపై ఆధారపడి ఉన్న విమాన వ్యతిరేక ఫిరంగులతోనే (Anti-aircraft artillery) కూల్చారు తప్ప ‘ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించే’ (surface-to-air) మిస్సైళ్లతో కాదు. దానర్ధం టర్కీ విమానం సిరియా గగనతలంలో ఎగురుతున్నట్లేనని ‘ది హిందూ’ తెలిపింది.
తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకోవడానికి సిద్ధమని రష్యా ప్రకటించింది. ఆ మేరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్ శనివారం ఒక ప్రకటన జారీ చేశాడు. సిరియా పరిస్ధితిపై శనివారం జెనీవాలో అంతర్జాతీయ సమావేశం జరిగిన అనంతరం లావరోవ్ ఈ ప్రకటన చేశాడు. సిరియాలో ‘ట్రాన్సిషనల్ గవర్న్ మెంట్’ ఏర్పాటు చేయవలసి ఉన్నదంటూ కోఫీ అన్నన్ చేసిన ప్రతిపాదనను జెనీవా సమావేశం ఆమోదించింది. సిరియా అధ్యక్షుడు బషర్ అస్సద్ కు కొత్త ప్రభుత్వంలో స్ధానం లేకుండా చేయడానికి పశ్చిమ దేశాలు చేసిన ప్రయత్నాలను రష్యా, చైనాలు తిప్పి కొట్టాయి. సిరియా ప్రభుత్వంలో ఎవరు ఉండాలన్నదీ తేల్చవలసింది సిరియా ప్రజలే తప్ప పశ్చిమ దేశాలు కాదని అవి తేల్చి చెప్పాయి.
ఇరాక్ పై దురాక్రమణ దాడి జరపడానికి ముందు కూడా నాటో దేశాలు టర్కీ ని అడ్డుపెట్టుకున్నాయి. టర్కీ దేశానికి ఇరాక్ తక్షణ ప్రమాదంగా మారిందని ఆ దేశం ప్రకటించాక దాన్ని అడ్డు పెట్టుకుని ఇరాక్ దురాక్రమణకి నాటో తెగించింది. సిరియా పై దురాక్రమణ యుద్ధానికి కూడా మరోసారి పశ్చిమ దేశాల చేతుల్లో పావుగా ఉపయోగపడడానికి టర్కీ సిద్ధమవుతున్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రపంచంలో బలహీన దేశాలపై మిలట్రీ పెత్తనం సాగించే నాటో దుష్ట కూటమిలో టర్కీ సభ్య దేశం. సిరియా సైన్యం కంటే, టర్కీ సైన్యం అనేక రేట్లు పెద్దది. భూభాగం విస్తృతిలో చూసుకున్నా టర్కీకి ప్రమాదంగా మారగల అవకాశాలు సిరియాకి ఏ కోశానా లేవు. తమ దేశ రక్షణే సమస్యగా మారిన సిరియాకు టర్కీకి ప్రమాదకరంగా మారడం సాధ్యం కాదు. తాను తాగుతున్న నీరు నీవల్ల కలుషితం అవుతున్నదంటూ మెరకలో ఉన్న తోడేలు, పల్లంలో ఉన్న గొర్రెను బెదిరిస్తున్నట్లే టర్కీ బెదిరింపులు సాగుతున్నాయి.
కానీ సిరియా, ఇరాక్ లా కాదు. సిరియాలో ప్రయోజనాలు కాపాడుకోవడానికి రష్యా సిద్ధపడుతోంది. చైనాకి కూడా సిరియాలో వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి. ఇరాన్ ప్రాంతీయ ప్రయోజనాలకు సిరియా ఫ్రంట్ లాంటిది. కనుక ఇరాన్ జోక్యం అనివార్యం. ఇజ్రాయెల్ నక్క జిత్తులు ఎలాగూ తప్పవు. ఇరాన్ పై దాడికి ఉరకలు వేస్తున్న ఇజ్రాయెల్ చేతులు ముడుచుకు కూర్చోదు. ఇజ్రాయెల్ ప్రవేశంతో అరబ్ దేశాలు కూడా ఏదో మేరకు ఘర్షణలో పాత్ర పోషించిక తప్పదు. అరబ్-ఇజ్రాయెల్ పరోక్ష ఘర్షణ సైతం మధ్య ప్రాచ్యంలో అరబ్ ప్రజల సెంటిమెంట్లను విపరీతంగా రెచ్చగొడుతుంది. ఇప్పటికే పీకల లోతు ఆర్ధిక సంక్షోభంలో ఉన్న పశ్చిమ దేశాలు సిరియాపై దాడి చేస్తే మరింత సంక్షోభంలోకి జారడం ఖాయం. సంక్షోభం నుండి తప్పించుకోవడానికి పశ్చిమ దేశాల ప్రభుత్వాలు ప్రజల ఆదాయ వనరులపై మరింత దాడిని ఎక్కుపెడతాయి. యుద్ధంలో చితికిపోయేది ఏ దేశంలోనైనా అంతిమంగా ప్రజలే.

0 comments:

Post a Comment